శ్రీధరమాధురి – 43
(ఆశించడం అనేది ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందన్న అంశం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)

ప్రతీదీ దైవేచ్చ వల్లనే జరుగుతుంది. అన్ని ఒప్పులు, తప్పులు, మంచి, చెడు అన్నీ ఆయన సంకల్పమే. ఆయనే కర్త. మనం ఏమీ చెయ్యలేము. మనం కేవలం మన పాత్రలను పోషించగలం, అంతే. దొంగ దొంగిలించడం అనే తన పాత్రను పోషిస్తే, పోలీసు అతడిని పట్టుకోవడమనే తన పాత్రను పోషిస్తాడు. ఫిర్యాదు చేసిన లాయరు దొంగకు విరుద్ధంగా మాట్లాడడమనే తన పాత్రను పోషిస్తే, డిఫెన్స్ లాయర్, దొంగ స్థితిగతుల్ని వివరిస్తూ, అతడికి అనుకూలంగా మాట్లాడడమనే తన పాత్రను పోషిస్తాడు. జడ్జి దొంగ చేసిన పనులను, అతనిపై ఉన్న అభియోగాలను విచారించి, తీర్పును ఇవ్వడం ద్వారా తన పాత్రను నిర్వహిస్తాడు.
ఇదంతా దైవం ఆడిస్తున్న నాటకం. ఒకసారి దీన్ని మీరు గుర్తిస్తే, మీ చర్యలన్నీ దైవంచే ఆదేశింపబడతాయి, మీరు కేవలం దైవం మీ నుంచి ఆశించిన పాత్రను పోషిస్తారు. మనం జ్ఞానంతో ఉంటే, మన చర్యలకు సాక్షీభూతులమై ఉంటే, ఆ చర్యలకు అతీతంగా ఉంటూ, మన పాత్రను పోషించగలము.
మీరే కర్త అని మీరు భావించినప్పుడు, మీ మస్తిష్కంలో కూర్చున్న దయ్యం మిమ్మల్ని విజయాల్లో పొంగిపోయేలా, అపజయాల్లో క్రుంగిపోయేలా చేస్తుంది. మీరు సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు అమితానందపడతారు, చెడు చేసినప్పుడు అపరాధ భావనతో ఉంటారు. మీరు కర్తలు కాదు కనుక పొంగిపోనక్కర్లేదు, క్రుంగిపోనక్కర్లేదు. తనలో ఉన్న నిజతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని మాత్రమే, ఈ ప్రపంచంలో జరిగే అన్ని చర్యల్లో దైవాన్ని గుర్తిస్తారు. మిగిలినవారు దయ్యం చక్కగా బిగించిన ఉచ్చులో చిక్కుకుపోతారు.

ఈ బాధలన్నీ మీకు అనుకూలమైన వాటినే మీరు అంగీకరించడం వల్ల కలిగేవే. దీనికి తోడు ఆశించడంతో మీరు మీ గాయాలకు ఉప్పు రాస్తున్నారు. అందుకే జీవితం ఎలా మళ్ళితే అలా దాన్ని హుందాగా అంగీకరించి, ఆశించడాన్ని వదిలెయ్యండి. మీరు ఆనందంగా ఉంటారు.

కోపం, నైరాశ్యం అనేవి ఆశించడం వల్ల కలిగే పరిణామాలు.

మీరు మీ భావాలను వెల్లడిస్తున్నప్పుడు, ఇతరులు మీకు అనుకూలంగా స్పందించాలని ఆశిస్తున్నట్లైతే, మీరు వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధం.

ఆశించడం అనేది ఎల్లప్పుడూ బాధిస్తుంది.

మీరు ఆశించడం మానేస్తే, గతకాలపు సంఘటనలు లేక భవిష్యత్తు మీ ఆలోచనలపై ప్రభావాన్ని చూపలేవు. ఇదే మీ గతాన్ని విడిచిపెట్టే మార్గం.
****************
నేనొక గ్లాసులో నీటిని ఇచ్చి, ఆమెను తాగామన్నాను. ఆమె ఎలా తాగాలని నన్ను అడుగుతోంది. తర్వాత  ఎలా గుటక వెయ్యాలని అడుగుతుందేమో ? చాలా,  చిత్రమైన అమ్మాయి.
మీరు ఆశిస్తూ ఉన్నంతవరకూ, మీరు గతాన్ని విడిచిపెట్టలేరు, భవిష్యత్తులో ధైర్యంగా ఉండలేరు.

నిబంధనలు ఉన్న ప్రేమ ఆశించడంతో నిండి ఉంటుంది.

మీ పనికి మీ ఆశలే మూలమైనప్పుడు, అది మీ ప్రశస్తమైన సామర్ధ్యంపై ప్రభావం చూపుతుంది.

ఆమె: పాదనమస్కారాలు గురూజీ. కొన్నిసార్లు సమాజంలో మనం నిస్వార్ధంగా, కర్తృత్వం వహించకుండా, ఏమీ ఆశించకుండా పని చేసినప్పుడు, దాన్ని ఒక బలహీనతగా భావించి, మనల్ని దోచుకుంటారు. ఆ సమయంలో మీ నామం, ఆలోచనలే శాంతిని చేకూరుస్తాయి.
నేను : ఈ బాధలన్నీ సమాజం నుంచి నీవు గుర్తింపును ఆశించడం వల్ల వస్తున్నాయి. ఆశించడం లేదని నీవు చెప్పినప్పటికీ, కేవలం అది పెదవుల పైనుంచి వస్తున్న మాట. హృదయంలోనుంచి కాదు. అందుకే అంతర్లీనంగా ఈ ఆశించడం అనేది ఉన్నంతవరకు, బాధ పడడం కూడా కొనసాగుతుంది. మీరు సమాజానికి సేవ చేస్తున్నప్పుడు, బదులుగా ఏమీ ఆశించకుండా ఉండే ధైర్యాన్ని పెంపొందించుకోండి. దీనికి బదులుగా మీరు రాళ్ళ దెబ్బలు తినాల్సి వచ్చినా, అంగీకరించండి. పరిపూర్ణ ఆమోదం వలన అప్పుడు మీకు మీలోనే శాంతి అనుభవమవుతుంది.

‘ఎలా ఉండకూడదో’ చూపే ఉదాహరణగా నిలిచేందుకే కొంతమంది ఈ ప్రపంచంలో పుడుతూ ఉంటారు. మన మూర్ఖమైన మేధస్సు, వారి ప్రవర్తనను ఇలా ప్రశ్నిస్తుంది,’ వాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అని అడుగుతుంది. అరటి చెట్లకు ఆపిల్స్ కాయాలని మీరు ఆశించకండి.
‘ఎలా ఉండకూడదు’ అన్న అమూల్యమైన విషయాన్ని వారు బోధిస్తున్నారని అర్ధం చేసుకోండి. సాధారణమైన వ్యక్తులు, అసాధారణ ప్రతిభావంతులు ఈ అంశాన్ని బోధించలేరు. కేవలం వికృతమైన ప్రవ్రుత్తి కలవారే బోధించగలరు. కాబట్టి, విపరీత ధోరణి కలవారు కూడా నేర్చుకోవడం అనే ప్రక్రియలో ఉపయోగపడేవారే. మీ ఉద్వేగాలను పక్కన పెట్టి, జీవితంలో మరింత మెరుగైన వ్యక్తిగా ఎదిగడం నేర్చుకోండి.
దైవ సృష్టిలోని సౌందర్యం ఏమిటంటే, జీవితంలో పనికిమాలినది ఏదీ ఉండదు. ప్రతీదీ ఉపయోగకరమైనదే. మనం దాని వంక ఎలా చూస్తాము అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. 

జీవితంలో మీరు ఒకరికి ఉపయోగపడ్డందుకు సంతోషించండి. మీ సహాయానికి వారు కృతజ్ఞత చూపాలని ఆశించకండి. కొంతమందికి కృతజ్ఞతా భావం ఉండదు, వారికి విశ్వాసం, చేసిన మేలును గుర్తుంచుకోవడం తెలీదు. అటువంటి పశువులను విస్మరించి, మీ జీవితాన్ని ఆనందంగా కొనసాగించండి.

మీరు గురువుతో ఉన్నప్పుడు, ఆశించనిది ఏదో జరుగుతుందని ఎదురుచూడండి. మీ అభ్యర్ధనను ఆయన మన్నించవచ్చు, మన్నించకపోవచ్చు.

మాన్పడం అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి క్షణం మీరు గడిచిన క్షణం తాలూకూ దుఃఖాలను మాన్పుతూ ఉంటారు. మీరు ఇలా చెయ్యకుండా, ఆ బాధలను పోగేసుకుంటూ ఉంటే, అది నిరాశకు దారి తీస్తుంది. నైరాశ్యానికి లోని ఇతరులు కౌన్సిలింగ్ ద్వారా మీకు చికిత్స చెయ్యాలని భావించేకంటే మీకు మీరే స్వస్థత చేకూర్చుకోవడం మంచిది.

ఇతరులు వారి ప్రవర్తనను మార్చుకోవాలని ఆశించకండి. అవసరమైతే, వారితో అనుబంధాన్ని మీరు గౌరవిస్తున్నట్లయితే,  మీరే వారిపట్ల మీ దృక్పధాన్ని మార్చుకోండి.

ఎవరూ హఠాత్తుగా బాధ్యతాయుతంగా మారిపోరు. ఒకవేళ వారు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నట్లయితే, చాలాసార్లు వారు అలాగే ఉంటారు. వారి నుంచి ఏమీ ఆశించకుండా ఉండడం మంచిది. మీ బాధ్యతలను మీరు నిర్వహించండి, అది మరింత మనశ్శాంతిని, ఫలితాలను ఇస్తుంది.

అవకాశం ఉంది కనుక, అది ఆశించడానికి దారి తీస్తుంది. అసలు ఆ అవకాశమే లేకపోతే ఎవరైనా ఆశించగలరా?
అదే ప్రకృతి యొక్క సౌందర్యం. మొదట అదొక భ్రమను కలుగజేసి, మెదడును ఉచ్చులి బిగించి, ఆశించేలా చేస్తుంది. వాస్తవం దానికి విభిన్నంగా ఉన్నప్పుడు, ఆశించినట్లు జరగనప్పుడు, అది నిరాశను కలిగిస్తుంది.
నిరాశ అనుభవంలోకి వచ్చినప్పుడు, ‘ఇది సాధ్యమే’ నాన్న భ్రాంతి యొక్క సౌందర్యాన్ని అది అర్ధం చేసుకుంటుంది. ఇప్పుడు మస్తిష్కం మరింత సంతులనంతో వ్యవహరించి, ప్రకృతిని యధేచ్చగా భావించడం పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.
ఈ నిరాశ యొక్క పరిణామాలు తక్కువగా ఉన్నప్పుడు, ఈ సౌందర్యాన్ని అర్ధం చేసుకోలేము, మస్తిష్కం అసంతులనంగా ఉంటూ, జీవితంలోని ఇతర అంశాలను ప్రభావితం చేస్తుంది.
 ***

1 comments:

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top