శివసంకీర్తనా ప్రాశస్త్యం -పంచభూత లింగ స్థల కృతులు - అచ్చంగా తెలుగు

శివసంకీర్తనా ప్రాశస్త్యం -పంచభూత లింగ స్థల కృతులు

Share This

శివసంకీర్తనా ప్రాశస్త్యం-పంచభూత లింగ స్థల కృతులు

మధురిమ 



శివరాత్రి పర్వదినం చేరువలో ఉన్న సందర్భంగా శాస్త్రీయసంగీతంలో పరమేశ్వరునిపై రచింపబడిన సంకీర్తనలను మీకు పరిచయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం కొనసాగింది.మూడవ వార్షికోత్సవ "సేవాభావప్రత్యేక" సంచిక సందర్భంగా తమ సంకీర్తనల రచన ద్వారా కొందరు మహానుభావులు భావితరాలకు అందించిన  సంకీర్తనా నిధిని ,భక్తిని  మనం పెంపొందించుకునేలా సాగిన వారి రచనలద్వారా సంగీత ప్రపంచానికి మరియు  విలువలతోకూడిన జీవితాన్ని గడపాలని మార్గనిర్దేశకాలుగా కీర్తనలు రచించి తద్వారా యావత్  జగత్తుకూ వారు చేసిన సేవను  స్మరించుకోవడానికి ఈ కీర్తనలను విశ్లేషించుకుందాం.
"బ్రహ్మ ప్రణవ సంధాన నాదో జ్యొతిర్మయః శివః
స్వయమావిర్భ వేదాత్మా మేఘాపాయేం శు మానివ"
బ్రహ్మమునకు ప్రణవమునకు అనుసంధానమైన నాదమే జ్యోతిర్మయమైన పరమేశ్వరుడు.శివ జ్యోతిర్మయమే సర్వజగత్తు.ఆ జ్యోతి నిత్య ప్రకాశమైనది,అయితే మనము చేయు కొన్ని దుష్కర్మలేఆ జ్యోతి నిమనకు కనిపించకుండా అవరోధములు కలిగించినా,మేఘాలు తొలగిపోగానే తిరిగి సూర్యుణ్ణి చూడగలిగినట్లుగా మన దుష్కర్మ ఫలితం నశించగానే తప్పక మనకి ఆ దివ్యజ్యోతి దర్శనం కలుగును.
ఆ దివ్యజ్యోతి సందర్శనమునకై చేయు సాధనలో నాదోపాశనము అత్యంత ఉత్తమమైనదని ఎందరో పుణ్యపురుషులు నిరూపించి చూపించారు.పరమేశ్వరుడే సాక్షాత్తు నాదస్వరూపుడు కాగా సంగీతము ఆ శంకరునకు ఆభరణము వంటిది.అందుచేత ఎవరైనా సంగీతాభ్యాసము చేస్తున్నారంటే వారు నాదశరీరుడైన  శంకరుని ఉపాసన గావించుచున్నట్లే భావము.
సంపూర్ణ శారదానుగ్రహ సుసంపన్నులైన శ్రీవిద్యా నిధులు సంగీత త్రిమూర్తులైన శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీముత్తు స్వామి దీక్షితులవారు,శ్రీ శ్యామ శాస్త్రులవారు.వీరి రచనలో శాస్త్ర,కళా,విద్యా సంబంధములైన దివ్యరహస్యాలెన్నో నిఘూడముగా నిక్షిప్తమై ఉన్నవి.అందరికీ తెలిసిన విషయమే త్యాగరాజ స్వామి భావప్రధానమైన  రీతిలో రఘుకులోత్తముని సేవించుచూ తరించిన పుణ్యాత్ములైతే.శ్రీ దీక్షితులవారు రాగప్రధాన రీతిలో పండితులకు ఆస్వాదయోగ్యమైనట్టుగా పామరులకు అర్థంగాని సంస్కృత భాషలో,ప్రాస నియమాలతో,మంత్ర తంత్రోపాసనాయుతాలుగా,బీజాక్షరాలతో,మంత్ర శాస్త్ర సంబంధ పదజాలంతో శివశక్తి తత్వంతో తన కృతుల్ని రచించారు.ఇక శ్యామశాస్త్రులవారు దేవి ఉపాసకులు.ఎన్నోసార్లు అమ్మవారి దర్శనాన్ని పొందిన ధన్యులు. వీరి రచనలన్నీ తల్లి దగ్గర తనయుని మనోవేదన మొరపెట్టుకున్న భావనతో,కరుణారస సంపూర్ణతతో,"అన్యధా శరణం నాస్తి అన్నట్లుగా"గోచరిస్తాయి.
ఇదే విషయాన్ని శ్రీ త్యాగరాజ స్వామి వారు "నాదతనుమనిశం శంకరం" అన్న కీర్తనలో నిరూపించారు.స,రి గ,మ,ప,ద,ని అను సప్తస్వర విద్యాలోలుడు పరమేశ్వరుడని ఈ కీర్తనలో వర్ణించారు.
త్యాగరాజాది వాగ్గేయకారులెందరోతమ భక్తిభావనలో తాదాత్మ్యత చెంది ఆ భక్తిరస భావావేశంలో తమ గళం నుండి  అమృతతుల్యములైన ఎన్నో సంకీర్తనా నిధిని అందించినప్పటికీ….. పరమేశ్వరునిపై అద్భుతమైన,అమోఘమైన విశేష సంకీర్తనలను చేసినది మాత్రం శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారే.నీటిని జలం అని,నీరు అని,తోయం అని ఇలా వివిధ నామాలతో ఎలాపిలిచినా దాహాన్ని తీర్చేది అని అంతరార్ధం కలిగియున్నట్లుగా   హరైనా,హరుడైనా ఒక్కరే"శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః" అని వేదాలు ఘోషించినట్లుగా  త్యాగరాజాదులు రామా అన్నా దీక్షితులవారు శివా అన్నా ఒక్కడే పరమాత్మ వారి భక్తి అనే దప్పికని తీర్చినవాడు.
“ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి”
అన్నట్లు  యదార్ధ తత్వము తెలిసిన సిద్ధపురుషులకు సర్వము పరబ్రహ్మ మయము గానే గోచరిస్తుంది. ఎన్నో పుణ్యక్షేత్రములు దర్శించి నిష్కామ యోగిగా జీవితమంతయూ గడిపిన దీక్షితులవారు అద్వైత సిద్ధాంతమును సంపూర్ణం గా అవగతము చేసుకోగలిగినవారు కనుక శైవ,వైష్ణవ భేదము లేక తాను సందర్శించిన పుణ్యక్షేత్రాలలోని దేవతలపై ఎన్నో కీర్తనలు రచించియున్నారు.
పరమేశ్వరుడుపంచభూతములైనపృథ్వి(భూమి),ఆపస్సు(జలము),తేజస్సు(అగ్ని),వాయువు(గాలి),ఆకాశము వీటియందు లింగ స్వరూపమున గలడని శ్రుతి ప్రమాణము. అట్టి పరమేశ్వరుడు దక్షిణ భారతదేశమున అయిదు క్షేత్రాలలో వెలసెను. అవిచిదంబరము (ఆకాశ),శ్రీకాళహస్తి(వాయు),అరుణాచలము(అగ్ని),జంబుకేశ్వరము (జల),కంచి(పృథ్వి) క్షేత్రాలు.
ఈవిధంగా వారు పంచభూతలింగ క్షేత్రములకు వెళ్ళి అక్కడగల లింగరూపధారుడైన శివుని దర్శించి ఆనందానుభూతితో అయిదు కృతులు రచించారు. ఇవి పంచభూత లింగస్థల కృతులుగా ప్రసిద్ధి చెందినవి.వీటిలో పంచభూత తత్వములను విభిన్నమైన విశేషణాలతో వర్ణించారు.ఆకాశమునకు పృథ్వికి మధ్యనున్నది జల,తేజో,వాయుకృతమైన ఈ జగత్తు.ఈ జగత్తు సత్యం కాదు ఒక మిధ్య,కానీ ఆకాశము సత్యము అది ఆనంద స్వరూపము.ఆనందమనగా పరమేశ్వరుడే కదా. ఈ పుడమి పై జన్మించిన ప్రతీ వ్యక్తి చివరికి పొందాలిసినది అలౌకికమైన ఆ ఆనందమే కదా. అందుకే ఈ కృతులలో వారు పృధ్వి నుండి ఆకాశమునకు పోవు క్రమమును సూచించి ఆ ఆనందం ఎలాపొందాలోదిశానిర్దేశం గావించినారు.
కాంచీపుర క్షేత్రములోని ఓ మామిడిచెట్టు కింద వెలిసిన స్వామి శ్రీ ఏకామ్రేశ్వరుడు.ఆ స్వామిని సేవించమని మనలిని ప్రభోదించుచూ ఈ కృతిని దీక్షితులవారు రచించినారు.ఇక్కడ స్వామి పృధ్వి లింగ స్వరూపుడు.ఏకామ్రమనగా ఒంటి మామిడి.ఆ ఒంటి మామిడి చెట్టే ఈశ్వరుడు.చెట్టనగా భూమినుండీ పుట్టినది. చెట్టుయందు పృధ్వి లక్షణము ఉన్నది.ఇక్కడ లింగము దారుమయమైనది.దారు అనగా చెట్టు మాను.దాని సహజ ఆవిర్భావ స్థానము పృథ్వియే.కనుకనే అక్కడ జగన్మాత అయిన పార్వతీదేవి పాదుచేసి ఆ పాదులో చెట్టంత స్వామిని చిట్టెడు లింగరూపముగా చేసిఅర్చించింది.
ఈ ఏకామ్రేశ్వరుని కీర్తిస్తూ భైరవి రాగంలోని "చింతయ మాకంద మూలకందం" అన్న కృతిని రచించారు.శివశక్తులు విడివడని జంట.ఈ పృధ్వి లింగమున వారు ఆనందభైరవి,ఆనందభైరవుడిగా ఉన్నారు. అందుకే బహుసా భైరవి రాగంలో స్వరపరిచారేమో...ఈ కృతిలో దీక్షితులవారు శివశక్తుల అభేద ప్రతిపత్తిని చెప్పినారు.
శ్రీరంగ పుణ్యక్షేత్రమునకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుకేశ్వరం జలలింగ క్షేత్రం.ఈ లింగాన్ని దర్శించినప్పుడు జంబూపతే మాపాహి "నిజానందామృత బోధం దేహి" అన్న యమునాకళ్యాణి రాగ కృతిని రచించారు. జంబుకేశ్వరమునగల అపోలింగ స్వరూపుడవైన ఓ జంబూపతి నన్ను రక్షించుము.నిజభక్తుని హృదయమే ఆనందామృత మయము.తన హృదయంలో గల ఆనందామృత ప్రవాహంలో గల శివలింగము దర్శించినచో ఎట్లుండునో అట్టి నిజానంద అమృత స్థితిని  ప్రసాదించమని వేడుకున్నారు దీక్షితులవారు. ఆ స్థితిని ఊహించుకోగలిగితే  పంచభూతాత్మకమైన పరమాత్మ శరీరమున లీనమై ఉన్నాడన్న నిజమును గ్రహించవచ్చును. దేహమనే దేవాలయంలోనే పరమేశ్వరసాక్షాత్కారం చేసుకోమని ప్రభోదించారు దీక్షితులవారు. ఇక్కడ శివుడు జంబు(నేరేడు వృక్షము కింద వెలసినాడు) కనుక ఈశివునకు జంబుకేశ్వరుడని పేరు.
శ్రీ దీక్షితులవారు అరుణాచల క్షేత్రమున తేజోమయ లింగరూపమున ఉన్న పరమేశ్వేఉని స్తుతించుచూ సారంగరాగమున "అరుణాచలనాధం స్మరామి అనిశం --అపీత కుచాంబా సమేతం ".
 అన్న కృతిని రచించారు.పల్లవి ప్రారంభంలోనే అరుణాచలనాధం అన్న క్షేత్ర నామము వినిపించుట విశేషము.అరుణాచల నాధుడు తేజో మయ లింగ స్వరూపుడు.అక్కడ అమ్మవారి పేరు అపీతకుచాంబ.అపార తేజోవతి.ఆమె వక్షోరుహములు సూర్యచంద్రులు.శంకరభగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పినట్లుగా ఆమె కుచయుగ్మములు సూర్యుడు,చంద్రుడు కాగా ఆ సూర్యచంద్రులే జగత్ పోషకులు.కేవలం తన చూపులతోనే బిడ్డలను పోషించగల తల్లి,వారిరువురూ ఆది దంపతులు.వారికి మనవలె పార్ధివ రూపములుండవు వారు తేజో స్వరూపులు.  అరుణాచల క్షేత్రమునకు తిరువణ్ణామలై అను నామాంతరము కలదు.ఈ క్షేత్రము కృత యుగములో జ్యోతి రూపమున,త్రేతాయుగములో నగలకొండగా,ద్వాపరయుగములో బంగారంతో  కూడిన కొండగా ,కలియుగములో మరకతముగా మారినదని ప్రసిద్ధి.
శివుడు పంచభూతములకు పతికావున భూతపతి అని పేరు కలవాడు.ఈశావాశ్యోపనిషత్ లోని "ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ " అన్న ప్రారంభ శ్లోకమున పేర్కున్నట్లుగా ఈ ప్రపంచమంతయూ శివమయము,శివమనగా ప్రాణమున్నది,మంగళకరమైనది అని భావము.ప్రాణంలేనిది శవం, కనుక ప్రాణస్వరూపము శివము.
భూమి,సలిల,అగ్నులను దాటిన తరువాత వాయువు.వాయుః ప్రాణః అన్నాయి వేదాలు అంటే వాయువే ప్రాణము.అందువలన శివతత్వమును వాయురూపముగా పేర్కొనుచూ హుస్సేని రాగంలో "శ్రీకాళహస్తీశ శ్రితజనావన--సమీరాకార మాంపాహి రాజమౌళే ఏహి" అన్న కృతిని రచించిరి.వాయువే తన ఆకారం కలిగినవాడు కనుక సమీరాకారా అన్న పద ప్రయోగము చేసిరి.గాలికి ఆకారము లేదు కానీ వాయువును జగత్తు యొక్క ప్రాణమందురు.సమస్త జీవరాసులయందు వాయువు "ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన,సమాన" మను పేర్లతో వాయువుకు పంచకస్థితి కలదు.ఈ పంచప్రాణములు తానే అయినాడు స్వామి అని అను భావార్ధంతో స్వామిని స్తుతించినారు.
ఇక్కడి అమ్మవారు "జ్ఞానప్రసూనాంబ".అందుకే దీక్షితులవారు చరణంలో స్వామిని జ్ఞానప్రసూనాంబికాపతి అని స్తుతించారు.అనగా జ్ఞానమే ప్రసూనము.అట్టి జ్ఞానప్రసూనమే తన స్వరూపముగా కలిగిన తల్లి అంబిక.యావత్ మానవాళిని ఉద్ధరించే  జగజ్జనని.అటులనే స్వామి తన భక్తులను కామక్రోదాధి అరిషట్వర్గములనుండీ కాపాడునట్టి కరుణానిధియనియు,అందుచే జ్ఞానము కలిగిన పశువులకు తాను పతియై తన పసుపతిత్వమును సార్ధకము చేసికొన్నాడనియు,అతి నిష్టా గరిష్టులనే కాదు తిన్నడువంటి మామూలు మనిషిని కూడా ఉద్ధరించాడన్న విషయం  "హీనజాతి కిరాతేన పూజిత కీర్తే" అన్న పంక్తుల్లో వివరించారు దీక్షితులవారు.
ఇక పంచభూతములకు పరాయణమైనది ఆకాశము.చిదంబరంలోని ఉన్నఆకాశలింగరూపుడైన ఈశ్వరునిపై కేదార రాగంలో "ఆనందన నటన ప్రకాశం చిత్సభేశం-ఆశ్రయామి శివకామ వల్లిశం" అను అద్భుతమైన కృతిని రచించారు.చిత్ అంబరం నుండీ చిదంబరం వచ్చింది.ఇక్కడ స్వామిని ఆనంద నటన ప్రకాశుని గా స్తుతించుచూ అట్టి స్వామిని ఆశ్రయించుచున్నప్పుడు కలిగిన భావమే ఈ కృతిలోని ఇమిడ్చి ఉన్నారన్నది సత్యము.
ఆనందము పరమేశ్వరుని లక్షణము.ఈ ఆనందము అనంతమైనది.ఆకాశమెట్టిదో ఆనందమట్టిది.అంతటా నందము కలది ఆనందమైతే , అంతటా కాశము కలది ఆకాశము.కాశమనగా వెలుగు----చీకటి లేనిది.ఆకాశమంతా ఆనందమే కానీ దుఃఖము లేదు.చిదంబరములోని దేవాలయములో మధ్య నటరాజ మూర్తి ఒకపక్క శివకామవల్లీ మరియొక పక్క ఆకాశలింగము ఉండును.ఆకాశము శూన్యము కనుక మనకి అక్కడ లింగం ఏమీ కనిపించదు,కాని మకరతోరణము,ఇంకోపక్క త్రిశూలము కనబడతాయి.ఈ గర్భగుడిని "చిత్సభ " అంటారు,ఈ సభకు ఈశుడు కనుక ఆ పరమేశుడు చిత్సభేశుడు.
ఈ చిత్సభలోకి ప్రవేశించడానికి గల అయిదు మెట్లను శివపంచాక్షారీ మంత్రం "ఓం నమః శివాయ" గా చెప్తారు.ఈ శివుని హస్తములోని ఢమరుకను భావిప్రపంచమునకు గుర్తు గాఉన్నది.
శార్ధూల చర్మమును ధరించి చిత్తునే అంబరముగా ఆవరణగా చేసికొన్నవాడు. ఈ శివుడు వెన్నవలె కరిగిపోవు హృదయం కలవాడు.వేదములకు వేద్యుడైనవాడు.అట్టి శివకామవల్లిసుని ఆశ్రయించమని చెప్పినారు.చిదంబరంలో గల సభామండపము నందు శివుడు ఆనందతాండవము చేసెనని ప్రసిద్ధి.
ఈవిధముగా ఈ కృతులలో దీక్షితులవారు ఆకాశమునుండీ భూమికి క్రమముగా చేరిన విధానము వర్ణించారు. ఇవి భుక్తి,ముక్తి ,ప్రధానమైన ఉపాసనా లక్షణాలతో చేయబడిన రచనలు.
ఈశరీరం కూడా పంచభూతాలతోనే నిర్మించాడు పరమేశ్వరుడు.అసలు శివశక్తి తత్వములైన పంచవింసతి తత్వములు -  పంచభూతాలు,పంచతన్మాత్రలు,పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు,మనస్తత్వము,మాయాఈ విధంగా వర్గీకరించబడింది.
సకల చరాచర జగత్తునకు మూలమైన పరమేశ్వర,పరమేశ్వరి తత్వమును ఇలా కృతులలో ఆవిష్కరించిన దీక్షితులవారికి,శివుడి ఆజ్ఞ లేకుండా చీమైన కుట్టదన్నారు...కాబట్టి ఈ విషయాలన్ని మనం తెలుసుకోగలుగుతున్నామంటే అదికూడా పరమేశ్వరుని సంకల్పమే...కావున ఆ పరమేశ్వరునికి ,దీక్షితులవారికి పాదాభివందనం చేస్తూ...శ్రవణం కూడా భక్తిమార్గాలలో ఒకటి .కాబట్టి ఎన్నో మంత్ర, తంత్ర,జ్యోతీష శాస్త్ర  విషయాలతో నిండి ఉన్న ఈ కృతులను తరచు వింటూ ఆ సదాశివుణ్ణి స్మరిస్తూ నాదోపాసన చేసి ఓ పరిపక్వమైన స్థితికి చేర్కున్ననాడు,హృదయంలోనే శివశక్తులరూపాలను సందర్శించుకుని తరించగలం.
అందరికి శివరాత్రి మరియు మూడవ వార్షికోత్సవ శభాకాంక్షలు.
****

No comments:

Post a Comment

Pages