మంచి పిల్లలు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!

మంచి పిల్లలు

పిల్లలూ! ఎలా ఉన్నార్రా? బావున్నారా?
అమ్మా, నాన్నలతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలియదు!
చిన్నపిల్లలు చెత్త ఏరుకోవడం, ఇళ్లలో హోటళ్లలో పనిచేయడం, పొద్దున్నపూట ,నిద్రపోవలసిన సమయంలో పాల ప్యాకెట్లు, పేపర్లు ఇళ్లకి వేయడం, రైళ్లలో చొక్కాగుడ్డ తీసుకుని రైల్లో పడిన ఒలిచిన వేరు శనక్కాయల చెత్తని, కాగితం ముక్కల్ని చొక్కాగుడ్డతో ఊడుస్తూ అడుక్కోవడం మీరు చూసే ఉంటారు. వాళ్లు అనాథలర్రా, బట్టలిచ్చి, తిండి పెట్టి, పాపం వాళ్లని జాగ్రత్తగా చూసుకునే వాళ్లుండరు. వేళకింత దొరికింది తిని ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. పిల్లల చేత పనిచేయించడం నేరం అని చట్టాలు చేసినా, వాళ్ల బతుకులు అలాగే ఉంటున్నాయర్రా. కొంతమంది అనాథ పిల్లలు హాస్టళ్లలో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతారు. ఆ వయసులో చదువుకోవాలని ఉన్నా, చెప్పించే వాళ్లుండరు. చదువుతుంటే మనసు కరిగి పోయి కన్నీళ్లు వస్తున్నాయి కదూ! వాళ్లతో పోల్చుకుంటే మనమెంత అదృష్టవంతులమో కదా! ఎంచక్కా మనకి అమ్మానాన్నలు కావలసినవన్నీ కొనిస్తారు. చక్కటి బట్టలు వేసుకోవడానికి తెచ్చిపెడతారు. తినడానికి ఏం కావాలంటే అవి ఇంట్లో చేసి పెడతారు. బయటవి కూడా కొని పెడతారు. అప్పుడప్పుడు సినిమాలకి, షికార్లకి, ఎగ్జిబిషన్ లకి, ఊళ్లకి తీసుకెళతారు. మనం ఈ వయసులో పెద్దవాళ్లనీ, గురువులనీ ఇబ్బంది పెట్టకుండా చదువుకుంటే రేపటి మన భవిష్యత్తు చక్కగా ఉంటుంది. మన పుట్టిన్రోజునాడు మనకి సన్నిహితంగా ఉండేవాళ్ల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంచడం కాకుండా, అనాథ శరణాలయాలకి వెళ్లి అక్కడి పిల్లల మధ్య జరుపుకుంటే వాళ్లు ఎంత సంతోషిస్తారో. పైగా మన స్నేహితులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మనం పెద్దై అనాథల్ని చేరదియ్యాలి. వాళ్లకు కావలసినవి కొనిచ్చి సంతోష పరచాలి. చదివించాలి. అలా చేస్తారు కదూ. చేస్తారు నాకు తెలుసు. మీరు మంచి పిల్లలు. ఉంటాను మరి!

మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages