“పాడ్యమినాటి చంద్రుడు...”
సుజాత తిమ్మన..

చైత్రానికి ఆరంభ సూచనగా.. సోయగాల బొండుమల్లి ఆసాంతం విచ్చుకున్న వేళ..
అలకలతో సంధ్యాదేవి పడమటింటి గడప దాటిన సూరీడుకు వీడ్కోలిచ్చిన వేళ..
తన జేగురు రంగు మొహానికి, నల్లని పైటచెంగు కప్పుకుంటున్న వేళ..
నెలవంక నవ్వులనే అలవోకగా కురిపిస్తూ పాడ్యమినాటి చంద్రుడు...
చెంత నున్న తారతో ..చిక్కని సరసాల తేలుతూ...మింటి రథాన ఊరేగుతున్నాడు...
మాఘంలో మావి చివురులు మేసి మేసి మంద్రమయిన స్వరాన్ని
సవరించుకున్న ఆ మత్త కోకిల, కుహు కుహూ రావాలతో..
వసంతునికి ఘన స్వాగతం పలుకుతూ...గానకచేరీలు చేస్తుంది..
కొమ్మల చివరల గుత్తులు గుత్తులుగా వేపపూవులు
మెరుస్తున్నాయి ముత్యాల సరాల వోలె ఆకు గుబురుల మాటునుండి...
మనసారా మనలను మమతలతో పలకరిస్తూ,
లేత పిందెల స్థాయిని దాటిన దోరమామిళ్ళు!
బొబ్బట్లు, పులిహోర, పాయసాన్నాలకు ముందు
ఆరు రుచుల మేళవింపుతో తయారయిన ఉగాది పచ్చడిని..
ఉదయాన్నే ఆరగించిన తెలుగువారు
తీపిలోని మాధుర్యాన్ని, చేదులోని కటుత్వాన్ని సమంగా ఆస్వాదిస్తూ..
అపుడే అయిపోయిందే..ఈనాటి ఉగాది..అనుకుంటూ పంచాగ శ్రవణం వింటున్నారు..
కాల కన్యను మన కసాయితనంతో కాల్చి వేయకుండా...
ఆత్మవిశ్వాసం అనే ఆభరణాన్ని అలంకరించి,
పచ్చని హరిత హారాలు వేసి, కెంపుల పూలసరాలతో అలంకరించి
అపురూపంగా చూసుకుంటూ ఉంటే
ప్రతి రోజునూ ఉగాది చేస్తుంది - తన నవ్వుల రతనాలను జలజల రాల్చుతూ!!
***0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top