గోత్రములు -ఋషులు - 2 - అచ్చంగా తెలుగు
గోత్రములు -ఋషులు - 2
మంత్రాల పూర్ణచంద్రరావు


గత నెల అగస్త్య మహర్షి గురించి కొన్ని విశేషాల్ని చెప్పుకున్నాం కదా. మరిన్ని సంగతులు చెప్పుకుందాము.
పితృ దేవతల యొక్క  ఆదేశానుసారము వివాహము  చేసుకొన దలచి అందులకు తగిన యువతి విదర్భ రాజ  తనయ లోపాముద్ర  గా  భావించి ,ఆ రాజు దగ్గరకు  వెళ్లి, వచ్చిన కార్యమును వెల్లడించెను. అందులకు రాజు బాధ పడుచుండగా కుమార్తె  లోపాముద్ర తను అగస్త్యుల ముని గారినే  పెండ్లి  చేసుకుంటానని  తెలిపెను. రాజు అందులకు సంతసిల్లి లోపాముద్ర, అగస్త్యుల వివాహము  అతి  వైభవముగా జరిపెను.తరువాత అగస్త్యుల వారు లోపాముద్రను తోడ్కొని గంగా ద్వారమున ఒక ఆశ్రమము  నిర్మించుకుని, గృహస్థు ధర్మము నిర్వర్తించుచూ తపోవృత్తి చేయుచుండెను.
కొంత కాలానికి పితృదేవతల కోర్కె తీర్చదలచి తన భార్య అయిన లోపాముద్రకోరిక మేరకు ఆమెకు ఆభరణములు, సున్నితమయిన వస్త్రముల కొరకు ధనము కావలసి శృతర్వుడు  అను రాజుని తనవద్ద తనకు సరిపోవుదానికంటే  ఎక్కువ ధనము  ఉంటె ఇవ్వమనగా ఆ రాజు ఎక్కువలేదని చెప్పెను. ఇద్దరూ కలసి బ్రద్నుశ్వుని అడిగెను , ఆయన కూడా లేదని చెప్పగా ముగ్గురూ  కలసి ఇల్వలుడు అను ఒక రాజు వద్దకు వెళ్ళెను , ఇల్వలుని తమ్ముడు వాతాపి. అతను  కామ రూపి అన్నదమ్ములు ఇరువురు కలసి రాజువద్దకు వచ్చిన విప్రులను మాయోపాయముతో చంపుచుండిరి .అగస్త్యుడు మిగిలిన రాజులతో అక్కడకు రాగా వారికి అతిధి సత్కార్యములు చేసి తన తమ్ముడు వాతాపిని మేకను చేసి  చంపి ఆ మాంసమును అగస్త్యులవారికి పెట్టెను.అగస్త్యుడు విషయము గ్రహించిన వాడై సుష్టుగా భోజనము గావించెను. అంత  ఇల్వలుడు సోదరా  వాతాపి రమ్మని  పిలిచెను. అంత అగస్త్యుడు " జీర్ణం  జీర్ణం వాతాపి జీర్ణం" అని పొట్ట మొత్తం నిమురుకోనగా వాతాపి జీర్నమయి పోయెను .ఇల్వలుడు అర్ధం చేసుకుని మారుమాటాడక వచ్చిన పని అడిగి ఆయనకు కావలసిన ధనమునిచ్చి  పంపెను ఆ ధనముతో అగస్త్యుడు లోపాముద్రకు కావలసినవి అన్నియూ సమకూర్చి లోపాముద్రను బదురులబోలు  సుతులు నూర్వురు కావలెనా , నూర్వురు బోలు సుతులు పది మంది కావలెనా లేక వేవురకు సరిపడునొక్కడు కావలెనా కోరుకోమ్మనెను . అంతనామే వేవురు బోలు ఒక్కరు చాలునని  తెల్పెను.
కాలక్రమమున లోపాముద్ర దృఢన్యుడు అను కుమారునికి జన్మనిచ్చెను. దృఢన్యుడు పెరిగిపెద్దవాడయిన పిదప ఆతనికి తేజస్వి అను కుమారుడు కలిగెను. ఈ విధముగా  అగస్త్యుడు పితృదేవతల కోర్కెను తీర్చెను.
తదుపరి ఒక దినమున బ్రహ్మ దేవుడు అగస్త్యుని ఆశ్రమమునకు రాగా ఆతనికి అర్ఘ్యపాద్యాదులు ఒసంగి చతురాననా మహాతప ప్రభావమున గాని కానట్టి మీ దర్సన భాగ్యము నాకు లభించుటకు కారణము తెల్పుమని అడిగెను అంత ఆ బ్రహ్మదేవుడు నా కుమారి అగు విష్ణుమాయ కవేరరాజ తనయగా జన్మించి, తండ్రికి ముక్తినోసగుటకై ఉగ్ర తపస్సు చేయుచున్నది , ఆమెను నీవు పరిణయమాడవలెను అని కోరెను.ఆమె ఒక అంశ నే లోపాముద్రగా జనియించగా నీవు పరిణయ మాడితివి, ఈమెను కూడా నీవే వివాహమాడ వలయును, ఇది  మీ ఇరువురకు శ్రేయస్కరము అని చెప్పెను అందులకు అగస్త్యుడు ఓ చతుర్ముఖా నీ ఆనతి మీరగలనా సరే అని కవేర కన్యను వెదుకుటకు బయలుదేరెను.
.దివ్యసుందరమయిన కవేరకన్య అగస్త్యుడు దగ్గరకు రాగానే పాదాభివందనము చేసి మహాత్మా త్రిలోకపూజ్య మీ దర్సనభాగ్యముచే నేను పునీతమయ్యాను నన్ను కటాక్షించి నా ఆతిధ్యము స్వీకరిపుము అనెను ,ఓ తరుణీ నేను నిన్ను వలచి వచ్చినాను కావున నన్ను పరిణయ మాడుము అని చెప్పెను , ఓ తేజోనిధీ నాకు అంతటి భాగ్యమా , అయిననూ మీరు నా సోదరి  లోపాముద్రను వివాహమాడి ఉన్నారు కదా, ఇక నాకు తావెక్కడ ఉన్నది, అయిననూ కొంతకాలములో నేను నదిగా మారిపోతాను కదా అనెను అందులకు  అగస్త్యుడు నా అంశ వల్ల ఉద్భవించినదే లోపాముద్ర , నీవు నదివి అయినా నాకు అభ్యంతరము లేదు అని చెప్పెను. కవేరి  కన్య సరే అని వివాహమాడి వెంటనే నదిగా మారిపోయేను . అగస్త్యుడు ఆ నదిని తన కమండలమున ధరించెను. తరువాత వింధ్య పర్వత గర్వమణచుటకు అగస్త్యుడు వెళ్ళగా ఇదే మంచి  సమయమని కవేరి కమండలమునుండి బయటకు వచ్చి నదిగా నేల మీద పారుచుండెను. అందు స్నానమాచరించి ఆమె తండ్రి కవేర మహర్షి సద్యోముక్తుడు అయ్యెను.
Image result for sage agastya photos
తరువాత కాలకేయాదులు అను రాక్షసులు పగలంతయు సముద్రమున దాగుకొని రాత్రులందు ధర్మచరితులయిన ఋషులను చంపుచుండెను, వారిని ఎలా వధించాలో తెలియక ఇంద్ర కుబేర వరుణాదులు విష్ణుమూర్తిని ప్రార్ధించెను, అప్పుడు విష్ణుమూర్తి అగస్త్యుని శరణు వేడుమని చెప్పగా వారందరూ అగస్త్యుని వేడుకొనిరి. అంతట అగస్త్యుడు వారందరినీ వెంట తీసుకుని వచ్చి ఒక్కసారిగా  సముద్ర జలమును ఔపోసన పట్టెను, అప్పుడు కాలకేయగణములు బయట పడగానే దేవతలు వారినందరినీ సంహరించెను. వారందరూ అగస్త్యుని అనేకవిధముల కొనియాడి అయ్యా ఇందు అనేక జలప్రాణులు బ్రతుకుచున్నవి కావున యధాప్రకారము సముద్రుని వదులుమని కోరెను. అందులకు అగస్త్యుడు జలము అంతయు జీర్ణమయిపోయినది, ఇప్పుడు కావలెనంటే మూత్రద్వారమున మాత్రమె వదలెదను అని చెప్పి అలాగే  చేసెను,, అందువలననే మనకి  సముద్రము  ఉప్పగా ఉండును.  అందు వలననే పర్వదినముల యందు తప్ప మిగిలిన దినములందు సముద్రము  స్నానమునకు అనర్హమయ్యను.
తదుపరి ఒకప్పుడు వింధ్య పర్వతము, మేరుపర్వతము పైన, సూర్యుని  మీద కోపగించి విపరీతముగా పెరిగి  సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తిరుగకుండా చేసెను. భూమి మీద రాత్రిపగలు లేక ఇబ్బంది పడుచు బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకొనిరి. బ్రహ్మ ఆ పని తనవల్ల కాదని, దీనికి  అగస్త్యుడే తగినవాడు , ఆయనవద్ద కు వెళ్ళమని చెప్పెను. అంత దేవతలందరూ బయలుదేరి కాశి పట్టణమున ఉన్న అగస్త్యుని పరి పరి విధములుగా వేడుకొనెను. తాము వచ్చిన కార్యము వివరించిరి.అందులకు అగస్త్యుడు ఒప్పుకొని కాశి విడుచుటకు నిర్ణయించు కొనెను.
అగస్త్యమహర్షిని దూరమునుండి చూచిన వింధ్య పర్వతము వెనకటివలె వొంగిపోయెను. వెంటనే లోకములన్నియు యధావిధిగా నడవ సాగెను, అప్పుడు పురుషాకృతి దాల్చి వింధ్యపర్వతము అగస్త్యునకు సాష్టాంగనమస్కారం చేసేను  అప్పుడు అగస్త్యుడు పర్వతరాజా మేము ఇరువురము దక్షిణ యాత్రకు పోవుచుంటిమి, మేము పెద్దవారము అయినాము నీ శిరస్సు శరీరము ఎక్కి దిగే ఓపికలేదు , కాబట్టి మేము తిరిగి వచ్చు వరకు నీవు భూమికి సమాంతరముగా పరుండుము, అని ఆజ్ఞాపించెను. ఈ విధముగా భూమి యొక్క ఉపద్రవమునాపి అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు గావించెను .
మానస  తీర్ధములే మోక్ష హేతువులు,బాహ్య తీర్ధములకంటే ఇవి మేలు.అవి ఏవి అనగా సత్యము, ఇంద్రియనిగ్రహము, దానము, దయ, సంతోషము,ధైర్యము, సమత్వము, విజ్ఞానము, ఇవన్నియు మానస తీర్ధములు.ఇవి ఆచరించని వారికి బాహ్యతీర్ధములాడుట వలన  ఇసుమంతయు ప్రయోజనము లేదు.ఏల అనగా నిత్యమూ ఆ పుణ్య నీటియందే ఉండు జలచరములకు మోక్షము కలుగదు కదా,అట్లే మానసిక తీర్ధము అలవరచుకొన్నగాని బాహ్యతీర్ధ ప్రయోజనములు దక్కవు. అని పత్ని అయిన లోపాముద్రకు ఉపదేశించెను.
అగస్త్యుడు లోకోత్తరపుషుడై జీవితాంతము జగద్ధితమునకు పాటుపడెను మహాభారతమందలి   శాంతి పర్వమున వెలయు ఈతని  ప్రసిద్ధ విద్యా బోధనయే అగస్త్య గీతానామము చిరస్థాయిగా నిలచినది.
అగస్త్యమహర్షి జగజ్జేయమానుడై నేటికిని భాద్రపదమాసమున భూలోకమునకు నక్షత్ర రూపమున దర్శనము ఈయు చుండును
అగస్త్య నక్షత్రము ఉదయించగానే విప్రులు సుస్నాతులై కాసపుష్పముతో అగస్త్యుని ప్రతిమ చేసి ధూప దీపాదులతో అర్చన చేసి అర్ఘ్యప్రదానము చేసి పూజావిధానము నెరవేర్చి రాత్రి జాగరణ చేయవలెను. అట్టివారికి ఇష్ట కార్య సిద్ధి మోక్షములను అతను ఒనరించును.
అగస్త్యాయ నమస్తేస్తు అగస్త్యేస్మిన్ ఘటేస్తితః 
అగస్త్యో  ద్విజరూపేణ ప్రతిగ్రుహ్ణాతు సత్కృతః 
అగస్త్యస్సప్తజన్మాఘం  నాసాయిత్వా వయోరయం 
అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్చుతు మహామునిః 
అని ప్రార్ధించ వలెను.
తనపేరు మీదనే " అగస్త్య " గోత్రము ఉన్నది
 ( వచ్చే నెల ఇంకో ఋషి ని గురించి చెప్పుకుందాము  )

No comments:

Post a Comment

Pages