Thursday, September 22, 2016

thumbnail

శ్రీ దత్తాత్రేయ వైభవం - 7

శ్రీ దత్తాత్రేయ వైభవం - 7
శ్రీరామభట్ల ఆదిత్య 

11. పదకొండవ గురువు - ఎలుగుబంటి:
తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి. యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.
పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.
అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.
12. పన్నెండవ గురువు - రాబందు:
దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.
కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను విదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి. మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకోగలిగింది.
మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.
మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగి తేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.
జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.
అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.
మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే..... ( ఇంకా వుంది )

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information