శ్రీమద్భగవద్గీత-12 - అచ్చంగా తెలుగు
శ్రీమద్భగవద్గీత-12
ఐదవ అధ్యాయము
కర్మసన్యాసయోగము
రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9482013801

బాహ్యస్వర్శేష్వసక్తాత్మా
విన్దత్యాత్మనియత్సుఖమ్
సబ్రహ్మయోగయుక్తాత్మా
సుఖమక్షయమశ్నుతే 21 వ శ్లోకం
బాహ్యమున గల శబ్ధాది విషయములందాసక్తి లేనివాడు ఆత్మయందెట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు.అతను బ్రహ్మానుసంధానపరుడై అక్షయమగు సుఖమునుబడయుచున్నాడు.
ఇంద్రియములు శబ్ధ,స్పర్శ,రూప,రస,గంధమనెడి బాహ్యవిషయములవైపు పరుగెత్తుచుండును.అవెప్పుడైతే అంతర్ముఖమై,మనసు ఎప్పుడైతే స్వస్థానమైన ఆత్మలో ప్రవేశించునో అప్పుడు అక్షయ సుఖమునుపోందును.ఆ సుఖానికి క్షయము లేదు.మానవుడు బాహ్యముననే సుఖము కలదని వెదకులాడి,విసిగి సాధనాపరుడై అంతర్ముఖమున ప్రశాంతిని బొందుచున్నాడు.అవివేకులైన జనులు సుఖము బయటనున్నదనిదలంచి ఎముకను కొరుకు కుక్క తననోటి నుండీ కారే రక్తము రుచి చూసి అది ఎముకనుండీ వచ్చినదని భ్రమించు చందమున ఎండమావుల వంటి బాహ్య సుఖములకై జీవితమును వ్యర్థముగావించుచున్నాడు.
ఆత్మసుఖమనుభవమునకు రావలెనన్న ముందుగావిరాగియై అశాశ్వతమైన బాహ్య సుఖములను త్యాగముచేయవలెను.నిరంతర అభ్యాసము, వైరాగ్యము అక్షయసుఖమునకు ముఖ్య అంగములు.
శక్నోతీహైవయస్సోడుం
ప్రాక్ఛరీ రవి మోక్షణాత్
కామక్రోదోద్భవం వేగం
సయుక్తః ససుఖీనరః - 23వ శ్లోకం
శరీరము విడుచుటకు పూర్వమే కామ,క్రోధములనుఎవరైతే అరికట్టగలుగుచున్నారో అతడు యోగి మరియు సుఖమును అనుభవించుచున్నాడు.
మోక్షసాధనకు భూలోకము కర్మభూమి.మానవ జన్మయే ముఖ్యమైన పనిముట్టు.దేవేంద్రాది దేవగుణములకు గాని ఊర్థ్వలోక అధోలోక వాసులెవ్వరికీ మోక్షమునకర్హతలేదు.ఒక్క మానవ జన్మద్వారానే మోక్షసాధన సాధ్యమని భగవానుడిచట వివరించెను.దుర్లభమైన మానవ జన్మను సార్ధకమొనర్చుకొని,నియమ,నిష్టలతో సాధనమొనరించి, అరిషడ్వర్గములను జయించి నిరతిశయానందమును పొందవలెనని భావము. వార్ధక్యములో శరీరము,మనసుస్థిరము కానేరదు.అందుచే యవ్వనమందే సరియైన యోగసాధన ప్రారంభించమని భగవానుని బోధ. శిధిలమైపోవునది శరీరము. అది బుద్బదప్రాయము.ఎప్పుడు కడతేరిపోవునో తెలియలేము.కావున పరమార్ధ లక్ష్యమునకై జాగరూకులై ప్రయత్నము సలుపవలెను.మానవ జన్మను వ్యర్థముచేయక ఇంద్రియజయము ద్వారా ఆత్మాన్వేషణగావింప వలెను.
లభంతే బ్రహ్మనిర్వాణ 
మృషయః క్షీణకల్మషాః
చిన్నద్వైధాయతాత్మానః
సర్వభూతహితేరతాః - 25 వ శ్లోకం
పాపరహితులు,సంశయవర్జితులు,ఇంద్రయమనంబులు,స్వాదీనపరుచుకొనినవారు,సమస్తప్రాణులయెక్క క్షేమమందాసక్తిగలవారునగు ఋషులు బ్రహ్మసాక్షాత్కారమును పొందుచున్నారు.ఋషులు మోక్షధామమునలంకరించెదరని తెలియబడినది.ఋషులనగా హృషీకములు అనగా ఇంద్రియములను జయించి మనస్సును పరమాత్మయందు నిలుపువారే.బ్రహ్మవిద్బ్రహ్మెవ భవతి.
సాధనలో ముఖ్యములైన నాలుగు విషయములిచట ప్రస్తావించబడినవి.1.పాపరాహిత్యము,2.సంశయములు,ద్వంద్వములు లేకుండుట 3.ఇంద్రియమనోనిగ్రహము,4.సర్వభూతదయ.
1.పాపరాహిత్యము: చిత్తమందు అనేక జన్మర్జితవాసనలుండును.పరమార్ధసాధనకవి అవరోధముగా నిలుచును.పుణ్యకార్యములచేతను, సాధనాబలముతో ఆ పాపములు,వాసనలనుండీ విముక్తులు కావలయును.
2.సంశయరహితత్వము:"బ్రహ్మసత్యము,జగన్మిధ్య".దృశ్యమానజగత్తంతయు ఎప్పటికైనా నాశనముకాకతప్పదు.బ్రహ్మనిత్యుడు,అవినాశుడు. పూలలో దారంలా,పాలలో వెన్నలా,తిలల్లో నూనెలా, ప్రకృతిలో ప్రాణవాయువులా ఎల్లెడలా వ్యాపించియున్నవాడు బ్రహ్మము.భగవంతుడొక్కడే. అతడు సర్వవ్యాపి.
దేవుడున్నాడా నాకు సాక్షాత్కారము కలుగుతుందా? ఈ జన్మలో నేను మోక్షమును పొందగలనా? ఈ విధమైన సంశయములకు తావివ్వక అణువణువునా నిండినిబిడీకృతమైన పరమాత్మను ధృడ దీక్షతో సాధనచేసిన తప్పక సాక్షాత్కరిస్తాడు.సాధనలో సాంధ్రతగా వచ్చునేమో కాని సాక్షాత్కరించుటకు పరమాత్మకు ఏ అడ్డంకులు లేవు.
3.ఇంద్రియమనోనిగ్రహముదృశ్యవస్తువులపైకి పరుగుడు ఇంద్రియములు,మనస్సు,మోక్షమునకు గొప్ప అవరోధములు.అభ్యాస,వైరాగ్యములచే వానిని స్వాధీనపరచుకొని ఆత్మయందు స్థాపనమొనర్చవలయును.ఇంద్రియ జయము లేకుండా మోక్షమార్గమున అడుగైననూ ముందుకువేయలేరు.అభ్యాస, వైరాగ్యములే ఇందుకు ఉపకరణములు.
4.సర్వభూతదయఅంతయు బ్రహ్మమే అనునది సిద్ధాంతము.సర్వభూతదయ అనునది ఆచరణరూపము.మనలోనున్న ఆత్మయే సర్వజీవరాసులలో వ్యాపించియున్నది.(ఏకంసత్ విప్రాబహుదావదంతి)ఒక ప్రాణిని ద్వేషించుచున్నవాడెన్నటికీ సర్వాత్మభవము కలవాడు కానేరడు.సర్వాత్మ భావము కలవాడెన్నటికినీ ఏ ప్రాణికినీ అపకారము చేయజాలడు.ఒకడు ఆత్మ జ్ఞాని ఔనోకాదో చెప్పుటకు ఇది చక్కని గుర్తు.సర్వప్రాణికోట్లపై ప్రేమగలిగి వానిక్షేమమునకై పరితపించుటయే సర్వభూతదయ.
స్పర్శాన్ కృత్వాబహిర్బాహ్యాం
శ్చక్షుశ్చైవాన్తరేభ్రువో
ప్రాణాపానౌసమౌకృత్వా
నాసాభ్యంతరచారిణౌ - 27 వ శ్లోకం
యతేంద్రియ మనోబుద్ధి
ర్మునిర్మోక్ష పరాయణః
విగతేచ్ఛాభయక్రోధో
యస్సదాముక్తఏవసః - 28వ శ్లోకం
ఎవడు వెలుపలనున్న శబ్ద,స్పర్శాది విషయములను వెలుపలకు నెట్టివేసి చూపును భూమధ్యమున(నొసట రెండు కళ్ళకు మధ్య స్థానమున) నిలిపి నాసికా పుటములందు సంచరించు ప్రాణ,అపానవాయువులను సమముగా జేసి ఇంద్రియ, మనో బుద్ధులను స్వస్థానమైన అత్మలోలీన మొనర్చిన వ్యక్తి జీవన్ముక్తుడు.
దృష్టిని భ్రూమధ్యమున నిలిపే సాధన ధారణ.ధారణ స్థిరముగా నిలిపిన సాధకుడు సులభముగా ఇంద్రియములను,మనస్సును స్వాధీనమొనర్చు కొనును.ధారణలో ఉన్నతస్థితినందుకున్న సాధకునకు మూడవనేత్రం క్రమక్రమముగా తెరచుకొనుట ప్రారంభమగును.
ప్రాణ,అపాన వాయువులను సమముగా జేయుటయనగా శాస్త్రోక్తమైన ప్రాణాయామ సాధనమొనరించుచున్న వ్యక్తికి క్రమంగా ప్రాణశక్తి ఊర్థ్వముఖమై వెన్నుపాము,మెదడులో నిక్షిప్తమగును.నిరంతర సాధనచేయుచున్న ఆ ముక్త పురుషుడు క్రమంగా ఊర్థ్య భూమికిలనధిరోహించి ధ్యానంలో ఉచ్ఛ స్థితులనుభవించుచూ ప్రాణ అపానవాయువులను స్థిరీకరించుచున్నాడు.తన శరీర కణజాలమంతయు ప్రాణశక్తితో పునర్ణవం చెందించుచున్నాడు.ప్రత్యగాత్మ స్వరూపుడైన సాధకుడు పరమాత్మతో సంధానించబడి ఉన్నతమైన సమాధిస్థితిని పొందుచున్నాడు.
*** 

No comments:

Post a Comment

Pages