మారుతిశతకము - గోపీనాథము వేంకటకవి - అచ్చంగా తెలుగు

మారుతిశతకము - గోపీనాథము వేంకటకవి

Share This
మారుతిశతకము - గోపీనాథము వేంకటకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:
మారుతీశతకకర్త గోపీనాథము వేంకటకవి నెల్లూరు జిల్లా, కావలి తాలూకాలోని లక్ష్మీపురాగ్రహార వాస్తవ్యుడు. ఇతడు క్రీ.శ. 1813 వ సంవత్సరం శ్రీముఖ సంవత్సరమున జన్మించినట్లు తెలుస్తున్నది. తన 16 ఏట వేదాద్రినరసింహస్వామి ఉత్సవాలకు వెళ్ళగా అచ్చట ఒక మహాయోగి మంత్రోపదేశం వలన అనర్గళ కవితాధార యలవడినట్లుగా ఈతని గ్రంధములవలన తెలుస్తున్నది. ఇతడు తన విద్వత్కవితా ప్రతిభచేత వేంకటగిరి సంస్థానాధిపతులను మెప్పించి వారి ఆస్థానకవిగా నియమితుడైనాడు. ఈకవి రామ భక్తుడు. మారుతీ శతకాన్ని ఈ కవి తన 16వ ఏట రచించి ఆతరువాత తన ఇరవయ్యవఏట రామాయణ రచన ప్రారంభించి అయిదేండ్లకు ముగించెను. ఈ రామాయణమే మనకు ఇప్పుడు గోపీనాథ రామాయణంగా ప్రసిద్ధి కెక్కినది. మహాయోగి ఉపదేశము వలన లభించిన కవితావిద్యావిశేషముతో ఈ కవి అనేక గ్రంధరచనలు చేసారు. అవి 1. శ్రీమద్రామాయణము (గోపీనాథ రామాయణము), 2. శ్రీకృష్ణజన్మఖండము, 3. భగవద్గీతా శాస్త్రము, 4. శ్రీరామస్తవము, 5. బ్రహ్మానంద శతకము, 6. శిశుపాలవధము (మాఘకావ్యము), 7. శ్రీరాధికాపరిణయము, 8. తిరునాళదండకము, 9. మారుతీ శతకము మొదలగునవి. 
శతకాంతమున ఈ కవి ఈ విధంగా తనను గురించి చెప్పుకొన్నాడు.
మ. చతురత్వంబున గోపీనాథకులవిస్తారుండు శ్రీపద్మనా
భతనూజుండగు వేంకటాఖ్యకవి విద్వత్సమ్మతంబైన యీ
శతకంబున్ రచియించి నీకు సముదంచద్భక్తి నర్పించె, స
మ్మతితో దీనిఁ బరిగ్రహించి కరుణాం బాలింపవే మారుతీ
దీనినిబట్టి ఈ కవి తండ్రి పేరు శ్రీపద్మనాభశాస్త్రిగా తెలుస్తున్నది. 
శతక పరిచయం
మారుతీశతకము ఈ కవి ప్రధమరచన. ఈశతకమున ఉపాసనాదైవము "శ్రీరామరక్ష సర్వజగద్రక్ష" అని చాటిన ఆంజనేయుడు. అతని చరిత్రము బాల్యమాదిగా ఇందు వర్ణితము. వీర, రౌద్ర, భయానకములిందలి రసములు. దీనికనుగుణముగా మత్తేభ, శార్ధూల వృత్తాకనులలో 116 పద్యాలలో ఈశతకమున కవి ఉపయోగించినాడు. 
మనోహరమైన ఈశతకము నుండి కొన్ని పద్యాలను చూద్దాను. 
మ. అనఘా నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్
వినువీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి, యె
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్ వేడ్క మున్నూరు యో
జనముల్ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ
మ. అనిమేసేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్ మ్రింగ నొ
య్యన డాయం బవిచే బలారి నిను మూర్చాక్రాంతినిం జేయ బూ
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్ భగ్నంబుగా బ్రాలినన్
హనుమంతుం డనుపేరు నా డమరె నీ కన్వర్థమై మారుతీ.
శా. లేరా కీశు లనేకులుం? ద్రిజగముల్ వీక్షించి రా నేర్పరుల్
గారా? రాముఁడు జానకిన్ వెదక వీఁకన్ గీశులం బంపుచో
నారూఢిన్ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్ నూచి కా
దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్ మారుతీ
శా. "ఏలా మీకు భయంబు నేఁ గలుగ మీ రిందుండుఁ డే నొక్కండన్
వాలాయంబు పయోధి దాటి యనువొందన్ లంకలో జానకిం
బోలం గంగొని వత్తు నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గదా కీశులన్ మారుతీ
ఈవిధంగా సీతాన్వేషణకై బయలుదేరిన మారుతీని గూర్చి అతని కార్యములను గూర్చి అత్యంత మనోహరమైన వర్ణనలను మనం చూడవచ్చును. సుందరాకాండము లోని ఘట్టాలను అత్యంత మనోహరమైన పద్యాలలో ఈకవి మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
మ. కమనీయోన్నత పుష్పతల్పముపయిం గన్మూసి గుర్వెట్టు పం
క్తిముఖున్ నీలఘనాభదేహు గని తత్తేజంబునన్ రత్బఁదీ
పములం దద్గ్రుహ మెల్ల వెల్గు చునికిన్ భావంబునన్ మెచ్చుచున్
సముదంచద్గతి నచ్చటన్ వెదకవే క్ష్మాపుత్రికన్ మారుతీ
మ. తరుణిం గ్రీష్మగభస్తి తప్తలతచందానన్ రహిన్ వాడి భీ
కరదైత్యాంగన లాడు మాటలకు నాకంపించుచున్ సారెకున్
జిరభక్తిన్ రఘురామ, రామ యనుచుం బేర్కొంచు శోకార్తయై
తరుమూలంబున నున్న జానకిని సందర్శింపవే మారుతీ
ఈ విధంగా కనుగొన్న సీతకు ముద్రిక ఇచ్చి ఆ కన్యారత్నం ఇచ్చిన ముద్రికను చేకొని లంగానగర ప్రభువుకు భ్ద్ది గరపి లంకానగరాన్ని దహనంచేసి తిరుగి రామచంద్రప్రభువువద్దకు వచ్చి 
శా. ఆరామాధిపు పాదపద్మముల కుద్యభక్తితో మ్రొక్కి గ
న్నారన్ జూచితి భూమిపుత్రిని దశాస్యావాసమౌ లంకలో
సారోద్యానమునందు దైత్యయువతీ సందోహమధ్యంబునన్
వీరగ్రామణి! చిక్కియున్నదని తద్వృత్తాంత మాద్యంత మిం
పారం దెల్పి ముదబ్ధి దేల్పవే నృపాలాగ్రేసరున్ మారుతీ
"శ్లో: ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూలవాసినం భావయామిపవమాననందనం" అనే శ్లోకానికి ఈ కవి అనువాదం గమనించండి
అమరాద్రి ప్రతిమాన విగ్రహము, బాలార్కప్రతీకాశవ
క్రము శోభిల్లఁగఁ పారిజాత తరుమూలం బందు గూర్చుండి యు
త్తమభక్తిన్ రఘురామమూర్తిని మదిన్ ధ్యానింపుచున్ దత్పవి
త్రమహామంత్ర మొగిన్ జపించు నిను నే బ్రార్ధించెదన్ మారుతీ
ఈవిధంగా రామాయణంలో మహాభక్తాగ్రేసరుడైన హనుమంతుని లీలలను బాలం నుండి వరుసగా సంపూర్ణంగా వివరించిన ఈ శతకం సాహిత్యంలో ఒక అనర్ఘ్యరత్నం. ప్రతిపద్యం ఒక ఆణిముత్యం. 
కావ్య చాతురి, ధారాశుద్ధి కలిగి దండక క్రియల భావములు పారాయణామున అనువుగా ఉండి స్వతంత్ర భావనా సముల్లాసితమైన ఈశతకము వాఙ్మయమునకు ఒక అలంకారము. 
మీరుకూడా చదవండి. ఇతరులచే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages