జీవితాన్నిచ్చిన అబద్ధం - అచ్చంగా తెలుగు

జీవితాన్నిచ్చిన అబద్ధం

Share This

జీవితాన్నిచ్చిన అబద్ధం

దొండపాటి కృష్ణ 

        
“హాయ్ రా..! ప్రయాణం బాగా జరిగిందా? నీ కోసమే చాలా సేపట్నుంచి ఎదురు చూస్తున్నా. బస్సు కొంచం ఆలస్యమైనట్లుంది” పలకరించాడు రమణ. “అవును” అన్నాడు రంజిత్. “సరే పదా. రూమ్ కెళ్దాం” అని రంజిత్ లగేజి కొంత చేతుల్లోకి తీసుకున్నాడు రమణ. రూమ్ చేరుకున్నారు. మొత్తం చూపించాడు. “నాకు ఆఫీస్ కు టైం అవుతుంది. బయలుదేరుతున్నాను. నీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమైనా అవసరమైతే ఒకసారి ఫోన్ చెయ్. సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా?” అని చెప్పి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు రమణ.
          అదో చిన్న రూమ్. ఇద్దరుండడానికి రెండువేల రూపాయులు అద్దె. ఇద్దరికి మాత్రమే సరిపోయేంత చోటు. ఆ పరిసరాలను చూసిన రంజిత్ కు ఒక్కసారిగా తన ఇల్లే గుర్తుకొచ్చింది. ఎంతమంచి ప్రదేశమది. ఎంత పెద్ద ఇల్లో, పదిమంది కలియతిరిగినా సరిపోయేంత ఇల్లు. ఎప్పుడూ బంధువులతో కళకళలాడుతుండే ఇల్లది. తనకంటూ ప్రత్యేకంగా ఉన్న రూమ్. ఇంచుమించు ఈ రూమ్ కూడా అంతే ఉంది. కాకపొతే అందులో ఒక్కడే ఉండేవాడు, ఏకాంతంగా గడిపేవాడు కాని ఇక్కడ ఇంకొకరితో ఉండాలి. అన్నీ బహిర్గతమే! ప్రతీది పోల్చుకుంటూ బాధగా రూంలోనే ఉండిపోయాడు ఎటూ వెళ్ళకుండా.
          ఆఫీస్ నుండి కొంచెం త్వరగానే రూమ్ కు చేరుకున్నాడు రమణ. రంజిత్ ను చూసేసరికి కొంచెం అనుమానం మొదలైంది. అకస్మాత్తుగా నిన్న రాత్రే ఇక్కడికి వస్తున్నానని చెప్పినప్పుడే అనుమాన పడ్డాడు కాని అప్పుడు బయట పడలేదు. ఇప్పుడు వదిలిపెట్టలేదు. “ఏమైంది రా” అడిగాడు చొక్కా విప్పి హెంగర్ కు తగిలిస్తూ. “అబ్బే, ఏమీ లేదే? ఎందుకులా అడిగావ్?” అన్నాడు రంజిత్. “నువ్వెందుకు అలా ఉన్నావ్?” వదలలేదు రమణ. “బాగానే ఉన్నానే. ప్రయాణం వలన అలసిపోయాను కదా అందుకే అలా కనిపించి ఉంటాను” వదిలించుకునే ప్రయత్నం చేశాడు రంజిత్. “సరే! ఏమన్నా తిన్నావా? రా... తిందాం” ఆహ్వానించాడు. “ఆకలిగా లేదు, నువ్వు కానిచ్చేయ్” సున్నితంగా తిరస్కరించాడు. “అయితే పదా కాసేపు బయటకెళ్దాం” అని బయటకు తీసుకెళ్ళాడు రమణ.
          “ఇప్పుడు చెప్పరా! ఏం జరిగింది? ఎప్పుడు రమ్మన్నా దాటవేసేవాడివి అలాంటిది ఇప్పుడేమో లగేజి తీసుకుని వచ్చేశావు” అడిగాడు రమణ. “ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా ఉంటాం రా! ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలిగా” చెప్పాడు రంజిత్. “ఈ ఆలోచన నీకు వచ్చిందేనా లేకా ...” అనుమానంగా అడిగాడు. “ఎందుకంత అనుమానం. నాకే వచ్చింది” చెప్పాడు. “లేదు, ఎప్పుడు రమ్మన్నా జాబ్ కోసం ఎప్పుడూ రాని నువ్వు, ‘తక్కువ జీతానికే నేను పనిచేస్తున్నానని హేళన చేసిన నువ్వు ఈ రోజిలా జీవితంపై మమకారంతో రావడం ఆశ్చర్యంగా ఉంది. అందుకే అడిగా. నువ్వు తీసుకున్న నిర్ణయమేగా ఇది?” మళ్ళీ అడిగాడు. “పరిస్థితులేం బాగోడం లేదురా. చదువుకు తగ్గది కాకపోయినా ముద్ద పెట్టేది చూసుకుందామని వచ్చా” చెప్పాడు.
          “ఇవన్నీ బాగానే కవర్ చేశావ్ కాని నీ మొహాన్ని ఎలా కవర్ చేస్తావ్?” అడిగాడు రమణ. “దేని గురించి మాట్లాడుతున్నావ్? మొహానికేం అయ్యింది, బానే ఉంది కదా” అన్నాడు రంజిత్. “ఏమైందా..! చాలా డల్ గా ఉంది. ఏదో జరిగి ఉంటుందని అర్ధమైపోతుంది. ఏంటో అది చెప్పు” అన్నాడు. “డల్ గానా.... నో... నో... అలా ఏం లేదు. ఏం లేదు” కంగారుపడిపోయాడు. “సర్లే! వదిలేయ్. ఎందుకలా ఒక్కో మాటను రెండుసార్లు పలుకుతావ్, కంగారు పడతావ్. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు” ముక్తాయించ్చాడు. రంజిత్ మౌనం వహించాడు. మరీ చీకటి పడడంతో పార్క్ నుండి లేచి రూమ్ కు చేరుకున్నారు. వెళ్ళిన దగ్గర్నుంచి రమణ ప్రశ్నించిన విషయమే కలిచివేస్తుంది. రెండు రోజులు క్రితం ఇంట్లో జరిగిన సంఘటనే గుర్తుకొచ్చి ఇంకా బాధించింది. రంజిత్ బాధపడుతుంటే రమణ ఓదార్చడం మొదలెట్టాడు. తన స్పర్శకు రంజిత్ కరిగిపోయి జరిగినదంతా చెప్పడం ప్రారంభించాడు.
******
          ఒక రోజు రాత్రి రాజుగాణ్ణి కలిసి ఇంటికి వెళ్లాను. పడకకుర్చీలో నాన్నగారు దీనంగా కూర్చొని ఉన్నారు. పరిస్థింటే తెలీదు. నేనోచ్చినట్లు కూడా పసిగట్టలేదు. అడుగుదామంటే ‘భాద్యతల్లేని వాడివి నీకెందుకులే, మా తిప్పలేవో మేం పడతాంలె’ అని ఎప్పటి మాదిరిగా అంటారేమో అనుకుని నేను నా గదిలోకి వెళ్తుంటే అమ్మ నా వంక చూసి ఆగమని సైగ చేసింది. ఎప్పుడూ నన్ను ఆపని అమ్మ ఆరోజలా చేసేసరికి అనుమానమొచ్చింది. ఆశలు త్వరగా నెరవేరవుగాని అనుమానాలు మాత్రం తొందరగా నిజమవుతాయి. సమస్య నా గురించే – నా జీవితం గురించే. గడిపిన దాని గురించి కాదు – గడపబోయే దాని గురించి. నాన్నగారిని పలకరించాను. తేరుకుని “ఎక్కడనుంచి వస్తున్నావురా?” అని అడిగారు. “రాజు గాడిని కలిసి వస్తున్నా నాన్నగారు” అన్నాను. “రాజునే కలిసి వస్తున్నావా లేక నీ ప్రియురాల్ని కలిసి వస్తున్నావా?” అన్నారు. నాకు షాక్. నా ప్రియురాలేంటి! “రాజునే నాన్నగారు” అన్నాన్నేను. “మరి రంజిత నాకు ఫోన్ చేసిందేంటి?” అడిగారు. “రంజితనా! ఎవరా అమ్మాయి?” తెలీక అడిగాను. “నిజంగానే తెలీదా లేక తెలిసే తెలీనట్లు, నాకు తెలియదని నాటకాలాడుతున్నావా?” గంభీరంగా ప్రశ్నించారు. “తెలీదు కాబట్టి తెలియదు అంటున్నాను” అన్నాను.
          “ఆకతాయిగా తిరుగుతున్నావనుకున్నా కాని ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావని అనుకోలేదు. నా కొడుకు తిరుగుతాడు కాని తప్పు చేయడనే నమ్మకంతో ఇన్నాళ్ళు ఎవరెన్ని చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే నా పెంపకాన్ని నలుగురూ ప్రశ్నిస్తారు” అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. “అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్నగారు. రంజిత ఎవరు? ఆమెకి నాకు ఏంటి సంబంధం?” అని అడిగేశాను. “అవును నీకు అర్ధం కాదు. సమస్య నీ దాకా వచ్చేసరికి నీకర్ధం కాదు. దాన్నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే తెలుసు నీకు” కోప్పడుతున్నారు. సమస్య ఉన్నచోట పరష్కారం కూడా ఉంటుంది కదా! అసలు సమస్య ఏంటో ఆయన చెప్పందే నాకేం తెలుస్తుంది చెప్పు. అందుకే అమ్మను అడిగాను. “కొద్దిసేపటి క్రితం ఎవరో ఫోన్ చేశారు. అది మాట్లాడిన దగ్గర్నుంచి నాన్నిలా అయిపోయారు. అదేంటో నాకూ తెలియదు. ఇప్పుడు నిన్ను అడుగుతుంటే అర్ధమవుతుంది. ఎవర్రా అమ్మాయి?” అంది అమ్మ. “అబ్బా... మళ్ళీ అదే మాట. ఎవరో నాకెలా తెల్సు” అన్నాను.
          “ఎవరా? నీకు తెలియదా? నేను చెప్తాను విను. నీ ప్రియురాలంట రంజిత. ఫోన్ చేసింది. నువ్వు చేసిన నిర్వాకమంతా చెప్పింది” అన్నారు నాన్న. నాలో నాకు కొత్తగా ఉంది. ట్రై చేసినా ఎవరూ పడని మనకి తెలీకుండా లవర్ ఎక్కడనుంచి వచ్చిందబ్బా అనిపించింది. అసలేం చెప్పిందో తెలుసుకుందామని “ఏం చెప్పింది నాన్నగారు?” అని అడిగాను. నాన్న దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒక్కసారిగా నాపై విరుచుకుపడ్డారు. “ఆ అమ్మాయిని ప్రేమించావని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావని, ఇంకేవో చాలా చెప్పింది. ఒక తండ్రిగా నా నోటితో నేను చెప్పలేను.  దరిద్రానికి తలుపులు తెరుస్తావని అస్సలు ఊహించలేదు” మాట్లాడుతున్నారు. అది విన్న నేను “ఇదంతా ట్రాష్! ఎవరో కావాలని చేసింది. లేక మీరే ఎదో కావాలని చేస్తున్నది” అన్నా ఏదో నిగ్రహించుకోలేని ఆవేశంలో. ఆ మాటలకు ఆయనకు కోపం నషాళానికి ఎక్కింది. మొహమంతా ఎర్రబారిపోయింది. ఎప్పుడో పంచాయితీ గొడవల్లో నాన్నగారినలా చూసిన నేను నా విషయంలోనే చూసే సరికి భయం వేసింది. చాలా తప్పుగా మాట్లాడానేమో అనిపించింది. సరిదిద్దుకుందామనే సమయానికి అది నా చేతుల్లోంచి ఆయన కబంద హస్తాల్లోకి వెళ్ళిపోయింది.
          “అవునురా! నేను కావాలని కల్పిస్తున్న పురాణామిది. ఇంట్లోంచి నిన్ను పంపించేయాలని నేను ఆడుతున్న నాటకమిది” అన్నారు ఒక్కసారిగా. “నాన్నాగారూ...“ అంటూ మాట్లాడబోతున్న నన్ను ఆపేసి “నా జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను, క్లిష్ట పరిస్థితులను పరిష్కరించగలిగాను. నీ విషయంలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాను. ఇక లాభం లేదు. నువ్వు తక్షణమే ఇల్లు ఖాళీ చెయ్” అన్నారు. “ఒక్కసారి నా మాట వినండి నాన్నగారు” అన్న నా మాటలను పట్టించుకోకుండా “నేనెన్ని చెప్పినా వినలేదు. కాని ఇది మాత్రం ఖచ్చితంగా విని తీరాల్సిందే! ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావోనని భయంగా ఉంది. నువ్వెల్లిపో. నువ్వేంటో నిరూపించి జనం కళ్ళు తెరిపించు. అప్పుడు నా కొడుకుగా స్వీకరిస్తాను. ఎప్పుడూ మాటలు చెప్పడం కాదురా, కనీసం ఎప్పుడైనా వాటి మీద నిలబడడానికి ప్రయత్నించు. నీ గురించి ఆఫీస్ లో అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నీకిక్కడ గడిపిన జీవితం చాలు. జీవితం ఎక్కడుందో అక్కడ జీవించాలి. జీవితం లేని చోట జీవిస్తే జీవితమే ఉండదు. వెళ్లి నీ జీవితాన్ని సరిదిద్దుకొని రా! నీ మరో ప్రపంచాన్ని నాకు పరిచయం చేశాక కనిపించు” అని చెప్పి తన గదిలోకి వెళ్తూ, ఆగి “నా నిర్ణయానికి తిరిగులేదు. ఎదురుచేప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అని ప్రశ్నించి సీరియస్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఆయన నిర్ణయాన్ని ఎవరు ఎదురిస్తారు చెప్పు!
          ఆడవాళ్ళు ఎక్కిళ్ళు పెట్టి నలుగురికీ వినిపించేలా ఏడిస్తే మగవాళ్ళు మౌన శోకంలా ఎక్కి ఎక్కి ఏడుస్తారు. నాలో బాధ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. “ఇదేంటమ్మా! నాన్నగారు అలా మాట్లాడుతున్నారు?” అని అమ్మనడిగితే “ఈ విషయంలో నేనేమి చేయలేను బాబు. ఎన్నో విషయాల్లో వెనకేసుకోచ్చాను, ఇప్పుడు కూడా వెనకేసుకొస్తే నా సంస్కారాన్ని నేనే పాడు చేసుకున్నట్లు అవుతుంది నాయన. నాన్నగారు చెప్పినట్లు చెయ్ బాబు” అంటూ బాధపడుతూ ఆయన్నే అనుసరించింది. రంజితనే అమ్మాయిని ఏదో చేశాననే అమ్మ కూడా నమ్మింది. అదింకా బాధించింది. “ఇప్పుడు మీరు చెప్పిన ఆబద్దమే నిజమనుకుందాం! ఉద్యోగం సంపాదిస్తే అంతా చెరిగిపోతుందా?” అని గట్టిగా అరిచాను.
          “నువ్వన్నది నిజమే కావొచ్చు బామ్మర్ది! సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనస్సులో ఏమున్నా బయటకు కనపడనీయకుండా చిరునవ్వుతోనే పలకరిస్తుంటారు కొందరు. ఏమీ లేకపోయినా ఏదో ఉందనే అపవాదులను చంకలో పెట్టుకుని తిరిగేవారు ఇంకొందరు. వీళ్ళకు మాత్రం డబ్బుతో అవసరముంటుంది కాబట్టి డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళను చూస్తె నోరు మెదపకుండా మనలాంటి మధ్యతరగతి వాళ్ళను హేళన చేస్తుంటారు. మొదటిరకం వాళ్ళు ఎదుటివాళ్ళ బాగోగులు కోరుకుంటారు. ఇంట్లోవాళ్ళందరూ మొదటిరకం అని తెలుసుకో. అందుకే నిన్ను నివ్వు నిరూపించుకొని రెండో రకం వాళ్లకు నువ్వు గొప్పవాడిగా కన్పించు. నువ్వే నిర్దేశించుకో. బ్రతికుండి మరనిస్తావా లేక సాధించి బ్రతుకుతావా? నీవు నేర్చుకున్న పోరాటం ఏమిటో చూపించు బామ్మర్ది” అంటూ నాకు అర్ధమే కాని విషయాలెన్నో చెప్పాడు బావ.
          ఇక మిగిలింది అక్క. ఆమె ఏమందో తెలుసా! “ఒరేయ్ తమ్ముడూ! ఎక్కడ ఉన్నా మరెవ్వరి జీవితాలతో ఆడుకోకరా” అని. చచ్చిన పామును చంపడమంటే ఇదేనేమో! అందరూ కట్టగట్టి పంపించాలనుకున్నారో, లేక మరొకటో తెలీదు కాని అందరూ నాకు రంజిత అనే లవర్ ఉందని నమ్మేశారు. ఎప్పుడూ నన్ను అనుమానించని వాళ్ళు కూడా అనుమానిస్తుంటే బాధ రెట్టింపు అవ్వక ఏమవుతుంది. “మీరు అనుమానించేది ప్రత్యక్షంగా నన్నే అయినా పరోక్షంగా మీ పెంపకాన్నే కదా! మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నాను, పెరిగాను. కాని ఇప్పుడిలా” అంటూ సెంటిమెంట్ డైలాగ్ వేసి ఏడ్చేశాను. “ఏ నమ్మకం లేని ఒక నమ్మకాన్నే సెంటిమెంట్ అంటారు. అటువంటివి నా ముందు చెప్పకు. కన్నీళ్ళ బాధదేముంది – తోడున్నామంటూ గుర్తుచేస్తాయి కాని తోడుండి నడిపించలేవు కదరా! మా అందరి ఆశిస్సులు నీకే! జరిగింది నిజమో అబద్దమో కారణమేదైనా విజయంతో తిరిగి రా. నీకోసం ఎదురుచూస్తుంటాం”అంది. నాన్నగారి మాటను కాదనలేక వెళ్ళిపొమ్మని పరోక్షంగా చెప్పేశారు. ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడాక నేనేం చేయగలను. ఇదిగో ఇలా లగేజి సర్దుకొని ఇలా నీ దగ్గరికి వచ్చేశాను.
******
          ఓపిగ్గా విన్నాక “బావుందిరా నువ్వు చెప్పింది. ఒక విషయం చెప్పమంటావా? చూస్తూనే ఉన్నాంగా అమ్మాయిలూ ప్రేమించేది అబద్దాల్ని, అబ్బాయి అనే అబద్దాన్ని, అబ్బాయిలు చెప్పే అబద్దాల్ని.అందుకే అబద్ధాలతోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు అమ్మాయే ఒక అబద్దమైపోతుంది. ఇదీ ఒకందుకు మంచిదైందిలే. నీలో మార్పు వచ్చి జీవితంపై మమకారంతో పరిగెత్తుకొచ్చావు” అన్నాడు రమణ. “అసలా అమ్మాయెవరు? నా గురించి తనకేం తెలుసునని నాన్నగారితో చెప్పింది.? అది నిజంగా జరిగిందంటావా? లేక నాన్నగారే ఏదో స్కెచ్ వేసుంటారంటావా? ఎన్నిసార్లు ఆలోచించినా సమాధానం దొరకడం లేదురా!” అన్నాడు రంజిత్.
          “కొంతమంది సరదా కోసమని వాళ్లకి తోచిన నంబర్లను డయల్ చేసి ఇలా మాట్లాడడం సినిమాల్లో చూసాం కదా! అలానే ఎవరో ఆకతాయి చేసుంటారులే!” అన్నాడు రమణ. “వాళ్ళ సరదా కోసమని ఒకతన్ని తన కుటుంబానికి దూరం చేయడం న్యాయమా? అది తన అభిమతమా?” అడిగాడు రంజిత్. “తన అభిమతం అవ్వొచ్చు కాకపోవచ్చు. సరదాల కోసం ఇలా చేసే అమ్మాయిలకు కొదవే లేదు. ఆ అల్లరి ఆనందం తనువంతా ఆవాహనం చేసేసుకుంటే అది హద్దులు దాటిపోతుంది. అలాంటప్పుడే సమస్య సృష్టించబడుతుంది. ఆ సమస్యకు కాలమే సమాధానం చెప్పాలి. రకరకాల ఋతువులు వచ్చి వెళ్తున్నట్లే రకరకాల మనుషులు రకరకాల సమస్యలను దాటుకుంటూ వెళ్లిపోతుంటారు. సాధించలేని వాళ్ళుమాత్రం నాకే ఎందుకిలా జరిగిందని మధనపడుతుంటారు. సమస్య సృష్టించబడినప్పుడే సమాధానం కూడా సృష్టించబడుతుంది. కాలం కూడా తనని తానూ నిరూపించుకోవాలి కదా! కాకపొతే దానిని కనిపెట్టుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. ఇప్పుడు అల్లరిగా సృష్టించబడ్డ ఒక సమస్య ఒకరి పరువుకు అవరోధంలా, మరొకరికి గుణపాటంలా, ఇంకొకరికి గమ్యంలానూ మిగతా వాళ్లకు మనోవేదనను మిగిల్చింది. గ్రేట్” వివరించాడు రమణ.
          “కావొచ్చు. ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకుపై నమ్మకం లేకుండా ఎవరో చెప్పిన ఒక అబద్ధాన్ని పట్టుకొని నాన్నగారలా తొందరపడడం నాకేం నచ్చలేదు” తన ఆవేదనను వెలిబుచ్చాడు రంజిత్. “అబద్ధం అని నువ్వంటున్నావు, నిజమని వాళ్ళు నమ్ముతున్నారు. అబద్దం ఒక తియ్యనైన పదార్ధం. సంతృప్త స్థానం బట్టి తియ్యదనం తెలుస్తుంది. లేకపోతే వెగటు పుట్టిస్తుంది. అందమైన అబద్ధం ఒక గమ్యంలా నిలబడితే, ఒక జీవితమే మారితే అదో ఆణిముత్యమవుతుంది. ఈ అబద్ధం నీకు జీవితాన్నివ్వాలి” ఉత్తేజపరుస్తూ చెప్పాడు రమణ. “ఏమోరా నువ్వెన్ని చెప్పినా నా మనస్సు మాత్రం స్థిమితపడడం లేదురా!” అన్నాడు రంజిత్. “అసలు అది జరిగిందో లేదో తర్వాత ఆలోచిద్దాం కాని హాయిగా పడుకో! రేపు ఐ.బి.పి.ఎస్.కు దరఖాస్తు చేద్దువు గాని. త్వరలో గ్రామీణ బ్యాంకు లకు కూడా నోటిఫికేషన్ ఇస్తారు, అది కూడా అప్లై చేద్దాం. ఇదే కసి, పట్టుదలతో చదివితే ఎనిమిది నెలల్లో ఉద్యోగంలో ఉండొచ్చు” చెప్పాడు రమణ.
“ఏదైతేనేం చాలా త్వరగా జాబ్ కొట్టి ఇంటికి గర్వంగా వెళ్ళాలిరా రమణ” అన్నాడు రంజిత్. “అంత త్వరగా అంటే ఈ హైదరాబాదు లో బోలెడన్ని ప్రయివేటు ఉద్యోగాలున్నాయి. చేస్తావా?” అడిగాడు రమణ. “అవి వద్దురా! గవర్నమెంట్ జాబ్ నే కొట్టి నా సత్తా ఏమిటో చూపిస్తా. ప్రయివేటు దే అయితే ఎప్పుడో సెటిల్ అయ్యేవాడినే” సమాధానమిచ్చాడు రంజిత్. “గవర్నమెంట్ జాబ్ కోచింగ్ లేకుండా కొట్టడం చాలా కష్టంరా” చెప్పాడు రమణ. “అవును, తెలుసు. కోచింగ్ తీసుకుంటాను. నాకు కొంచం సాయం చేయాలి నువ్వు” అన్నాడు రంజిత్. “దాందేముందిలే. మంచి ఇన్స్టిట్యూట్  గురించి నేను కనుక్కుంటానులే” అభయమిచ్చాడు రమణ. “అది సరే! నాకు కావాల్సింది వేరే సాయం రమణ” అంటూ నీళ్ళు నమిలాడు రంజిత్. “ఏంటో చెప్పరా!” అడిగాడు రమణ. “కోచింగ్ ఫీజు నువ్వే కట్టాలిరా. నీకు సాధ్యమైనంత త్వరగా తీర్చేస్తాను” అడిగేశాడు రంజిత్. “అంటే నాకే ఎసరు పెట్టావా?” అన్నాడు రమణ. “అదేంటిరా అలా అంటావ్. కలిసి చదువుకునేటప్పుడు ఎన్ని సార్లు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు నువ్వు” గతం గుర్తు చేశాడు రంజిత్. “ఓకే... ఓకే.. ఇప్పుడదంతా ఎందుకు? నేను కడతానులే. దాన్ని గురించి మర్చిపోయి జాబ్ కొట్టడం మీద దృష్టి పెట్టు” ఒప్పుకున్నాడు రమణ. “థాంక్స్ రమణ” కృతజ్ఞత తెలిపాడు. “సరే.. సరే... ఆలస్యమైంది ఇక పడుకో. రేపు దాని గురించి ఆలోచిద్దాం” అని చెప్పి పడుకున్నాడు రమణ. ఆనందంతో అతన్నే అనుసరిస్తూ రంజిత్ కూడా నిద్రకుపక్రమించాడు.
* * * * * *
          “ఏరా, ఇంటికి బయలుదేరుతున్నావా?” అడిగాడు రమణ.“అవునురా! లగేజి మొత్తం సర్దేశాను. ఏమన్నా మర్చిపోయానేమో గుర్తు చెయ్. బస్సు వచ్చే టైం అయ్యింది” అన్నాడు రంజిత్. “ఇంటికి వెళ్తున్నావ్ కదా ఎలా అన్పిస్తుందిరా?” అడిగాడు రమణ. “చాల రోజుల తర్వాత వెళ్తున్నా కదా కొంచెం నేర్వెస్ గా ఉంది, కొత్తగా అన్పిస్తుంది” ఆనందంతో చెప్పాడు రంజిత్. “నీ ఆనందం నన్నూ ఆనందానికి గురిచేస్తుంది. అన్న మాట నిలబెట్టుకున్నావ్. ఒక స్నేహితుడికి ఆశ్రయమిచ్చినందుకు నాకూ గర్వంగా ఉందిరా” చెప్పాడు రమణ. “అవునురా, నువ్వన్నది నిజమే. ఈ క్రెడిట్ నీకే దక్కుతుంది. నీ మీద నమ్మకంతో అసలు ఉండమంటావో, వద్దంటావో అని కనీసమైనా ఆలోచించకుండా కొంచెం ఆవేశంతోనూ, కొంచెం కోపంతోనూ ఇంట్లోవాళ్ళ మీద అలిగి వచ్చేశాను. నన్ను అర్ధం చేసుకున్నదుకు ధన్యవాదాల్రా” కృతజ్ఞతలు చెప్పాడు రంజిత్.
          “వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. అదో బృహత్తర కార్యం. గొప్ప యజ్ఞం కాబట్టే తప్పు లేదంటారు. ఒక అబద్ధం జీవితాన్ని తీర్చిదిద్దుతుందంటే నమ్మలేని వారు కూడా నీ గురించి తెలిశాక నమ్మి తీరాల్సిందే! అబద్ధమంటే అదో అబద్ధమనుకుంటాం కాని అదీ ఓ నిజమేనని తెలుసుకోలేం. నిజం కన్నా ముందు అడ్డు నిలబడుతుందని పసికట్టలెం. నీ విషయంలో అదే జరిగిందనుకుంటా. ఒక అబద్ధం జీవితాన్ని జీవించేలా చేసిందంటే నాకే నమ్మాలనిపించడం లేదు. ఇక్కడితోనే ఆగిపోకుండా పైకేదగడానికి ప్రయత్నించు. నాకు తెలుసులే నాలాగా ఇక్కడితో సంతృప్తి పడే రకం కాదులే! ఇంటికెళ్ళి మీ వాళ్లకు చెప్పి సంతోషపెట్టు. నీ కోసమే ఎదురు చూస్తుంటారు” అని చెప్పి బస్సెక్కి పంపించాడు రమణ.
          “సరే! వీలు చూసుకుని మళ్ళీ ఒకసారి వస్తానులే! ఉంటా మరి” అని రమణ దగ్గర్నుంచి శెలవు తీసుకొని బస్సు లో ప్రయాణం ప్రారంభించాడు రంజిత్. ఇంటికెళ్ళగానే విషయం తెలుసుకున్న నాన్న ఎలా భుజం తడతారో, అమ్మ కంట్లో ఆనంద భాష్పాలు ఎలా వస్తాయో, అక్క బావలు ప్రయజకుడినైనందుకు ఎలా ప్రశంసిస్తారోనని ఊహించుకుంటున్నాడు. ‘ఈ కొద్ది కాలంలో ఎవ్వరూ ఎప్పుడూ చూడడానికి రాలేదు, నేను ఫోన్ చేసినా మాట్లాడలేదు, నా బాగోగుల గురించి ఆరా తీయలేదు మరి అటువంటప్పుడు నన్ను నన్నుగా స్వీకరిస్తారో లేదో’ అనే సంకోచం మొదలైంది అతనికి. తనవాళ్ళు అంత చంచల హృదయులు కాదనుకుంటున్నాడు. తనే ప్రశ్నించుకుంటున్నాడు. తనే సమాధానం చెప్పుకుంటున్నాడు. తనలో తనే మధనపడుతున్నాడు. పరిపూర్ణ వ్యక్తిలా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన అంతరాత్మతో తనే సంభాషించుకుంటున్నాడు.
‘మనల్ని మనమే ప్రశ్నించుకుని మనల్ని మనమే సరిదిద్దుకోవడమంటే ఇదేనేమో! ఎంతమంది ఎన్ని చెప్పినా ఒకప్పుడు వినిపించుకోలేదు. విని ఉంటే ఇలా దూరంగా వచ్చి ఉండే వాడిని కాదు. వాళ్లకు దూరమయ్యి ప్రేమకు మొహం వాచేవాడిని కాదు. దగ్గరున్నప్పుడు తెలుసుకోలేకపోయాను దూరమైనాక అందిపుచ్చుకోలేకపోయాను. ఏ బంధం గోప్పతనమైనా దూరమైతేనే తెలుస్తుంది. ఐ.బి.పి.ఎస్. కాబట్టి నోటిఫికేషన్ ప్రకారం జరగబట్టి త్వరగా ఇంటికి చేరుకుంటున్నా, వేరేది అయితే ఫలితాలోచ్చేసరికి సంవత్సరాలు పట్టేది.రమణ చెప్పింది నిజమేననిపిస్తుంది. సూక్తులు కాని, సుప్రభాతాలు కాని ఎవ్వరికీ పనికి రావు. వినరు కూడా. అందుకే అవి పుస్తకాలలో ముద్రించాబడ్డాయి కాని మనస్సుల్లో కాదు. మనోఫలకంపై ఎప్పటికీ నిలయమవ్వవు. అలా జరిగితే మన దేశం ప్రపంచ పటంలో తన ముద్రను స్పష్టంగా గీసేదే! మనిషిని అనుభవాలే నడిపిస్తాయి. అవే గుణపాఠం ను నేర్పిస్తాయి. మనలోనున్న ఆత్మాభిమానాన్ని గుర్తు చేసి తడిమి చూసుకునేట్లు చేస్తాయి. ఎవ్వరి ఆత్మాభిమానం వాళ్ళు వదులుకోనంత వరకూ సమస్యే ఉండదు’ పరిపరివిధాలుగా పోతున్న రంజిత్ మనస్సు బస్సు హరన్ తో ఈ లోకంలోకి వచ్చింది. తెరచి చూస్తె తన ఊరు! అవును తను పుట్టి పెరిగిన ఊరే!
******
దూరమైంది కొన్ని నెలలే అయినా ఎంతో మార్పు వచ్చినట్లు అనిపించింది. ప్రతి ప్రదేశమూ కొత్త బంగారు లోకంలా తోస్తుంది. ఒక వింతైన అనుభవానికి గురిచేస్తుంది. ఒకప్పుడు చుట్టూ చెట్టూ చేమ అన్నీ చూసుకుంటూ తిరిగిన వాడే. పల్లె స్పర్శకు దూరమయ్యి ఇప్పుడు దగ్గరయ్యేసరికి పరవశం పొంగింది. లోపలున్న అలజడులన్నీ కమ్ముకొచ్చి పాదాల్లోనే నిలయమైనాయి. అడుగులు వణుకుతూ పడుతున్నాయి. ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అనుమానాన్ని, అర్ధవంతమైన జీవితాన్ని కళ్ళనిండా నింపుకుని ఇంటిముందు ఆగి లోపలి చూశాడు రంజిత్. ఒక్కసారిగా పెద్ద కేక. “అమ్మా! తమ్ముడోచ్చాడు. త్వరగా రా. హారతి పట్టుకొని రా!” అంటూ సరళ ఆనందం నిండిన కళ్ళతో తల్లిని పిలిచింది.
“ఏరా తమ్ముడూ! ఎలా ఉన్నావ్? ప్రయాణం బాగా జరిగిందా? నిన్ను చూడాలని బావగారు నిన్ననే తీసుకోచ్చేశారు. ఏంటిరా అలాగే చూస్తూ ఉండిపోయావ్. దూరమయ్యాక చాలా మార్పు వచ్చినట్లు ఉందే. రా.. లోపలికొచ్చి హారతి తీసుకో” అంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది సరళ. ‘అదేంటి నేను వస్తున్నా సంగతి వీళ్ళకేలా తెలుసు? నిన్ననే వచ్చామంటుంది’ మనస్సులో అనుకుంటూ తనని తానె నమ్మలేకపోతున్నాడు రంజిత్.“ఏంటి బామ్మర్ది గారు! ఇన్నాళ్ళకు ఇల్లు గుర్తోచ్చినట్లుంది. పూర్తిగా మమ్మల్ని మర్చిపోయినట్లున్నారు, ఏం మాట్లాడడం లేదేంటి?” హాస్యాస్పదంగా అన్నాడు రవి. ‘నేను అడగాల్సిన ప్రశ్న వీళ్ళు నన్ను అడుగుతున్నారేంటి? పైపెచ్చు ‘గారు’ అంటూ గౌరవ సంబోధన. అసలేం జరుగుతుంది’ మనస్సుతోనే మాట్లాడుకుంటున్నాడు. తలపైకెత్తి చూస్తె హారతి పళ్ళెంతో లీలావతి పక్కనే రామేశ్వరరావు ఉన్నారు. ‘నేను వీళ్ళను ఆశ్చర్యపరుద్దామనుకుంటే వీళ్ళే నన్ను ఆశ్చర్యపరుస్తున్నారేంటి? అసలేంటి ఈ అయోమయం?’ అనుకున్నది కాకుండా అనుకోనిది జరుగుతున్నందుకు ఆనంద భాష్పాలు చిందిస్తున్నాడు రంజిత్.
మనస్సులో అయోమయాల్ని ప్రస్తావించగానే “ఓరి పిచ్చోడా! మేం ఏం చేసినా అది నీ మంచికేరా! నువ్వు దూరంగా ఉన్నా మా కళ్ళేప్పుడూ మీ మీదనే ఉంటాయి. నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఎలా కష్టపడుతున్నావో అంతా మాకు తెలుసు. కాని ఆ సంగతి నీకు తెలియదు. మాకు కావాల్సింది నీలో ఆ తపనే. కన్నపేగు కనిపించకుండా రక్షణనిస్తూనే ఉంటుందిరా! సంతోషం. రా... వచ్చి హారతి తీసుకో..” అన్నాడు రామేశ్వరరావు. “నాన్నగారు – అంటే ఆ అమ్మాయి విషయం అబద్దమనేగా మీరు చెప్పేది?” అడిగాడు రంజిత్ ఉడుకుని ఆపుకోలేక. “ఇప్పుడా విషయం ఎందుకు బాబు. హారతి ముందు నుంచొని ప్రశ్నలెయ్యకూడదు. ముందు హారతి తీసుకొని లోకలికి అడుగుపెట్టు” చెప్పింది లీలావతి.
“ఇది చాలా చిన్న ఉద్యోగామ్మా!” అన్నాడు రంజిత్. “బ్యాంకు ఉద్యోగం అంటే చిన్నదేం కాదు. భవిష్యత్ లో దానికి మంచి రోజులు ఇంకా ఉన్నాయి. క్లర్క్ గా సంపాదించిన ఉద్యోగంతో ఆఫీసర్ స్థాయికి చేరుకోవాలి నాన్నా” అంటూ దీవించింది లీలావతి. హారతి తీసుకుని లోపలికెళ్ళాడు రంజిత్. లగేజి మొత్తం తన రూమ్ లో పెట్టాడు. ఎంతో ఆనందపడిపోయాడు చాలా రోజులు తర్వాత తనకే సొంతమైన రూమ్ ని చూస్తూ. “అమ్మా! నా మీద కోపం తగ్గిందా?” కాఫీ ఇచ్చిన లీలావతిని అడిగాడు తెలుసుకుందామని. “ఎందుకుంటుంది నాయనా! అలాంటిదేం లేదు. నువ్వంటే మాకెప్పుడూ ప్రేమే! నీ భవిష్యత్ గురించే మా బెంగంతా! ఇప్పుడా సమస్య కూడా లేకుండా చేసిన నీ మీదేందుకు౦టుంది” ప్రేమగా మాట్లాడింది తల్లి. “నేనేదో తప్పు చేశానని చాలా కోప్పడి నన్ను దూరం చేశారు కాదమ్మా” సూటిగా ప్రశ్నించాడు కాఫీ త్రాగుతూ. “నువ్వు కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నుతుంటుంటే అమితానందం పొందాను. తల్లిగా అది నా తన్మయత్వం. ఇప్పుడదే కాళ్ళతో మమ్మల్ని కాలదన్ని పోకుండా ఉండాలన్నదే మా అభిమతం. పున్నమ నరకం నుండి కాపాడాలి కదా నాయన! ఆ అవకాశం అమ్మాయిలకు ఉండదు అందుకే కొడుకులంటే తల్లీదంద్రులకు అంత పిచ్చి ప్రేమ. లే – వెళ్లి నాన్నగారిని కలువు” అని కాఫీ కప్పుని తీసుకుని తండ్రి దగ్గరికి పంపించింది తల్లి.
“నాన్నగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది?” యోగక్షేమాలు అడిగాడు రంజిత్, తండ్రిని సమీపించి. “నా ఆరోగ్యానికి ఇప్పుడప్పుడే వచ్చిన ఇబ్బందేం లేదు కాని నువ్వెలా ఉన్నావ్” అడిగాడు తండ్రి. “బావున్నాను నాన్నగారు” సమాధానమిచ్చాడు. “ఇంట్లోంచి పంపించేశానని నా మీద కోపంగా ఉంది కదా?” ప్రశ్నించాడు తండ్రి. రంజిత్ మౌనం వహించాడు. అల్లుకున్న నిశ్శబ్ధాన్ని చెరిపెయ్యడానికి మళ్ళీ తండ్రే అందుకొని “నీ భవిష్యత్ బాగుండాలనే మా కోరిక. నువ్వలా జీవితం గురించి పట్టించుకోకుండా తిరుగుతుంటే ఏం చేయాలో తెలియలేదు. తప్పనిసరై ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అన్నాడు. రంజిత్ మదిని తొలిచేస్తున్న విషయాన్నే లేవనేత్తేసరికి మౌనం వీడాడు. “నిజంగానే ఆ అమ్మాయెవరో నాకు తెలియదు నాన్నగారు! నేనేటువంటి తప్పు చేయలేదు. నేను మీ రక్తాన్ని. ఇప్పటికైనా నిజం చెప్పి నా మనస్సును తేలిక పరచండి” అన్నాడు రంజిత్. “ఎన్నో విషయాల పట్ల నిగ్రహం పాటించిన నువ్వు ఈ విషయంలో పాటించలేవా? ఇక్కడితో వదిలేయ్. జరిగిందేదో జరిగింది. అలసిపోయి వచ్చావు. వెళ్లి భోజనం చేసి పడుకో. రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం” అంటూ మాటను దాటవేసి తప్పించుకున్నాడు తండ్రి. ఆయనలా సమాధానమిచ్చేసరికి ఇంకేం ప్రశ్నించకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు రంజిత్.
దేవుడంటే నమ్మకం. అనుభవం సాయంతో నమ్మకమే నడిపిస్తుందంటారు. ఇప్పుడా అమ్మాయే దేవుడు. ఆ అబద్ధమే తన నమ్మకం. నిరాకారమే సాకారమైనట్లుగా ఉందిప్పుడు. అబద్ధమైన ఆ అమ్మాయే తన మనోనేత్రంలో కొలువై ఉంది. భాష్పాలను కార్చి అలసిపోయామని కనులు విశ్రాంతిని కోరగా నిద్రే శరణ్యమని నిరాకారాన్నే తలుచుకుంటూ వాలిపోయాడు జ్ఞాపకాల్లోకి.
........

No comments:

Post a Comment

Pages