శ్రీధరమాధురి -36 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -36

Share This

శ్రీధరమాధురి -36

(సేవను గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు )జీవితమంటే ప్రేమ. పెద్ద ఎత్తున సమాజానికి బేషరతుగా సేవ చెయ్యడం ద్వారా కూడా ఈ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మీకున్న అవకాశాన్ని బట్టి, మానవాళికి ఏదో ఒక చిన్న సాయం చెయ్యండి. మీకు దైవం యొక్క ఆశీస్సులు అందుతాయి, అలౌకిక మైన ఆనందం కలుగుతుంది.
****
జాతి, మత, కుల, వర్గ, వర్ణ, ప్రాంతీయ, స్త్రీపురుష విభేదాలు అన్నింటికీ అతీతంగా మీరు ఎదిగినప్పుడే  రాజీపడకుండా ప్రపంచానికి బేషరతైన నిస్వార్ధ సేవను చెయ్యగలుగుతారు. అందరినీ బేషరతుగా ప్రేమించి, భువిలోనే స్వర్గాన్ని సృష్టించండి.
****
డబ్బును, అధికారాన్ని మానవాళికి సేవ చేసేందుకు వినియోగించవచ్చు.
****
మానవజన్మలోనే, మీకు సేవ చేసే అవకాశం ఉంది.
*****
నిటారుగా ఎదిగిన చెట్లు చెక్కపనివాడి చేతిలో ఇంటికి ఉపయుక్తమైన సామాన్లుగా మారే అవకాశాన్ని పొందుతాయి. వంకరగా ఎదిగిన చెట్లను కొట్టే వీలు లేకపోయినా, అవి అందరికీ నీడను ఇస్తాయి కదా. దైవం ప్రతి ఒక్కరికీ, వారివారి జ్ఞాన స్థితిని బట్టి,  నిస్వార్ధ సేవలో పాలుపంచుకునే అవకాశాన్ని ఇస్తారు. 
****
ఇతరుల స్వార్ధానికి అంతనేది ఎక్కడ ఉంది? వారు చందమామనే కోరవచ్చు. కాని, మీరు వారి అత్యాశను తీర్చకుండా జాగ్రత్త పడండి. లేకపోతే అలసిపోయి, కొన్నిసార్లు నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
****
మీకంటే తక్కువ అదృష్టవంతులు మీకు తారసపడినప్పుడు, ఆ పేదవారికి నిరంతర సేవలను అందించడం ద్వారా దైవానికి మీ కృతజ్ఞతా భావాన్ని మీరు తెలియజేయవచ్చు.
****
మానవాళికి సేవల్ని అందించడమే జీవిత పరమార్ధం.
****
ప్రపంచం అన్ని అంశాల్లోనూ సమానంగా ఉండదు. పేద-గొప్ప, మంచి-చెడు, అందం-అవకారం, ఆరోగ్యం –అనారోగ్యం, తప్పు –ఒప్పు, మొదలైన సంఘంలోని అసమానతలు నిస్వార్ధ సేవలకు అవకాశాన్ని ఇస్తాయి. అన్నీ అందరికీ సమానంగా అందితే, ఇక ఎవరిపై ఆధారపడడం అనేది ఉండదు.  ఆధార పడడమన్నది ఉండకపోతే, సేవ అనేది పూర్తిగా మాయమవుతుంది. దైవం బహుశా మనం ఒకరిపై ఒకరు ఆధారపడాలని కోరుకుని ఉంటారు. ఇలా ఆధారపడడం అనేది మనం నిస్వార్ధ సేవతో మొగ్గతొడిగి వికసించేందుకు అవకాశాన్ని ఇస్తుంది.
****
ఇతరులు మీకేమైనా సేవను చెయ్యాలని అనుకున్నప్పుడు, చెయ్యనివ్వండి. మీకోసం ఏదైనా చేసామన్న సంతోషాన్ని వారికి ఇవ్వండి. మొండిగా ఉండకండి. సేవను తిరస్కరించడం మానవత్వం కాదు.
****
అతను నిస్వార్ధంగా ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. ఒకరోజున, నాకతని చెప్పుల్ని తీసి అతను తొడుక్కునేందుకు సిద్ధంగా ఉంచే అవకాశం దొరికింది.
అతను – ‘గురూజీ, మీరు ఏం చేస్తున్నారు? ఇది నన్ను బాధ పెడుతుంది.”
నేను నవ్వి, ఇలా అన్నాను – ‘నువ్వు నిస్వార్ధంగా ఎన్నో సేవలు చేస్తూ ఉంటావు. ఇతరులకు కూడా నీకు సేవ చేసే అవకాశం ఇవ్వు, అలాగే నాకూ నీకోసం చిన్న సేవను చేసిన ఆనందాన్ని ఇవ్వు.”
****
మొత్తం జీవితాన్ని రెండుగా విభజించవచ్చు...
మీరు ఎవరికైనా సేవ చెయ్యడం...
లేక
ఎవరైనా మీకు సేవ చెయ్యడం...
ఈ ప్రపంచంలోని అన్ని పనులు దీనికి ప్రతిబింబాలే !
****
ధర్మం చర ... తైత్తరీయ ఉపనిషత్తు
‘ధర్మం చర’ అంటే అవసరంలో ఉన్నవారికి కేవలం డబ్బో, వస్తువులో ఇవ్వడం కాదు. కొందరికి కొన్ని రకాల సేవలు  కావాల్సి వస్తాయి. అవి శారీరకమైనవో, మాసికమైనవో కావచ్చు. కొంతమందికి ప్రేమ కావాల్సి ఉంటుంది. నిరాశలో ఉన్న కొంతమందికి కొన్ని ఓదార్పు వాక్యాలు కావలసి ఉంటాయి. మీరు అటువంటి వారి వద్దకు వెళ్లి, వారికి ఉపయోగపడాలి. జీవితమంటే నిస్వార్ధంగా సేవ చెయ్యడమే !
****
సమయం వచ్చినప్పుడు, గురువు సాంగత్యంలో ఉండాలన్న తపన ఉదయిస్తుంది. అంత వరకు జరిగేదంతా ఒక ఎక్సిబిషన్ లాంటిది, ప్రదర్శనకు ఉంచిన వాటినే మీరు చూస్తూ ఉంటారు. మీరు గురువును చూసే ఉంటారు, వారు మీకు తెలిసే ఉంటారు, కాని వారితో ఉండాలన్న తపన ఉండదు. ఇది మనలో చాలామందికి సర్వసాధారణం. అందుకే, శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు వస్తారని అంటారు. అంతవరకు గురువు బంధువైనా, స్నేహితుడైనా, తెలిసినవారైనా, సహోద్యోగి అయినా, మీరు గుర్తించరు. కాని, గురువు మీరు వారికి బంధువైనా, స్నేహితుడైనా, తెలిసినవారైనా, సహోద్యోగి అయినా,మిమ్మల్ని గుర్తుపెట్టుకుని, మీకు తెలియకుండానే మీకు నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉంటారు. ఆయనతో ఉండేందుకు  సమయం ఆసన్నమవ్వాలి.ఇదంతా సమయానికి సంబంధించినది.
****
నిజమే... మీరు సమాజానికి సేవ చేస్తారని నాకు తెలుసు. కాని, అది ఇతరులు తెలుసుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇతరులకు మేలు చేసే పని ఏదైనా మనం చెయ్యచ్చు, కాని అది ఎవరు చేసారో తెలియక వారు ఆశ్చర్యంతో అవాక్కయ్యే విధంగా, వారికి తెలియకూడదన్న నిబంధనతో చెయ్యగలమా ? చివరికి వారు పసికట్టి మిమ్మల్ని అడిగినా, మీకు తెలియనట్టే మీరు నటించాలి. సమాజానికి నిస్వార్ధంగా సేవ చేసే వ్యక్తికి, ఏ అవార్డులు బహుమానాలు అక్కర్లేదు. అటువంటి ఆత్మలకు ప్రేరణ కల్పించేందుకు ఏమీ అక్కర్లేదు.
****
అతను – గురూజీ, ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను మీ సేవకు సిద్ధంగా ఉంటాను.
సరే చూద్దామని, నేను అతన్ని కలిసేందుకు అతని ఆఫీస్ కు వెళ్లాను. విసిటర్స్ కూర్చునే సోఫాలో కూర్చున్నాను. అతని సీనియర్ మేనేజర్ వచ్చారు కనుక, అతను వారితో చాలా బిజీగా ఉన్నాడు. దూరం నుంచి నన్ను చూసి, చెయ్యి ఊపాడు. నేనూ చెయ్యి ఊపి, బయటపడ్డాను. నేను నవ్వుకుని, నాలోనేను ఇలా అనుకున్నాను, “ఎప్పుడూ, ఎక్కడా నాకోసం సమయమూ లేదు.” అని.
****
రాధా – దయుంచి మా ఆఫీసుకో, ఇంటికో రండి. నేను ఖచ్చితంగా మీ సేవలో ఉంటాను. మీరు రావడమే మా అదృష్టంగా భావిస్తాము.
నాకు రాధా ను చూసి నవ్వాలనిపించింది.
నాకు రాధ గురించి బాగా తెలుసు. అతను అన్నీ వదిలేసి, నా వెనుక పరిగెడతాడు. కాని, నాకు సేవ చెయ్యలేని వారినే నేను ఎంచుకుంటాను. అదే గమ్మత్తు.
****
నా డిక్షనరీలో, ప్రతిఫలంగా ఏదైనా పొందితే అది సేవగా పరిగణించబడదు.
****
దైవం, గురువులూ మీ కష్టాల్లో, ఒత్తిళ్ళలో మీతో కలిసి నడిచేలా నాకు శిక్షణ నిచ్చారు. గుర్తుంచుకోండి, మీరు ఆనందంగా ఉన్నప్పుడు, మీ సేవలు ఇబ్బందుల్లో ఉన్న వేరొకరికి అవసరం.
****
ఎంతసేపని మీరు కొట్లాడుతూ ఉంటారు? అవతల మరిన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీ అహాన్ని విడనాడే ధైర్యాన్ని కలిగి ఉండి, మానవాళికి సేవ చెయ్యండి.
****
మీదైన పద్ధతిలో మానవాళికి, ప్రకృతికి సేవ చెయ్యండి. దేనికైనా ఉపయోగపడండి. ఈ ప్రపంచం యొక్క శ్రేయస్సుకు ఏదో ఒక విధంగా పాటు పడండి. సేవే దైవం,  సేవలో దైవత్వం ఉంది.
****
మానవాళికి, ప్రపంచానికి పెద్ద ఎత్తున సేవ చెయ్యడంలోని స్పూర్తిని, అహం పాడుచేస్తుంది.
****
పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సేవ చేసేటప్పుడు వినమ్రంగా మెలగండి. కొంతమంది సంఘసేవ చేస్తారు, కాని బోలెడంత గర్వాన్ని ప్రదర్శిస్తూ చేస్తారు. అటువంటి దృక్పధంతో చేసే సేవ వాంఛనీయమూ కాదు, భద్రతనూ ఇవ్వదు.
***

No comments:

Post a Comment

Pages