Thursday, November 24, 2016

thumbnail

బాల గేయాలు – 03

బాల గేయాలు – 03

వానా... వానా... వల్లప్ప!

-టేకుమళ్ళ వెంకటప్పయ్య నా చిన్నతనములో వాన వస్తే ఇక పండుగే. అది కూడ ఉదయాన్నే తొమ్మిది లోపు కురిస్తే ఇంకా సంతోషం రోజుకి బడి  లేనట్టే! వానలో తడిస్తే జలుబు చేస్తుందనే అమ్మ నాన్నల ఆరాటం చెప్పనలవి కాదు. మేము మాత్రం "వానా వానా వల్లప్పా! అంటూ వానలో తడుస్తూ పాటలు పాడుకుంటూ గుండ్రంగా తిరగడం... పిచికమ్మలూ..చిలకలూ మన ఇంటి వసారాలో కూర్చుని సేద తీరడాలూ...   ఇంకా పడవల సరదా. అవసరమోకాదో చూడకుండానే పుస్తకాలు చింపేసి పడవలు చేసి నీట్లో వదలడం, ఎవరి పడవ దూరం వెళుతుందో పోటీలుపెట్టుకోవటం, పడవల్లో చాలా రకాలు చేసే వాళ్ళం. సాదా పడవ, కత్తి పడవ, మరపడవ, గొడుగు పడవ ఇలా ఎన్నో. పడవల్లో చీమల్ని, జీరంగులను ఉంచి వాటిని నీటిలో వదలడం. అవి కొట్టుకునిపోతుంటే నవ్వడంవడగళ్ళ వాన పడిందంటే గొప్ప సందడి. వడగళ్ళు పడగానే వెంటనే వానలో తడుస్తూ వెళ్ళి వాటిని ఏరుకొచ్చి ఒక గిన్నెలో పోసేవాళ్ళం. ఎవరు ఎక్కువ ఏరితే వాళ్ళు గొప్ప. ఇలా ఎన్నో ఎన్నెన్నో సరదాలు వానంటే...అవన్నీ  జ్ఞాపకాల తెరలుగా కదిలితే మనసులో అదో తెలీని బాధ, వింత అనుభూతి. అనుభూతులను నాటి బాలబాలికలు పంచుకోలేకపోతున్నారు.
పాట చూడండి.
వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?

వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి.
ఈ మాదిరి కొన్ని ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది.
" వానా వానా వల్లప్ప
చేతులు చాచు చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగలేను నరసప్ప."
(వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది. (వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి, నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమును పూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే, కూడు కొంటుందంటాడు వల్లప్ప.)
 నాడు పిల్లలు "వానా వానా వల్లప్పా!" అని స్వాగత గీతాలు పలికితే నేటి ఆంగ్లేయ చదువులు మన పిల్లలచే "రెయిన్ రెయిన్ గో అవే" అని వర్షానికి భరతవాక్యం పలికే "రెయింస్" పలికిస్తున్నారు. మన దేశంలో ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారం కావడం వల్లనే ఏటా తప్పనిసరిగా వర్షాలు బాగా కురిస్తే గాని ఆహారోత్పత్తి సంతృప్తికరంగా పండించలేని  స్థితి నెలకొని ఉండగా ఇలాంటి ఆంగ్ల పాటలు మన స్థితిగతులకు సరిపడేవి కావు. ఈ పాటలను పెద్దలు పిల్లలకు 3-4 యేళ్ళ వయసులో నేర్పాలి. సరదాగా ఉండి భాషా జ్ఞానమూ పెంపొందుతుంది.
పిల్లల బాల్యాన్ని బలితీసుకోవడం, ఆటపాటలు లేకుండా కట్టిపడేయడం తగదు. వారిని సహజంగా ఎదగనివ్వండి. ప్రకృతిని పరిశీలించనివ్వండి. పరవశించనివ్వండి. వారు పెద్దయ్యాక బాల్యపు స్మృతులు కొన్నైనా నెమరేసుకోడానికి మిగల్చండి.
 -0o0-

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information