పద్మశ్రీ రేలంగి - అచ్చంగా తెలుగు
పద్మశ్రీ రేలంగి
పోడూరి శ్రీనివాసరావు 

సామాన్యులకే కాదు... పండితపామరులకే కాదు... గృహిణులకే కాదు.... చిన్న పిల్లలకే కాదు... అందరికీవినోదాన్నందించేది, ఆనందపరిచేది సినిమా, సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లతో సమానమైన ప్రాధాన్యత కలవాడు,హాస్యనటునికి కూడా గుర్తింపు, గౌరవం కల్పించిన వ్యక్తి శ్రీ రేలంగి వెంకట్రామయ్య.
హాస్య చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు రేలంగి,పామరజనానికి, పల్లెటూరి ప్రజలకు ‘రేలంగోడు’... ఎవ్వరికైనామనవాడు, మనలో మనిషి, రేలంగి తన హాస్యాభినయంతో, తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న చతురుడు శ్రీ రేలంగి.
చలన చిత్రరంగంలో ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్యే!
********
9 ఆగష్టు 1910 వ తేదీన రావులపాడు అనే కుగ్రామంలో శ్రీ రేలంగి వెంకట్రామయ్య జన్మించారు. తండ్రి రామస్వామి గారు.చేసేది సారా వ్యాపారమైనా, హరికథలు చెప్పడంలో మంచిపేరు సంపాదించారు. తల్లి శ్రీ వెంకట్రామయ్య గారి చిన్న తనంలోనే మరణించారు. పినతల్లిగౌరమ్మే... రేలంగిని తల్లి లాగసాగింది. రేలంగికి చిన్నతనం నుంచీ, నాటకాలంటే... పిచ్చి ప్రేమ అందుకనే చదువు సరిగ్గా అబ్బలేదు.9 తరగతితో చదువు అటకెక్కించేసారు.లలితకళలమీద ఉన్న శ్రద్ధతో, తండ్రే గురువుగా ఆయనవద్ద సంగీతం నేర్చుకున్నారు. బాల్యంనుండీ తండ్రి వద్దే సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచిపేరు తెచ్చుకున్నారు.
1919 వ సంవత్సరంలో ‘బృహన్నల’ అనే నాటకంలో స్త్రీ పాత్ర ధరించేందుకుగాను మొదటిసారి ముఖానికి రంగు పులుముకున్నారు. కాకినాడలో గల ‘యంగ్మెన్ హ్యాపీ క్లబ్’లో వారు నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు. శ్రీఎస్.వి.రంగారావు, అంజలీదేవి అప్పటికే, ఆ క్లబ్ సభ్యులుగా, నాటకాలు ప్రదర్శించేవారు. శ్రీ రేలంగి కూడా, అదే క్లబ్ లో, వారు ప్రదర్శించే నాటకాలలోఎస్.వి.రంగారావు,అంజలీదేవితదితరులతోకలసినాటకాలలో పాల్గొనేవారు. స్కూలు రోజుల్లో కూడా, చదివింది 9 వ తరగతి వరకే అయినా, నాటకాలలో పాత్ర పోషణ చేసేవారు. నటనంటేవారికంత ప్రాణం మరి!
1931 లో విడుదలయిన‘భక్త ప్రహ్లాద’ చిత్రంచూశాక, తను కూడా చలనచిత్రాల్లో నటించాలనే కోరిక బలపడింది. ఆ నిశ్చయంతోనే కలకత్తా చేరుకున్నారు. అప్పట్లో చలనచిత్ర పరిశ్రమ, కలకత్తా, షోలాపూర్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండేది. ఎక్కువ చిత్రాలు కలకత్తాలోనే నిర్మితమౌతూ ఉండేవి. ఆ రోజుల్లో మూకీ చిత్రాలే ఎక్కువగా నిర్మించబడుతూండేవి. శ్రీ సి. పుల్లయ్యగా పేరొందిన,చిత్తజల్లు పుల్లయ్యగారు, అప్పటికే కలకత్తా లోని చలనచిత్ర పరిశ్రమలో సంబంధాలు కలిగి ఉండేవారు.
అప్పటికే శ్రీ రేలంగి వెంకట్రామయ్యగారికి వివాహమైంది, భార్య పేరు బుచ్చియమ్మ.
కలకత్తాలోసి.పుల్లయ్యగారు నిర్మిస్తున్న ‘శ్రీ కృష్ణ తులాభారం’ సినిమాలో మొదటిసారిగా వసంతుడి రూపంలో హాస్య పాత్ర దక్కింది. ఆ తర్వాత ‘వరవిక్రయం’, ‘గొల్లభామ’ మొదలైన చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు ధరించినా, సరి అయిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చాలా రోజులకు, సుమారు 12 సంవత్సరాలు తర్వాత ‘గుణసుందరి కథ’ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని పాత్ర పోషణకు తగిన గుర్తింపు వచ్చి, రేలంగికి పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు, హాస్యనటునిగా మరిన్ని చిత్రాలలో అవకాశాలు తలుపుతట్టాయి.
ఆ తర్వాత, శ్రీ రేలంగి మరి వెనుతిరిగి చూడలేదు. దాదాపుగా ప్రతీ సినిమాలో ప్రముఖ హాస్యపాత్రలో కనిపించేవారు.హాస్యపాత్రాలే కాదు, కథానాయకుడి స్నేహితుడిగా, కథానాయకుడు లేక కథానాయిక తండ్రిగా, బాబాయ్ గా, మామయ్యగా, వయసుమళ్ళిన పాత్రలో సైతం, తనదైన మార్కు చూపిస్తూ, పాత్రలో ఒదిగి పోయేవారు.
మిస్సమ్మ, మాయాబజార్,దొంగరాముడు,వెలుగునీడలు,విప్రనారాయణ,నర్తనశాల,అప్పు చేసి పప్పుకూడు, సత్యహరిశ్చంద్ర, లవకుశ, జయభేరి, జగదేకవీరుడు, సువర్ణ సుందరి, ప్రేమించి చూడు,పెళ్ళికానుక....ఇలా అనేక చిత్రాలలో కథానాయకుడితో సమానమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు శ్రీ రేలంగి.
శ్రీ రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చాడు.ఎందఱో వివాహాలకు ద్రవ్య సహాయం చేసేవాడు. రేలంగి ఇంట్లో నిత్యం అన్నదానాలు జరుగుతుండేవి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రేలంగికి ఒక సినిమా థియేటర్ ఉంది. దాని పేరే రేలంగి చిత్రమందిర్. ఆ థియేటర్ ఇప్పటికీ కొనసాగుతోంది.
రేలంగి వేసిన హాస్యపాత్రలకు జోడీగా ఎక్కువగా సూర్యకాంతం,గిరిజ నటించారు.హాస్యనటునిగానే కాక,కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన శ్రీ రేలంగి సినిమాల్లో పాటలు కూడా పాడారు. వాటిల్లో“వినవే బాలా నా ప్రేమగోల” “ధర్మంచెయ్ బాబూ, కాణీ ధర్మం చెయ్ బాబూ!” “సరదాసరదాసిగరెట్టు” – మొదలైన పాటలు, రేలంగి పాడిన పాటల్లో అత్యంత బహుళ జనాదరణ పొందినవి.
శ్రీ రేలంగి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి, 1960వ సంవత్సరంలో ‘సమాజం’ అనే సినిమా నిర్మించారు. మరో ప్రముఖ హాస్యనటుడిగా తరువాత పేరు ప్రఖ్యాతులు గడించిన శ్రీ రాజబాబుకు, ఈ‘సమాజం’ సినిమాయేతొలిచిత్రం.
1970 వ సంవత్సరం, శ్రీ రేలంగి కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం పొందారు. ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన తోలి హాస్యనటుడు శ్రీ రేలంగి.
1968 వ సంవత్సరంన పక్షవాతం బారిన పడిన శ్రీ రేలంగి శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బంది పడ్డారు. తరువాత కొంత కోలుకున్నప్పటికీ మునుపటి మనిషి కాలేకపోయారు. 27.11.1975 న అందర్నీ నవ్వించిన ఈ హాస్యనట చక్రవర్తి, తన అభిమానులను శోకసముద్రంలో ముంచి కన్ను మూశారు. 1975 లో విడుదలయిన‘పూజ’ చిత్రం శ్రీ రేలంగి నటించిన ఆఖరిచిత్రం.
ఈనాటికీ,పాతసినిమాలు చూసేవారికి, మనసు చికాకుగా ఉన్నప్పుడు శ్రీ రేలంగి సినిమాలు చూస్తే, మనసు తేలిక పడుతుంది. ప్రశాంతంగా హాయిగా ఉంటుంది.
***

No comments:

Post a Comment

Pages