శ్రీమద్భగవద్గీత – 3 - అచ్చంగా తెలుగు

శ్రీమద్భగవద్గీత – 3

రెండవ అధ్యాయము –  సాంఖ్యయోగము

రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు.

 Ph: 09482013801


కర్మణ్యేవాధికారస్తే
మాఫలేషు కదాచన
మాకర్మ ఫలహేతుర్భూ
ర్మాతే సంగోస్త్వ కర్మణి             || 47 వ శ్లోకం ||
         అర్జనుని నిమిత్తమాత్రుని జేసి గీతాచార్యుడు మనకు తెలియజెప్పిన గొప్ప విశేషమున్నది. అదియే గీతామాత గొప్పదనము. పై శ్లోకము నందు నాలుగు విషయాల్ని తెలియజేయుచున్నది.
  1. నీకు కర్మచేయుటయందే అధికారమున్నది
  2. కర్మ ఫలమునాశించుటయందధికారము లేదు.
  3. కర్మ ఫలమునకు నీకు కారణభూతుడవు కావద్దు.
  4. కర్మలు మానుట యందాసక్తి లేకయుండుము.
యుద్ధము చేయుటయందాసక్తిలేని యర్జునకి జ్ఞానవైరాగ్యములను గురించి ఉత్సాహముగా తన ధర్మనిర్వహణ జేయుటకు బలమును చేకూర్చినదీశ్లోకము.
        నిజానికి కర్మ ఫలమును భగవదర్పణ చేయుట చాలా సులభము. త్రికరణ శుద్ధిగా కర్మను భగవదర్పణజేయునపుడు, కర్మఫలము మనలను భాదించదు.సమాజములో అవకాసమున్న ప్రతివ్యక్తీ నా వలన ఈ గొప్పకార్యము సఫలీకృతమైందనిభావింతురు. దైవార్పిత భావంతో, అహంకార రాహిత్యంతో చేయువారు చాల అరుదు. నేను నిమిత్తమాత్రుడిని చేసేది చేయించేది ఆ పరమాత్ముడే అన్న భావంతో చేయుటయే కర్మయోగము.
        ఆకలిగొన్నవారికి అందించే ఆహారాన్ని నారాయణ సేవ గా నామకరణం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు బాబా వారి ప్రేమ భాషలో చెప్పాలంటే మనం చేస్తున్న ఈ సహాయం చాలా చిన్నది. ఆహారాన్ని భుజించి ఆకలిబాధ తీర్చుకున్న నారాయణులు మనకు చేస్తున్న సహాయం చాలా గొప్పది. ఘనీభవించిన సంచిత పాప కర్మల నుండీ మనలను విముక్తుల జేయుచున్నారు.
        అబ్బాయి ! నేను నీలాగే ముందు జన్మలలో ధనవంతుణ్ణి. గర్వంతో విర్రవీగి ఎవరికీ ఏ సహాయము చేయలేదు. ఫలితముగా ఈ జన్మలో ఆకలి బాధతో అల్లాడిపోతున్నాను. నీవు ఆ విధంగా బాధ పడవద్దని హెచ్చరిస్తున్నాడు.  సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వచ్చి మన పాపాలను ప్రక్షాళన మొనరించుతున్నాడు అన్న భావన గొప్ప తృప్తిని కలిగిస్తుంది. సేవను మించిన గొప్ప ఆధ్యాత్మిక సాధన ఏదీ లేదు. అహంకార నిర్మూలనకు సేవేగొప్ప సాధన.
            హిరణ్య గర్భుడైన పరమాత్మ సంకల్పం వలన ఈ చరాచర సృష్టి జరిగింది. కర్మలు చేయకుండా ఎవరూ వుండలేరు. ఏదో ఒక కర్మ చేయాలి. ఆ కర్మ దైవార్పిత భావంతో చేయాలి. ఆ కర్మ యోగంగా మారిపోయి భగవంతుని సామీప్యాన్ని కలుగజేస్తుంది. నేను చేస్తున్నాను నా వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతోందన్న భావన వలన గర్వము, అహంకారము ప్రజ్వరిల్లే ప్రమాదముంది. భగవంతునికి తెలియకుండా మనం ఏ పని చేయుటకు అవకాశము లేదు. ప్రతి జీవిలోనూ రస స్వరూపంలో భగవంతుడున్నాడు. మనం చేసే ప్రతి పనికీ ఆయనే సాక్షీ భూతుడు. మానవ శరీరంలోని ప్రతి అణువులోనూ ఆయన విరాఢ్రూపం కనిపిస్తూ వుంటుంది. కంటి ద్వారా దృశ్యాన్ని చెవి ద్వారా శ్రవణాన్ని ముక్కు ద్వారా వాసనను నాలుక ద్వారా రుచి చర్మం ద్వారా స్పర్శను అనుభవింప జోస్తున్నది ఒకే చైతన్యము. 72 వేల నాడుల ద్వారా శరీరక విధులన్నీ సక్రమముగా నిర్వహింపబడుచున్నవి.
స్థిత ప్రజ్ఞుని లక్షణములు
దుఃఖే ష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగత స్పృహః
వీతరాగ భయక్రోధః
స్థితధీర్ముని రుచ్యతే                               ||56 వ శ్లోకం||
యోగ స్వరూపుడైన శ్రీ కృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞుని లక్షణములను తెలియజేయుచున్నాడు. దుఃఖములందు కలత చెందని మనస్సు కలవాడు సుఖములందు ఆశక్తి లేనివాడు, అనురాగము భయము క్రోధము తొలగినవాడు, మనన శీలుడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.
        మనిషి పుట్టినపుడు ఏమియును వెంట తీసుకుని రాలేదు. పోయేటప్పుడు వెంటనేమియును తీసుకునిపోవుట వీలుకాదు. చేసే మంచిపనులు భగవంతుని బ్యాంకులో బద్రపరచబడతాయి. అవి ఏ జన్మలోనైనా మనకు స్వీకరించే వెసులుబాటు వుంటుంది.
సుఖము దుఖము రెండూ కర్మలే. ప్రకృతిలో చీకటి వెలుగు ఒకటి తరువాత ఒకటి నిర్విరామముగా సంభవించేవి. అధేవిధముగా మానవునికి సుఖము దుఖము రెండూ సంభవములే. మనసు ఆడించే క్రీడ వలన మానవుడు సుఖానికి పొంగిపోతూ దుఃఖానికి కృంగిపోతూ వుంటాడు.దుఃఖానికి కలత చెందక సుఖానికి వెంపర్లాడక రెండింటినీ సమన్వయ పరుచుకుంటూ తామరాకుపై నీటి బొట్టులా వుండేవాడే స్థిత ప్రజ్ఞుడు.
          ఈ సందర్బంగా సజీవయోగి జీవన్ముక్తుడు, స్థిత ప్రజ్ఞుని వివరాలు పాఠకదేవుళ్ళకు విన్నవించుకుంటున్నాను.
        2001 వ సంవత్సరం మే నెలలో నేను, మా పెద్దబ్బాయి (చంద్రమౌళి) ఇంకా ఇద్దరు మిత్రులము కలిసి కడప ప్రావిడెంటు ఫండు (ప్రాంతీయ) ఆఫీసుకు కారులో వెళుతున్నాము. యోగులను మహనీయులను దర్శించుకోవడమంటే చాలాయిష్టం. కడప జిల్లా రాయచోటికి, 7 కి.మీ దూరంలో చింతకొమ్మదిన్నె అనే గ్రామంలో శ్రీ కోదండరామయ్య స్వామిగారనే అవధూత దర్శనానికి వెళ్ళాము. ఒక పురాతన రాతి మిద్దెలో స్వామివారు వున్నారు. లోపలికి ప్రవేసించి చూసేసరికి వాతావరణమంతా నిశ్శబ్దంగా వుంది. సుమారు 30 మంది భక్తులు స్వామివారి చుట్టూ కూర్చుని వున్నారు.బహు ప్రాంతాలవారంతా అక్కడ వున్నారు. మేము లోపలికి వెళ్ళి పరిసరాలు చూస్తే బాహ్యంగా చాలా అసభ్యంగా కనిపించింది.స్వామివారి చుట్టూ వారు విసర్జించిన మల మూత్రాలు నిండి వున్నాయి. గుమిగూడిన ఆర్తులంతా ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ఇంతలో ఒకామె స్వామికి ఫలహరంగా ఇడ్లీ ,వడ సమర్పించింది.ఈ వాతావరణాన్ని చూసిన నా మిత్రులు బయటికి పరుగులంకించుకుని కారు దగ్గరికి చేరిపోయారు. నాతో మా అబ్బాయి మాత్రం వున్నాడు. స్వామివారు ఇడ్లీ వడ వున్న పళ్ళెం తీసుకున్నారు.స్వామివారు తింటూవుంటే నేను గమనించాను ఒక కుక్క ఆకలితో ఇంట్లో చొరబడి ఆత్రంగా ఆహారాన్ని ఎలా తింటుందో ఆవిధంగా స్వామివారు భుజిస్తున్నారు.కొంచెం తిని విడిచి పెట్టిన పదార్థాలు అక్కడి వాళ్ళకంతా ప్రసాదంగా పంచిపెట్టారు.నేను మా అబ్బాయి కూడా స్వీకరించాము.చిన్నపిల్లాడిలా పిచ్చివాడిలా పిశాచిలా వుంటారు అవధూతలు, యోగులు. స్వామి కూడా అలాగే కనపడ్డారు.
ramireddy
స్వామి దిగంబరంగా వున్నారు. బ్రాహ్మీ స్థితులైన వారు బాహ్య స్థితికి రావటం చాలా అరుదు. వారు బహ్య స్థితిలో ఎవరైనా భక్తుని ఆశీర్వదిస్తే వాళ్ళ జన్మ చరితార్థమైనట్లే. భక్తుల రుగ్మతలు తొలగిపోతాయి. చెన్నై నుండీ స్వామివారి దర్శనానికై ఒక భక్తురాలు వచ్చింది.ఆమె రొమ్ము కేన్సరు వ్యాధితో బాధ పడుతుండేది. వ్యాధి మదిరిపోయిందని డాక్టర్లు చెప్పారంట. స్వామివారిని దర్శించుకుని, విచిత్ర సంఘటన తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైందని డాక్టర్లుకూడా దృవీకరించారట. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి ఫోటో ఒకటి పెడుతున్నాను. చివరిగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమంటే….!! స్వామి విసర్జించిన మలమూత్రాలు ఏ విధమైన దుర్గంధాన్ని వెదజల్లుటలేదు, అక్కడ ఈగలు , దోమలు అసలేలేవు. ఈ సంఘటనకు నేను మా అబ్బాయి ప్రత్యక్ష సాక్షులము. తదనంతర కాలంలో స్వామివారు మహాసమాధి పొందినారని తెలిసి మరలా దర్శించుకోలేక పోయినందుకు బాధపడ్డాను.
                                                                                           ***

No comments:

Post a Comment

Pages