సామ్రాజ్ఞి – 4 - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి – 4

భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. గిరిజనులకు బందిపోట్ల బాధను తొలగించేందుకు వెళ్ళిన ఆమె చేతికి గాయమవుతుంది. ఈ సంగతిని ఆమె తన గుర్విణి శక్తిసేనకు చెబుతూ, కుంతల రాజు విజయవర్మ యుద్దానికై పంపిన లేఖను గురించి వివరిస్తుంది ప్రమీల.  అనవసర రక్తపాతం తనకు ఇష్టం లేదని, దీనికి తరుణోపాయం చెప్పమని కోరిన ప్రమీలతో మల్లయుద్ధమే సరైన ఉపాయమని చెబుతుంది గుర్విణి. మల్లయుద్ధంలో విజయవర్మను ఓడించి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తీసుకువెళ్తుంది ప్రమీల. పరిణామ, వ్యాఘ్ర  సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. )
“ పార్ధా ! కుశలమా ! ఏమిటి విషయం, ఎందుకో కలత చెందినట్లు ఉన్నావు ?” కోటి సూర్యుల కాంతితో దేదీప్యమానంగా ప్రత్యక్షమైన కృష్ణ భగవానుడు ఆప్యాయత, దయ మేళవించిన స్వరంతో అడిగాడు.
“బావా, వచ్చావా ! నీ దర్శనభాగ్యమనే ప్రదీప్తితో నా చింతల చీకట్లన్నీ పటాపంచలు చేసావు పరమాత్మా ! నీ కృపాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరిస్తూ ఉండగా, నా క్షేమానికి వచ్చిన లోటు ఏమీ ఉండదు. సర్వజ్ఞుడివైన నీకు వేరు చెప్పపనిలేదు. అయినా, నీవు నా నోట వినాలని అడుగుతున్నావు కనుక విన్నవిస్తున్నాను. యాగాశ్వ సంరక్షణ బాధ్యతను నాకు అప్పగించిన సంగతి నీకు తెలిసిందే. నీ దయవల్ల ఉత్తర భారత యాత్ర దిగ్విజయంగా ముగిసింది. కాని, ఈ కేరళ రాష్ట్ర సరిహద్దుకు రాగానే, అదిగో, ఆ కనబడే సరస్సుల్లో దప్పిక తీర్చుకునేందుకు వెళ్ళిన అశ్వం మొదట ఆడగుర్రంగా మారి, ఆపై పులిగా మారి, వలలో బంధించబడి ఉంది. ఆ సరస్సుల్లో ఏదో మాయ ఉందని గమనించి, వెనువెంటనే మా పరివారం అక్కడకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాను. కాని, బావా ! ఈ పులే యాగాశ్వం అంటే ఎవరైనా నమ్ముతారా ? సవ్యసాచిగా బిరుదుగాంచిన అర్జునుడు, కురుక్షేత్ర సంగ్రామంలో నీ సారధ్యంలో విజయ దుందుభి మ్రోగించిన కిరీటి, ఒక యాగాశ్వాన్ని రక్షించలేక, పులిని వెంటబెట్టుకు వచ్చాడని అంతా నవ్వి పోరూ? ఈ విపత్తు నుంచి, అపవాదు నుంచి నువ్వే నన్ను రక్షించాలి. అన్ని మాయలకు మూలమైన జగన్నాటక సూత్రధారీ ! నీ పాదపద్మాలే ఇక నాకు శరణ్యం !” అంటూ కృష్ణుడికి సాష్టాంగనమస్కారం చేసాడు అర్జునుడు.
“కళ్యాణ ప్రాప్తిరస్తు ! లే అర్జునా ! నీవిప్పుడు కేరళ స్త్రీ సామ్రాజ్య సరిహద్దుల్లోకి వచ్చావు. ఇక్కడ ఉన్న రెండు సరోవరాలు ఒకటి పార్వతీదేవి చేత, మరొకటి అకృతవర్ణుడు అనే ముని చేత శాపగ్రస్తమైనవి. మొదటి దానిలో మునిగిన పురుష జీవులు పార్వతి శాపంవల్ల స్త్రీ జీవులుగా మారిపోతాయి, రెండవ దానిలో మునిగినవి ముని శాపం వల్ల పులిగా మారిపోతాయి. అందుకే యాగాశ్వం వ్యాఘ్రమయ్యింది. ఏమిటి, నీ సందేహం తీరినట్లేనా ?”
“సందేహం తీరింది కాని, సర్వాంతర్యామీ , మీ దీవెనల వెనుక పరమార్ధం మాత్రం బోధ పడలేదు. ఇప్పటికి ఉన్న భార్యలు చాలకనా ? నా అనుకున్న వారినందరినీ నా చేతులతో మట్టుపెట్టి, యుద్ధంలో ఈ విజయుడికి కలిగినది జయమో, అపజయమో తెలియని సందిగ్ధంలో, వైరాగ్య స్థితిలో ఉన్న నాకు మళ్ళీ వివాహమా ? ఏమిటి పరమాత్మా నీ లీలలు ?”
“చింతించకు అర్జునా ! బ్రహ్మలిఖితం జరుగక మానదు. ఏ ఆత్మలు ఎందుకు కలుస్తాయో, ఎందుకు ముడిపడతాయో, అవి ఎన్నెన్ని జన్మల సంచిత కర్మల ఫలాలో అన్నీ ముందే నిర్ణయించబడతాయి. జీవులంతా ఇష్టమున్నా, లేకపోయినా బ్రహ్మరాతను దాటలేరు. సరే, ఇప్పుడే వ్యాఘ్రాన్ని తిరిగి అశ్వంగా మారుస్తున్నాను. నీ విజయ యాత్ర కొనసాగించు. రానున్నది స్త్రీ మండలం సుమీ ! ఆ స్త్రీ మండల సామ్రాజ్ఞి ప్రమీల అంతటి సౌందర్యవతి, ధీర ముల్లోకాల్లోనూ లేదు. మనసు పదిలం విజయా !” కొంటెగా కన్ను గీటుతూ అన్నాడు కృష్ణుడు.
“అంతా నీ దయ కన్నయ్య. నీ అనుజ్ఞ ప్రకారమే నా యాత్ర కొనసాగిస్తాను. నమో కృష్ణ నమో కృష్ణ నమోన్నమః !” అని అర్జునుడు నమస్కరిస్తూ ఉండగా, అంతర్ధానమయ్యాడు పరమాత్మ.
అటు ప్రక్క వ్యాఘ్రం మళ్ళీ అశ్వంగా మారడంతో అర్జునుడి సేనలో మళ్ళీ ఉత్సాహం అలముకుంది. “విజయుడికి జై, పార్ధుడికి జై, సవ్యసాచికి జై, కిరీటికి జై” అన్న నినాదాలు మిన్నంటుతూ ఉండగా, సీమంతిని సామ్రాజ్య దిశగా పయనం సాగించింది అర్జున సేన.
******
“రాజరాజేశ్వరీ !కేరళదేశాధీశ్వరి ! అరివీరభయంకరి ! పరాక్, బహుపరాక్ !” అంటూ పరిజన స్త్రీలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా సభామండపంలోకి అడుగుపెట్టింది ప్రమీల. ఆ రోజున ఆమె ధరించిన కెంపు రంగు వస్త్రాలు, ఆభరణాలు ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. దివినుంచి భువికి దిగివచ్చిన అప్సర కాంతలా ఉంది ఆమె. ముందుగా గుర్విణి శక్తిసేన ఆసీనురాలు అయ్యాకా, ఆమె తన సింహాసనాన్ని అధిష్టించి, పరిజనుల్ని కూర్చోమని సైగ చేసింది. ఆమె ఆజ్ఞతో మల్లయుద్ద్హంలో ఓడిన విజయవర్మ సభలోకి తీసుకుని రాబడ్డాడు.
“గుర్విణీ ! మీ ఆన ప్రకారమే ఈ ధూర్తుడిని బంధించి తెచ్చి, మీ పాదాల వద్ద పడేసాను. ఇతనికి తగిన శిక్షను మీరే నిర్ణయించండి !” నమస్కారపూర్వకంగా విన్నవించింది ప్రమీల.
“ప్రమీలా దేవి ! ఎందరో స్త్రీలను చెరబట్టి చెరిచిన ఇతన్ని విలాసపురుషుడిగా మార్చండి. ఇటువంటి కాముకులకు   తగిన శిక్ష అదే ! ఇది నా ఆజ్ఞ !” గంభీరమైన స్వరంతో పలికింది గుర్విణి.
“నేను సమ్మతించను. ఏవిటీ దారుణం ? యుద్ధంలో ఓడినంత మాత్రాన ఇంతటి శిక్ష వేస్తారా ? ఇష్టం వచ్చినట్లు పురుషుల్ని బంధించి తెచ్చి, విలాస పురుషులుగా మార్చి చంపడం మీ ఘనతగా భావిస్తున్నారా ? స్త్రీ సహజమైన దయ, ధర్మం లేకపోయాకా, ఇక మీరు స్త్రీ అన్న పదానికే అనర్హులు కదా ! ఇక స్త్రీ సామ్రాజ్యం ఏమిటి, ఈ సామ్రాజ్ఞి గొప్ప ఏమిటి?” ఉక్రోషంగా నిలదీశాడు విజయవర్మ.
“ఆపు నీ వాచాలత ! చింత చచ్చినా పులుపు చావలేదనీ, ఓడినా నీ మదం అణగలేదు. దయ అనేది మానవ లక్షణం, కేవలం స్త్రీలకే పరిమితం కాదు. నీవు ఎందరో కన్యకల్ని రాజగర్వంతో తెప్పించి, చెరలో బంధించి, బలవంతంగా చెరిచినప్పుడు, నీ కాళ్ళా వెళ్ళా పడి, ఆ కన్యలు రోదించినప్పుడు, నీకు దయ కలుగలేదా ? కనిపెంచిన బిడ్డ ఇలా నీవంటి కసాయి పాలౌతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖించి ఉంటారో ఊహించావా ? పట్టపు రాణులు, భోగ పత్నులు, విలాసాలకి స్త్రీలు, వీరిని బలవంతంగా కూడినప్పుడు నీలో దయ ఏమైంది, కాముకత్వం ముసుగులో దాక్కుందా ? ఇక ధర్మం అంటావా? అది దైవనిర్ణీతం. పురుషుల రాజ్యాలలో బహుభార్యాతత్త్వం, స్త్రీ బానిసత్వం ఉండడం ఎలాగ ధర్మమో, ఈ స్త్రీ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోడానికి దైవం చూపిన ధర్మం ఇదే.  ‘విలాస పురుషుడితో’ కూడిన స్త్రీలు అందరిలో ఒకామె మాత్రమే గర్భవతి అవుతుంది, నెల రోజుల తర్వాత అతను చనిపోగానే, గర్భవతి తప్ప అతడితో కూడిన తక్కిన స్త్రీలంతా అతడినే భర్తగా భావించి, సహగమనం చేస్తారు. నెల రోజులకి మించి ఏ విలాస పురుషుడు బ్రతుకడు. గర్భవతి అయిన స్త్రీ కేవలం ఆడబిడ్డకు మాత్రమే జన్మనిస్తుంది. ఇదిక్కడి ధర్మం, అద్భుతం... తరతరాలుగా ఈ పరంపర ఇలాగే సాగుతోంది. ఇన్నాళ్ళూ పశువులా బ్రతికావు. కనీసం చనిపోబోయే ఈ నెల రోజుల ముందైనా, నిన్ను కూడబోయే స్త్రీలతో మనిషిలా ప్రవర్తించు. ఎవరక్కడ, ఇతడినిక  తీసుకువెళ్ళండి !” ఆజ్ఞాపించింది గుర్విణి.
గుర్విణి మాటలు విన్న విజయవర్మలో ఏ మూలనో తన చర్యలకు పశ్చాత్తాపం కలిగిందేమో, ఆమెకు నమస్కరిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
****
“ఒసేయ్ కమలిని, ఈ ప్రశాంతమైన పంపా నదిని చూస్తుంటే, ఈ  దిక్కుమాలిన కాపలా కాసే ఉద్యోగం మర్చిపోయి, ఆ రెల్లు పొదల్లో కాసేపు గుర్రు పెట్టి హాయిగా నిద్రపోవాలనుందే !” అంది పహారా కాసే ఉత్కళ.
“ఇంకెందుకు ఆలస్యం, పడుకో మరి. మన సామ్రాజ్ఞికి తెలిసిందంటే, నిన్ను నిద్దర్లోనే సమాధి చేయించేస్తుంది. అప్పుడు ఎంచక్కా  నిద్దర్లోనే  ఊర్ధ్వలోకాలకి  పయనమైన దానివిగా చరిత్రలో నీకు ఉత్కృష్టమైన స్థానం దక్కుతుందే ఉత్కళా !” వెటకారంగా ఆటపట్టిస్తూ అంది కమలిని.
“అంటావే అంటావ్. అసలు నిన్ను కాదే, ఆ దైవాన్ని అనాలి. ఏ జన్మలో, ఏ మొండి గోడ మీద ఆదమరచి హాయిగా నిద్దరోతున్న కొండముచ్చుకి నిద్రాభంగం కలిగించానో కాని, నిద్ర మాని ఈ పొలిమేరల్లో గుడ్లగూబల్లా రాత్రివేళ పహారా కాసే ఉద్యోగాలు దొరికాయి. కళ్ళు మూతలు పడుతుంటాయి, ఇంతలో ఏ జంతువు కూతకో విప్పారి, మళ్ళీ కత్తుల పిడులు బిగిస్తాయి. అంతా నా ఖర్మే, ఖర్మ.”
ఉత్కళ మాటలకి నవ్వుతూ,“ఊర్కోవే మరీనూ ! అంత బాధగా ఉంటే ఈ ఉద్యోగం మానెయ్యరాదూ ! నిర్బంధం ఏమీ లేదుగా !” అడిగింది కమలిని.
“సామ్రాజ్ఞి కొలువులో ఉద్యోగమని వీధివీధంతా హడిలి చస్తారే తల్లీ. కబురు పెడితే కదిలొస్తారు. అన్ని కూరలు, పళ్ళు, ఇంటి సామాన్లు సగం ధరలకే మరి. వైద్యం, వసతి ఉచితం. ఇన్ని రాజలాంఛనాలు వదులుకునే పీల గుండె నాకు లేదే,” చతికిలబడుతూ అంటున్న ఉత్కళ, తెరిచిన నోటిని ముయ్యడం మర్చిపోయి, ఎటో చూస్తోంది.
“ఏమే ! మాట్లాడుతూ నోరు ముయ్యడం కూడా మర్చిపోయావా? ఏ కీచురాయో దూరిందంటే, మాట పోయి కూతలు పెట్టుకుంటూ తిరగాలి. ఏమే ఉత్కళ, ఏమయ్యిందే, నిన్నేనే !” ఆమె భుజాలు పట్టి కుదపసాగింది కమలిని.
నిలువెల్లా ఒణికిపోతూ, తాను చూస్తున్న దిశకేసి వేలు చాచింది ఉత్కళ. “ అది... అదీ... అక్కడ జ జ ... జంతువు... ఏదో కదులుతోంది. పులో, సింహమో... వాసన పట్టిందంటే ఇవాళ మనం పలారమైపోతాం. ఓమ్మయ్యోవ్ ...” బిగ్గరగా అరవసాగింది ఉత్కళ.
అరచేత్తో ఉత్కళ నోరు నొక్కేసి, “నువ్విలా అరిచావంటే, ఆ జంతువుకు దారి చూపినట్లే. కాస్త తెలివిగా ప్రవర్తించు. నాలుగు కాళ్ళున్నంత మాత్రాన సింహమో, పులో కావక్కర్లేదు. నెమ్మదిగా దగ్గరకెళ్ళి చూద్దాం పద, భయపడకు.” అంది కమలిని. కాస్త ధైర్యం కూడగట్టుకుని, ఇద్దరూ పంపా నదికేసి బయలుదేరారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages