నా కవిత - అచ్చంగా తెలుగు
నా కవిత
రెడ్లం చంద్రమౌళి
నిశి కేళిని చీల్చునట్టి ఉషోదయము నాకవిత శిసిరానికి సెలవు పలుకు వసంతమే నాకవిత ఒడ్డుచేర అలసిపోని అలల ఘోష నాకవిత వినువీధిని చూపు నిలిపి ఎదుగు మొక్క నాకవిత!
మంచు తెరలు తీయునట్టి తొలికిరణం నాకవిత పున్నమిలో చంద్రకిరణ ప్రకాశమే నాకవిత ఆకాశపుటంచు కొలుచు కొలమానం నాకవిత అలుపెరుగని పోరాటపు అక్షరమే నాకవిత !
కవిత రాయు కలమునకు కలల భాష నాకవిత రాయలేని భావాలకు రాజధాని నాకవిత అక్షరాల లక్షణాన అమరిన పద్యంబై శతాబ్ధాలు చెరిగిపోని తెలుగు పదము నాకవిత !
సాహిత్యపు శిఖరాన వెలుగొందిన తెలుగు కవుల పాదధూళి నాకవిత జనుల గుండె లయను తెలుపు జానపదము నాకవిత సుతిమెత్తని భావనలా పరిమళించు సిరిమల్లే నాకవిత ఆకురాల్చు కొమ్మలకు ఆయువిచ్చు నాకవిత రెప్పవేయు మెలకువలో జ్ఞానదీప్తి నాకవిత రెప్పవాల్చు చీకటిలో ఆత్మజ్యోతి నాకవిత ! ****

No comments:

Post a Comment

Pages