ఇంటింటి రామాయణం1 - అచ్చంగా తెలుగు

ఇంటింటి రామాయణం1

Share This
(జ)వరాలి కధలు - 23
ఇంటింటి రామాయణం 1
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)


కార్తీకమాసం బహు రమణీయంగా గడుస్తోంది. మాసం మొదలైనప్పటినుంచి అప్పుడప్పుడు వరాలు చేసే పూజలతో, నేనిచ్చే ఆశీర్వాదాలతో, ప్రసాదాల పేరుతో ఆమె పెట్టే వడపప్పు, చలిమిడి, రకరకాల పళ్ళతో మేళవించిన చిన్న సైజు చిరుతిళ్ళతో, నైవేద్యాల పేరుతో పులిహోర, పరమాన్నం లాంటి పిండి వంటలతో నాలికకు నవకాయ రుచులను అందిస్తూ కాలక్షేపం చేస్తున్నాను. చిన్నప్పుడు కార్తీకపురాణం చదివే అలవాటు ఉండేది. ప్రస్తుతం వాటి విజ్ఞానం బుర్రలో బాగా నిండిపోవటంతో దాని జోలికి పోవటం లేదు. ఆరోజు కార్తీక పున్నమే గాక శిక్కుల మత గురువు గురునానక్ గారి పుట్టిన రోజు కూడా కావటంతో కేంద్రకార్యాలయాలకు అంటే మా ఆఫీసు లాంటి వాటికి సెలవు. మధ్యాహ్నం సుష్టుగా భోజనం లాగించి, హాలులో ఆ రోజు దినపత్రిక చదువుతూ కూర్చున్నాను. ఉన్నట్లుండి చిటపటమని ధ్వని వినిపించి తలెత్తి చూశాను. వరాలు కార్తీకపురాణంలో లీనమై ఉంది.
"ఏమిటోయి? పొయ్యి మీద ఏదో పడేసి యిక్కడ పుస్తకం చదువుతూ కూర్చున్నావు! వంటింట్లోకి వెళ్ళి చూడు" అన్నాను. 
"ఖర్మ! మీ భోజనం అయ్యాక నాకు వంటింట్లో పని ఏముంటుంది? అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక మీ పత్రికాపఠనం చూసుకోండి" వరాలు చెప్పింది.
"నా భోజనం అయిపోయిందనుకో! నువ్వు ఉపవాసం కదా! ఏ కాఫీయో గాస్ స్టవ్ పై పెట్టి మరిచిపోయావేమోనని. . . "
"నేను అందరిలా పొయ్యిమీద ఏదో పడేసి పెరట్లో పని చూసుకొనే బాపతు కాదు. అసలు అలాంటి వాటి వల్లే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. నేను పొయ్యి వెలిగించానంటే, ఆ పని పూర్తయ్యేవరకు పొయ్యి ప్రక్కనే నిలబడతాను" వరాలు స్వోత్కర్ష మొదలెట్టింది.
"మరి ఆ చిటపటలెక్కడినుంచి?" అడిగాను.
"పక్కింట్లో అత్తాకోడళ్ళు అరుచుకుంటున్నారు" వరాలి మాటలకు త్రుళ్ళిపడ్డాను. 
"పక్కింట్లో వాళ్ళకి అమ్మాయే కదా ఉంది. మరి యీ కోడల్ని తెచ్చే కొడుకు ఎక్కడినుంచి వచ్చాడు?" అడిగాను.
"ఈ రోజు నన్ను పురాణం చదువుకోనిచ్చేట్లు లేరు!" అంటూ చదువుతున్న పుస్తకాన్ని మూసి కళ్ళకి అద్దుకొని దేవుడి మందిరంలో పెట్టి వచ్చింది. దూరంగా ఉన్న కుర్చీని నా ప్రక్కకు లాగి కూర్చుని తను పురాణాన్ని విప్పింది. 
"ప్రక్కింటి పంకజమ్మ గారు వేరేచోట యిల్లు కొనుక్కొని, యీ యిల్లు అద్దెకిచ్చి వెళ్ళిపోయారు. రెండు వారాల క్రితమే యీ యింట్లో యీ గొడవ పడుతున్న వాళ్ళు దిగారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. తల్లి గుండ్రాయిలా ఉంటే, వయసులో ఆవిడ ధాటిని తట్టుకున్న పెద్దాయన ప్రస్తుతం తట్టుకోలేక మంచాన పడి ఉన్నాడు. అమ్మాయిలకు పెళ్ళి కాలేదు. అబ్బాయికి పెళ్ళయింది. కృష్ణాజిల్లా అమ్మాయి. పంతమొస్తే వెనక్కి తగ్గే రకం కాదు. ఇంట్లో కూర్చున్న నాకు రోజూ బ్రహ్మాండమైన కాలక్షేపం. ఈ రోజు మీరు ఉన్నారు గనుక వినగలిగారు" వరాలు చెబుతూండగానే నేను లేచాను.
"ఎక్కడికి? ఇదేం పల్లెటూరు అనుకున్నారా-మధ్యలో దూరి పంచాయితీ తీర్చటానికి? ప్రక్కింట్లో ఖూనీ అవుతున్నా పట్టించుకోని మహానగరం" అంది. 
"అక్కడ గాలి తగలటం లేదు అందుకని. . . "అంటూ కుర్చీని కిటికీ ప్రక్కకు మార్చి కూర్చున్నాను.
" పెళ్ళయిన కొత్తలో నా గాలి తగిలితే చాలు . . .ప్రపంచాన్నే మరిచిపోతాను అనేవారు. అదేంటి అక్కడ కూర్చున్నారు? "
"గాలికోసం" అంటూ మూసి ఉన్న కిటికీని తెరిచాను. ఈసారి ప్రక్కింటి మాటలు మరింత స్పష్టంగా వినబడుతున్నాయి. వినబడకపోవటానికి వాళ్ళేం మెల్లిగా మాట్లాడుకుంటున్నారా? మైకులో ప్రసంగిస్తున్నట్లు తారాస్థాయిలో రెచ్చిపోతుంటే!
"తప్పండీ! ప్రతి యింట్లోను గొడవలుంటాయి. ఇలా పొంచి వినటం సభ్యత అనిపించుకోదు." 
"తప్పేముంది? మా కధల్లో కొత్తదనం కావాలంటే యిలాంటి పరిశోధనలు ముఖ్యం. విను. వాళ్ళ అందరి మాటలు ఎంత పదునుగా ఉన్నాయో! పదునైన మాటల నుంచే గొప్ప గొప్ప ప్రబంధాలు పుట్టుకొస్తాయి. నీకు తెలీదా? వ్యాసుడు చెప్పుకుపోతుంటే వినాయకుడు మహాభారతం వ్రాసి పడేశాడు" 
"అలాగని వీళ్ళ యింటి గొడవలను కధల్లో యిరికిస్తారా? ఆ విషయం వాళ్ళకి తెలిస్తే, యిప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళంతా ఏకమై మీపై దాడి చేస్తారు. అసలే పెళ్ళిలో చేయించిన పుస్తెలే! కొత్తది యింకా చేయించుకోనే లేదు" వరాలి మాటలను కొట్టి పడేశాను.
"వెనకటికి ఘనత వహించిన నవలా రచయిత టెలిఫోను శాఖలో రాత్రి విధులను(నైట్ డ్యూటీ) నిర్వర్తించే అమ్మాయిల చర్యలను, ఒక పత్రికలో సీరియల్ గా వ్రాసి పడేశాడు. అది చదివిన టెలిఫోను అమ్మాయిలు అదే పత్రికపై సీరియల్ ఆపమని ఉత్తరాల దాడి చేసినా, ఆ సీరియల్ ఆగిపోలేదు. అసలా రచయిత యింగ్లీషు నవలలను చదివి వాటిలో కొన్ని అంశాలను ఉన్నదున్నట్లు దింపేసినా, ప్రజలు అతనికి యిప్పటికీ బ్రహ్మరధం పడుతున్నారు. కధలు జనజీవన స్రవంతి నుంచి రావాలని మీరంతా చెప్పేదే కదా! దాని అర్ధం యిదే! పక్కింటి గొడవలను కధలరూపంలో పత్రికలకు ఎక్కించటమే! అప్పుడే పాఠకులకు కిక్. .రచయితలకు క్లిక్.. ."
"సరే మహానుభావా! మీ తిప్పలు మీరు పడండి. మధ్యలో నన్ను పలకరించొద్దు" అంటూ దేవుడి మందిరంలో పెట్టిన పురాణాన్ని తీసుకొని పడక గదిలోకి వెళ్ళిపోయింది.
ఈ గొడవలో అంతవరకూ జరిగిన ఆ గొడవను వినలేకపోయాను. నేను వినే సమయానికి ఆ యింటి కుమారుడు ప్రవేశించి ఉంటాడు. అత్త స్థానంలో ఉన్నావిడ అతనికి అతని భార్యపై ఫిర్యాదు చేస్తోంది. 
"అది కాదురా! డాబామీదకి వెళ్ళి  ఎండిపోయాయని తన బట్టలు మాత్రమే తెచ్చుకొంది. మా బట్టలు కూడా ఆరేశాం కదా! వస్తూ వస్తూ వాటిని కూడా తీసుకు రావచ్చు కదా! అదే అంటే నీ అక్కచెల్లెళ్ళను తిట్టిపోస్తోంది" 

"ఏమే! అమ్మ చెప్పిందాంట్లో తప్పేముంది?" భార్యని అడిగాడు. 
"ఆ బట్టలేం తక్కువ ఉన్నాయా? పనిమనిషి ఉంది కదాని దాని చేత రోజూ లంపెడు బట్టలు ఉతికిస్తున్నారు. అవి ఉతకలేక ఆమె రోజూ తిట్టుకుంటోంది కూడా!" 
"ఎందుకు తిట్టుకుంటుంది? దానికేం తక్కువ యిస్తున్నామా? నెలకి మూడువేలు పేలేసి పుచ్చుకుంటోంది. కాఫీ యిస్తే గాని కార్యరంగంలోకి దిగదు. అలాంటి పనిమనిషిని ఎలా వెనకేసుకొస్తోందో చూడు" ఆ మాటలంటున్న అత్తగారిని సినిమానటి సూర్యకాంతం రూపంలో ఊహించుకొన్నాను.
"పనిపిల్ల గొడవ సరే! ఈ గొడవ గురించి చెప్పండి" చిరాగ్గా అరిచాడతను.
"ముందు మీ అమ్మగారిని ఆగమనండి. తరువాత చెబుతాను" కోడలి ఉవాచ. 
"చూశావురా ఎలా తప్పించుకుంటోందో? 'అమ్మాయికి నోరెక్కువని చుట్టుపక్కల చెబుతున్నార్రా? వద్దు' అంటే విన్నావా? అందంగా ఉందని వెంటపడ్డావ్! అలుసైపోయావ్! నేలమీద పాకుతూ వెళ్తున్నప్పుడు త్రాచుపాము కూడా అందంగానే కనిపిస్తుంది. ఒక్కసారి తల పైకెత్తి కాటేసినప్పుడే దాని క్రూరత్వం బయటపడుతుంది!" 
"నేను త్రాచుపామైతే మీరేంటి?"
"ముంగీసనే! నిన్ను తొక్కిపెట్టి ఏదోనాటికి నీ పొగరును దించే ముంగీసను"
"అబ్బబ్బా! అమ్మా! అసలు విషయం మానేసి అనవసర విషయాలు మాట్లాడుతారేంటి? దాన్ని జరిగిందేమిటో చెప్పనీయి."
"ఏం చెప్తుంది? వినే దద్దమ్మ ఉంటే పురాణాలు వినిపిస్తుంది"
"ఏవమ్మోయి! నన్నేమన్నా అంటే పడతాను గానీ మా ఆయన్ని అంటే ఊరుకొనేది లేదు" 
"అహా! మహా పతివ్రత దిగి వచ్చిందండీ! మావాడు చవట గనక వాడి ఎదురుగానే యిన్నన్ని మాటలు అంటున్నా ఊరుకున్నాడు. ఇప్పుడంటే జవసత్వాలుడిగి ఆయన మంచాన పడ్డారు గానీ, వయసులో ఉన్నప్పుడు నేను నోరెత్తితే ఊరుకునేవారా? నడుముకున్న బెల్టు తీసి నా నడుము విరిగేలా చావగొట్టేవారు"
"అంటే నన్ను చావగొట్టమని చెబుతున్నారా? అలా కొడితే నేనేం ఊరుకొనేదాన్ని కాదు. పోలీసు స్టేషనుకెళ్ళి యింటిల్లిపాది మీద కాగితం వ్రాసి యిస్తాను. మీరింతగా నా మీద నోరెట్టుకు పడిపోతున్నా, గౌరవనీయమైన కొంపలో పుట్టాను గనుక మిమ్మల్ని రోడ్డున పెట్టలేదు. గృహహింస క్రింద కాగితం పడేస్తే చాలు, అత్తగారు జైలు ఊచలు లెక్కెడతారు"
"చూశావురా! నన్ను జైల్లో పెట్టిస్తుందా? మొగుడి తల్లిదండ్రులను చూడనంటే ఆ పెళ్ళానికి విడాకులివ్వవచ్చని యీ దేశంలో పెద్దకోర్టే చెప్పింది. ఈమాత్రం లా పాయింట్లు నాకూ తెలుసు" 
ఆ మాటలకు మాయింట్లో ఉన్న నేను త్రుళ్ళిపడ్డాను. ఈ రోజుల్లో పెళ్ళాడాలంటే వివాహవ్యవస్థకు సంబంధించిన చట్టాన్ని బట్టీపట్టాల్సిందే! కారణం యీ నాటి కాపురాలు గొడవలు పడకుండా ఎన్నాళ్ళుంటాయో చెప్పలేము. నా చిన్నప్పుడు మా మూర్తిగాడన్న మాటలు గుర్తొచ్చాయి.
" పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడున్నవన్నీ గుమ్మడి కుటుంబాలే!"
" నలుగురూ కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అంటారు, మరి యీ గుమ్మడి కుటుంబం ఏమిటో నాకు అర్ధం కాలేదు"
" తెలుగు సినిమాల్లో గుమ్మడి అని ఒక మంచి నటుడు ఉన్నాడు కదా! ఆయన ఎంతో హుషారుగా చిందులు వేస్తూ, పేజీల కొద్దీ డైలాగులు ఊపిరి తీసుకోకుండా చెప్పేసేవాడు. అంత ధాటీగా మాట్లాడే మనిషి ఉన్నట్లుండి గుండెను పట్టుకొని కుప్పకూలిపోతాడు. ఈ రోజుల్లో భార్యాభర్తలు రైలు, బస్సు అని చూడకుండా, బాహాటంగా ప్రయాణీకులకు తమ అన్యోన్యతని ఉచితంగా ప్రదర్శించి చూపిస్తారు. చూసేవాళ్ళు ' ఆహా! ఆ కాలంలో మా దంపతులం కూడా యింత అన్యోన్యంగా లేము' అనుకొనేలా భ్రమింప చేస్తారు. ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఒక చిన్న మాటపట్టుతో కుప్ప కూలిపోయి విడిపోతారు. చిత్రాల్లో గుమ్మడి కూలిపోయినట్లే ఎప్పుడు హఠాత్తుగా కూలిపోతాయో తెలియని కుటుంబాలు గనుక గుమ్మడి కుటుంబాలయ్యాయి."

"అమ్మా! ఊరుకుంటావా?" ఆ యింట్లోంచి వచ్చిన కేకకు నా ఆలోచనలు చెదరిపోయాయి. చుట్టుప్రక్కల ఎపార్టుమెంట్లు భూకంపం వచ్చినట్లు చలించాయి. ఏమి అనర్ధం జరిగిందో అని ఆ అంతస్తుల భవనాల్లోని జనం బాల్కనీలోకి పరుగున వచ్చి, ఏమీ కనిపించక తమ యిళ్ళల్లోకి వెళ్ళిపోయారు. 
"జైల్లో పెట్టించటాలు, విడాకులు యిప్పించటాలు . . .అంతా మీ యిష్టమేనా? నా జీవితం మీద నాకే అధికారం లేదా?" ఈ విషయంలో మగాడు అర్భకుడే! 
"అదేంట్రా నాన్నా అంత మాటన్నావ్? నిన్ను పాతిక సంవత్సరాలు కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారా!"
"ఎందుకూ? యిలా కుళ్ళబొడవటానికా?" అర్భకప్రాణి ప్రశ్న.
"మీరు పాతికేళ్ళే చూశారు. నేను ఆయనకు మిగిలిన జీవితమంతా గుండెల్లో దాచుకొని కాపాడాలి" 
"ఓహో! ఇదేనా కాపాట్టం?" సూర్యకాంతం కోడలికి సంధించిన ప్రశ్న.
"అమ్మా! నువ్వు మధ్యలో మాట్లాడకు. ప్రసూనా! అసలేం జరిగిందో చెప్పు" 
"ఆరిన బట్టలు తెద్దామని డాబా మీదకి వెళ్ళాను. డాబా నిండా బట్టలే! ఈ రోజు ఉపవాసం వల్ల నీరసంగా ఉంది. అన్ని బట్టలను ఒకేసారి చేతుల్లో యిరికించుకొని తేవటం సాధ్యం కాదు. అలాగని అన్నిటిని తేవాలంటే నాలుగు విడతలుగా తేవాలి. నీరసం వల్ల అన్నిసార్లు మెట్లెక్కలేను. అందుకే నా బట్టలను తెచ్చుకొన్నాను. వాళ్ళ బట్టలు ఎందుకు తేలేదని అడిగితే అదే చెప్పాను. ' రోజూ తెస్తున్న దానివి యీ రోజు తేవడానికేం? దొబ్బుడాయా! ' అని అత్తగారు అన్నారు. ఈ ఒక్కరోజు తమ బట్టలు తెచ్చుకొంటే మీ అమ్మాయిల అందాలేం కరిగిపోవని అన్నాను. అక్కడే గొడవ మొదలైంది" భర్తకు చెప్పిందామె.
"అయ్యో! ఎంత నంగనాచిలా చెబుతోంది. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువేం తినదు. ఈ మహాతల్లికి నీరసం వచ్చిందట! అలా పడుకో అమ్మా! మేమంతా నీ కాళ్ళు పిసికి సేవలు చేస్తాం!" 
"మీరు నాకేం సేవలు చేయక్కర్లేదు. మీ బతుకులు మీరు తిన్నగా బతకండి చాలు" 
"నోర్ముయి" ప్రసూన చెంప ఛెళ్ళుమంది.
"సెభాష్! పౌరుషం అంటే అలా ఉండాలి. నా పేరు చెప్పి మరో రెండు తగిలించు" సూర్యకాంతం కంఠం ఖంగున మోగింది.
"ఏ తప్పు చేయకుండా నన్నెందుకు కొడతారు?" ఏడుస్తున్న ప్రసూన గొంతు బొంగురుపోయింది. 
"ఆవిడకి నోటితీట ఎక్కువ. ముసల్ది ఏదో అనుకోనీ అని ఊరుకోవచ్చుగా! మీ బతుకులు మీరు తిన్నగా బతకండంటే నాకెంత మండుతుంది? ఎంతైనా వాళ్ళు నా రక్త సంబంధీకులు. ఇకపై వాళ్ళనెప్పుడు మాటలనొద్దు" అంటూ భార్యను హెచ్చరించాడు.
"అయ్యో అయ్యో! నాకు నోటితీట అంటావురా? ఇంత బతుకు బతికి యింటి యెనకాల చచ్చినట్లు, చివరికి యీ మహాతల్లిని వెనకేసుకొస్తూ నన్ను మాటలంటావురా?" ఆమె మాటలింకా పూర్తి కాలేదు.
"అమ్మా" అన్న అతని కేకతో కొద్ది క్షణాలు నిశ్శబ్దం. తరువాత సూర్యకాంతం ఏడుస్తూ అంటున్న మాటలు వినిపించాయి. 
"చూశారే! యిన్నాళ్ళకు మీ అన్న నా మీద కొట్టటానికి చేయెత్తాడు. ఇంతకన్నా ఘోరావమానం యింకేమి కావాలి? ఈ రోజు నుంచి మీ పనులు మీరు చేసుకోండి. ఆరిన మీ బట్టలను మీరే తెచ్చుకోండి. మీరే గనక లేకపోతే యీ నరకాన్ని ఎప్పుడో విడిచిపోయేదాన్ని. పెళ్ళికాని మీరున్నారని ఆగాను కానీ లేదంటే ఆత్మహత్య చేసుకొనేదాన్ని" 

"మీరెవరూ చావొద్దు. నేనే చస్తాను. వెధవకొంప! బయట పనుల్లో ఒత్తిడికి లోనై యింటికి వస్తే, ఆప్యాయంగా పలకరించి మానసిక అలసటను పోగొట్టేవారే లేరు. ఎవరికి వారు యింట్లో పెత్తనం కోసం పోరాటమే! నా సంపాదన మీద మీరంతా పడి బ్రతుకుతున్నారు. కానీ నేను సరదాగా గడపటం మీకెవ్వరికీ యిష్టం లేదు" అంటూ విసురుగా బయటకు నడిచాడు. నేను వినటం ఆపి పరుగులాంటి నడకతో మా యింటి గేటు దగ్గరకు చేరుకొన్నాను. అదే సమయంలో తన యింటిగేటును విసిరికొట్టి వేగంగా మా యింటి ముందునుంచి వెళ్తున్న అతన్ని పిలిచాను. ఆవేశంలో ఉన్న వాణ్ణి ఆపి అనునయంగా మాట్లాడితే, జరగబోయే అఘాయిత్యాలను ఆపవచ్చని నా చిన్నప్పుడు ఏదో కధలో చదివిన గుర్తు. అందుకే అతన్ని అనునయించాలనిపించింది. 
"హల్లో! మిమ్మల్నెప్పుడూ చూడలేదు. ఈ కాలనీకి కొత్తగా వచ్చారా?" పలకరింపుగా అడిగాను.
ఆవేశంగా పోతున్న అతను ఒక్క క్షణం ఆగి తన ఆవేశాన్ని దిగమింగుకున్నాడు.
"అవునండీ! మీ ప్రక్కయింట్లోనే దిగాను" 
"ఏదో అర్జంటు పని మీద వెళ్తున్నట్లున్నారు?" నాకేమీ తెలియనట్లే అడిగాను.
"ఈ రోజు కార్తీక పూర్ణిమ కదా! కాలక్షేపానికి దగ్గరలో ఆలయానికి వెడుతున్నాను"  నిజమే! ఆలయాలు కేవలం ప్రార్ధనామందిరాలే కాదు, మానసిక ఒత్తిడికి లోనయ్యే వారికి మానసిక వైద్యమందిరాలు కూడా! 
"మీరేమి అనుకోకపోతే కొద్ది నిమిషాలు మా యింటికొస్తారా? కేవలం ఒకరినొకరు పరిచయం చేసుకోవటానికి మాత్రమే!. . కాఫీ త్రాగి వెడుదురు గానీ. అదీ మీకు సమ్మతమైతేనే!" కొద్ది క్షణాలు ఆలోచించినట్లాగి మా యింటికొచ్చాడతను.
ఆవేశంగా వెళ్ళే భర్త అఘాయిత్యం చేసుకొంటాడేమోనని భయంతో బయటకు వచ్చిన ప్రసూన, తనని నేను పలకరించటం వాళ్ళ కాంపౌండ్ లోంచి చూసింది. మా రెండు యిళ్ళకీ పిట్టగోడ మాత్రమే అడ్డు గనుక గోడమీదుగా ఒకరినొకరు చూసుకొనే వీలు ఉంటుంది. గేటు వేసి అతన్ని అనుసరిస్తున్న నేను వాళ్ళ కాంపౌండ్ లోకి చూశాను. ప్రసూన నీళ్ళు నిండిన కళ్ళతోనే నాకు కృతజ్ఞతలు చెబుతూ, వాళ్ళ యింట్లోకి వెళ్ళిపోయింది. కానీ తలొంచుకు మా యింట్లోకి వెడుతున్న అతను మాత్రం యీ సంగతిని గమనించలేదు.

ఉన్నట్లుండి నేను బయటకు పరుగు తీయటం గమనించిన వరాలు చదువుతున్న పుస్తకాన్ని మూసేసి, కంగారుగా పడకగదిలోంచి హాలులోకి వచ్చింది. నేను ప్రక్కింటి వ్యక్తిని పిలవటం గమనించి, కంగారుగా వెళ్ళి నేను తెరచిన కిటికీని మూసేసింది. ఆ కిటికీలోంచి వాళ్ళింట్లో మనషులు కనపడకపోయినా, గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు మా హాల్లోకి వినిపిస్తాయి. మా యింట్లోకి వచ్చిన అతనికి తను బయట పడ్డాక, వాళ్ళింట్లో జరిగే భాగవతం వినిపించవచ్చు. దాని వల్ల అతనికి యింతవరకూ కిటికీ తీసి తమ యింట్లో గొడవను నేను విన్నట్లు గ్రహించవచ్చు. దానికి అతను మమ్మల్నేమీ అనకపోయినా, మా మీద దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది కదా! ఎంతయినా, యిలాంటి విషయాల్లో వరాలు నా కన్నా చురుకు.
లోపలికి వచ్చిన అతనికి వరాలు చేతులు జోడించి స్వాగతపూర్వకంగా నమస్కరించింది. అతను కూడా ప్రతినమస్కారం చేశాడు. 
"ఈమె నా భార్య జవరాలు" అతనికి పరిచయం చేస్తూ అన్నాను.
"జవరాలా?" విస్తుపోయాడతను. 
వెంటనే నా తప్పును గ్రహించిన నేను "సారీ! వరాలు. కాకపోతే అప్పుడప్పుడు నేను తనని జవరాలని పిలుస్తాను" చెబుతున్న నా పిర్రపై అతను గమనించకుండా గిల్లిందామె. 
"అబ్బా!" అన్నాను. 
అతను త్రుళ్ళిపడి ఏమైందని అడిగాడు.
"ఏం లేదు. కూర్చోండి" అంటూ అతను గమనించకుండా మండుతున్న పిర్రను చేత్తో రుద్దుకొన్నాను. 
వరాలు కిటికీ దగ్గర ఉన్న కుర్చీని హాలు మధ్యకి తెచ్చి, ఫాను వేసింది. అతను కూర్చుంటుండగా "వరాలూ! కాఫీ!" అని ఆమెకు ఆజ్ఞ జారీచేశాను.
"నేను అదేపనిలో వెడుతున్నాను" అంటూ వంటింట్లోకి తప్పుకొంది.
నేను మెల్లిగా నా వివరాలు చెప్పి అతని వివరాలు అడిగాను.
"నా పేరు ధర్మారావండీ! లార్సన్ టుబ్రోలో పని చేస్తున్నాను. మేము యీ ప్రక్కింట్లోకి వచ్చి పది రోజులైంది. ఇంతకుముందు నగరశివార్లో ఉండేవాళ్ళం. కంపెనీకి దూరమై వాళ్ళచేత డ్యూటీకి ఆలశ్యమవుతోందని మాట పడవలసివచ్చేది. అందుకే కంపెనీకి దగ్గరని యీ కాలనీకి మారిపోయాను."
"అదే! గేటు దగ్గర నిలబడ్డ నాకు పంకజమ్మ గారి యింట్లోంచి కొత్త వ్యక్తి వస్తున్నారేమిటని అనిపించి, మిమ్మల్ని పలకరించాను."
"పంకజమ్మగారు మీర్ పేటలో ఎపార్ట్ మెంట్ కొనుక్కొని, అక్కడకి వెళ్ళిపోయారు" అంటూ వంటింట్లోంచి వరాలు కాఫీలు తెచ్చింది. 
ప్లేటులోని కాఫీని అతనికి అందిస్తూ "మీది ప్రోపర్ యీ నగరమేనా?" అడిగాను.
"నిజానికి మాది శ్రీకాకుళం. ఉపాధికోసం యిక్కడ స్థిరపడాల్సివచ్చింది" 
"ఎక్కడుంటే ఏం లెండి. ఉపాధి కోసం అమెరికాలో స్థిరపడ్డవాళ్ళు లేరా? ఈరోజుల్లో మనం ఎక్కడ స్థిరపడితే అదే మన ఊరు" అన్నాను.
"మీ ఆవిడది విజయవాడట కదా! రోజూ డాబా మీద బట్టలు ఆరేసేటప్పుడు పలకరించుకొంటూ ఉంటాం" వరాలు చెప్పింది. 
"అవునమ్మా!"
"చాలా మంచి అమ్మాయి. మనసులో మాటను దాచుకోదు. ఆత్మాభిమానం ఉన్న పిల్ల" వరాలు సర్టిఫికెట్ కి అతను మౌనంగా తలొంచుకొన్నాడు. 
వరాలు కాఫీకప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. 
అంతవరకూ జరిగిన గొడవలో భార్యను అసహ్యించుకొంటున్న ధర్మారావులో వరాలు సర్టిఫికెట్టుతో ఏదో అలజడి గమనించాను. నిజానికి బంధాలను కలపాలన్నా, విడగొట్టాలన్నా ఆడవాళ్ళే సమర్ధులు. అందులో వరాలు లాంటి జవరాళ్ళు ఉపన్యాసాలు దంచే రకాలు కాకపోయినా, ఒక చిన్నమాటతో శత్రువులను కూడా ఆప్తమిత్రులుగా మార్చి పారేస్తారు. కొద్దిక్షణాలు మా మధ్య నిశ్శబ్దం తాండవించింది. ధర్మారావులో భార్యమీద అభిమానం పెరిగి, తనను కొట్టినందుకు మధనపడుతున్నట్లు గమనించాను.
"మీ భార్య చదువుకున్నట్లున్నారు!" అన్నాను.
"ఔనండీ! కామర్స్ లో పి.జి. చేసింది" చెప్పాడతను.
"మరి తనచేత ఉద్యోగం చేయించొచ్చుగా!" లోనుంచి వస్తున్న వరాలు అంది.
ఆమె పండుగ అని చేసిన జంతికలను రెండు పళ్ళాల్లో పెట్టి తెచ్చింది. ఒక ప్లేటు అందుకొని మౌనంగా తింటున్నాడతను. 
"ఈ రోజుల్లో ప్రభుత్వాఫీసుల్లో కూడా జీతాల ఖర్చు తగ్గించేందుకు, కన్సాలిడేటెడ్ పే చెల్లించి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మీరు ఆ కంపెనీలో జేరి ఎన్నాళ్ళైంది?" నిశ్శబ్దాన్ని భేదిస్తూ అడిగాను. 
"సుమారు పదేళ్ళయింది" చెప్పాడతను. 
"అంటే మీ పనితనం గురించి ఆ కంపెనీవాళ్ళకు తెలుసుగా! యాజమాన్యాన్ని కలుసుకొని మీ భార్య గురించి చెప్పి, మీ కంపెనీలో గాని, దాని అనుబంధసంస్థల్లో గాని ప్రయత్నిస్తే తప్పకుండా యిస్తారనిపిస్తోంది. గుమాస్తా కేటగిరీలో రోజువారీ కూలీపై తీసుకొన్నా ఆరేడు వేలకి తక్కువ రాదు. ఇంకా వయసు ఉంది గనుక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సర్వీసు కమీషను పరీక్షలు కూడా వ్రాయమనండి. అదృష్టం కలిసివచ్చి  ప్రభుత్వ ఉద్యోగం దొరికితే మరీ మంచిది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళగా మీకు సాయపడగలదు. చదువుకొన్న అమ్మాయిని ఖాళీగా యింట్లో కూర్చోపెడితే వాళ్ళకీ ఏమీ తోచదు" అన్నాను.
" మా అమ్మ అంటుంది ఉద్యోగం చేసే అమ్మాయిలు చెప్పిన మాట వినరని" గొణిగాడతను. 
"అది మీ అమ్మగారి రోజుల్లో అయి ఉండవచ్చు అన్నయ్యా! ఆ రోజులెప్పుడో పోయాయి. ఈ రోజుల్లో అమ్మాయిల తరహాయే వేరు. అయినా నాకు తెలిసి ప్రసూన గొడవలు పెట్టే రకం కాదు. రోజూ డాబాపై బట్టలు ఆరవేసేటప్పుడు పలకరించుకొంటాం కదా! దాపరికం లేని మనిషి. కాకపోతే ఎవరైనా అనవసరంగా మాటలంటే, చిన్న వయసు గనుక మాట విసరవచ్చు. ఈ మధ్యనే కదా తన పుట్టింటిని విడచి మీ యింటికి వచ్చింది. ఇక్కడి వాతావరణానికి సర్దుకోవటానికి కొంతకాలం పడుతుంది. మావారు చెప్పినట్లు తనను ఉద్యోగంలో చేరిస్తే, మీకు చేయూతగాను ఉంటుంది, తనకీ కాలక్షేపం అవుతుంది. ఇలా చనువు తీసుకొని చెప్పానని ఏమైనా అనుకొంటే సారీ!" నా తరఫున వరాలు వకాల్తా తీసుకోవటంతో మౌనంగా అతన్ని గమనిస్తున్నాను.
"లేదమ్మా! నేను అదే అనుకొంటున్నాను! తను ఉద్యోగానికి వెడితే ముఖ్యంగా నాకు ప్రశాంతత చిక్కుతుంది" అనుకోకుండా తన ఆవేదనని బయటపెట్టాడు.
"గొడవలు ప్రతీ యింట్లోను ఉన్నవే అన్నయ్యా! దాన్ని మనసులో పెట్టుకోకూడదు.. మీ కంపెనీలో దొరికితే మంచిదే! ఎన్నో కంపెనీలు ఉన్న మహానగరం యిది. రోజూ పేపర్లో ఉద్యోగాల కోసం ప్రకటనలు పడుతూంటాయి, ఫోను నంబర్లు కూడా యిస్తూంటారు. వాటికి ఫోను చేసి వివరాలు కనుక్కొంటూ ఉంటే తప్పక ఎక్కడో అక్కడ దొరకొచ్చు. అయితే యీ సందర్భంలో నేనొక మాట చెబుతాను. మీరు మరోలా అనుకోవద్దు. చెప్పింది విని మీరు కూడా ఆలోచించండి" 
"ఏమీ అనుకోను. చెప్పమ్మా!" అడిగాడతను.

(ముగింపు వచ్చే సంచికలో . . . . .)

1 comment:

Pages