Sunday, July 23, 2017

thumbnail

దేవీ దశమహావిద్యలు - 1


దేవీ దశమహావిద్యలు - 1
శ్రీరామభట్ల ఆదిత్య 

మహామాత,మహాదేవి అయినటువంటి ఆ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించివుంది... అయితే లోక రక్షణకు,భక్తుల కోరిక వలన,రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది ఇంకా ఎన్నో లీలలనూ ప్రదర్శించింది...వాటిల్లో  ప్రముఖమైనవి శ్రీ దేవి యొక్క "దశమహావిద్యలు".

లోకనాయకుడైనటువంటి ఆ పరమేశ్వరునితో  వైరం పెట్టుకున్న దక్షుడు పరమేశ్వరుడు లేకుండా ఒక యజ్ఞాన్ని చేయనారంభించాడు. ఆ యఙ్ఞానికి మహాదేవుణ్ణి మరియు సతీదేవిని ఆహ్వానించలేదు. తండ్రి చేస్తున్న యాగం గురించి తెలుసుకున్న సతీదేవి యాగానికి వెళ్ళడానికి పరమేశ్వరుని అనుమతి అడిగింది. సతీదేవి యాగానికి వెళితే ఏం జరుగుతందో పరమేశ్వరుడికి తెలుసు. అందుకే వెళ్ళవద్దని ఆమెకు ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు శ్రీ కంఠుడు. అయినా సతీదేవి వినలేదు. వద్దన్నా వినకుండా వెళుతున్న సతీదేవి వెళ్ళకుండా ఆయన అడ్డుపడ్డాడు. దాంతో ఆమె ఆగ్రహంతో దశమహావిద్యలను సృజించింది ఆ విద్యలు శివుణ్ణి దశదిశల నుండి చుట్టుముట్టాయి. విధిలీలలకు పరమేశ్వరుడు సైతం అతీతుడు కాడు. ఇలా దేవి లీలల వల్ల దశమహావిద్యల సృజన జరిగింది.

తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది.
1)కాళీ                    
2)తార
3)షోడశి                  
4)భువనేశ్వరి
5)భైరవి                    
6)ఛిన్నమస్త
7)ధూమవతి              
8)భగళాముఖి
9)మాతంగి                
10)కమలాత్మిక.

ఇవే దేవి యొక్క దశమహావిద్యలు... ఈ దశమహా విద్యల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....


దేవీ దశమహావిద్యలు - 2:

1. కాళీ మాత

శ్లో||జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ|
దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే||

మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయం మరియు సంశయం ఎక్కువ,ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీ మాత.
కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యలలో ఈమె ప్రధాన దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుండి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు,సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.

ఒకనాడు భూమిపైన పాపసంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామస్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకులోనై స్వేచ్ఛగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీ మాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీ మాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తూంటుంది. మనమూ ఆ కారుణ్యమూర్తిని స్మరిద్దాం...

కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనమిది రూపాలు..
1. దక్షిణ కాళిక         
2. సిద్ధ కాళిక
3. గుహ్య కాళిక        
4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక           
6. చాముండా కాళిక
7. శ్మశాన కాళిక        
8. మహాకాళిక.

కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరించింది. అందుకే కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information