తిరోగమనం

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గొంగళిపురుగు దశనుండి

సీతాకోక చిలుక అవ్వొచ్చుకాని

సీతాకోకచిలక నుండి

గొంగళిపురుగవ్వొచ్చా?

 

విచక్షణతో వివేకంతో

జీవనయానం చేస్తూ

సకల జీవరాశిని సమాదరిస్తూ

ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ

అంతరిక్షాన్ని..సమస్త గ్రహాలని

పాదాక్రాంతం చేసుకుంటూ..

 

అనుపమాన మేధస్సుతో

దేవుడికి సైతం కన్నుకుట్టేలా

అప్రతిహతంగా ఎదిగి..

మానవోత్తముడిగా మన్ననలందుకుంటున్నంతలోనే..

 

రాక్షసాధముడిగా మారి

అకారణ విద్వేషాగ్నితో రగిలిపోతూ

నలువైపులా మారణకాండ సృష్టిస్తూ

పేట్రేగిపోవడం..

 

తిరోగమనం కాక మరేమిటి?

ఈ వికృతికి పోగాలం ఎప్పుడు దాపురిస్తుందో

సకలం శోభాయమానం..శుభమయం ఎప్పుడవుతుందో?

 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top