గోదావరి నుంచి సబర్మతి వరకు..(ఆరవ భాగం) - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు..(ఆరవ భాగం)

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు..(ఆరవ భాగం)

                                                      -అవని


             కొచిన్‌ పొర్ట్‌, ఆసుపత్రి ప్రాంగణం..లోపట ఒక వార్డులో బెడ్‌ మీద శ్రీరాం పడుకొని వున్నాడు.ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రణవి. మంచం మీదున్న శ్రీరాం ని అలా చూసేసరికి మాటరాని స్తితిలోకి వెళ్ళిపోయింది. శ్రీరాం కూడా ఆ సమయంలో స్పృహలేని పరిస్తితిలో వున్నాడు.ఆ ప్రాంగణంలో వున్న అతని సహచరుల వద్దకు వెళ్ళి వారిని వాకబు చేసింది.
" ఏమైంది..ఇంత సడన్‌ గా.."అడిగింది ఆశ్చర్యంగా ప్రణవి.
" తెలియదండి..సడన్‌ గా చెస్ట్‌,పెయిన్‌ ..అన్నారు.ఆసుపత్రికి తీసుకొచ్చాక తెల్సింది గుండెలో రెండు రంధ్రాలున్నాయని..వాటివల్లే ఇలా జరుగుతుందని చెప్పారు." చాలా సూటిగా విషయాన్ని చెప్పాడు దాచడం అనవసరం అన్నట్టుగా అతని సహోద్యోగి.
" అయితే..ఇప్పుడు ఏం చెయ్యాలంటారు డాక్టర్లు.." అడిగింది అయోమయంగా.
" ఏం ..లేదు..కొన్నాళ్లు..ఇంటికి తీసుకువెళ్ళి,నెమ్మదిగా కోలుకొనేలా చెయ్యండి.తర్వాత చూద్దాం..అప్పటి పరిస్తితులేంటో.."అన్నాడు అతను.
ఆదుర్దాగా తమ ఇంటికి మాట్లాడి తన తండ్రితో పరిస్తితినంతా వివరించి చెప్పింది.కానీ తను ఊహించిన స్పందనకాని,సహకారం కాని తనకు లభిస్తాయని అనిపించలేదు.శ్రీరాం తల్లితండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది.వాళ్ళు తమ కొడుకునే మర్చిపోయాం అన్నట్టుంది వాళ్ళ స్పందన..ఈ పరిస్తితులను చూసి తనకి ఆశ్చర్యంతో పాటు అయోమయంగా కూడా వుంది.' మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనా.." అని అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఇప్పుడు ఏం చెయ్యాలి..ఇదో ఎడ తెగని ప్రశ్న.
మౌనంగా అక్కడున్న కుర్చీలో కూలబడింది ప్రణవి.
తోడు దొరికే ఒక నేస్తం,తన ఆవేదన పంచుకొనే ఓ మనస్సు,నేనున్నానంటూ ఓదార్పునిచ్చే ఓ స్నేహ హస్తం దొరికితే ఎంత బావుణ్ణు అని ప్రణవికి మనసులో అనిపించింది.
ఏమయితే అదే అయింది..తను కొంత కోలుకున్నాక తనతో తీసుకెళ్ళాలనుకుంది.
ఇంతలో తల్లిదండ్రుల దగ్గరనుంచి ఫోన్‌..పెళ్ళవకుండా ఒక్కదానివి..అక్కడ ఎందుకలా..వెంటనే తిరిగి వచ్చేయ్‌..పెళ్ళికానిదానివి..నలుగురికీ తెలుస్తుంది..అధి సభ్యతగా వుండదు.అని చెప్పారు.
తను అనుకున్న మనో దర్మం ముందు ఈ మాటలు ఏవీ తనకి వినబడడం లేదు.
సుఖాల్లో వుంటేనే మనిషా..కష్టాల్లో వుంటే వదిలేస్తారా..ఇదేనా మానవత్వం..మనుషుల విలువలు ఇలా కరిగిపోవలసిందేనా..ఎన్నో ఆలోచనలు..మదినిండా ఊపిరిసలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి ప్రణవికి.
నాలుగు రోజులు గడిచాయి..నెమ్మదిగా శ్రీరాం ఆరోగ్యం కుదుటపడ్డం మొదలెట్టింది.
శ్రీరాం నెమ్మదిగా అడిగాడు.." ఏవరూ ..రాలేదా.."అని.
ఆ ప్రశ్నకి ప్రణవి దగ్గర సమాధానం లేదు.
" పోనీలే..ఎవరూ..రాకపోయినా..నువ్వొచ్చావు..అదే నాకు చాలా సంతోషం.." అన్నాడు శ్రీరాం.
" ఇప్పుడు ఏం చేద్దాం.." అడిగింది ప్రణవి.
ఏమీ జవాబు చెప్పలేదు శ్రీరాం.
" వెంటనే..పెళ్ళి చేసుకుందాం." అంది ప్రణవి.
ఒక్కసారిగా షాక్‌ తిన్నట్టు అయిపోయాడు శ్రీరాం.
" ఇప్పుడున్న పరిస్తితుల్లో నన్ను పెళ్ళి చేసుకోవడం ధర్మంకాదు" చెప్పాడు.
"ఏది ధర్మం..కష్టాల్లో వున్నప్పుడు మనుషుల్ని వదిలి వెళ్ళడమా..పెళ్ళయ్యాక ఇలా జరిగితే ఏం చేసేవాళ్ళం."ప్రశ్నించింది .
" అది ఖర్మ అని సరిపెట్టుకోవాలేమో..అంతేకాని పెళ్ళికానప్పుడు నీకు ఎందుకు ఇదంతా.." అన్నాడు.
" మాంగల్యం అనేది రెండు మనసుల మధ్య నమ్మకానికి వేసే పునాది లాంటిది. వివాహం అంటే రెండు మనసుల కలయిక అంతే.ఈ ప్రక్రియ ఓ తంతులాంటిది." అంది నిర్ధుష్టంగా.
మరో మాట మాట్లాడే అవకాశం కల్పించడం లేదు శ్రీరాంకి.
" పోనీ పెద్దవాళ్ళకి ఓ మాట చెబుదాం.." అన్నాడు నసుగుతూ.
" తప్పకుండా..ఎందుకంటే ,నలుగురు నాలుగు రకాలుగా అనుకొనే అవకాశం ఇవ్వక్కరలేదు కదా..అందుకు" అంది.
అలా కొన్ని రోజులు గడవడం..ఈ ప్రవాహంలో ఒకరికి ఒకరం దగ్గరవడం..ఓ మంచిరోజు అనుకొన్న రోజు పెళ్ళిలాంటి తంతు ముగించడం చకచకా జరిగిపోయాయి.
అమ్మ,నాన్న వద్దన్నారు,అత్త,మామ కాదన్నారు.
భయం వెయ్యలేదు..జీవితం కదా పోరాడాల్సిందే అనిపించింది.
అమ్మ,నాన్న కోరుండి జీవితాన్ని నరకం చేసుకుంటున్నావు అన్నారు.నిక్షేపం లాంటి జీవితాన్ని నీ మొండితనానికి బలిచేస్తున్నావు.మరో మంచి సంబంధం తెచ్చి దివ్యంగా పెళ్ళి చేస్తామన్నారు.ఇవేవీ తలకెక్కించుకొనే స్తితిలేదు నా దగ్గర.
అందుకే మౌనంగా విని ఊరుకున్నాను.
ఆయనకి తల్లిదండ్రుల్ని ఎదిరించే శక్తిలేదు.ఎలా బతకాలో అంచనాలేదు,ఆలోచనా లేదు.
ముందు ఆయనకో లక్ష్యం ఏర్పాటు చెయ్యాలి.ఆయన్ని ముందు ఓ సంపూర్ణమైన మనిషిలా మార్చాలి.ఆయన అనారోగ్యాన్ని తలచుకొని బాగా డిప్రెషన్‌ గురయిన ఆయన్ని మామూలు మనిషిగా మారిస్తేనే నాకు ఏనాటికైనా విలువుంటుంది అనిపించింది.
 అనునయంగా చెప్పడం మొదలెట్టాను.
మనిషి పడిపోవడం తన తప్పుకాదు.తిరిగి నిలబడాలి.అలాంటి ప్రయత్నం చెయ్యకపోతే అది నిజంగా తప్పే.
చదువుకున్నారు..కావాలంటే ఇంకా చదవండి.నేను చదివిస్తాను.చదువు అనేది పెద్ద అస్త్రం లాంటిది.అది మీ చేతిలో వుంటే ప్రపంచమంతా మీకు దాసోహం అనక తప్పదు.
మీ జ్నానాన్ని పంచొచ్చు..మీ విజ్నానాన్ని నలుగురికి అందించొచ్చు.సమాజానికి అనేక విదాల ఉపయోగపడొచ్చు.
దానివల్ల మీమీద మీకే తెలియని ఓ భరోసా వస్తుంది,నమ్మకం వస్తుంది.అని అనేక విదాల నచ్చచెప్పింది.
ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టాం.అలా క్రమక్రమంగా నిలదొక్కుకున్నాం.మళ్ళీ అందరిచూపు మావైపు పడింది.అన్ని చోట్లా పిల్లలు కాదన్నా కన్నవాళ్ళు కాదనలేరు.ఇక్కడ వాళ్ళు ఎలా చేసినా కన్నవాళ్ళను దూరం చేసుకోలేకపోయాం.మళ్ళీ అందరం దగ్గరయ్యాం.
ఈలోపు నేను గ్రూప్‌ ఒన్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవడం మొదలెట్టాను.
ఒకరోజు ఉన్నట్టుండి మా ఆయన విపరీతమైన కేకలు,అరుపులు అరవడం మొదలెట్టారు.ఏమయిందో అని గాభరాపడి ఆసుపత్రిలో చూపించాం.అతని మానసిక స్తితి సరిగాలేదని గుర్తించారు.కారణాలు అ న్వేషించాం.ఏమీ తెలియడం లేదు.
ఇదో మరో కొత్త ఉత్పాతం మొదలయ్యింది అనిపించింది.
దేవుడు ఒక ద్వారం తెరిస్తే మరో దాన్ని మూసేస్తున్నట్టు అనిపించింది.
మళ్ళీ ఆయన ఒక్కరే ఇంట్లో వుండటం..అది మరింత మనస్తాపానికి గురి అయ్యేలా చేస్తుందనిపించింది.
ప్రశాంతతకోసం హరిద్వార్‌ తీసుకెళ్ళాలనిపించింది.
జీవితంలో గెలవాలంటే డబ్బు కావాలి.ఈ లోకంలో అది వున్నవాడే రాజు.ఎన్నైనా వేదాంతాలు చెప్పొచ్చు.కానీ కాసులేనిదే కాలం గడవదు.ఇది అనుభవం నేర్పినమాట.
ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒకటే.నా భర్తని మళ్ళీ మామూలు మనిషిగా చెయ్యాలి.
ఒక ప్రభుత్వ ఉద్యోగం నా లక్ష్యం కావాలనిపించింది.అనుకున్న లక్ష్యంకోసం అహర్నిశలు కష్టపడ్డాను.అనుకున్నట్టుగానే ఓ ప్రభుత్వ కళాశాలలో గణిత ఉప న్యాసకురాలిగా మంచి ఉద్యోగం సంపాదించేను.
ఆర్ధికంగా కొంతమేర నా కష్టాలు తీరాయి.ఆయనకి మంచి వైద్యాన్ని అందించగలిగేను.పూర్తి స్తాయిలో నయంకాలేదు కాని కొన్నాళ్ళకి మామూలు స్తాయికి చేరుకున్నారు.తన పని తను చేసుకొనేలా ఎదిగారు.
హరిద్వార్‌,రుషీకేష లాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళడం ద్వారా ఆయనలో తెలియని ఒక అధ్యాత్మిక లోకం మొదలయ్యింది.
నెమ్మదిగా పురాణాలన్నిటినీ చదవడం మొదలెట్టారు.దానిద్వారా సమకాలీన,సామాజిక జీవన విదానం నెమ్మదిగా అవగతమయింది.
ఈ క్రమంలో నేనో బిడ్డకు తల్లినయ్యాను.
అలా చెప్పుకుంటూ పోతోంది ప్రణవి..వేదవతి ఆ అలయానికి వున్న గోడకి ఆనుకొని అపస్మారక స్తితిలో వున్న ఆమెని చూసింది..
వెంటనే ఆమెని చూసి.." ఆంటీ..ఆంటీ.." అని పిలిచింది.
ఎలాంటి స్పందనా లేదు.వెంటనే ఆలస్యం చేయకుండా కృష్ణమోహన్‌ కు ఫోన్‌ చేసింది.
"ఎక్కడ వున్నారు." అడిగాడు.
సమాధానం చెప్పింది.వెంటనే జాగు చేయకుండా అంబులెంస్‌ కి ఫోన్‌ చేసింది.
వెంటనే అంబులెంస్‌ రాడం,ఆసుపత్రికి తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి.
ఈలోగా గాయత్రి,విష్ణుశర్మ కూడా అక్కడకు చేరుకున్నారు.
కృష్ణమోహన్‌ డాక్టర్ని కలిసి వివరాలు అడిగాడు.
ఆమెకి బ్రెయిన్‌ లో క్లాట్‌ అయిందని,వీలయినంత త్వరలో ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు.
ఈ ఊహించని ఉపద్రవానికి ఎంతో మదనపడసాగింది ప్రణవి.
" కృష్ణ..ఏమైనా సాయం కావాలా.." అడిగింది ప్రణవి.
" ఏం..వద్దు..ఈ సమయంలో మనోధైర్యం తప్ప మరేమీ వద్దు.." మొండిధైర్యంతో చెప్పాడు కృష్ణ.
" ఆపరేషన్‌ కి ఏమైనా ఆర్ధికంగా సాయం కావాలా..?" అనుమానిస్తూ అడిగింది ప్రణవి.
" బంగారం..నువ్వు వున్నావన్న ధైర్యం చాలు..నేను ముందుకు నడవడానికి.అదే నన్ను ముందుకి నడిపించే దివ్యాస్త్రం.." అన్నాడు.
" నిన్ను చూసి ఆశ్చర్యంగా వుంది కృష్ణ..నీ మనోధైర్యం,నిబ్బరత..నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి." అంది.
" ముందు అమ్మ ఆరోగ్యంగా ఇంటికి రావాలి..అది ముఖ్యం"అన్నాడు కాసింత బాధగా.
" తప్పకుండా అమ్మ ఆరోగ్యంగా తిరిగొస్తుంది.నువ్వేం భయపడకు.." అని ఓదార్చింది.
  (సశేషం..)

No comments:

Post a Comment

Pages