Saturday, October 24, 2015

thumbnail

రణధీరుడు (పెద్దకధ – 2వ భాగం )

రణధీరుడు (పెద్దకధ – 2వ భాగం )

అక్కిరాజు ప్రసాద్


తన రాజ్యంపై ప్రతీకార చర్యకు పూనుకునేది ఎవరన్న ఆలోచన ఆయన మనసును తొలిచింది. రణధీరుడిని ఇలా అడిగాడు "రణధీరా! మా రాజ్యం క్షేమం కోరి ఇంతటి ముఖ్యమైన విషయాన్ని నాకు తెలియజేసినందుకు శివానంద సరస్వతి గురువులకు, వ్యయప్రయాసలతో ఇక్కడికి వచ్చి గోప్యంగా ఈ విషయాన్ని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు మా రాజ్యం ఎంతో రుణపడి ఉంది అని తెలిపి అతనిని తన వద్ద ఉన్న ఆభరణాలతో, వస్త్రాలతో సత్కరించి స్వయంగా రాజ్యం పొలిమేరల వరకు వెళ్లి వీడ్కోలు చెప్పాడు.
శూరసేనుడు జగన్మోహినిని పిలిపించి వివరాలు తెలిపాడు. మహామంత్రి చతురబుద్ధిని అక్కడికి రావలసిందిగా ఆదేశించాడు. చతురబుద్ధి హుటాహుటిన రాజమందిరానికి వచ్చాడు. "మహామంత్రీ! మగధదేశంపై పెద్ద కుట్ర జరుగుతోంది. మన రాజ్యంపై తిరుగుబాటు చేయటానికి ఎవరో సమాయత్తమవుతున్నారు. వీలైనంత త్వరగా నాకు వివరాలన్నీ తెలియాలి. దీనికి మన రాజ్యం నుండి శక్తియుతులు కలిగిన, నమ్మకమైన ఒక వ్యక్తిని విదర్భ రాజ్యానికి పంపాలి. ఎవరైతే సముచితమో మీరే చెప్పాలి" అన్నాడు. చతురబుద్ధి దీర్ఘాలోచన చేసి, "మహారాజా! దీనికి అన్ని విధాలా మన యువరాజు విక్రమసేనుడు యోగ్యుడు. అతడు ఈ కార్యాన్ని సఫలం చేయగలడని నా నమ్మకం" అని అంటాడు. మహారాజు జగన్మోహిని వైపు చూడగా ఆ తల్లి తనయుడి శౌర్యపరాక్రమాలు, బుద్ధి కుశలతపై పరిపూర్ణమైన నమ్మకంతో ఆ అభిప్రాయాన్ని ఆమోదించింది.
రాజకోటకు నైరుతి దిక్కున గంగానది ఒడ్డున ఒక యువకుడు ఉత్సాహంగా గుర్రపు స్వారీ చేస్తున్నాడు. వేగంగా మలుపులు తిప్పుతూ, కొండలు, గుట్టలు, మైదానాలు దాటుతూ గంగానది వెంబడి ఎంతో దూరం వెళ్లాడు. అతని వెంట నలుగురు సైనికులు, ఇద్దరు మిత్రులు. వారిని చూస్తుంటే చిరుతపులుల సమూహం వేగంగా పరుగెడుతున్నాయా అన్నట్లుంది. ఆ యువకుడి కళ్లలో సాహసం, శౌర్యం, ఆత్మ విశ్వాసం కనబడుతున్నాయి. కొన్ని గంటల తరువాత వాళ్లు కోట సమీపానికి చేరుకున్నారు. గుర్రాలు ఆపి, ప్రజలలో మమేకమైనారు. అంగట్లో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇంతలో ఒక సైనికుడు వచ్చి "యువరాజా! మహారాజు మిమ్మల్ని వెంటనే రాజమందిరానికి రమ్మన్నారు" అని సందేశమిచ్చాడు. నాన్నగారి తలపు రాగానే యువకుడి మనసులో భక్తి భావం పొంగింది. శరవేగంతో రాజమందిరాన అడుగుపెట్టాడు. తల్లిదండ్రులకు, మహామంత్రికి నమస్కరించాడు.
శూరసేనుడు కుమారుడు విక్రమసేనుడుని చూసి ఉప్పొంగి పోయాడు. "యువరాజా! నీ భుజస్కంధాలపై ఒక క్లిష్టమైన కార్యం మోపుతున్నాను. నీవు దానిని సాదించగలవని మా నమ్మకం" అని వివరాలు తెలిపి మహారాణివైపు, మహామంత్రివైపు చూశాడు. వారిరువురూ రాజు గారి మాటలకు సమ్మతం తెలిపినట్లుగా అతనిని ఆశీర్వదించారు. యువరాజు మరల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొంది రాజగురువు శంకరభట్టు గారి నివాసానికి చేరుకున్నాడు.
"గురువర్యా! నాన్న గారు నాపై నమ్మకంతో ఒక పనిని నాకు అప్పగించారు" అని ఆయనకు వివరాలు తెలిపాడు. శంకరభట్టు విక్రమసేనుని ఆశీర్వదించి ఇలా అన్నాడు "నాయనా! మీ కులదైవము సిద్ధలింగేశ్వరుని కొలిచి కార్యాన్ని ఆరంభించు. కానీ, నీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. మొదటిది - వచ్చే శుద్ధ పంచమి నాటికి, అనగా సరిగ్గా వారం రోజులలో నీవు కార్యాన్ని పూర్తి చేయాలి. అటు తరువాత నీకు, మహారాజు గారికి పరీక్షా కాలం.
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. సిద్ధలింగేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి మహాపాశుపత హోమం, ఏకాదశరుద్రాభిషేకం చేసి వెళ్లు. రెండో విషయం - ఈ విషయం వెనుక మన రాజపరివారంలోని ముఖ్యమైన వ్యక్తులెవరో ఉన్నారేమో నా మనస్సాక్షి తెలుపుతున్నది. దీని గురించి నీకు నమ్మకస్థులైన అనుచరులను నిఘాగా నియమించు. మూడో విషయం - విదర్భరాజ్య సరిహద్దులు దాటగానే అక్కడ భువనేశ్వరీమాత ఆలయం ఉంది. ఆ తల్లి మహిమాన్వితమైంది. అమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచి రాజ్యంలో ప్రవేశించు. దిగ్విజయోస్తు" అని ఆశీర్వదించి, తన మెడలోని స్ఫటిక మాలను ఆతని మెడలో వేస్తాడు.
గురువుల ఆదేశంతో విక్రమసేనుడు తన సహచరులైన ప్రబుద్ధి సుబుద్ధి అనే వారిని కోటలో విద్రోహచర్యలేమైనా జరుగుతున్నాయేమో గమనించటానికి నియమించాడు. కోటలో ఈశాన్య దిక్కున ఉన్న సిద్ధలింగేశ్వరుని పూజించటానికి శంకరభట్టుతో వెళ్లాడు. ఎంతో నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో ఆ ఈశ్వరుని కొలిచాడు. ఈశ్వరుడు అతడిని అనుగ్రహించాడా అన్నట్లు ఆ సమయంలో కుంభవృష్టి కురిసింది. విక్రమసేనుడు ఈశ్వరుని ప్రసాదం స్వీకరించి, తల్లి దండ్రుల ఆశీర్వాదంతో విదర్భకు బయలుదేరాడు.
గంగానది దాటి ఒక చెట్టుకింద సేదతీరాడు. పచ్చని చెట్లు, గలగల పారే గంగానది, పక్షుల కిలకిలారావాలు, నెమళ్ల అందమైన నడకలు, లేళ బింకపు చూపులతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందమైన రాజకన్య చెలికత్తెలతో ఆ ప్రాంతంలొ విహారానికి వచ్చింది. పూల తీగలతో అల్లుకున్న మర్రి ఊడలలో ఊయల ఊగుతూ కేరింతలు కొడుతూ ప్రపంచాన్ని మరచిపోయేంత ఆనందిస్తోంది. ఇంతలో ఎక్కడనుండి వచ్చిందో మదపుటేనుగుల సమూహం. ఒక్కసారిగా ఆ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. బెంబేలెత్తి పరుగెత్త సాగారు ఆ రాజకన్య మరియు చెలికత్తెలు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చాడో మెరుపు వేగంతో రణధీరుడు. ఒక్క ఉడుటున హుంకరించి ఆ ఏనుగుల కుంభస్థలంపై పిడి గుద్దులు కురిపించాడు. అద్భుతమైన శరీర లాఘవంతో మెలికలు తిరుగుతూ, విన్యాసాలు చేస్తూ ఆ గజసమూహాన్ని చెల్లా చెదరు చేశాడు. ఆ సన్నివేశం చూసి నివ్వెరపోయింది రాజకన్య. ఏనుగుల సమూహం వెనుదిరిగిపోయాక రణధీరుడు రాజకన్య దగ్గరకు వచ్చి తన పరిచయం చేసుకున్నాడు. ఆమె చెలికత్తెలు 'ఈ కన్య విదర్భరాజ్య యువరాణి బిందుమాలిని ' అని పరిచయం చేశారు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆతడు ఆమె మనసు దోచుకున్నాడు. ఆతడూ ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు. ప్రేమ చిగురించింది. చీకటి పడుతుండటంతో బిందుమాలిని పరిచారికలతో అంతఃపురానికి వెళ్లింది. రణధీరుడు శివానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్నాడు.
విక్రమసేనుడు ఉదయానే మేల్కొని గంగానదిలో స్నానమాచరించి భువనేశ్వరీ మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించాడు. అక్కడకు శివానంద సరస్వతి ఆ సమయంలో వచ్చాడు.  విక్రమసేనుని దగ్గరకు వెళ్లి 'నాయనా! నన్ను శివానంద సరస్వతి అంటారు. నువ్వు ఎవరవు? ఎందుకు ఇక్కడికి వచ్చావు?' అని అడిగాడు. రణధీరుడు శివానంద సరస్వతికి ప్రణమిల్లి 'అయ్యా! మీరు మా క్షేమం కోరేవారని మాకు మీరు పంపిన యువకుని వలన తెలిసింది. మీ మంచితనానికి, ముందు చూపుకు మా రాజ్యం మీకు రుణపడి ఉంది" అని తాను వచ్చిన కార్యాన్ని వివరించాడు. వారి సంభాషణలో శివానంద సరస్వతి విక్రమసేనుని ఎడమ భుజంపై ఉన్న పచ్చబొట్టు చిహ్నాన్ని చూశాడు. వెంటనే రణధీరుని భుజంపై గల చిహ్నం గుర్తుకు వచ్చింది. ఆ చిహ్నమేమిటని విక్రమసేనుని ప్రశ్నించాడు. విక్రమసేనుడు ఆయనతో "గురువర్యా! ఈ చిహ్నం నేను పుట్టినపుడు మా తాతగారు, అప్పటి మహరాజు వీరసేన మహారాజు గారు వేయించారుట. ఇది మా వంశంలో మగసంతానానికి వేయించే ఆనవాయితీ ఉంది అని తాతగారు చెప్పటం నాకు బాగా గుర్తు." అని అన్నాడు. శివానంద సరస్వతి ఆశ్చర్యచకితుడైనాడు. ఒక్కసారి గతంలోకి వెళ్లింది ఆయన ఆలోచన.
గంగానదీ తీరం. కాశీ పుణ్య క్షేత్రం. విశ్వనాథుని మందిరానికి ఆవలి తీరాన వ్యాసపీఠంలో శివానంద సరస్వతి ధ్యానమగ్నుడై ఉన్నాడు. చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకు తెలియనంత తదేక ధ్యాస. ఎన్నాళ్లనుండి తపస్సులో ఉన్నాడో తెలియదు. వానలు వరదలు వచ్చి నది ఉప్పొంగి ఆయన కూర్చున్న చెట్టును తాకేంత ప్రవాహంలో గంగానది ప్రవహించింది. అయినా ఆయనకు తెలియలేదు. వర్ష ఋతువు వెళ్లి శరదృతువు వచ్చింది. నదీ ప్రవాహం తగ్గింది.
ఎక్కడినుండి వచ్చిందో ఒక పుష్పమాల శివానంద సరస్వతి కంఠాన్ని అలంకరించింది. మెరుపు శరీరాన్ని తాకినంత శక్తి తనలో ప్రవేశించటంతో శివానంద సరస్వతి ధ్యానం నుండి కన్నులు తెరచాడు. ఎదురుగా ఒక నెలల మగ బిడ్డ. ఆ పసిబాలుని ఎడమ భుజంపై పెద్ద పచ్చబొట్టు చిహ్నం. బాలుడి తల్లిదండ్రులకోసం వెదికి ఎవ్వరూ కానరాక అతనిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. బాలుని రాకతో ఆశ్రమంలో వేడుక వాతావరణం వచ్చింది. అప్పటినుండి ఆ బాలుని ఎంతో బాధ్యతతో పెంచాడు శివానంద సరస్వతి. అతనిని సకలవిద్యా పారంగతుని చేశాడు. అతనికి కఠోరమైన పరీక్షలు పెట్టి ఉత్తీర్ణుడయ్యేంతవరకు ప్రోత్సహించాడు. ఆబాలుడే రణధీరుడు. విక్రమసేనుడు-రణధీరుడు ఒకే వంశంలో బిడ్డలని శివానంద సరస్వతికి అర్థమయ్యింది. రణధీరుని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని సంకల్పించాడు.
విక్రమసేనుడు శివానంద సరస్వతి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ రణధీరుని కలిసి ఎంతో సంతోషించాడు. అతనిని చూడగానే సోదరభావం కలిగింది. వారి వద్ద సెలవు తీసుకొని తన లక్ష్యసిద్ధికి బయలుదేరాడు. తమ రాజ్యంపై కుట్రపన్నుతున్న ఆ దంపతులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఎందరో యువకులు అస్త్ర శస్త్ర విద్యలలో శిక్షణ పొందుతున్నారు. ఆ ప్రాంగణం నుండి బయట పడుతుండగా విక్రమసేనుడి దృష్టి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులపై పడింది. తనను అనుమానంగా చూస్తున్న వారి వద్దకు వెళ్లాడు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలపై ఉన్న లిపిని చూశాడు. అది కేవలం మగధ రాజప్రాసాదంలో వాడే రహస్య భాష యొక్క లిపి. పెద్ద ఖడ్గము, చురకత్తులు, డాలుపై ఆ లిపి వ్రాసి ఉంది. విక్రమసేనుడు వారిని ఆ విషయం ఎత్తకుండా ఆ దంపతుల కోసం తాను వైశాలీ రాజ్యం నుండి వచ్చానని, వారు మగధపై చేసే తిరుగుబాటులో తానూ పాల్గొనటానికి బృందంగా వైశాలీ రాజు పంపగా వచ్చానని తెలిపాడు.
విదర్భ రాజ్యానికి, వైశాలీ రాజ్యానికి మగధ రాజ్యంతో గల శత్రుత్వం కొత్తది కాదు. శూరసేనుడు జగన్మోహిని వివాహమాడే సమయంలో విదర్భ యువరాజు, వైశాలీ యువరాజు స్వయంవర పరీక్షలలో ఘోరంగా విఫలమై శూరసేనుడు గెలిచిన సందర్భంనుండీ ఆ వైరం ఉన్నదే. అటు తరువాత రెండు మార్లు విదర్భ వైశాలీ రాజ్యాల సేనలు మగధపై దాడికి ప్రయత్నించారు. గోవులను అపహరించి, ఎందరో మగధ ప్రజలను చెరపట్టారు. కానీ, శూరసేనుడు చతురబుద్ధి యుక్తితో తన శక్తితో వారిని అవలీలగా ఓడించి తన రాజ్య సార్వభౌమాధికారాన్ని కాపాడాడు. ఇదీ ఈ రాజ్యాల మధ్య శతృత్వపు గాథ.
ఆనాటి రాత్రి విక్రమసేనుడు ఆ దంపతుల నివసిస్తున్న ప్రాంగణపు అంతర్భాగంలో ప్రవేశించాడు. అక్కడి ధన ఆయుధ సంపదను చూసి ఆశర్యపోయాడు. ఎకరాలకు పైగా భూమి కింద మళిగలలో ఆయుధాలు, గదుల నిండా కుప్పలు పోసిన ఆభరణాలు, ధనము, కారాగారాలు ఉన్నాయి. దాదాపుగా పదివేల మందికి సరిపడా ఆయుధాలు అక్కడ ఉన్నాయి. మగధ రాజ్యపు   రేఖా చిత్రాలు, కోట పూర్తి వివరాలు, సైన్యం వివరాలు అన్నీ గోడలపై చెక్కబడి ఉన్నాయి. మధ్యలో ఒక తలుపులు మూసిన మందిరం ఉంది. లోనికి చప్పుడు కాకుండా ప్రవేశించాడు. దంపతులు నిద్రపోతున్నారు. ముసుగుతో వారి వద్దకు వెళ్లి పరిశీలించాడు. వారి ముఖాలను చూసి అవాక్కయ్యాడు... ఉగ్రసేనుడు, ప్రభావతీ దేవి....
(సశేషం)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information