చెప్పులు కుట్టే సాంబయ్య - అచ్చంగా తెలుగు

చెప్పులు కుట్టే సాంబయ్య

Share This

చెప్పులు కుట్టే సాంబయ్య

(మా బాపట్ల కధలు – 6)

భావరాజు పద్మిని


రెక్కలొచ్చిన ఊరిపక్షులు ఎగిరిపోతే, ఎగరలేని వృద్ధ పక్షులు ఈసురో మంటూ కొలువై ఉన్న పెద్ద మఱ్ఱి చెట్టులా ఉంది మా ఊరు బాపట్ల. శీతాకాలంలో వలస వచ్చే వలసపక్షుల్లా కొంతమంది  చదువులకి పక్షుల్లా వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వరుసగా ఎప్పుడైనా సెలవలు వస్తే, ఊరు మనుష్య సంచారం తగ్గి, శిశిరంలో మొండి మానులా అనిపిస్తుంది. ఇళ్ళు, ఊరు, మనుషుల తీరు... చూస్తుండగానే అన్నీ మారిపోతున్నాయి...

సొంత ఊరిలో  అడుగుపెట్టగానే మన కళ్ళు అప్రయత్నంగా కొంతమంది కోసం, కొన్ని చోట్ల వెతుకుతూ ఉంటాయి. వారందరినీ దాటుకుంటూ తమ ఇంటి వైపు కాళ్ళు అడుగులేస్తాయి. నా పిచ్చి కాప్పోతే, ఊరికి దీపస్తంభంలా ఉండే  “గడియార స్తంభాన్ని” కొట్టేసారు. ఊరినే రక్షించే మా భావన్నారాయణ స్వామి  గోపురం ఐదేళ్ళ క్రితం కూలిపోతే, “ఆలయం  పురావస్తు శాఖ వారి అధీనంలో ఉందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుమతి కూడా కావాలని,” సాకులు  చెప్పి, ఇంతవరకు మళ్ళీ కట్టిన పాపాన  పోలేదు. ఇక భావన్నారాయణ  స్వామి కోవెల స్థితి – ఇవాళా రేపా  అన్నట్లు ఉంది. చారిత్రాత్మకమైన కట్టడాల గతే ఇలా ఉంటే, ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేది ఏముంది? అయినా నా కళ్ళు ఎప్పుడూ ఆ గడియార స్థంభం సెంటర్ నుంచి మధ్యలో ఉండే బాదంపాల కొట్లు, ఆ పక్కగా రోడ్డవతల సంపెంగ పూలతో సహా అన్ని పూలు చవగ్గా అమ్మే పూలకొట్లు, పక్కనుండే పోస్ట్ ఆఫీస్, దాని ముందు  కొలిమి వాళ్ళు, మా ‘శిఖరం వారి వీధి’ మలుపులో ఉండే చెప్పులు కుట్టే సాంబయ్య, కొబ్బరిబొండాల కొట్టు, కాస్త ముందుకు కనిపించే పప్పుల కొట్లు, మా వీధి లో ఎప్పుడో కొట్టు పెట్టుకు టీ అమ్మిన టీ కొట్టు బాబు, వీరందరి కోసం వెతుకుతూ ఉంటాయి. అన్నీ మారిపోయాయి, మారిపోతున్నాయి. ఆవేళ అక్కడ... చెప్పులు కుట్టే సాంబయ్య లేడు !
చవగ్గా చెప్పులు దొరుకుతూ ఉండడం, కాలంతో పాటు మనిషి కూడా పరుగులు తీస్తూ ఉండడంతో ఇప్పుడు చెప్పులు కుట్టించుకునే సమయం, తీరికా ఎవరికి ఉన్నాయి? మొబైల్ లోనే టైం, అలారం పెట్టుకునే వీలు, ఫోటోలు తీసుకునే వీలు ఉండడంతో గడియారం షాప్ లు, ఫోటో స్టూడియోలు  మూతబడ్డాయి. పాడయిన వస్తువుని రిపేర్ చేయించుకునే కాలం ఇదివరకు ఉండేది. కాని, ఇప్పుడు కాలికి తొడిగే చెప్పుతో సహా వాడి పారేసే “యూస్ అండ్ త్రో” తరం వచ్చేసింది. దానితో చిన్న చిన్న కుల వృత్తులు కనుమరుగయ్యాయి. వాటితో ఇల్లు గడిచే వీలు ఎంతమాత్రం లేదు కదా ! అందుకే సాంబయ్య కాని, అతని వారసులు కాని, అదే వృత్తిలో కొనసాగే ప్రశ్నే లేదు. కాని అతను కూర్చునే ఆ కాస్త చోటు, అక్కడి ఇసుకతో కలిసిన మట్టి, నాతో మాట్లాడుతున్నాయి. ‘వాడిపోని పూలగుత్తి’ లాగా మనసులో ఉన్న గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నాయి...
***
“అమ్మా, అమ్మా, గోడెక్కుతుంటే  నా చెప్పు తెగిపోయింది. కుట్టించవా ?”
“ఏమే, మాయా శశిరేఖ లాగా తయారయ్యావు. ఏ చెప్పులూ నీ ధాటికి ఆగవు కదా ! కొత్త చెప్పులు కొని కనీసం వారం అవుతోందా? మళ్ళీ మొదటికి వచ్చావు. అయినా, నాకు తెలీక అడుగుతాను, చెప్పులేసుకుని ఎవరైనా గోడలూ, చెట్లూ ఎక్కుతారుటే ! తింగరబుచ్చివి కాప్పోతేనూ ?” కోప్పడింది అమ్మ.
“ఊరుకోవే పద్మా ! ఏదో చిన్నపిల్ల. ఇది తింగరబుచ్చి అయితే, దీనికి తగ్గ మంగలిమల్లిగాడ్ని దేవుడు ఎక్కడో పుట్టించే ఉంటాడుగా ! ఇంద, ఈ పావలా పట్టికెళ్ళి, వీధి చివర చెప్పులు కుట్టే సాంబయ్య ఉంటాడు, అతనితో కుట్టించుకో, పో !” అంది బామ్మ నన్ను చూసి నవ్వుతూ.
బామ్మ తిట్టిందో, పోగిడిందో తెలీకపోయినా, ఏదో అమ్మ సంధించే అస్త్రాల నుంచి రక్షించేందుకు ఓ పావలా డాలు ఇచ్చింది కదా, గెంతుకుంటూ చెప్పులు కుట్టించుకోడానికి వెళ్ళిపోయాను.
చిన్న గొనె పట్టా మీద ఒక్కొక్కటే ఉన్న రంగురంగుల బూట్లు, చెప్పులు, ఓ పెద్ద రాయి, బ్రష్ లు, రకరకాల పాలిష్ లు, ఏవో జిగురులు, రంగులున్న చిన్న చిన్న గాజు సీసాలు, ఓ చెక్క పెట్టె, ఆ పెట్టె నిండా సూది, సుత్తి వంటి సామాగ్రి. ఇవీ సాంబయ్య ఆస్తులు. ఓ మాసిన చొక్కా, బుర్ర మీసం, గళ్ళ లుంగీ, చింపిరి జుట్టు, ఇదీ  సాంబయ్య అవతారం. కాస్త దూరంగా నిలబడి కాస్త బెరుగ్గా అతను కుడుతున్న చెప్పు కేసి చూడసాగాను. మామూలుగా సూదీ దారంతో కుట్టే కుట్టు కాదది, ప్రత్యేకంగా ఉంది. చెప్పుకి అతికిన కొత్త తోలు లోకి సూదిని జొప్పించి, క్రింది నుంచి దారం మెలి తిప్పి, పైకి లాగడం, కుట్టు పడిపోవడం అంతా గమ్మత్తుగా ఉన్నాయి చూడడానికి! చివరగా ఓ మూలగా చిన్న మేకు కొట్టి, సుత్తి తో ఆ మేకుని అటు, ఇటూ గుచ్చుకోకుండా అణగగొట్టి, కాస్త పాలిష్ కొట్టి, చెప్పుని అటూ ఇటూ తిప్పి తృప్తిగా చూసుకుని, తనముందు నిల్చున్న పెద్దాయనకి ఇచ్చాడు సాంబయ్య.  అప్పటిదాకా, అతనికి పరిసరాలు పడితే ఒట్టు ! అదో తపస్సో, ధ్యానమో అన్నట్లు ఉండేది. ఏ పని చేసినా ఆ పనినే దైవంగా భావించి, అంకిత భావంతో చేస్తే, అందులో రాణించవచ్చు అని అందుకే అంటారేమో !
సాంబయ్య ఇచ్చిన చెప్పుని సంతోషంగా చూసుకున్న పెద్దాయన “ఏమైనా, నీ పనితీరే వేరు సాంబయ్య, చెప్పు కొత్తదానిలా మెరిసిపోతోందనుకో !”అంటూ రూపాయి తీసి, అతను ఇవ్వబోతే, “అర్ధరూపాయి చాలయ్యా, ఈ పనికి అంతే సరిపోతుంది,” అంటూ వెనక్కు ఇచ్చాడు. ఈ లోగా దూరంగా తడబడుతూ నిల్చున్న నన్ను చూసిన సాంబయ్య...
“ఏమ్మా పాపా ! మాణిక్యమ్మ గోరి మనవరాలివి కదూ ! అలా బొమ్మలా చూస్తూ నిల్చున్నావే, అదేంటి చేతిలో, చెప్పు తెగిందా, ఇలారా, కుట్టిస్తాను,” అంటూ పిల్చాడు.
చెప్పు చేతిలో పెట్టి మౌనంగా నిల్చున్నాను. ఐదు నిముషాల్లో చెప్పు కుట్టేసి ఇచ్చాడు.
“మరి నా దగ్గర పావలానే ఉంది” అన్నాను బెరుగ్గా.
“అయ్యో, పది పైసలు చాలమ్మా, ఆ పెద్దాయనకి అంటే, వేరే చెప్పు తోలు తీసి తొడిగి కుట్టాను, నీకైతే ఇంతేలే ! మిగతా డబ్బులతో పప్పుండ కొనుక్కో !” అన్నాడు.
ఇంత మొహం చేసుకుని, గెంతుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఎప్పుడు అటు వెళ్ళినా, సాంబయ్యను చూసి, నవ్వుతూ ఉండేదాన్ని. ఎప్పుడు బాపట్ల వచ్చినా “పాపా, బాగున్నావా?” అని పలకరించేవాడు. ఎందుకంటే -
నాన్నగారి బ్యాంకు ఉద్యోగం రీత్యా వేర్వేరు ఊర్లలో ఉన్నా, వేసవి సెలవలకి మాత్రం మా విడిది అక్కడే ! బామ్మ ఇంట్లో కిందున్న నీళ్ళ ట్యాంక్ మీదనో, డాబా మీదున్న చేప ట్యాంక్ కిందనో, బావి గట్టు మీదనో, దానిమ్మ, ఉసిరి చెట్ల మీదనో, పెరటి వసారాలోనో, గుమ్మంలో ఉన్న వీధి వరండాలోనో, లేక మా బామ్మ ఇంట్లో అద్దెకుండే పది కుటుంబాల ఇళ్ళలో  ఎక్కడో ఒక చోట మా మకాం. నేల మీద కంటే, చెట్లు, గోడల మీదే ఎక్కువ వెతుక్కునేవారు మమ్మల్ని. ఏవో క్రోటన్ పూలు, చిలక ముక్కు పూలు, ముద్ద గన్నేరు పూలు, మల్లె పూలు, యూకలిప్టస్ కాయలు, కావేవీ మా ఆటలకి అనర్హం. మనవరాళ్ళు అంతా కలిసి, ఇల్లు పీకి పందిరి వేస్తున్నారని, మమ్మల్ని ఏవో సంగీతం క్లాస్సులు అనో, హిందీ క్లాస్సులు అనో పంపేసేవారు. అక్కడా ఇదే కిష్కింద కాండ మొదలు !
నాకు నాట్యం అంటే ప్రాణం. పెద్ద పెద్ద కళ్ళు, బొద్దుగా ఉండే ఒళ్ళు, ముద్దుగా ఉండే ముఖ కవళికలు వెరసి, నా ఆకృతి డాన్స్ కోసమే పుట్టినట్టు ఉండేది. ఆ సంగతి తెలిసి, అమ్మ నాకు ఐదేళ్ళ వయసు నుంచి డాన్స్ నేర్పించసాగింది. అప్పటిదాకా, హైదరాబాద్ లో భరతనాట్యం నేర్చుకున్నాను. చిన్న వయసులోనే స్టేట్ పోటీల్లో మూడవ బహుమతి గెల్చుకుని, సి.నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి తీసుకున్నాను. కాని, ఇప్పుడు నాన్నగారికి బదిలీ అయిన ఊళ్ళో గుళ్ళో కూచిపూడి నాట్యం తప్ప నేర్పరు. ఇక్కడే నాకో చిక్కు వచ్చి పడింది.
భరతనాట్యం తాలూకు గజ్జెలు, పశువుల మెడలో వేసే గజ్జెల వంటి వాటిలో చిన్న సైజువి. ఒక తోలుకి కుట్టిన గజ్జెల్ని, అప్పట్లో నాకు గజ్జెపూజ చేసిన భరతనాట్యం టీచర్ ఇచ్చారు. అవే ఇంతవరకు వాడాను. నా ధాటికి అందులో కొన్ని ఊడి పడిపోయాయి కూడాను. కాని, కూచిపూడి నేర్పే మాష్టారు, అవి పనికిరావు, చిన్న గజ్జెలు తెమ్మని చెప్పి, అప్పటికే నెలయ్యింది.
గజ్జెలు అప్పట్లో ఇనప కొట్లలో దొరికేవి. అమ్మ గజ్జెలు కొంది, కాని వాటిని ఒక రకం తెల్ల నవారు తాడుతో అల్లాలి. ఎవరు అల్లుతారు? తీగకున్న గజ్జెలు చూస్తూ, అమ్మను త్వరగా అల్లించమని, లేకపోతే వెనక్కు వెళ్ళాకా మాష్టారు తిడతారని, వేధించే దాన్ని.
“పద్మినీ ! ఆ చెప్పులు కుట్టే సాంబయ్య నీ గజ్జెలు అల్లి పెడతాను అన్నాడే ! అతనికి అల్లిక తెలుసుట !” అంది అమ్మ ఒక రోజు. నా మొహం వెయ్యి కాండిల్ బల్బ్ లాగా తయారయ్యింది. వెంటనే గజ్జెలు, డబ్బులు తీసుకుని, అతని దగ్గరకు పరుగెత్తాను. నాకో చిన్న పీట వేసి కూర్చోపెట్టాడు.
చూస్తుండగానే... అరగంటలో తాళ్లలో మువ్వలు ఇమిడిపోయాయి. నా చిట్టి పాదాలకు సరిపడా కొలత తీసుకుని మరీ  అల్లేసాడు సాంబయ్య ! హబ్బ, కొత్త గజ్జెలు ఎంత బాగున్నాయో ! పైగా నవారుకు అలంకారంగా పైన రంగురంగుల ఊలు కుచ్చులు కుట్టి ఇచ్చాడు సాంబయ్య. వాన వెలసిన తెల్లటి ఆకాశం వంటి నవారు మీద బంగారు రంగు సూర్య కిరణాల్లాంటి మువ్వలు మెరుస్తుంటే, ఆ రెండిటి కలయికకు విరిసిన హరివిల్లులా ఉన్నాయి, ఆ రంగురంగుల ఊలు కుచ్చులు. పట్టలేనంత ఆనందం కలిగింది. నా కళ్ళలో మెరుపులు చూసి, తృప్తిగా డబ్బులు తీసుకు పంపేశాడు సాంబయ్య.
సంబరంగా ఇంటికి గజ్జెలు కట్టుకునే వెళ్ళిన నేను ఆ రోజు అవి తియ్యనే లేదు. రాత్రి అలాగే నిద్రపోతే, అమ్మ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టింది. డాన్స్ ఒక్కటే లోకంగా బ్రతికే రోజులవి... ఒక్కటే లక్ష్యం. టెంత్ తర్వాత కళాక్షేత్రకు వెళ్లిపోవాలి, గొప్ప డాన్సర్ అవ్వాలి ! అంతే. ఖాళీ దొరికినప్పుడల్లా, గజ్జెలు తీసుకుని, డాబా పైకి పరుగులు పెట్టేదాన్ని. ఒక్కదాన్నే, నాలోనేనే, ఎంతో సేపు వచ్చిన డాన్స్ లు అన్నీ పాడుకుంటూ చేసేసేదాన్ని. ఎప్పుడైనా అరుదుగా స్కూల్ లోనో, గుళ్ళో వేడుకలప్పుడో, లేక ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడో డాన్స్ చెయ్యమంటే, నేనే పాట కూడా పాడుతూ చేసేసేదాన్ని. కాని, అప్పట్లో చిన్న ఊర్లలో “డాన్సులు ఆడే పిల్ల” అన్న చులకన భావం ఉండడం వల్ల, భవిష్యత్తులో నాకు ఏ సమస్యలు వస్తాయో అన్న బెరుకుతో, తొమ్మిదో తరగతి తోనే నా నాట్యాన్ని ఆపేయించారు పెద్దలు. అంతే ... నా మువ్వలు మూగబోయాయి. చదువు మాత్రం ఎం.ఎస్.సి దాకా కొనసాగింది. మనసుకు నచ్చిన దారిలో పయనించే అవకాశం, అదృష్టం ఏ కొందరికో మాత్రమే ఇస్తుందేమో జీవితం !
నాట్యం ఆగిపోయినా, బాపట్ల వెళ్ళినప్పుడు, సాంబయ్యను చూడడం, పలకరించడం రివాజుగా మారిపోయింది. కొన్నాళ్ళకి అతని పక్కన ఓ చిన్న బాబు కూర్చుని, చెప్పులు కుట్టడం నేర్చుకునేవాడు. కొడుకు కాబోలు. ఆ తర్వాత చూసినప్పుడు, ఎప్పుడు చూసినా, చుట్ట కాలుస్తూ ఉండేవాడు. ఆ పొగ అలవాటు కారణంగా, అతనికి దగ్గు పట్టుకుంది. తెలుస్తూనే ఉంది... అతని ఆరోగ్యం అంతకంతకూ దిగజారుతోంది. నెమ్మదిగా కొడుకు సాయంతో ఎలాగో నెట్టుకు రాసాగాడు. చూస్తుండగానే కాలం మారిపోయింది, అన్నీ మారిపోయాయి. రింగులు రింగులుగా వదిలే ఆ పొగ అతని పాలిట యమపాశమై ఎగసి, అతన్ని కబళించేసింది. అదే వృత్తిలో ఇప్పుడు జీవికకు అవకాశం లేకపోవడంతో, కొడుకు వేరే పనులకు వెళ్ళడంతో ప్రస్తుతం ఆ చోటు ఖాళీ అయ్యింది.
ఇన్నేళ్ళకు కూతురితో పాటు మళ్ళీ నాట్యం నేర్చుకుంటూ ఆ మువ్వలు తీసాను. మాసిన నవారులో మెరుస్తున్న ఆ మువ్వలు మళ్ళీ కొత్త ఊపిరి పోసుకున్నాయి. నటరాజ స్వామి పాద ధూళి వంటి ఈ నాట్య రవళిలో, లయబద్ధంగా మ్రోగే ఈ మువ్వల్లో, ఎప్పుడో, గాల్లో కలసిపోయిన ఆ సాంబయ్య ప్రాణాలు మువ్వమువ్వలో ప్రతిధ్వనిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నాయి. సాంబయ్యా... నువ్వా సాంబశివుడివే నయ్యా ! నువ్వు లేకపోయినా, ఎప్పుడూ నువ్వు కూర్చుండే మట్టిలో, ఈ సిరిమువ్వల్లో మ్రోగుతూనే ఉంటావయ్యా !
***

No comments:

Post a Comment

Pages