ధర్మ నిర్ణయం - అచ్చంగా తెలుగు
ధర్మ నిర్ణయం 
బి.ఎన్.వి.పార్థసారథి

ధర్మా రావు మందుల దుకాణానికి వెళ్ళాడు. నూట యాభై రూపాయలకి మందులు తీసుకుని తన దగ్గర చిల్లర లేక ఐదు వందల రూపాయల నోటు ఇచ్చాడు. తిరిగి మందుల షాప్ వాడు ఇచ్చిన చిల్లర యాంత్రికంగా జేబులో పెట్టుకున్నాడు. మందుల షాప్ నుంచి బయటికి వచ్చి పళ్ళ దుకాణం లో డజను అరటి పళ్ళు తీసుకుని డబ్బులు ఇచ్చాడు ధర్మా రావు. ఎందుకో జేబులో ఎక్కువ డబ్బులు వున్నట్టు అనిపించాయి. లెక్క చూసుకుంటే పదహేను వందలు అదనంగా వున్నట్టు గ్రహించాడు. మందుల దుకాణం వాడు తాను ఇచ్చిన ఐదు వందల నోటు కి పొరపాటున రెండు వేల నోటుగా లెక్క కట్టి పదహెను వందలు ఎక్కువ తిరిగి ఇచ్చినట్టు వెంటనే ధర్మా రావు గ్రహించాడు. మందుల దుకాణం బాగా రద్దీ గా వుంది. బహుశా కంగారులో మందుల షాప్ అతను పొరపాటు పడి తనకి పదహేను వందలు ఎక్కువ ఇచ్చి ఉంటాడు. వెనక్కి వెళ్లి డబ్బులు ఇచ్చేద్దామని అనిపించినా ఎందుకో తరవాత ఇవ్వచ్చు లే తరచూ వెళ్ళే మందుల షాపేగా అనుకున్నాడు ధర్మా రావు.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్ దాటుతూఉండగా వీధి చివర  ధర్మా రావు కి తాను నిన్న మేజోళ్ళు కొన్న కుర్రాడు కనిపించాడు. “ సార్ ! జత మేజోళ్ళు ఇరవై రూపాయలు సార్ ! కొనండి సార్ ! “ అంటూ కాస్త దీనంగా పలికిన కుర్రాడి మాటలు విని అవసరం లేకపోయినా ( బేరం కూడా చేయకుండా) మూడు జతల మేజోళ్ళు కొన్నాడు ధర్మా రావు.  ఆ కుర్రాడు కృతజ్ఞతలు చెప్పుతూ ధర్మా రావు తో “ సార్ ! నాకు నాన్న లేరు . తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళు . నా కాలేజే ఫీజు కి డబ్బులు చాలక దానికోసం ఇలా మేజోళ్ళు అమ్ముకుంటున్నాను . ఇంకొన్ని మేజోళ్ళు తెసుకోండి సార్ ! “ అన్నాడు.  “ నాకు మేజోళ్ళు కొత్తవి అవసరం లేదు. కానీ నిన్ను చూసి కొనాలనిపించి మూడు జతలు తీసుకున్నాను. ఈ వంద రూపాయలు తీసుకో” అని  కొన్న మేజోళ్ళ ధరకి అరవై రూపాయలతో పాటు అదనంగా ఓ వంద నోటు ఆ కుర్రాడి చేతులో పెట్టాడు ధర్మా రావు. అనుకోకుండా ఇవాళ మళ్ళీ ఆ మేజోళ్ళ కుర్రాడు కనిపించడం తో రోడ్డు దాటుతున్న ధర్మా రావు ఆలోచనలు పలు విధాలుగా పరుగెత్త సాగాయి.
మందుల షాప్ వాడు అదనంగా ఇచ్చిన పదహేను వందలు ఈ మేజోళ్ళ కుర్రాడికి దానం గా ఇస్తే పోలా అనిపించింది ధర్మారావు కి.  వెంటనే తాను దానం గురించి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకి వచ్చాయి. “ దానం అన్నది గుప్తం గా వుండాలి. దానం తీసుకునే వ్యక్తి మనకి అపరిచితుడై వుండాలి. ఆ దానం ప్రతిఫలాపేక్ష ఆశించి ఉండరాదు. వీలయితే ఆ దానం గ్రహించిన వ్యక్తి కి దాత ఎవరో కూడా తెలియకుండా వుండాలి. ఇవి ఉత్తమమైన దానానికి వుండ వలసిన లక్షణాలు.“ మరి ఈ మేజోళ్ళ కుర్రాడికి ఈ పదహేను వందలు నేను ఇస్తున్నట్టు తెలియకుండా ఎలా దానం ఇవ్వాలి? “ సుదీర్ఘంగా ఆలోచించ సాగాడు ధర్మా రావు. ఒక మంచి ఐడియా స్పురించింది  ధర్మా రావు మెదడుకి. సిగ్నల్ దగ్గర రోడ్డు పక్కన టీ దుకాణం కుర్రాడికి ఈ పదహేను వందలు ఇచ్చి ఆ డబ్బుని ఎవరో పెద్దమనిషి ఇచ్చాడని చెప్పి మేజోళ్ళ కుర్రాడికి టీ షాప్ వాడి ద్వారా అందచేస్తే బావుంటుందని అనిపించింది ధర్మా రావుకి .  టీ షాప్ కుర్రాడు ధర్మారావుకి బాగా పరిచయం. రోజుకి కనీసం రెండు సార్లన్నా ఆ టీ షాప్ లో టీ తాగుతాడు ధర్మారావు. 
  ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తూ ధర్మా రావు సిగ్నల్ దగ్గర రోడ్ దాటుతూ వుండగా ఇంతలో  గ్రీన్ సిగ్నల్ పడటం, వెంటనే ఆగిన వాహనాలన్నీ తిరిగి  స్టార్ట్ అవటం క్షణాల్లో జరిగిపోయాయి. ఇది గమనించి స్పృహలోకి వచ్చి ధర్మా రావు కంగారుగా రోడ్ దాటేసే ప్రయత్నం చేస్తూ వుండగా ఇంతలో ఒక మోటార్ బైక్ మీద కుర్రాడు దూకుడుగా వచ్చి బాలన్స్ తప్పి ధర్మా రావుని గుద్దటం జరిగింది. పెద్దగా గాయాలు తగలక పోయినప్పటికీ కాస్త దెబ్బలు తగిలాయి ధర్మారావు కి.  సిగ్నల్ దగ్గరలోనే హాస్పిటల్ వుండటం తో నలుగురు పోగై  ఆపద్భాందవులుగా ధర్మారావుని ఆ హాస్పిటల్ కి తరలించారు. 
ఎక్సరే, మిగతా టెస్ట్ లు అన్నీ కలిపి మూడు వేలు వదిలాయి. హాస్పిటల్ వారు ఇచ్చిన మందుల ప్రిస్క్రిప్షన్ తీసుకుని నడుచుకుంటూ మందుల దుకాణానికి వెళ్ళాడు ధర్మా రావు. “ ఆయ్యో! అదేమిటి సార్!  గంట క్రితమేగా మీరు షాప్ కి వచ్చి వెళ్లారు. ఇంతలోనే ఈ గాయాలు ఏమిటి ? ఆక్సిడెంట్ అయ్యిందా ? ఎక్కడ ? ఎలాగ అయ్యింది? “ అంటూ ప్రశ్నల బాణాలు సారించాడు మందుల దుకాణం వాడు. జరిగిన సంఘటనని క్లుప్తంగా వివరించాడు ధర్మా రావు మందుల షాప్ వాడికి. మందులు కవర్లో పెట్టి లెక్క కట్టి చెప్పాడు మందుల షాప్ వాడు “ సార్ ! మొత్తం పదహేను వందలు అయ్యింది.” అని. ఉలిక్కి పడ్డాడు ధర్మా రావు . జేబు లోంచి పదహేను వందలు తీసి మందుల షాప్ వాడికి  ఇస్తూ వుండగా ధర్మా రావు చెయ్యి వణికింది. “ పాపం. మనిషి ఆక్సిడెంట్ తో కాస్త డిస్టర్బ్ అయినట్టు వున్నాడు. “ అనుకున్నాడు మందుల షాప్ వాడు ధర్మా రావు చెయ్యి వణకటం గమనించి. కానీ తన చెయ్యి ఎందుకు వణికిందో ధర్మారావుకి మాత్రం తెలుసు.

No comments:

Post a Comment

Pages