నాట్య విజ్ఞాన్ - శ్రీమతి రాధామోహన్ - అచ్చంగా తెలుగు

నాట్య విజ్ఞాన్ - శ్రీమతి రాధామోహన్

Share This

నాట్య విజ్ఞాన్ - శ్రీమతి రాధామోహన్ 

భావరాజు పద్మిని 


ప్రేమ, సేవ, కళ ఈ మూడే ఆవిడకి తెలిసిన భాషలు. గంజి నుంచి బెంజి స్థాయి దాకా, ఎవరితోనైనా చిటికెలో మాటలు కలిపేసే కలివిడితనం ఆవిడ సొంతం. ప్రతి మనిషి జీవితం దైవ సంకల్పం ప్రకారమే నడుస్తుందని నమ్ముతూ, పదుగురికి మేలు చేసేందుకు తన కార్ డిక్కీలో పాత బట్టలు, కొత్త దుప్పట్లు, ఆహారం వంటివి నింపుకుని అడవులలోకైనా ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి మరీ సాయం అందించే ఆమె సేవాగుణం, అందరికీ ఆదర్శం. నృత్యానికే తమ జీవితాల్ని అంకితం చేసిన ఆ దంపతులలో నాట్య విజ్ఞాన్ శ్రీమతి రాధామోహన్ గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీ కోసం... 
నమస్కారమండి. నాట్యం పట్ల ఆసక్తి మీకు చిన్నప్పటి నుంచే ఉండేదా ?
మా స్వగ్రామం పమిడిముక్కల మండలం లంకపల్లి. బసవయ్య, దేవకీ దంపతులకు 1964 లో జన్మించాను.నాకు 3.5 సం. వయసు ఉన్నప్పుడు నేను నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. నేను హాస్టల్ లో ఉండి చదువుకున్నాను. మా స్కూల్ నియమాల ప్రకారం విద్యార్దినులంతా తప్పనిసరిగా సంగీతం/నాట్యం అభ్యసించాలి. నాకు డాన్స్ అంటే ఇష్టం కనుక నేను అందులో చేరాను. నేను చిన్నప్పటి నుంచి హైపర్ ఆక్టివ్ గా ఉండేదాన్ని. ఒకచోట కూర్చోవడం నచ్చేది కాదు. స్పోర్ట్స్ లో కూడా చురుగ్గా ఉండేదాన్ని. స్టేట్ లెవెల్ లో బెస్ట్ అథ్లెట్ గా అవార్డు పొందాను. స్కూల్ లో వరుసగా మూడేళ్ళు స్పోర్ట్స్ లీడర్ గా ఉన్నాను. మూడేళ్ళు వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇలా అతి చిన్న వయసులో డాన్స్ మొదలుపెట్టడం, చదువుతో పాటుగా కొనసాగించడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా నాట్యం వైపు నేను అడుగులు వెయ్యకపోయినా, దైవ నిర్ణయంలా నేను నాట్యం నేర్చుకోవడం, నర్తకిగా స్థిరపడడం జరిగింది.
మీరు నాట్యం అభ్యసించడంలో మీ కుటుంబసభ్యుల పాత్ర ఎంత ఉంది ?
నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ పోషణా భారం అమ్మ మీద పడింది. ఆవిడ ఉద్యోగం చెయ్యాలంటే, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కష్టమని నన్ను హాస్టల్ లో వేసారు. వరంగల్ లోని ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ లో నేను అతి పిన్న వయసులో హాస్టల్ లో చేరాను. ఇదంతా నా మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి, ముందు చూపుతో అమ్మ చేసినది. ఇలా పరిస్థితుల ప్రభావం వల్ల నా జీవితం ఇలా కొనసాగింది.
విద్యాభ్యాసంతో పాటు నాట్యాభ్యాసాన్ని ఎలా కొనసాగించారు ?
నేను నర్సరీ నుంచి 10 వ తరగతి దాకా, వరంగల్ ఫాతిమా స్కూల్ లోనే చదివాను. అక్కడ 12 ఏళ్ళ పాటు విద్యాభ్యాసంతో పాటుగా నాట్యాభ్యాసం కూడా స్కూల్ లోనే కొనసాగింది. వెంపటి నాగేశ్వరి గారని, ఆవిడే స్కూల్ లో నా తొలి గురువు. వారి వద్ద నేర్చుకున్నాను. ఇంటర్ నుంచి డా. కోరాడ నరసింహారావు గారి వద్ద నాట్యం
నేర్చుకున్నాను. నాకు పెళ్ళైన తర్వాత మావారు నన్ను కూచిపూడి గ్రామంలో ఉంచి, నాట్యంలో శిక్షణ ఇప్పించారు. అక్కడ రత్నయ్య శర్మ గారు, రాధేశ్యాం మాష్టర్  మొదలైన వారివద్ద నేర్చుకున్నాను.
ఇలా నా జీవితంలో నేను తెల్సుకున్న సత్యం ఏమిటంటే, ఏది మన చేతుల్లో ఉండదు. భగవంతుడి చిత్తానికి అనుగుణంగా జరుగుతుంది. అటువంటి పరిస్థితులను కూడా భగవంతుడే కల్పిస్తాడు.
నాట్యాన్ని ఒక వృత్తిగా మీరు ఎప్పటినుంచి స్వీకరించారు ?
87 లో నాకు పెళ్ళయ్యింది. పెళ్ళికి ముందు మా గురువుగారు నా కాబోయే శ్రీవారు మోహన్ గారి చేతులు పట్టుకుని, “బాబూ, రాధని నువ్వే పెళ్లి చేసుకుంటావని తెలిసింది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నాట్యంలో అమితమైన ప్రతిభ చూపిస్తుంది. చిన్నవాడివైనా, ఇవి చేతులు కాదు, కాళ్ళనుకుని బ్రతిమాలుతున్నాను. దయచేసి అమ్మాయి చేత
డాన్స్ మాన్పించద్దు “ అని రిక్వెస్ట్ చేసారు. మా వారూ ఒప్పుకున్నారు. సాధారణంగా మగవారు పెళ్ళికి ముందు ఒప్పుకున్నా తర్వాత అడ్డు చెప్తారు. కాని మా వారు అలా కాదు. ఆయన పెళ్లైయాకా నా దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. ముందు అసలు ఆయనకీ డాన్స్ అంటే తెలీదు. కళ దైవదత్తమైనది అంటారు కదా, ఆ అదృష్టం అందరికీ ఉండదు కదా, అని నాకు ఆసక్తి తగ్గినా ఆయన నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను కూచిపూడి గ్రామానికి పంపారు. నిష్ణాతులైన కళాకారుల వద్ద నాట్యంలో మెళకువలు తెల్సుకుంటే బాగుంటుందని, అక్కడ నన్ను హాస్టల్ లో చేర్పించారు. అలా 87 నుంచి నాట్యాన్నే వృత్తిగా స్వీకరించడం జరిగింది.
మీ నాట్యం వెనకాల మీఅమ్మగారి ప్రోత్సాహం చాలా ఉందని మీరు చెబుతుంటారు కదా !
ఒక్క మా అమ్మగారే కాదు, మా అత్తగారు, మా మరుదులు ఇలా నా కుటుంబ సభ్యులంతా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఎప్పుడైనా వంటింట్లోకి వంట చేసేందుకు వెళ్తే, “ఇది ఎవరైనా చెయ్యవచ్చు. కాని డాన్స్ అనేది అందరికీ రాదు, అది దేవుడిచ్చిన వరం లాంటిది. అందరికీ రాదు కూడాను, కనుక నువ్వు ప్రాక్టీసు చేసుకో అనేవారు. నిజానికి, మా అమ్మ చనిపోయే వరకూ నాకు నా వంటింట్లో ఏముంటాయో కూడా తెలీదు. మా చుట్టాలు ఎవరో కూడా తెలీదు. డాన్సే నా లోకంగా ఉండేది. అలా నేను సంతోషంగా ప్రాక్టీసు చేసుకోడానికి అమ్మ, అమ్మలాంటి అత్తగారు, కుటుంబ సభ్యులు అంతా తోడ్పడ్డారు. నాతోపాటు మావారు కూడా కష్టపడి ప్రాక్టీసు చేసేవాళ్ళం. ఒక పెర్ఫోర్మర్ గా ఉండాలంటే ఎంతో ప్రాక్టీసు అవసరం. తను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేసి అలసిపోయి ఒచ్చినా, నాతో ప్రాక్టీసు చేసేవారు. మేము
ఎక్కువ బయటకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఎప్పుడు ఖాళీ దొరికినా పూర్తి అంకితభావంతో డాన్స్ ప్రాక్టీసు చేసేవాళ్ళం, డాన్స్ మా ఊపిరి,  ప్రోగ్రాం ఇవ్వడం అంటే మాకు పండగ. అలా ఉండేది.
మీరు నాట్యకళలో ఎటువంటి వైవిధ్యాన్ని సృష్టించారు?
నేను చేసే ప్రతి బాలే నా సొంతమే. ఎవరి దగ్గరా తీసుకున్నవి కాదు. పెద్ద పెద్ద బృంద నాట్యాలకు సైతం నృత్య కల్పన పూర్తిగా నేనే చేస్తాను.  అవి దేశ విదేశాల్లో పేరు పొందాయి. నాకూ మంచి పేరును సంపాదించి పెట్టాయి. 50 కు పైగా దేశాల్లో రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఎంతో మంది పేద పిల్లలకు నా ఇంట్లో పెట్టుకుని స్టెప్స్ నుంచీ శిక్షణ ఇచ్చి, ప్రోగ్రాం లు ఇప్పించాను. వారిలో కొందరు నన్ను మర్చిపోయినా నాకు బాధ లేదు. నాకు భగవంతుడు ఇచ్చిన వారి బాధ్యతను నిర్వహించాననే తృప్తి ఉంది.
ప్రస్తుతం మీరు ఉండేది ఎక్కడ? 
నేను మావారి ఉద్యోగ రీత్యా బొంబాయిలో ఉంటాను. కాని, నెలకు ఒక వారం రోజులు నందిగామలో ఉన్న మా
అత్తగారి వద్దకు వెళ్లి ఉంటాను. ఆవిడా పెద్దావిడ, కూతుర్లు లేరు, నన్నే కూతురిలా చూసుకుంటారు కనుక, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్తాను. బొంబాయిలో ఉన్న మూడు వారాల్లో క్లాసులు తీసుకుంటాను.
మీలో సేవాభావన ఎలా కలిగింది?
'పేదలకు సాయం అందించాలి' అన్నదే నా తల్లి నాకిచ్చిన సందేశం. నేను హాస్టల్ లో చదివాను కదా. నాకు ఆడపిల్ల పుడితే నేను ఉన్న హాస్టల్ లోనే వేసి చదివించాలి అనుకున్నాను. అక్కడి వాతావరణం, భద్రత వేరు, అక్కడ నేను నేర్చుకున్న సంస్కారం వేరు. కాని, నాకు ఆడపిల్లలు లేరు. మనం ఏది చేసినా బ్రతికి ఉన్నప్పుడే చేతనైంది చెయ్యాలని నేను నమ్ముతాను. మనం సేవ చేసినప్పుడు చేసి మర్చిపోవాలి. ఆశించినప్పుడు, వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకి బాధ ఉంటుంది. అది భగవంతుడు మనకిచ్చిన డ్యూటిగా నేను భావిస్తాను. తల్లిదండ్రులు బిడ్డలకు సేవ చెయ్యడం అనేది వాళ్ళ బాధ్యత, ప్రేమతో చెయ్యాలి. చేసి మర్చిపోవాలి. వాళ్ళ నుంచి తిరిగి మనం సేవలు ఆశించి నప్పుడు 'నా కొడుకు నన్ను చూడలేదు, కోడలు చూడలేదు' వంటి అసంతృప్తి తలెత్తుతుంది. కాని, ఎవరైనా మన వద్దకు వచ్చి, చెయ్యి చాపి అడిగితే మాత్రం లేదనకుండా ఉన్నంతలో సాయం చెయ్యాలి.
భగవంతుడు నాకిచ్చిన ఈ కళతో, పేద పిల్లలకు భవితను ఇచ్చే విద్యాదానం, పేద వారికి చేతనైనంత సాయం చెయ్యాలని అనుకున్నాను. ఒకసారి మా అమ్మ ఒక ఎయిడ్స్ రోగిని ఆంధ్రా నుంచి తీసుకొచ్చి పెట్టింది. ఆమె మా ఇంట్లో ఆరేళ్ళు ఉంది. ఆ తర్వాత చివర్లో ఆమెను వరంగల్ లోని  హాస్పిటల్ లో పెట్టాము. ఆమె హాస్పిటల్ లో ఉండగా నేను ఆమెను చూసేందుకు వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఒక పేషెంట్ కి కావాల్సింది ప్రేమ. ఎయిడ్స్ రోగులకి తాము చనిపోతామని ఖచ్చితంగా తెల్సు. రోగం కంటే, చనిపోతామన్న భయమే వారిని ఎక్కువగా బాధిస్తుంది. నేను ప్రతి నెలా ఆమెను చూసేందుకు వరంగల్ వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు అక్కడున్న పేషెంట్లు అందరినీ పలకరించే దాన్ని. వారిని ఇంటినుంచి పంపేసారు కనుక వారు ప్రేమ కోసం తపిస్తూ ఉంటారు. ఆవిడకి ఏమి తీసుకుని వెళ్తానో, అక్కడున్న వారందరికీ అదే తీసుకుని వెళ్ళే దాన్ని. అది వారిలో 'నాకోసం కూడా ఎవరో ఉన్నారు, నన్ను గుర్తు పెట్టుకు తీసుకుని వచ్చారు' అన్న మనోధైర్యాన్ని నింపేది.
తల్లిదండ్రులు ఎయిడ్స్ తో చనిపోతే అనాధలైన పిల్లల్ని నేను కరీంనగర్, నిజామాబాద్ లోని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నాను. కొందరు పిల్లలకి తల్లో, తండ్రో ఉన్నారు. కొందరికి ఇద్దరూ లేరు. అటువంటి పిల్లల బాధ్యతను భగవంతుడు నాకిచ్చిన బాధ్యతగా భావించి నేను తీసుకున్నాను. కొందరికి పెళ్ళిళ్ళు చేసాను, కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
ఈ మధ్య మూడేళ్ళ క్రితం నా పుట్టినరోజుకి భద్రాచలం వెళ్లాను. ఆ సందర్భంగా పేద వారికి ఏమైనా ఇస్తాను అన్నాను. ఇక్కడకు దగ్గరలోని మావిళ్ళ వావిలో అడవిజాతి వారు ఉన్నారు. పదండి, అని వారు తీసుకు వెళ్ళారు. వెళ్లి చూస్తే, వారికి కట్టుకోడానికి ఒంటి మీద బట్టలు కూడా లేవు - కారణం పేదరికం. అలాగే నాగరికత తెలియకపోవడంతో వారు కాలువల్లో పారే నీళ్ళు తాగేవారు. వాళ్లకి ఒంటి మీద పెద్ద పెద్ద వ్రణాలు, కారణం - పారిశ్రామిక కాలుష్యాలు కలిసిన నీటిని వారు త్రాగుతున్నారు. దీనికి బోరింగు పంపు వేయించి చేతనైన సాయం నేను చేసాను. అక్కడ నక్సలైటు ఏరియా కావడంతో ఎవరూ వెళ్లరట. కాని, నక్సలైట్లు అయినా మనుషులే,
పేదవారేనని నేను వెళ్లాను. ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు.  అయితే, అప్పుడు వారు 'మేడం, మీరు ఇక్కడ ఒక స్కూల్ కట్టించండి,' అని వారు నన్ను అడిగారు. ఇప్పుడు కడుతున్నాము. జనవరి 15 న దాన్ని ప్రారంభిస్తున్నాము. నేను వెళ్ళినప్పుడల్లా బట్టలు, మందులు నా డిక్కీ నిండా నింపుకుని, ప్రతి నెలా ఆంధ్రా వెళ్లి అందిస్తాను. మా పిల్లలకు ఒక్కటే చెప్తాను - మీకు ఏది ఒద్దనుకుంటారో అది నాకు తెచ్చి ఇవ్వండి, అని. వారూ అలాగే పాత బట్టలు, వస్తువులు, దుప్పట్లు ఇస్తారు. అవి వారికి అందిస్తాను.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
భగవంతుడి చిత్తం జరుగుతుంది. అంతేగాని మన ప్రణాళికలు ఏవీ పని చెయ్యవు. మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. నన్ను తిరుపతి రమ్మని మా తమ్ముడు తరచుగా అడిగేవాడు. రాను, పోనూ చార్జీలు, ఖర్చులు దండగని, ఆ డబ్బుతో ఎవరైనా పేదవారికి సాయం చెయ్యవచ్చని భావించి, నేను వెళ్ళలేదు. ఒకసారి 'దేవుడికి నన్ను చూడాలని ఉంటే ఆయనే నన్ను పిలిపించుకుంటారు' అన్నాను. కొన్నేళ్ళు వెళ్ళలేదు. నెల్లూరుకు చెందిన 'నదియా' అనే పేద ముస్లిం అమ్మాయిని నేను నా ఇంట్లో పెట్టుకుని, డాన్స్ నేర్పి, ప్రోగ్రాం లు ఇప్పించి, విదేశాలు కూడా తీసుకుని వెళ్లి ప్రదర్శనలు ఇప్పించినందుకు నెల్లూరు వారికి నా మీద అభిమానం. వాళ్ళు నన్ను సన్మానానికి నెల్లూరు పిల్చి, అనుకోకుండా తిరుపతి తీసుకుని వెళ్ళారు. అప్పుడు నాతో బొంబాయి నుంచి 64 మంది విద్యార్ధులు బాలేలు చేసేందుకు వచ్చారు. మమ్మల్ని తిరుపతి తీసుకుని వెళ్లి, దేవుడి ముందు గర్భగుడిలో 10 నిముషాలు నిల్చో పెట్టారు. నేను 'ఎంతసేపు , నేను వెళ్పోతాను,' అంటే... పూజారి గారు, 'ఉండమ్మా, నువ్వు దేవుడిని చూడద్దులే, దేవుడికే నిన్ను చూడాలని ఉంది,' అన్నారు. అప్పుడు నేను గతంలో అన్న మాట నాకు గుర్తొచ్చింది.
ఇవాళ దేవుడు నాకిచ్చింది నాది, అంతే. నాకు స్వార్ధం కూడా లేదు. దేనికీ దుఃఖ పడను, ఆనంద పడను. రేపటి గురించి ఆలోచించడం కూడా నాకు రాదు. ఏ రోజు ఎవరు కలిస్తే వారే నా కుటుంబం అనుకుంటాను. రేపు ఆయనకు నాతో ఏం చేయించుకోవాలని ఉంటే అదే చేయించుకుంటారు. ఇక నాకు ఎటువంటి ఆశలు కాని, కోరికలు గాని లేవు. కాబట్టి నా భవిష్యత్తు ప్రణాళికలు... దైవ నిర్ణయమే !
రాధామోహన్ గారి టి .టి.డి. వాళ్ళ ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయ్యింది. సుమారు 147 దేశాల్లో చూసారు. ఆ ఇంటర్వ్యూ ను క్రింది లింక్ లో చూడవచ్చు.

No comments:

Post a Comment

Pages