శ్రీకనకదుర్గ శతకము - శ్రీదేవవరపు రాఘవులు - అచ్చంగా తెలుగు

శ్రీకనకదుర్గ శతకము - శ్రీదేవవరపు రాఘవులు

Share This
శ్రీకనకదుర్గ శతకము - శ్రీదేవవరపు రాఘవులు
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:

శ్రీదేవవరపు రాఘవులు తూర్పు గోదావరి మండలములోని గొల్ల్ప్రోలు ప్రాంతమునకు చెందిన ఆధునిక కవి. వీరి తల్లి వెంకటాచలం నాజరాజ. ఈ కవి భద్రాద్రి రామచంద్రుని భక్తుడు. ఈ కవి తనగురించి శతకాంతమునందు ఇలా చెప్పికొనినాడు. 

సీ. వసుధలో శ్రీదేవవరపు వంగడమున, వేంకటాచలమను విమలగుణుడు
నాదు జనకుడు; వినయవతి శ్రీమతి, నాగరాజనుసాధ్వి నాకు జనని
దోషరహితమైన "తూర్పుగోదావరీ", మండలంబందున మాన్యమైన
"గొల్లప్రో" లనియెడు పల్లెలోపుట్టి; శ్రీ, భద్రాద్రిరాముని భక్తితోడ

గీ. కొలిచి; కవిత వరించి నీ లలితకీర్తి
గూర్చి శతకంబు వ్రాసితిన్ కోర్కెతోడ
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

సీ. విద్యుత్తుశాఖలో నుద్యోగినై జీవి, తంబును గడుపుచు దైవతత్వ
జిజ్ఞాసతో సవ్య చిన్మయానందము, పొందకోరుచు మహాపుణ్యమలర
సర్వమానవులకు సౌశీల్యభావముల్, బోధింప నిశ్చల బుద్ది కలిగి
మతతత్త్వరహితమౌ మానవతనుకోరి. "కనకదుర్గ శతకమును" ను రచించి

గీ నీకు కృతి యిచ్చుచుంటిని నిర్మలముగ
వేగ నను బ్రోవుము భవాని! విశ్వజనని!
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

ఈ కవి ఇతర రచనలు 1. భద్రాద్రి రామ శతకము, 2. వందేమాతరం అను దేశభక్తి కావ్యము, 3. కోకిల సందేశము, 4. ఆత్మ - పరమాత్మ వచన గ్రంధము, 5, శ్రీ క్రీస్తుపురాణము, 6. రవీంద్రిని గీతాంజలి ప్రేరణచే రవింద్ర గీతాంజలి - రమణీయ హృదయాంజలి అనేపద్యకావ్యం (సంపూర్ణ తేటగీతులతో). 

శతక పరిచయం:

"భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!, ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!" అనే మకుటంతో 108 సీస పద్యాలలో రచింపబడిన ఈశతకం భక్తి రస ప్రధానమైనది. 1975 సంవత్సరంలో భద్రాచలము నుండి విజయవాడకు వెల్లి అక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ఆమె కీర్తిపై ఒక శతకము వ్రాయనెంచి ఇంద్రకీలాద్రిపైననే "విశ్వవిఖ్యాత పూత! శ్రీవిజయవాడ, ఘనవినుత చరిత! జనని కనకదుర్గ!" అనే మకుటంతో కొన్ని పద్యాలకు శ్రీకారం చుట్టటం జరిగింది. తరువాత పొల్లూరులో జరిగిన కనకదుర్గ మందిర ప్రతిష్టలో పాల్గొని మకుటమునందు పొల్లూరు పేరుతో మార్పుచేసారు. ఈవిధంగా పూర్తిచేయబడిన శతకము విడుదల చేయటంలో ఎన్నో ఆటంకములు కలిగినవి. ఒకనాడు కలలో "భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!" అనే మకుటాన్ని ఎవరో సూచించినట్లొ కవి మదికి తోచగా వెంటనే మకుటమును మార్చగా మరునాడే ఆ శతక ఆవిష్కరణకు గల ఆటంకములన్నియు తొలగి ముద్రణ జరిగింది. 

ఈ శతకము భక్తిరస ప్రధానమైనప్పటికీ సమకాలీన విషయములపై కవి తన అభిప్రాయములను చెప్పినాడు. నీతి బోధక విషయములను, విపులముగా చర్చించినాడు. దుర్గా సప్తశతి (దేవీ మహత్యమునందలి కథలను, సివపార్వతుల కల్యాణ ఘట్టములను, శక్తిపీఠ విషయములను కూడా ఈశతకంలో మనం చూడవచ్చు. 
ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాం.

సీ. కాశికా పురిలోన కనికరమున; అన్న, పూర్ణవై వ్యాసుఇ బ్రోచినావు
శ్రీకాలహస్తిలో చెలువొప్ప కన్నని, దీవించి ముక్తి యందించినావు
కామాక్షివై భక్తగణములన్ ఖ్యాతితో, కాపాడితివి శివకంచిలోన
మీనాక్షివై దుష్టదానవ వీరులన్, వధియించి యుంటివి మధురలోన

గీ. కాళికా దేవివై కలకత్తలోన
వెలసియుంటివి తల్లివై విమలమలర
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

సీ. కంచిలో కామాక్షి! కాశీ విశాలాక్షి!, మధురమీనాక్షివై మహినిబ్రోచి
శ్రీకాలహస్తిలో సిద్ధితో జ్ఞాన ప్ర, సూనాంబవై ముక్తి సుఖములిచ్చి
శ్రీశైలమందున స్థిరమొప్ప భ్రమరాంబ, తల్లివై ప్రజకు వాత్సలమొసగి
దక్షవాటికలోన దక్షసుతవు సత్, దేవివై ప్రజ్ఞాన దివ్వెయగుచు

గీ. విమ మహిమలలు నెలకొల్పి వెలసియున్న
తల్లివని నిన్ను దలచ నా తమము తొలగె
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

సీ. "పీఠికాపుర"మందు పెంపుతో పురుహుత, శక్తివై భక్తులన్ సాకినావు
రామలింగేశ్వరు రామవై నీమవై, పూజగొంటివి "గొల్లప్రోలు"లోన
క్ప్ప్పేశ్వర సతివై కోమలరూపివై, భువిని బ్రోచితివి "పలివెల"యందు
"పొల్లూరు" నగరిలో చల్లని కరుణతో, పూజలందితివి ప్రపుణ్యమొప్ప

గీ. ఇట నెటనుగన్న నీకాంతి యినుమడించె
నీదికీర్తి చంద్రికలెల్ల నిలిచియుండె
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

సీ. పదిమందిలో స్త్రీలు బాగుగా తిరిగిన, నీతిగోల్పోవుట నిజముకాదు
పదిమందిలో మగవారలు తిరిగిన, నీతిగోల్పోదురు నిష్ఠతొలగి
సతులపై నిందలు సవ్యంబుగాదాయె, సతులు సహనమందును సౌమ్యమతులు
విద్యావినయములం దుద్యోగమందున, స్త్రీలు నేడు ప్రకాశించుచుండె

గీ. సుదతికి తెలివితేటలు సొమ్ము సుమ్మి
రాజ్యమేలు చుండిరిగాదె రమణులిపుడు
భవ్య గుణజాల! శివలోల! భక్తపాల!
ఘనవినుత! శ్రీవిజయవాడ కనకదుర్గ!

సీ. సాగరంబునగల జలచరంబుల గూర్చి, ఖచ్చితంబుగ లెక్ఖ కట్టవచ్చు
నీరులేనట్టి యెడారులందునగల, యిసుకరేణువుల లెక్కించవచ్చు
వనము లందునగల పక్షుల లెక్కను, తప్పులేకుండగ చెప్పవచ్చు
గగనాన విహరించు గ్రహరాశి చర్యలన్, నిపుణ మొప్పార గుణించవచ్చు

గీ. కాని నీ దివ్య తత్త్వంబు ఖచ్చితముగ
నెంచసాధ్యమె కడకా విరించికైన   ||భవ్య||

చక్కని వాడుక భాషలో, తేటతెనుగు పదములతో విజయవాడ కనకదుర్గమ్మను సంబోదిస్తూ చెప్పిన ఈశతకము అందరూ చదువ తగినది. దసరా సందర్భంగా ఆతల్లి కరుణాకటాక్షాలు మీ అందరిపై ప్రసరించాలను కోరుకుంటూ ఈశతకాన్ని మీకు పరిచయం చేసున్నాను.

మీరూ చదవండి మీ మిత్రులచేత చదివించండి.
***

No comments:

Post a Comment

Pages