జీవన ప్రయాణం - అచ్చంగా తెలుగు

జీవన ప్రయాణం

Share This
జీవన ప్రయాణం
ఆండ్ర లలిత

“జాగ్రత్తగా వెళ్ళు నాన్నా, డబ్బు గురించి ఆలోచించకు. రమేష్! మనకి చదువుకునేందుకు ఉంది. హాయిగా చదువుకుని మంచి వృద్దిలోకి రా. నీ లక్ష్యం మర్చిపోకు. మీ అమ్మ గురించి బెంగ పెట్టుకోకు. నేను చూసుకుంటాను” అని చిరునవ్వుతో రాము తన సుపుత్రుడు రమేష్ చేయి తన అరచేతితో గట్టిగా తనకిష్టమైన వస్తువు తన చేతులోంచి ఎక్కడ జారిపోతుందో అనట్టు పట్టుకుని, రమేష్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు విమానాశ్రయంలో.
“అలాగే నాన్నా ఇంక చెప్పటం ఆపు. నన్ను వెళ్ళనీ అంటూ, నాన్న కళ్ళలోకి అమాయకంగా చూస్తూ, తండ్రి రాము చేతిలోంచి తన చేయి వదుల్చుకున్నాడు. అమ్మ జానకి కేసి చూస్తూ “నవ్వవా! అలా ఉండకు. నేను అమెరికా వెళ్తున్నానమ్మా. నా సంతోషంలో పల్గొనమ్మా. మళ్ళీ వచ్చేస్తాను. నేను మిమల్ని వదిలి ఉండగలనా!” అన్నాడు రమేష్.
ఎక్కడా!! తన మాటలకి చలనం లేకుండా కొయ్యబారిపోయిన తల్లిని నవ్వించ తలచి, తల్లికేసి చూస్తూ రమేష్ తన బుర్రకొట్టుకుంటూ ఆశ్చర్యంగా “అయ్యో!!!”అన్నాడు.
“ఏవన్నా మర్చిపోయావా! అంటూ ఏకస్వరంతో రామూ జానకి అన్నారు.
“అవును!”
“ఏమిటీ?”అంది జానకి.
“ఎంత ముఖ్యం? ఏమిటది చెప్పరా బాబూ!”అన్నాడు రాము.
అమ్మకేసి గంభీరంగా చూస్తూ.... నాన్నా, అమ్మకళ్ళలోకి చూడు....అన్నాడు రమేష్. “అబ్బా!మళ్ళీనా!” అన్నాడు రాము.
ఈ ఇరువురి మాటలకి జానకి ఉల్లికిపడి, “నాకేమైంది” అంది మొహం చాటేసుకుని కళ్ళు రుమాలుతో తుడుచుకుంటూ
“ ఏమిటమ్మా! నువ్వుముందే చెప్పుంటే , నేను రెండు ఖాళీ టేకర్లు పురమాయించేవాడినిగా ఫోన్ చేసి. అసలే నీళ్ళెదడి. నీళ్ళమ్మా నీళ్ళు. అదీ ‘distilled water Mommy' ఏమంటావ్ నాన్నా!” అనేటప్పటికి రమేష్ రాము ఇద్దరూ, పకపకా నవ్వుకున్నారు.
జానకికి బరువెక్కిన కళ్ళు మరియు మనసు తేలికైయ్యాయి. అలా రమేష్ తల్లీ తండ్రులను మాయచేసి జారుకుంటూ “బై అమ్మా,బై నాన్నా...అక్కడ నుంచోండి. నేను భద్రతా తనిఖీ తరువాత బై చెప్తాను” అంటూ నవ్వుతూ అమ్మా నాన్నా నవ్వులు తన గుండెలలో పదిలముగా దాచుకుని, బరువెక్కిన హృదయముతో, జీవన గమనాలు స్వీకరించుటకు ముందుకు సాగిపోయాడు రమేష్.
“జానకి యిక్కడికి రా , వాడు బాగా కనబడుతున్నాడు” అన్నాడు రాము.
“ఏవండీ, వాడిని సరిగ్గా తినమని చెప్పండి. మీరు చెప్తే వింటాడు” అంది జానకి బరువెక్కిన కంఠం నుండి పెకిలించుకుని వచ్చే స్వరంతో రాముకేసి చూస్తూ.
“వాడే తింటాడులే ఆందోళన చెందకు. పెద్దవాడైయాడు జానకీ!”అన్నాడు రాము.
“ నాకు ఇంకా చంటి బాబే! ఏమిటో మాయ”అంది జానకి
“రమేష్ ని మనము, జానకీ! మమకారంతో నాది, నావాడని కట్టి పడేయాలనుకుని గట్టిగా పట్టుకుంటాం. కాని అలా చేస్తే, వాళ్ళు ఎత్తరిల్లలేరు. వదిలేయాలి. అనురాగాల ఆత్మీయతల కోవెలైన మన ఇల్లు, రమేష్ కి మొదటి శిక్షణాకేంద్రం. మరి రమేష్ శిక్షణ నిర్విఘ్నంగా పూర్తైనది. ఇక మన గూటిలోనుంచి రెక్కలొచ్చి, ఎగరిపోయాడు. భగవంతుడు చల్లగా చూస్తే వాడే వృద్దిలోకొస్తాడు” అన్నాడు రాము జానకితో.
రాము మాటలు జానకికి ఊరట కలిగించాయి. ఇంతలో ఫోన్ మ్రోగే శబ్దం విని, మళ్ళీ రమేష్ కంఠం వినొచ్చు అనే ఆతృతతో , “ఏవండీ, ఫోన్ మ్రోగుతోంది” అంది జానకి రాముతో.
“హలో!రమేష్!” అన్నాడు రాము.
“నాన్నా!I checked in baggage. ఇంక మీరు వెళ్ళిపోండి. జేరాక ఫోన్ చేస్తాను. బై నాన్నా, అమ్మకీయండి”
“ఇదిగో జానకీ! నీతో మాట్లాడుతాడట” అని రమూ జానకికి ఫోన్ అందించాడు.
“రమేష్! సరిగ్గా తిను. నీకు ఛీజ్ అవీ పడవు. మరీ అర్ధరాత్రి వరుకూ చదువుతూ మెలుకువగా ఉండకు.ఆరోగ్యం పాడౌతుంది. రోజులో ఒక్కసారన్నా నువ్వు రైస్ కుక్కర్ లో అన్నం వండుకుంటే పెరుగన్నం తిను. లేకపోతే, ఉత్తి పెరుగన్నా తిను. మనకి అలవాటు. లేకపోతే కడుపులో మండుతుంది”
“ఆ....ఆ...సరే సరే అమ్మా Now I am a big boy. I can manage myself. Be cool. Love you Mommy!!!”
“Ok! Take care, both of you. I love you both. Bye .I am switching off my phone. My phone is running out of charge. Talk to you later”
బై...బై అని ఇద్దరు రమేష్ కి చెప్తూ , కార్ పార్క్ చేసిన చోటుకి బయలుదేరారు.
కార్లో చాలా మౌనంగా ఉంది జానకి.
“జానకీ బెంగపెట్టుకోకు.మన రమేష్ ఉన్నత విద్యకు వెళ్ళాడంతే. మళ్ళీ వచ్చేస్తాడు. ఇంతలో మనమే వెళ్దాము జానకీ”అన్నాడు కారు నడుపుతూ రాము.
“హూ!ఏమిటో !! అంతా మాయ కదండి. దేనికోసమో పాకులాడుతాం నాది నాది అంటూ. మనది అనుకున్నది శాస్వతం అనుకుంటాము. బంధాలు, అనుబంధాలు పెంచుకుంటాము. పోనీ అని పెంచుకోకపోతే , మనలో మమకారం వాత్సల్యం, ఎలా పుట్తాయి? కాని రమేష్ ముందు మాత్రం, “మాకు బెంగేమీ లేదు. నువ్వు ఇంక మమల్ని వదిలి నీ జీవిత లక్ష్యంకోసం సప్త సముద్రాలు దాటవలసి వస్తే దాటాలి. ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్ళాలి. జీవితంలో స్థిరపడాలి”అని చెప్పి పంపేసాము
కాని... “రమేష్ని చూడకుండా ఎలా ఉండగలమండీ” అని వెక్కి వెక్కి ఎడుస్తుంటే; అంతవరుకు ఉగ్గపెట్టుకున్న రాము, కారు రోడ్ ప్రక్కన ఆపి,జానకి చేతులు తనచేతిలో తీసుకుని విలవిలా ఏడుస్తూ. మళ్ళీ, తననితాను తమాయించుకున్నాడు రాము.
“జానకీ! మనము ఇలా డీలా పడిపోకూడదు. వాడు స్థిరపడే వరుకు మనము రమేష్కి మద్దతు వ్యవస్థగా పనిచేయ్యాలి. ఇంకా నాకు పదవి విరమణకి ఐదేళ్ళుంది. మనకేం కావాలి. మనం ఎక్కడన్నా బ్రతకగలం. పెన్షన్ డబ్బులు మనకి చాలు. మనదంతా రమేష్కేగా. మన రమేష్ బాగా చదువుకుని, ఈ సమాజానికి కూసంత ఉపయోగపడితే చాలు జానికి.”
“అవుననుకోండి. అసలు మమకారం పెంచుకోకుండా ఉంటే పోతుంది. ఇన్ని బాధలుండవు”అంది జానకి.
********
జీవిత చక్రం తిరిగి పోయింది.
అమెరికాలో ఉన్నతన రమేష్ తో ఫోన్లో మాట్లాడుతుండగానే, “ఆ..ఆ... అలాగే. అంటీ ముట్టనట్టుంటే, అనురాగం,వాత్సల్యం లాంటివి ఎలా ఉద్భవిస్తాయి. అవి ఉంటేనే కదా! బంధాలు చిక్కపడతాయి. అయినా జానకి! జీవితం ఒక రంగస్థలం. ప్రతీ పాత్ర రసభరితంగా మనము తీర్చిదిద్దాలి. మనములేకపోయినా మన పాత్ర...ఆదర్శం కావాలమ్మా. మనం పోషించే ప్రతీ పాత్ర అందం దానిదే” అన్న రాము మాటలు గుర్తొస్తున్నాయి. రమేష్ ఈమధ్య రోజూ ఫోన్ చేస్తున్నాడు.
తండ్రి కాలంచేసారనే వార్త జీర్ణించుకోలేక బాధతో నాన్నకి అంత సీరియస్ అని తేలీదమ్మా! అని విలపిస్తూ అన్న మాటలకి కరిగిపోవాలా వాత్సల్యంతో లేక తండ్రికి జబ్బుచేసినప్పుడు రాలేకపోయాడనే కోపంతో బాధపడాలా అర్థంకాక తల్లి మమకారంతో రమేష్ని క్షమించి, చెమర్చిన కళ్ళుతుడుచుకుని విశాలమైన మనసుతో ఫోన్ పెట్టేసి, తన గదిలోకి వచ్చి తన పెట్టెలో దాచుకున్న రాము పటంతోమూగబోయిన హృదయంతో కాసేపు ఉసులాడింది జానకి.
ఇంతలో “జానకక్కా భోజనాలగదిలో అందరు కలవరిస్తున్నారు నీకోసం. ఏది నాకేసి చూడు. అనుకున్నా! ఇంత ఆలస్యం చేస్తోందక్క అంటే.... మా అక్క మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని. ఏమిటక్కా ఎరుపెక్కిన కళ్ళు,బరువెక్కిన మనసుతో! రమేష్ ఫోన్ వచ్చిందిగా, ఏమన్నాడు!! వస్తానన్నాడా? నిన్ను అమెరికాలో తనతో పాటు ఉంచుకుంటానన్నాడా!!” అంది లావణ్య.
“అంటే మాత్రం ఎదో చుట్టంచూపుగా వాడి మనసు కష్టపెట్టటం ఇష్టంలేక వెళ్తాను కాని...మిమల్ని వదిలి ఉండగలనా లావణ్యా! ఏమిలేదు...వాడికీ నాకూ ఏదో ఇవాళ మీ బావగారు బాగా గుర్తొస్తున్నారు లావణ్యా”అని జానకి లావణ్య బుజంమీద తలవాల్చి కంటనీరు పెట్టుకుంది. “పోయినోళ్ళు తిరిగిరారు. గుండెనిబ్బరంతో ఉండక్కా. నువ్వుతినకపోతే రాము బావగారు బాధ పడరూ అని లావణ్య అనేటప్పటికి.జలజలా రాలుతున్న కన్నీరుని తుడుచుకుంటూ... ఒసే! లావణ్యా మా అబ్బాయి నా గురించి కనుక్కునేటందుకు నీకు ఫోన్ చేస్తే నేను బాధ పడినట్లు చెప్పొద్దు. వాడి మనసు కష్టపడుతుంది. ఇప్పుడు అక్కడ బాధ్యతలొదులుకుని నాకోసం వచ్చేస్తానంటాడు. అలా ఎలా కుదురుతుంది. వాడికి ఎక్కడా తీరికుండదు. మా రమేషూ కోడలు వాణి చాలా బిజీ వైద్యులు. వాళ్ళిద్దరు పేరుమొసిన వైద్యులు ఇప్పుడక్కడ. వాళ్ళదగ్గరకు వచ్చిన వారు దుఖంతో వచ్చి చిరునవ్వుతో వెళ్తారు. వాడికి వాణికి ఎన్నోబాధ్యతలు! అవన్నీవదలుకుని ఎక్కడ రాగలరూ! స్కైప్లో మాట్లాడతారు. అది చాలు, నాకు లావణ్య.అయినా లావణ్య గత 10 సంవత్సరాలనుంచి ఈ వృద్ధాశ్రమం లాంటి ఈ ఓల్డ్ ఏజ్ కమ్యూనిటీ ఎపార్టమెంట్స్ తో నా అనుబంధం రోజురోజుకి పెరిగిపోతోంది. ఎలా వదలగలను. మీ బావగారు రాము...నాకు మీ అందరితో కూడా చక్కటి సంత్రృప్తికరమైన జీవితం జీవిస్తూ నలుగురి అనుభవాలు, సుఖ సంతోషాలు పంచుకునే బాధ్యత వదిలి పెట్టి కాలం చేసారు”అంది జానకి లావణ్యతో చిరునవ్వుతో.
“ఏమిటో అక్కా నీ వేదాతం. లోపలగుండెలోతుల్లో ఎంత బెంగ రమేష్ మీదున్నా కనబడనీయవు. ఎంతసేపు నా రమేష్ను నా తోబ్బుటువులాంటి వృద్ధాశ్రమవాసులలో చూసుకుంటుంన్నాను అంటావు. బావగారు మధ్యలోవదిలేసిన పనులు పూర్తి చేస్తూ,బావగారు నీతోనే ఉన్నట్టు భావిస్తావు. అందరూ నీ మాటలలో పడి వారి బాధలు మర్చిపోయేలా చేస్తావు. కాని నీ మనసులో బరువెలా తగ్గేను అక్కా. మాతో పంచుకోవాయే”అంది లావణ్య.
“అదేమిటే పిచ్చి మొహమా! మీ అందరి చిరునవ్వే నాకుజీవామృతం లావణ్యా!”అంది జానకి.
“పోని రమేష్ దగ్గరుకి వెళ్ళచ్చుగా !”అంది లావణ్య.
“కుదరదు. అక్కడ వాళ్ళకి భారమౌతాము. అక్కడ మనకి అరోగ్య సమస్యలోస్తే కష్టం.ఇక్కడ వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయటం కష్టం . వాళ్ళు మన ప్రాణప్రదమైనప్పుడు వాళ్ళ మనసుని కష్టపెట్టటం ఎందుకు. నాకేసి రమేష్ తిరిగినప్పుడు నాలుగు మాటలు చిరునవ్వుతో మాట్లాడితే వాడు సంతోషంగా ఉంటాడు కదా. ఇంకా చిన్నతనం పోలే. అమ్మనవ్వు చాలు వాడికి. మరి వాడి నవ్వు నాకాధారం. దానికన్నా నాకేమి కావాలి లావణ్యా”అంది జానకి.
“అలా ఎలా ఉండగలవు అక్కా”అంది లావణ్య. “ఎందుకుండలేము! ఇదంతా మన భావన! జీవన సముద్రంలో ఎంతో మంది కలుస్తుంటారు. కలిసినవాళ్ళు విడిపోవటం కూడా జరుగుతుంది. ఇంకొంచం తాక్తాలిత సంబంధాలని చూస్తే. మనం రైలు ప్రయాణాలలో ఎంతో మందిని కలుస్తూ వుంటాము. ఆ ప్రయాణ సమయంలో ఎన్నో కబుర్లు. ఒక్కొక్కసారి తినుబండారాలు పంచుకోవడం, చిరునామాలు, ఫోన్ నంబర్లు తీసుకోవడం కూడా అవుతాయి. ఈ రోజుల్లో నమ్మకాలు తగ్గుతున్నాయనుకో. కాని వాస్తవానికి ఆ ప్రవర్తన కొంచం మారింది అంతే. మన రోజుల్లో రైలు ప్రయాణలయితే ఈ రోజుల్లో ఫేస్ బుక్, లింక్డిన్లు! ఈ మజిలీల కాలమానాలు వాటి బాహ్యంగా కనిపించే ప్రక్రియలు కొంచం వేరంతే. జీవన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, ఉద్యోగ ప్రయాణాలు అలా అలా. ఎందుకు కలుస్తామో ఎందుకు విడిపోతామో ఆ దేవునికే ఎరుక. ఉన్నది ప్రేమతో స్వీకరిద్దాము. లేనిదానికోసం తల్లడిలద్దు. ఎందుకు ఏది ఎలా జరుగుతుందో తెలియదు. ఆలోచించి లాభంలేదు. ఎందుకు దేవుడు నడి సముద్రంలో పడేస్తాడో అనుకునే కన్నా, మనమెలా ఈదుకుని రాగలం అని ఆలోచించి, పది మందికి ఆదర్శం కావాలి. ఇంత మాట్లాడుతున్న ఈ అక్క కంట తడెందుకు అంటావా లావణ్యా! మరి నాలోను ఎదో ఒక మూల చిన్నజానకి తొంగి చూస్తూ ఉంటుంది. నీలాంటి స్నేహితురాలి సహాయంతో మాములౌతాను” అని నవ్వింది జానకి.
“అలా ఎలా కుదురుతుందక్కా!”అంది లావణ్య వడ్డన చేస్తూ.
“ ఇప్పుడు నా జీవితమే తీసుకో, బాల్యంలో తల్లి తండ్రి చెల్లెలితో, తరువాత పెళ్ళైక అత్తగారు ఆడబడుచులు, బావగార్లు, మరుదులు వాళ్ళ సంతతి అలా ఎంతో మంది. వాళ్ళందరు నా వాళ్ళే అనుకుని నా వాళ్ళని వాళ్ళలో చూసుకునే దాన్ని. మరి ఇవన్నీ నాకు తక్కువని దేవుడి పేగుబంధం కూడా పెట్టాడు. మరి అది శాశ్వతం అనుకున్నా.. ఆ ‘నా’ అనే బంధాలలో మమేకమైనప్పుడు, అవి ఒకరోజు కాస్త దూరమైనప్పుడు, చాలా బాధేస్తుంది. అదితట్టుకుని బయటకొచ్చి మీ అందరి మమకారాలలో మర్చిపోతున్నాను. ఇదే జీవితం. ఏ బంధం తీసుకున్నా శాస్వతం అనుకుంటేనే సఫలమౌతుంది. కాని శాస్వతం అనుకున్నది ఒక్కొక్క సారి మనకి ఆ బంధం దూరమైనప్పుడు వదలగల్గి మరొక బంధనకు చేరువైనపుడు ప్రశాంతతొస్తుంది. అది రక్తసంబంధమే అవ్వక్కరలేదు. సుఖం, సంతోషము, ఆనందమనేవి నలుగురికి ఇస్తే వచ్చేవి. తృప్తి, పరిసరాలతో సామరస్యం మిగిలేవి. అది అర్థమైనరోజు మానసిక రుగ్మతలు తొలుగుతాయి లావణ్య. మరి మన ప్రయాణాలు ఇలా పది మందికి ఉపయోగపడుతూ చిరునవ్వు మన లక్ష్యముగా శ్రమిద్దామా.లేనిదానికోసం పాకులాడకుండా ఉన్నది కలసి పంచుకుని అందరితో ఆనందిద్దామా లావణ్యా! చూడు ఈ రోజు ఇలా పకపకా నవ్వేవారు మన కమ్యూనిటీకి ఒకరోజు పుట్టెడు దుఖంతో వచ్చారు. ఈ రోజు మనమంతా కష్టాలు,సుఖాలు కలసిపంచుకుంటూ చిరునవ్వులు వొలకపోస్తున్నాం. అంది భోజనాలగదిలో అందరికీ ప్రేమతో వడ్డిస్తూ వున్నలావణ్యతో
“అయితే అక్కా! బంధాలు మారచ్చు కాని మనవతా వాదం శాశ్వతం” అంది లావణ్య.
“అవును”అంది జానకి.
అందరూ భోజనాల పంక్తులలోంచి లేస్తూ అన్నధాతా సుఖీభవ అంటూలేచి సావిట్లోకి వెళ్ళారు. కాస్తందరూ ఒకరితో ఒకరు కబుర్లు కాకరకాయలు చెప్పుకుని, ఆ తరువాత మనసు నిండా మధురభావనలలో తేలిపోతూ సాగిపోయారు.
ఇది కళ్ళారా చూస్తూ జానకీ...తన కమ్యూనిటీ సభ్యులూ, సమతుల్యమైన తమ తమ జీవిత ప్రయాణాలు సాగిస్తూ, ఎప్పుడు ఈ ప్రయాణం ఆగుతుందా అనే ఆలోచనలను మరిచిపోయి ఒకరి కోసం ఒకరు చిరునవ్వులలో జీవన నావలను నడిపించసాగారు.
***

5 comments:

  1. అమ్మ మనసును చాలా చక్కగా వివరించారు..లలిత గారు.....నిజం ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది....అభినందనలండి...

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ధన్యవాదాలమ్మా

      Delete
  2. ధన్యవాదాలమ్మా

    ReplyDelete
  3. ధన్యవాదాలమ్మా

    ReplyDelete

Pages