గోదావరి నుంచి సబర్మతి వరకు..(అయిదవ భాగం) - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు..(అయిదవ భాగం)

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు..(అయిదవ భాగం)

అవని 


ఏదో తెలియని అలౌకికానందానికి గురయ్యింది ప్రణవి.
గాయత్రి మాత్రం అ న్య మనస్కంగా ఏదో ఆలోచిస్తున్నట్టు వుంది.
ఇంతలో తన ఫోన్‌ రింగవడంతో ప్రణవి అక్కడనుంచి బయటకు వెళ్ళి మాట్లాడింది.కృష్ణ తను రడీగా వున్నానని సెమినార్‌ కి వెళదాం రమ్మని ఆ ఫోన్‌ సందేశం.
***
రాత్రి పదకొండు దాటింది..కృష్ణ,ప్రణవి ఆడిటోరియం నుంచి ఇంటికి చేరుకున్నారు.
కృష్ణ తనగదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు.ఇంతలో గాయత్రి నెమ్మదిగా వచ్చి పక్కన కూర్చొంది.
" ఏంటి..ఆలోచిస్తున్నారు..పడుకోండి." అంది.
" పరవాలేదు..నువ్వు పడుకో. " చెప్పాడు కాస్త అసహనంగా.
" భోజనాలకి రమ్మని ఫోన్‌ చేసారు కదా అత్తయ్యగారు..మీరు అక్కడే తిని లేటుగా వస్తానన్నరని .."ఇంకా ఏదో చెప్పబోతోంది గాయత్రి.
" ఏం..పరవాలేదు గాయత్రి..నువ్వు పడుకో.." అన్నాడు.
" ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి..?" ఊహించని సూటి ప్రశ్న వేసింది గాయత్రి.
కొంచెం ఘాటుగా ఎక్కడో తగిలినట్టుంది కృష్ణకి.ఒకసారి ఆమెని చూసాడు తదేకంగా..
" నిజం..చెప్పాలా.." మరింత సూటిగా అడిగాడు కృష్ణ.
" నిజమే చెప్పండి..అందులో ఏముంది.." అంది సుతారంగా గాయత్రి.
" మంచి తనానికి మరో రూపం..మానవత్వానికి ప్రతిరూపం.." అన్నాడు.
" నేనడిగింది ..మీకు ఏమవుతుంది అని..అంతేగాని ఆవిడ గొప్పతనం గురించి కాదు.." అడిగింది మళ్ళీ.
"మనిషిని పట్టుకొని నడిపించే ఓ మంచి మార్గదర్శకురాలు.."చెప్పాడు.
" అంటే..ఈ సమాజానికి అర్ధమవుతుందా.." కొంచెం ఆతృతగా అడిగింది.
" అర్ధమవాల్సింది సమాజానికి కాదు..నాకు..నువ్వు ఇలా అడగడం ఆశ్చర్యంగా వుంది." అన్నాడు.
" సరేలెండి.ఐతే కొంచెం విశ్రాంతి తీసుకోండి..తర్వాత మాట్లాడుకుందాం" అంది.
" నువ్వు నన్ను అడిగే లాంట్‌ ఇలాంటి ప్రశ్నలు ఆమెను అడగకు..బాగోదు." చెప్పాడు.
" అబ్బే..నేనెందుకు అడుగుతానండి.." అంది ముక్తసరిగా..
***
గదిలో పడుకొని తీవ్రంగా ఆలోచిస్తుంది ప్రణవి..అసలు ఇదంతా ఏంటి.ఏం జరుగుతోంది..ఒకటే ప్రశ్నలు మనసునిండా తిరుగుతున్నాయి.
ఈ బంధం పేరేంటి..ఈ మానసిక అనుబంధం ఏంటి..కృష్ణ ప్రతి పలకరింపులోని తెలియని ఓ ఆత్మీయత నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది.
 బొమ్మరిల్లులాంటి పొదరింట్లో తనకి దొరకనిది ఏమిటి..దేనికోసం వెతుకుతున్నాడు..నేనేం కోరుకుంటున్నాను. ఏమీ అర్ధం కావడంలేదు.తనలో తనే ప్రశ్నించుకొంటోంది.
****
" ఏంటి..అమ్మా..బాగా నిద్ర పట్టిందా..?" అన్న వేదవతి పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి అడుగు పెట్టినట్టయింది ప్రణవికి.
" పదమ్మా..నువ్వు తయారయితే అలా లలితా దేవి గుడికి వెళ్ళొద్దాం.." చెప్పింది వేదవతి.
" సరే ఆంటీ..పది నిమషాల్లో రడీ" అంటూ చకచకా రడీ అయింది ప్రణవి.
వేద పాఠశాలకి కాస్తంత కూతవేటు దూరంలో చక్కగా తీర్చిదిద్దినట్టున్న ప్రాంగణంలో కొలువుతీరివుంది ఆ ఆలయం.ఆలయం చుట్టూ చక్కని పచ్చికతో కూడి కూర్చొని సేద తీరడానికి అమర్చిన సిమెంట్‌ బెంచీలు అక్కడక్కడ వున్నాయి.ఆ వాతావరణంలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తోంది.మంద్ర స్వరంలో చక్కగా వినపడే లలితా సహస్రనామం ఓ వైపు వీనుల విందుగా అనిపిస్తోంది.
నెమ్మదిగా అక్కడికి చేరి లలితా దేవి దర్శనం చేసుకున్నారు వేదవతి,ప్రణవి.ఆ దేవతామూర్తిని చూడగానే త్రిగుణాత్మక సంహితమైన పార్వతి,లక్ష్మి,సరస్వతుల ప్రతిరూపంలా అనిపించింది ప్రణవికి.ఆ తర్వాత అక్కడ ఉన్న సిమెంట్‌ బెంచీ మీద కూర్చున్నారు.
" చెప్పమ్మా..ఏంటి విశేషాలు..ఈ ఊరు,వాతావరణం ఎలా అనిపిస్తోంది." అడిగింది వేదవతి.
" చాలా బాగుంది ఆంటీ..స్వచ్చంగా,నిర్మలంగా,అచ్చంగా తెల్లకాగితంలా వుంది.మంచి ముత్యాల్లాంటి మీలాంటి మనుషుల మధ్య నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా వుండలేనంత అత్మీయంగా వుంది.."చెప్పింది ప్రణవి.
" చెప్పమ్మా..మీ నాన్నగారు ఏం చేస్తారు..నీ గురించి చెప్పమ్మా..వినాలనివుంది.నీ గొంతులో తెలియని ఓ తీయదనం నన్ను బాగా ఆకట్టుకుంటోంది.." ప్రణవి తల నిమురుతూ అడిగింది వేదవతి.
మెల్లగా మంద్ర స్వరంతో చెప్పడం మొదలెట్టింది ప్రణవి..
 " మాది గోదావరి దగ్గరలోని ఓ పల్లె గ్రామం.పచ్చని పొలాలతో,గలగల పారే సెలయేరుతో,కల్మషం తెలియని పల్లెవాసులతో హాయిగా,ఆహ్లాదంగా గడిచిపోయింది బాల్యం.నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు.ఆ పక్క అనేక గ్రామాలకు ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు.ఊళ్ళో జనం అనేక సమస్యలతో మా ఇంటికి వచ్చేవారు.వాటిని తనదైన రీతిలో పరిష్కరించి వాళ్ళకి ఓ మార్గాన్ని చూపించేవారు నాన్నగారు.ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను అనేక కోణాల్లోని మనుషుల్ని,వాళ్ళ స్వభావాల్ని బాగా ఆకళింపు చేసుకున్నాను.నన్ను బాగా చదివించాలని నాన్నగారు బాగా తపన పడేవారు.అదే నన్ను ఈ రోజు విశ్వవిద్యాలయం మెట్ట్లెక్కెలా చేసింది.
అలా విశ్వ విద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే నాకు శ్రీరాం తో పరిచయం అయింది.నేను పెరిగిన వాతావరణం,నా చుట్టూ వున్న పరిస్తితులు నన్నో పరిణతి గల అమ్మాయిలా మార్చడమే కాకుండా,ఒకింత స్వేచ్చ,మరికొంత ధైర్యాన్ని కూడా అలవర్చాయి.
శ్రీరాం మొదట్లో పరిచయం ఐనప్పుడు ఒక మంచి స్నేహితుడిలా కనిపించాడు.అతనిలోని నిరాడంబరత,నన్ను ఇష్టపడే తత్వం నాలోని ఇష్టాన్ని మరింత పెంచాయి.ప్రేమ అంటే అదే అని తెలుసుకోడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.కానీ ఇద్దరం మనసులోనే దాచుకున్నాం.
ఈలోగా శ్రీరాం కి కొచిన్‌ పోర్ట్‌,లో ఓ జాబొచ్చింది.చాలా మందికి ఎదురయ్యే సమస్యలాంటిదే ఇది.కెరియరా..ప్రేమా..? నేను కెరియర్‌ కే వోటెయ్యమన్నా..కానీ శ్రీరాం నీ సాహచర్యం,నీ స్నేహాన్ని వదిలి వెళ్లలేనని అసక్తతని కనపరచాడు.నచ్చచెప్పాను..నేను ఎక్కడికిపోతాను..నేను ఎప్పుడూ వుంటాను.కానీ కెరియర్‌ వుంటే నీకు ఎంతోబాగుంటుంది అని ప్రోత్సహంచాను.
అప్పుడు తన మనసులోని మాటని బయటపెట్టాడు..నీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దవాళ్లతో మాట్లాడతానన్నాడు.
" దేనికి.." నా ప్రశ్న.
" నీకు ఇష్టమైతే నిన్ను వివాహం చేసుకుంటాను.." సంకోచిస్తూ చెప్పాడు.
" నాకు జీవితంలో కొన్ని ఆశయాలు,లక్ష్యాలు వున్నాయి..ఆ తర్వాతే పెళ్ళి " అన్నాను.
" నాకేం అభ్యంతరం లేదు.." అన్నాడు.
అంతేగాని అవి ఏమిటో ఏ రోజు అడగలేదు.
పెద్దల దగ్గరకి వెళ్ళి నిజాయితీగా చెప్పాం.అభ్యంతరం చెప్పడానికి పెద్దగా కారణాలు కనపడలేదు..కానీ పెద్దవాళ్ళ ద్వారా వస్తే బాగుండేదన్నది   వాళ్ళ అభిప్రాయం.
ఐతే ప్రస్తుతానికి నిశ్చితార్ధం చేసుకుందాం..కొంతకాలం తర్వాత పెళ్ళి చేసుకోవచ్చు.అన్న అభిప్రాయానికి వచ్చారు.
అందులో పెద్ద ఆలోచించడానికి,అభ్యంతరం చెప్పడానికి ఏమీలేదు అనిపించింది.ఒక శుభముహూర్తంలో ఆ ముచ్చట జరిగింది.
అలా కొన్ని రోజులు తెలియకుండానే గడిచిపోయాయి.ఈలోగా శ్రీరాం కొచిన్‌ వెళ్ళి జాబ్‌ లో జాయిన్‌ అయ్యాడు.నేను ఆఖరి సెమెస్టర్‌ పి.జి. పరీక్షలు రాసి పి.హెచ్‌.డి.ప్రవేశ పరీక్షకి ప్రిపేర్‌ అవుతున్నాను.
అందరి రాతలు రాసే దేవుడు..ఎవరికి,ఎప్పుడు..ఎలా రాస్తాడో ఎవరికీ తెలీదనేది ఒక నిజమైతే అది వాళ్ళ పూర్వ జ న్మ సుకృత,దుష్కృతాలని బట్టి వుంటుందన్నది మరో మాట.ఏది ఏమైనా పుట్టాం కాబట్టి జీవితంలోని మంచి.చెడ్డల్ని ఊపిరి వున్నంతవరకు అనుభవించాల్సిందే..ఇది నా అభిప్రాయం.
పాతిక సంవత్సరాలు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకి తమ పిల్లల మీద అభిమానాలే కాదు అధికారాలు కూడా వున్నాయంటారు కొందరు.కొందరు జీవితాంతం పిల్లల్ని ప్రేమిస్తారే కాని వాళ్ళనుంచి ఏమీ ఆశించకూడదంటారు మరికొందరు.ఇందులో మొదటి రకానికి వస్తారు శ్రీరాం పేరెంట్స్‌,.
వాళ్ళలో కమర్షియల్‌ కోరికలు మొదలయ్యాయి.ఓ పది ఎకరాలు భూమి తో పాటు,కట్నం కోసం కూడా పట్టుబట్టారు.ఇదంతా ఎందుకో అర్ధం కాలేదు.వదిలించుకోవాలని చూస్తున్నారా అనిపించింది.ఈ విషయం శ్రీరాం కి తెలియడం అవసరం అనిపించింది.శ్రీరాం సున్నితంగా ఆ ఆలోచనల్ని ఖండించాడు.నా దృష్టిలో మరింత ఉన్నతంగా కనబడ్డాడు.
అలా రోజులు గడవడం మొదలెట్టాయి..అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకోడంతో రోజులు హాయిగానే గడిచిపోతున్నట్టు అనిపించాయి.
అంతే అకస్మాత్తుగ్గా ఊహించని ఉపద్రవంతో ఒక్క కుదుపు..
అంతా ఊహించని నిశ్శబ్ధం..చీకటిలాంటి వాతావరణం..
కిం..కర్తవ్యం..ఏం చేయాలి..ఎలాంటి అడుగు వెయ్యాలి..
అందరిలోనూ ఒకటే ఆలోచన..
(సశేషం..)

No comments:

Post a Comment

Pages