నవదుర్గలు. - అచ్చంగా తెలుగు

నవదుర్గలు.

Share This

నవదుర్గలు.

                                           డా.బి ఉమాదేవి                                             కామవరం.


భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆశ్వీజశుద్ధ పాడ్యమినుండి దశమి వరకు జరుపుకొనే పండుగ దసరా పండుగ. ఈ నవరాత్రులలో ఆదిశక్తియైన పార్వతీదేవి తొమ్మిది రూపాలతో తొమ్మిది అలంకారాలతో కనువిందు చేస్తూ భక్తజనులను కాపాడుతూ  వుంటుంది.ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పూజలందుకొనే దేవిని గూర్చి తెలుసుకొందాం. నవదుర్గల ప్రస్తావన మనకు వరాహపురాణంలో అగుపిస్తుంది.ఒకప్పుడు మార్కాండేయ మహర్షి బ్రహ్మదేవుడితో "హే స్వామీ అన్నవిధాలుగా లోకులను రక్షించే మంత్రాలున్నాయని విన్నాను వానిని గూర్చి వివరించమని"అడుగుతాడు.దానికి సమాధానమిస్తూ బ్రహ్మ దేవుడు ఇది చాలా గుహ్యమైనదంటూ ఇలా వివరిస్తాడు.
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది. శరన్నవరాత్రులో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అలంకారముతో భక్తులకు దర్శన మిస్తుంటారు.
మొదటిరోజు శైలపుత్రి :        శివపత్ని సతీదేవి  దక్షయజ్ఞంలో తన తనువును ఆహుతి చేసుకొని మరు జన్మలో శైలాధిపుడైన హిమవంతునకు కూతురుగా జన్మిస్తుంది.అందుకే శైలపుత్రి అని వ్యవహరిస్తారు.ఈమెవృషభవాహనయై విరాజిల్లుతుంటుంది.కుడిచేతిలో త్రిశూలము ఎడమచేతిలో కమలము ధరించి వుంటుంది.      మెదటిరోజు అమ్మవారు త్రిపురసుందరిగా దర్శనమిస్తారు. ఆ.వె: దక్ష సుతవు నీవు దాక్షాయణీ దేవి        దగ్ధమైతి వపుడు దక్షునింట          హైమవతిగ పుట్టి హరుని సేవించుచు         శంకరు సతి వైతి శైల పుత్రి.
మొదటిరోజు అమ్మవారిని "బాల త్రిపుర సుందరిగా"అలంకరిస్తారు.
రెండవరోజు బ్రహ్మచారిణి: 'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించివుంటుంది. పరమేశ్వరుని పతిగా పొందడానికై తీవ్రమైన తపమొనర్చింది. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము.బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
2.ఆ.వె: బ్రహ్మచారిణిగనె ప్రఖ్యాతి గాంచిన            మేన తనయ వమ్మ  మేలు కూర్చు           ఘోర తపము చేసి గోరితివి శివుని           పతియు నయ్యె తాను పరమ శివుడు.
రెండవరోజు అమ్మవారు గాయత్రీ రూపంలో దర్శనమిస్తారు.
మూడవరోజు చంద్రఘంట:
పార్వతీదేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటవలన ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును. 3.ఆ.వె:భక్త జనుల యొక్క పాపాల రాశిని           తొలగ జేయు నట్టి దుర్గ వీవు            చంద్ర ఘంట యనుచు చక్కగా కొలిచేము           కావు మమ్మ మమ్ము కరుణ తోడ.
మూడవరోజు అమ్మవారు అన్నపూర్ణగా అనుగ్రహిస్తారు.
నాలుగవ రోజు. "కూష్మాండ" సింహ వాహిని యైన ఈమె అవలీలగా నవ్వుతూ బ్రహ్మాండమును సృజిస్తుంది కనుక ఈమె కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.నిరుపమాన తేజస్సు గలది.ఈ మాత అష్టభుజములతో విరాజిల్లు చుండును.7 చేతుల్లో వరుసగా కమండలము,ధనస్సు,బాణము,కమలము,అమృతకలశము,చక్రము,గద వుంటాయి.ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులను నిధులను ఇచ్చే జపమాల వుంటుంది.ఈ దేవిని ఉపాసించుట వలన సమస్త రోగములు,శోకములు నశిస్తాయి.కొద్దిపాటి సేవకే ప్రసన్నురాలవుతుంది.
ఆ.వె:అంబ పూజ చేయ హర్షించి దీవించు భక్తి తోడ గొలువ వరము లొసగు కూరిమెంతొ చూపు కూష్మాండ గౌరియై సర్వ సిద్ధు లొసగు శైల పుత్రి.
నాలుగవరోజు అమ్మవారు "లలితా త్రిపుర సుందరిగా"అనుగ్రహిస్తారు.
5.నవరాత్రులలో ఐదవ రోజు. "స్కందమాత"
  కార్తికేయుడు,షణ్ముఖుడు,శక్తిధరుడు,గుహుడు అను పేర్లతో ప్రసిద్ధుడైన స్కందుని తల్లి పార్వతీదేవిని స్కందమాత పేరుతో నవరాత్రులలో ఒకరోజు ఆరాధిస్తారు . సింహవాసినియైన ఈ దేవి చతుర్భుజాలతో దర్శన మిస్తుంది.కుడివైపు ఒకచేత స్కందుని పట్టుకోగా మరో చేతిలోపద్మముంటుంది.ఎడమ వైపు ఒకచేత అభయ ముద్ర మరొక చేత కమలము ధరించి వుంటుంది.స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలు నెరవేరుతాయి.
ఆ.వె:స్కందమాత వీవు శంకర పత్నివు
        భక్తి తోడ కొలుతు భాగ్య మొసగు
         నమ్మి యుంటి నమ్మ నవదుర్గవే నీవు          అభయ మొసగు మమ్మ యాదిశక్తి. "
ఐదవరోజు అమ్మవారు వీణాపుస్తకధారిణి యైన సరస్వతీ రూపులో అనుగ్రహిస్తారు.
ఆరవ రోజు 6.కాత్యాయని. సింహవాసినియైన పార్వతీదేవి భాద్రపద  బహుళ చతుర్దశి నాడు కాత్యాయన మహర్షి యింట త్రిమూర్తుల ఆశిస్సులతో కాత్యాయని అను పేరుతో అవతరించింది.ఆశ్వీయజమాసంలో నవరాత్రులలో ఆందరి పూజలందుకొని మహిషాసురుని వధించింది.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందుకోరి గోపికలు యమునా నదీ తీరంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారని భాగవతం వల్ల తెలుస్తున్నది.ఈ మాత చతుర్భుజాలతో విరాజిల్లుతూ వుంటుందు.కుడి వైపున ఒక చేతిలో అభయముద్ర,మరో చేతిలోవరముద్ర వుంటుంది.ఎడమ వైపున ఒక చేతిలోఖడ్గము మరో చేతిలో పద్మము వుంటుంది.కాత్యాయనీ మాతను సేవించిన వారికి చతుర్విధ పురుషార్థాలు కలుగుతాయి.అమ్మవారిని కొలవడం వల్ల రోగాలు,శోకాలు,సంతాపాలు,భయాలు తొలగిపోతాయని చెప్పబడింది.
ఆ.వె: భాద్రపదము నందు బహుళ చతుర్దశిన్         నవతరించినట్టి యంబ వీవు       కామితముల నొసగ కాత్యాయనివై బుట్టి        కోర్కె దీర్చు నంట కొండ చూలి.
౹ఈరోజు అమ్మవారు "మహాలక్ష్మిగా అలంకరింపబడి అనుగ్రహిస్తారు.
7.కాళరాత్రి. దుష్టసంహరణకై  పార్వతీ దేవి "కాళరాత్రి" పేరుతో ఏడవ రోజు అగుపిస్తుంది. గాఢాంధకారము వలె నల్లని రూపుతో వుంటుందిఈమె ఉచ్చ్వాస నిశ్వాసాలు అగ్ని జ్వాలలను వెదజల్లుతుంటాయి.ఈ రూపులో నున్న దేవి వాహనం గార్దభము(గాడిద)చతుర్భుజాలుంటాయి.కుడి వైపున ఒకచేతిలో వరముద్ర మరోచేతిలో అభయముద్ర వుంటాయి.ఎడమ వైపున ఒకచేతిలో ఇనుపముండ్ల ఆయుధము మరో చేతిలో ఖడ్గము వుంటాయి.రూపము భయంకరమైనా భక్తులకు శుభాలను కల్గిస్తూ శుభంకరిగా పిలువబడుతున్నది.ఈమెను స్మరిస్తే రాక్షసులు,భూత ప్రేతాలు భయంతో పరుగు తీస్తారు.భక్తితో ఉపాసించు వారు భయవిముక్తులౌతారు.
ఆ.వె: అగ్ని కీలలయ్యె నంబ నిట్టూర్పులే          భయము గొల్పు రీతి బయలు వెడలె              రాసభమ్ము నెక్కి రౌద్రరూపము తోడ                              భద్రకాళి వోలె భవుని రాణి.
2.ఆ.వె: రక్కసులను జంప కక్కసంబగు తీరు            నవతరించె నచట నాదిశక్తి           దుస్సహమగు నటుల దుష్టుల పరిమార్చి          కాళరాత్రి యయ్యె కాళి మాత.
ఏడవరోజు అమ్మవారు దుర్గాదేవిగా అనుగ్రహిస్తారు.
ఎనిమిదవ రోజు. 8.మహా గౌరి: పార్వతీదేవి వృషభవాహనారూఢురాలై చతుర్భుజములతో తెల్లని వస్త్రములతో భక్తులకు దర్శనమొసగుతుంది.కుడివైపు ఒకచేతిలో అభయముద్ర,మరో చేతిలోత్రిశూలము ఎడమ వైపు ఒక చేతిలోడమరుకము,మరో చేతిలోవరముద్ర వుంటుంది.         శివుని పతిగా కోరి తపము చేయుట వలన ఎండకు కమిలు శరీరము నలుపెక్కగా శివుడు గంగా జలముతో అభిషేకించడంవలన ఈమె శ్వేత వర్ణయై"మహాగౌరి"గా ప్రసిద్ధి చెందింది.ఈ మహాగౌరిని ఉపాసించడం వలన పాపములన్ని నశించి పుణ్య ఫలాన్ని పొందుతారు.
ఆ.వె:తపమొనర్చె తరుణి ధవునిగా శివుగోరి        తరణి వేడి వలన తనువు నలయ       గరళకంఠుని దయఁ గౌర వర్ణము రాగ      గౌరి యనెడి పేర కరుణ జూపు/ఘనత కెక్కె.
ఎనిమిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధని అలంకరణతో  అగుపించి అనుగ్రహిస్తారు.
8.సిద్ధిధాత్రి:   భక్తులకు  సర్వ సిద్ధులను ప్రసాదించుట వలన  పార్వతీదేవి "సిద్ధిధాత్రి"గా ప్రసిద్ధి చెందింది.శివుని మేనులో సగభాగమై అర్ధనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలిచింది.సింహవాహనారూఢురాలై చతుర్భుజాలతో విరాజిల్లే తల్లికి కుడివైపు ఒక చేతిలోగద మరో చేతిలో చక్రమువుంటాయి.ఎడమ వైపు ఒకచేతిలో శంఖము మరో చేతిలో కమలమువుంటాయి.ఈమెను ఉపాసించడం వలన మనోరథాలన్నీ ఈడేరుతాయనే ధృఢ విశ్వాసం భక్తులకు గలదు.
ఆ.వె: సగము మేను పొంది శంకరు సతి తాను         సిద్ధిధాత్రి యని ప్రసిద్ధి గాంచె         శరణు గోరు వారి శంకలు బాపేటి         నందయంతి మాకు నందమొసగు.
నవరాత్రులలో చివరిరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ రూపుతో అనుగ్రహిస్తారు. మనసంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింప చేసే పండుగలను ఆచరిద్దాం.

No comments:

Post a Comment

Pages