Thursday, February 23, 2017

thumbnail

శ్రీమద్భగవద్గీత -7

శ్రీమద్భగవద్గీత -7

రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు.

Ph : 09482013801నాల్గవ అధ్యాయము జ్ఞాన యోగము

శ్రీ భగవానువాచ:బహూనిమేవ్యతీతానిజన్మానితవచారుజనతాన్యహంవేదసర్వాణినత్యంవేత్థ పరన్తప               5 వ శ్లోకం
తాత్పర్యముః
శత్రువులను తరింపజేయు ఓ అర్జునా ! నీకును నాకును ఇంతవరకనేక జన్మములు గడిచినవి.వానినన్నింటినీ నేనెరుగుదును. నీ వెరుగవు. జీవుడు దేవుడు - ఇరువురును వాస్తవానికి ఒకే ఆత్మ స్వరూపులు. దేవుడు మాయను జయించినవాడు. మనిషి - కర్మ = దేవుడు. దేవుడు మానవరూపు ధరించినా, చేయు కర్మలన్నియు లోకకళ్యాణార్ధమే. అందువల్ల కర్మబంధ రహితుడు. జీవుడు మాయాధీనుడు మనిషి + కర్మ= జీవుడు. జీవుడు మానవ రూపు ధరించి చేయు కర్మలు స్వార్ధ పూరితములు. అందవల్ల మానవుడు కర్మ బంధనమున తగుల్కొని అనేక జన్మలెత్తు చుండును. అజ్ఞానమువలన జీవుని దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమై యుండును. నిజానికి ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడిచినవి. కర్మ బంధము నశింపనిచో ఇంకనూ ఎన్నో జన్మలెత్తవలసి యుండును. పుణ్యవశమున ఇప్పుడు మానవ జన్మ లభించినది. మోక్షమునకు అనుకూలమైన ఈ మానవ జన్మను పొందియు తన యాత్మ నెరింగి తరించుటకై యత్నింపక విషయ భోగములందు మునిగి తత్పలితముగ ఇంకనూ అనేక జన్మలయందు యాతనలననుభవించువాడు నిక్కముగ దౌర్భాగ్యుడేయగును.

జీవుడు భగవంతుని శరణాగతి పొంది ఈ జన్మయందే బంధరహితుడై కడతేరు ప్రయత్నము దృఢముగా చేయవలయును. మానవ శరీర నిర్మాణము విపులముగా గమనించిన కడుయాశ్చర్యము కలుగకమానదు.భగవంతునిలోనున్న దివ్య తత్వములన్నియు మనకు బహూకరించినాడు.72 వేల నాడులు, ఆరు చక్రములు , బ్రహ్మదండి(వెన్నుపాము) , అద్భుతమైన మెదడు (సూపర్ కంప్యూటరు). ఇంత గొప్ప నిర్మాణ కౌశలము భగవంతునికే చెల్లు. పురాతనులైన ఋషులు సూక్ష్మములన్నియు తెలిసికొని ధన్యులైరి.

జీవుడు గతములో పొందిన జన్మలన్నియు మెదడులో నిక్షిప్తమైయుండును పరమాత్మ యోగశక్తితో కూడుకున్న తాళం వేసినాడు లేదంటే గతజన్మ పరంపర ప్రతి మనిషి తెలుకొన్నట్లైతే తీవ్రవైరాగ్యంతో కూడియుండి మానవ సంతతి అభివృద్ధికాజాలదు. తీవ్రతర యోగసాధన చేసిన మానవ శ్రేష్టులకు తళుక్కున మెరిసినట్లుగా గడచిన ఏదో ఒక జన్మ వివరములు , దృశ్యములు మనోనేత్రంలో దెలియుటకద్దు.తాళం వేసి పరమాత్మ భద్రపరచిన మెదడులోని గత జన్మ వివరములు, యోగాగ్ని ఊర్ద్వ ముఖమైనపుడు ఆ జన్మకు సంబంధించిన దళములు తెరువబడి మనోనేత్రమునకు గోచరమగును. పరిణితి చెందిన యోగులు ఆ వివరములు రహస్యముగానుంచుదురు.

జీవుని గతించిన జన్మలన్నియు సూక్ష్మ రూపమున మన మస్తిష్కములో నిక్షిప్తమైయుండును బాహ్య స్మృతికి అవి తెలియనేరవు.మన చర్యల ద్వారా ఆ వాసనలు కొంత మేర బయట పడుచుండును. ఈ జన్మలో సంస్కారము వలన ధారణ, ధ్యాన మరియు సమాధి స్థితుల సంభవించిన యోగరూఢులు కుండలినీ శక్తిని మూలాధార చక్రము నుండి ఉర్ధ్వముఖముగావించి సహస్రార ఆజ్ఞా చక్రములందు స్థిరముగావించిన మానవ శ్రేష్టులు సహస్రదళ పద్మములో ఏదో ఒక దళమునకు సంబంధించిన ఆ జన్మ వివరములు మనో నేత్రము ద్వారా దర్శింతురు. గతించిన జన్మల వివరములు తెలియజేయుట భగవంతునికి ఇబ్బందిని కలిగించే విషయము.

యోగ శాస్త్రానికి మూల పురుషుడైన శ్రీ కృష ్ణ పరమాత్మకు అంతయూ కరతలామలకము. మాయావరణములో నున్న అర్జునునికి(మనలాంటివారు) అంతయూ అగమ్యగోచరము.

శ్రీ భగవానువాచ:
యదాయదాహి ధర్మస్య 
గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమ ధర్మస్య 
తదాత్మానం సృజామ్యహమ్        7 వ శ్లోకం

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చదుష్కృతామ్
ధర్మసంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే           8 వ శ్లోకం

ఓ అర్జునా! ఎపుడెపుడు ధర్మము నశించుచు అధర్మము వృధ్ధి చెందు చుండునో అపుడపుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును.ధర్మాచరణము ఎంత శ్రేష్టమైనదో భగవానుడు సుస్పష్టముగా చెప్పుచున్నాడు. ధర్మాచరణమే మానవుని రక్షింపగలదు.మానవునికి శాంతిని , శౌఖ్యాన్ని ఒసంగగలుగునది ధర్మాచరణమే.ధర్మ రక్షణకై పరమాత్ముడు బద్ద కంకణుడై పూనుకొనినప్పుడు దాని మహాత్యము వేరుగ వర్ణింపనవసరములేదు.

సన్మార్గమునజనువారికి సత్ప్రవర్తన గల వారికి సాధుశీలురకు మాత్రమే భగవానుని రక్షణ లభించును. ఇచ్చట జాతి మత కుల బేధము లేమియును లేవు. సత్ప్రవర్తన, ధర్మానుష్టానము కలిగిన వారలందరూ భగవంతునిచే రక్షింపబడెదరు.
ప్రస్తుత ప్రపంచంలో మనిషి ధర్మాచరణుడు కావాలంటే బ్రతుకు చాలా కష్టమౌతుంది.కడకు ధర్మాన్ని ఆచరించేవారికి సమాజంలో ఎడతెరిపిలేని కష్టాలు కలుగుతుంటాయి. యధార్ధానికి ధర్మాన్ని ఆచరించే మానవునికి కలిగే కష్టమైనా మనసుకు ఏమాత్రం బాధ కలిగించదు. అది అనుభవించిన వారికి మాత్రమే అర్ధమౌతుంది.ధర్మాచరణ వలన ఇంద్రియములు , మనసు , ఆత్మ గాఢమైన ప్రశాంతత అనుభవిస్తాయి.
****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information