Saturday, July 22, 2017

thumbnail

నాకు నచ్చిన కథ--పెళ్ళానికిప్రేమలేఖ—రంగనాయకమ్మగారు

​ నాకు నచ్చిన కథ--పెళ్ళానికిప్రేమలేఖ—రంగనాయకమ్మగారు
శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

ప్రేమలేఖలు వ్రాయటం అందరికీ చేతకాదు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రేమలేఖ వ్రాసారా? గుర్తుకు  తెచ్చుకోండి. మనలో బహుశ: నూటికి 80 మంది వ్రాసి ఉండరు.ఒక పదిమంది వ్రాసి ఉంటారేమో! మిగిలిన పదిమందీ వ్రాసినవి ఒక విధంగ వారి 'మగ'తనాన్ని చూపించేవే!  నిజంగా మనం వ్రాసిన దాంట్లో ఏ మాత్రం ప్రేమ ఉన్నా,అందుకున్న వారి మనసులో చిరకాలం అది ఒక అపురూప చిత్రమై నిలిచిపోతుంది. 'మన వాళ్ళు వట్టి వెధవాయలోయ్!' అన్న  మహారాజశ్రీ గిరీశం గారు కొన్ని అక్షరసత్యాలు చెప్పుతుంటాడు ఒక్కొక్కసారి.! 'ప్రేమలేఖలు' అనే అద్భుతమైన  పుస్తకాన్ని వ్రాసిన శ్రీ చలం గారు,తెలుగువాళ్ళలో చాలామందికి  ప్రేమలేఖలు వ్రాయటం చేతకాదన్నారు.ప్రియురాలికి ప్రేమలేఖ వ్రాస్తే,అది పెళ్లి కాకముందే వ్రాయాలి. కాకపోతే--మరీ పెద్ద అయిన తరువాత,కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, భార్యాభర్తలు చెరొకచోట ఉన్నప్పుడు, నిజమైన 'ప్రేమలేఖలు' కొన్నిటిని  మనం గమనించవచ్చు.ఆత్మీయ, ఆప్యాయతానురాగాలు తెలుపుకుంటూ, ప్రేమను పంచుకుంటూ, పెంచుకుంటూ  ప్రేమలేఖలు వ్రాసే ప్రేమికులు ఎంత మంది ఉంటారు?నేను చెప్పే విషయాలన్నీ స్త్రీలకూ కూడా వర్తిస్తాయి.పెళ్ళికి ముందు గానీ, పెళ్ళైన కొత్తల్లో గానీ, ఒకవేళ కొన్ని రోజులు భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండవలసి వస్తే.ఒకవేళ వారు ప్రేమమలేఖలు(?) వ్రాసుకుంటే,వాటిలో మహా ఉంటే,సెక్స్ ను ఉద్రేకపరిచే విషయాలే ఉంటాయి.ఉదాహరణకు--'నీకు నా ముద్దులు!' అనో, మరేమేమో ఉంటాయి. భూతద్దం వేసి వెతికినా వాటిల్లో 'ప్రేమ'  అనేది కనపడదు. ఇక ప్రస్తుత ఆధునిక ప్రపంచం గురించి చెప్పేదేముంది ? ప్రేమించటం,ప్రేమించబడటం --ఈ రెండూ తెలియని రోజులు ఇవి. పార్కులంబడిపడి తిరగటమే 'ప్రేమ' అని అనుకుంటున్నది నేటి యువత! నాకు తెలిసినంత వరకూ, ప్రేమ అనేది ఒక అవ్యక్తమైన మధురానుభూతి! ప్రేమించబడే వ్యక్తికి,ప్రేమ అనేది మన స్పందన వల్లే తెలియాలి! ప్రత్యేకమైన వ్యక్తీకరణ అవసరము లేనిదే నిజమైన ప్రేమ!అంతే కానీ,వికారపు వెకిలి చేష్టలను, ప్రేమ అనలేము.ఇదంతా చెపుతుంటే,నాకు,ఈ విషయాలలో విపరీతమైన అనుభవం ఉందని మీరందరూ అనుకోవచ్చు. నిజంగా నేను,'ప్రేమికుడనే'! ప్రేమించటం ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను! భార్యాభర్తలు యవ్వనంలో ఉన్నప్పుడు  ఒకరినుంచి  మరొకరు ఏదో ఒకటి ఆశిస్తారు. వయసొచ్చిన కొంత కాలానికి ,ఒకరికొకరు ఏమీ ఇచ్చుకోలేకపోయామని బాధపడుతుంటారు.వృద్ధాప్యంలో,తన కళ్ళముందరే తన భార్య  పోతే బాగుంటుందని భర్త,---అలాగే,తన కళ్ళముందరే తన భర్త  పోతే బాగుంటుందని భార్య, ఆలోచిస్తుంటారు.అదే 'దివ్యప్రేమ'! అటువంటి 'దివ్యప్రేమ' అనే మధుర కావ్యానికి సమగ్ర రంగుల పద చిత్రమే,శ్రీ రమణ గారు వ్రాసిన 'మిథునం'!ఈ కథలోని ఈ 'దివ్యప్రేమ' గుర్తుకొచ్చినప్పుడల్లా,మన కళ్ళు మనకు తెలియకుండానే చెమ్మగిల్లుతాయి. ఇక,రంగనాయకమ్మ గారి విషయానికి వస్తే, ఈమ పూర్తి స్త్రీవాద రచయిత్రి అని చెప్పవచ్చు.తరువాత రోజుల్లో  Radical views తో రచనలు చేసారు. వీరు వ్రాసిన కృష్ణవేణి, స్వీట్ హోం,బలిపీఠం లాంటి నవలలు నేటికి చదివినా వాటిలోని  విషయాలు ఈ నాటికి కూడా వర్తించేటట్లు ఉంటాయి.ఆధునిక మహిళ,పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ, 'మహిళ ' పరిస్థితిలో గణనీయమైన ఏ మార్పూలేదు! భార్యల వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్తలు అరుదుగానే కనిపిస్తారు.ఇదే విషయాన్ని,రంగనాయకమ్మ గారు తన 'పెళ్ళానికి ప్రేమ లేఖ' అనే కథలో,ఎవరినీ నొప్పించకుండా,ఆవిడ బాణీలో చెబుతారు.ఇక కథలోకి వెళ్లుదాం.
*********
బుచ్చిబాబు,విమలలు ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన దంపతులు.వారిది అన్యోన్య దాంపత్యమనే చెప్పవచ్చు. బుచ్చిబాబుకు,పెళ్ళామంటే అపరిమితమైన  ప్రేమ.ఎంతైనా,భర్త కదా--కొద్దిగా పురుషాధిక్యపు అహంకారం ఉంది! కానీ,అతడి భార్య విమలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. తల్లితండ్రులూ,బంధువుల మీద మనసుమళ్ళి విమల ఒకసారి పుట్టింటికి వెళ్ళింది, భర్త అనుమతితోనే! కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పింది. ఎన్నిరోజులైనా  ఆవిడ మాత్రం పుట్టింటి నుండి తిరిగి రావటం లేదు.ఇక,గత్యంతరము లేక పెళ్ళానికి  (ప్రేమ?)లేఖల  రాయబారం సాగించాడు.ఆ లేఖల సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే  --తనకు హోటల్ భోజనం పడటంలేదని, రోజూ ఎక్కడనుంచో  వచ్చి ఒక దొంగపిల్లి పాలు త్రాగిపోతుందని ......! విమల, ఆ లేఖలన్నిటినీ చదివి,భర్త  మీద జాలికలిగి పుట్టింటి నుండి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.అకస్మాత్తుగా వెళ్లి భర్తను ఆశ్చర్య పరచాలనేమో! తాను వస్తున్న విషయం గురించి భర్తకు లేఖ వ్రాయలేదు. బుచ్చిబాబుకు విసుగుపుట్టి, ఆఖరి అస్త్రంగా ఒక లేఖను వ్రాసాడు.ఈసారి లేఖలో బుచ్చిబాబు కొంత అతితెలివి ప్రయోగించాడు. పక్కింటి ఆవిడ అందాన్ని గురించి,ఆవిడ మంచితనం గురించి, ఆవిడను  ఆకాశానికి  ఎత్తేస్తూ వ్రాసాడు.దీని వల్ల అతని భార్యకు అసూయ(jealousy) కలుగుతుందని అతని 'మగ'(భర్త ) ఆలోచన.అది కాస్తా బెడిసికొట్టింది. విమల రాలేదు సరికదా,బదులుగా ఒక ఘాటైన లేఖ కూడా వ్రాసింది.మొదటిసారిగా,చివరిసారిగా ఒక నిజం తెలుసుకుంది.అది ఏమిటంటే--తన భర్త పెళ్ళానికి ప్రేమలేఖ వ్రాయటం చేతకాని చవట అని.అంతేకాదు,అటువంటి చవటతో కాపురం చేయటంకన్నా హీనమైనపని మరొకటిలేదనే భావనకు పూర్తిగా వచ్చింది. బుచ్చిబాబుకి ఏమీ పాలు పోవటంలేదు.భార్యను తిరిగి రప్పించుకోవటంలో అతను చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.అప్పుడు బుచ్చిబాబుకు జ్ఞానోదయమైంది.భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో అర్ధమయింది.భార్యాభర్తల మధ్య ఉండవలసినవి--ఆర్ధిక అవసరాలు కాదు,శారీరక సంబంధాలు కానే కాదు,భార్య అంటే పనిచేసే పనిమనిషి కాదు,పడక సుఖం ఇచ్చే యంత్రం కూడా కాదని తెలుసుకున్నాడు.ఆఖరి ప్రయత్నంగా మరో నిజమైన  ప్రేమలేఖ వ్రాసాడు. "నాలోని ఒక్కొక్క అణువూ,ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తుంది.నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినము, ప్రతి యుగము ప్రార్ధిస్తాను." అని వ్రాసాడు.ఆ ప్రణయలేఖను చదివి  విమల వెంటనే రివ్వుమని వచ్చి బుచ్చిబాబు కౌగిలిలో కరిగిపోతుంది.
(కథ పూర్తి అయింది.)
*********
ఈ తరం వారికి ఇలాంటి ప్రేమలేఖల అవసరం అక్కరలేకపోవచ్చు.మాయాజాలం లాంటి అంతర్జాల యుగంలో ఇటువంటి  లేఖలలోని మాధుర్యం  తెలుసుకునే అవకాశం చాలావరకు, యువత కోల్పోయారు. ..'ప్రేమలేఖల' కోసం  పోస్ట్ మాన్ కోసం ఎదురు చూడటం, వాటిని ఎవ్వరూ చూడకుండా దాచిపెట్టి పదేపదే చదవటం, చదివిన ప్రతిసారీ మనసు ఆనంద డోలికల్లో ఊగటం....ఇటువంటివన్నీ చెప్పలేని మధురానుభూతులు! పెళ్ళానికి  ప్రేమలేఖలు ఎలా వ్రాయాలో చెప్పటమే కాకుండా,భార్యాభర్తల మధ్య  ప్రేమానుబంధం ఎలా ఉండాలో కూడా ఈ తరం వారికి చెబుతుంది ఈ కథ. స్త్రీ హృదయాన్ని గురించి ఆలోచింపచేసే  గొప్పతనం కూడా ఈ కథలో ఉంది. అందుకే,ఈ కథ అంటే నాకు ఇష్టం.
స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మగారికి కృతజ్ఞతలతో...
(చలం గారు ఒక ప్రేమలేఖలో ప్రేయసికి ఇలా వ్రాస్తాడు,"నీ వైపు ప్రయాణం చేస్తున్న ఏ రైలు అయినా-నాకు ఆత్మీయంగానే  కనిపిస్తుంది- నీకు చేరువవుతుంది కనుక"అని.)


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

2 Comments

avatar

మంచి కథ.ఈ తరం వారికి ప్రేమ గురించి తెలుసుకుందికి ఉన్న ఓకే ఒక ఆధారం సినిమాలు.ఆ వెర్రి పోకడలనే అనుకరిస్తున్నారు.పుస్తకాలు చదివే అలవాటు మిగిలిన చోట్ల తెలియదు కానీ..తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ..అందు చేత మంచి సాహిత్యాధ్యయనం అనేది మృగ్యం.ఇక ప్రేమే కాదు మనిషి కి సంబంధించిన ఏ సున్నితమైన భావాలు పట్ల అవగాహన లేని..డబ్బు,వస్తు వ్యామోహం తప్ప మరో అంశంలేని ప్రపంచం.భార్యా, భర్తల మధ్య కూడా డబ్బు,నీ నా బేధాలు చోటుచేసుకుంటూ..అహాలు పెచ్చుపెరిగి సంసారాలు నరకాలు గా రూపు దిద్దుకుంటున్న నేపధ్యం లో ఇలాటి కధలు వాటి విశ్లేషణ కాస్తాయినా దాంపత్య జీవితం పట్ల అవగాహన కలిగిస్తాయి..మంచి కథ ,విశ్లేషణ..regards సర్

Reply Delete
avatar

మీరు రంగానయకంమ్మ గారి నవలను మా అందరికి చక్కని మీదిన శైలిలో విసిదపరిచారు ధన్యవాదాలండి. మీరన్నట్లు నేటి తరంవారికి ప్రేమ లేఖలే కాదు మాములు లేఖలు వ్రాయటం వాటిని అందుకోవటం వాటిని చదువుతో ఆనందించటం వాటిని దాచుకోవటం గొప్ప అనుభూతి కోల్పోయారు .

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information