వెన్నెల యానం – 8 - అచ్చంగా తెలుగు

వెన్నెల యానం – 8

Share This

వెన్నెల యానం – 8

భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనగా, చంద్రిక తల్లిదండ్రులు, అత్తయ్య కుటుంబం అంతా అనుకోకుండా కేదారనాథ్ వరదల్లో చనిపోతారు. చంద్రిక బావ కంపెనీ బాధ్యత ఆమె మీద పడుతుంది. కోట్లకు వారసురాలిగా ఒంటరిగా మిగిలిన చంద్రికకు ముగ్గురు యువకులు ప్రేమ ఉచ్చు బిగించాలని చూస్తూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా, ఫేస్ బుక్ మెసెంజర్ లో ఆమె ఒక ఫోన్ కాల్ అందుకుంటుంది.  ఇక చదవండి...)
“చెప్తా కాని, ముందు నువ్వు పడవ పోనీయ్... ఇలా తెడ్లు వెయ్యడం ఆపేసి, నోరుతెరుచుకు  నన్నే చూస్తూ కూర్చుంటే, మనం మధ్యాహ్నానికి పేరంటపల్లి ఆలయం చేరుకోలేము.” తనూ ముందుకి వంగి అంది చంద్రిక.
“సరే అయితే, నేను సవ్యసాచి లాగా ఎడాపెడా పడవ నడపాలంటే నాకు ముందు ఎనర్జీ కావాలి. ఓ సారి దగ్గరకొచ్చి, గట్టిగా కౌగలించుకుని, ‘భేష్, నీ అంతటి పడవవాడు లేడోయ్,’ అని భుజం తట్టి, ఒక ముద్దు కట్నంగా ఇచ్చావనుకో, గంటకు వెయ్యి మైళ్ళ వేగంతో పడవ నడిపేస్తా. నువ్వు టార్టాఇస్ కాయిల్ చేతిలో పుచ్చుకుని, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవచ్చు.” అన్నాడు శరత్ చేతులు చాపి.
వెంటనే వెళ్లి అతన్ని కౌగలించుకుని, నుదుట సుతారంగా చుంబించింది చంద్రిక... చంద్రిక జ్ఞాపకాల అలలను చీల్చుకుంటూ వెళ్తున్నట్లుగా పడవ ముందుకు సాగుతోంది.
**********
ఆలోచించాను... క్లిష్ట పరిస్థితిలో ఉన్న అతను బ్రతకాలంటే ఒక ముద్దు కావాలి. అతను పొరపాటున ఫోన్ చేసినా, నన్ను ఎవరో తన ప్రేయసి అనుకుంటున్నాడు. అయినా, నేను ముద్దు పెట్టినా, పెట్టేది ఫోన్ కే గాని, అతనికి కాదు కదా ! కాస్తంత ధైర్యం, మాటసాయం మనిషికి కొత్త ఊపిరి పోస్తుంది. నిశ్చయంగా, ఆపత్కాలంలో ఇలా చెయ్యడంలో తప్పేం లేదు. నా ఆలోచనల పరంపర ఇంకా కొనసాగుతోంది.
“ఏమేవ్... ‘సాహసం చేస్తే రాకుమారి లభిస్తుందన్న’ పాతాళభైరవి సినిమాలో ఎస్.వి.ఆర్ మాటలు విని, నీ ప్రేమకోసం వలలో పడి, ఏదో లారి గుద్దేస్తే, ఇలా ఒడ్డున పడేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటున్న నాకు జస్ట్ ఒక్క ముద్దు పెట్టి, బ్రతికించమని అడిగితే... అదేదో రాష్ట్రవిభజన కోసం ఆలోచించే ప్రధానమంత్రిలా ఇంత ఆలస్యం చేస్తావా ? అన్యాయం అధ్యక్షా !” అంది, ఫోన్ లో అవతలి స్వరం.
అతని మాటలకు నవ్వుకుని, నెమ్మదిగా పెదవులతో నా ఫోన్ ను స్ప్రుశించాను. ‘ఏం పర్వాలేదు, మీరు కోలుకుంటారు... మళ్ళీ మామూలు జీవితం గడుపుతారు. ధైర్యంగా ఉండండి,’ అన్నాను.
“హమ్మయ్య, ఇప్పుడు ఎన్ని ఆపరేషన్ లు అయినా నవ్వుతూ చేయించేసుకుంటానే. అయినా మీరు ఏంటే... కొత్తగా, ప్రేమలో ఫార్మాలిటీస్ దగ్గరితనాన్ని చంపేస్తాయి అనికదా మనం ఒప్పందం కుదుర్చుకున్నాము ? ప్రపంచం మొత్తం మీద  ఒక్క మనిషితోనైనా అరమరికలు లేకుండా చనువుగా ఉండకపోతే, జీవితం బోర్ కొట్టేస్తుంది కదా ! బాబోయ్, నర్స్ వచ్చేసింది... బై...” లైన్ కట్ అయిపొయింది.
అంతే, తర్వాత వారం గడిచిపోయింది. ఈ వారం రోజులూ అతను ఎవరో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. తెల్సిన వాళ్ళను కనుక్కున్నాను. అసలు చచ్చాడో, బ్రతికాడో తెలుసుకోవాలని, మళ్ళీ మెసెంజర్ లో కాల్ వస్తుందేమోనన్న ఉద్వేగంలో, పగలూ, రాత్రీ నెట్ ఆన్ లో ఉంచాను. ఏ సమాచారం లేదు. అతని మాటలు నా చెవుల్లో మ్రోగుతున్నాయి. “ప్రపంచం మొత్తం మీద  ఒక్క మనిషితోనైనా అరమరికలు లేకుండా చనువుగా ఉండకపోతే, జీవితం బోర్ కొట్టేస్తుంది కదా !” అటువంటి వ్యక్తి నాకు ఒక్కరూ లేరే ! అంతా ఏదో ఒక హోదాలో మహారాణిలా నన్ను చూసేవారే!
పది రోజులు దాటుతుండగా, ఒకరోజు నేను ఫారన్ డెలిగేట్స్ తో ముఖ్యమైన మీటింగ్ ముగించుకుని కార్ లో ఇంటికి తిరిగి వెళ్తుండగా, మళ్ళీ మెసెంజర్ లో అతని నుంచి కాల్ ఫ్లాష్ అయ్యింది. వెంటనే కార్ ను రోడ్డు పక్క ఆపి,
“అసలు నీకు బుద్ధుందా లేదా ? నువ్వెవరో , ఎందుకు ఫోన్ చేసావో నాకు తెలీదు. ఐ.సి.యు లో ఉన్నాను అని చెప్పావు, ఉన్నవో, పోయావో తెలీక ఎంత మధనపడ్డానో తెలుసా ?” గట్టిగా కోప్పడింది.
“మేడం. మీ కోపంలో అర్ధం ఉంది. కాని, నేను చెప్పేది కూడా వినండి. ముందుగా మీకు సారి చెప్పాలి. ఎందుకంటే, ఫేస్ బుక్ లో అచ్చంగా మీరు పెట్టిన గులాబి ప్రొఫైల్ ఫోటో తో, మీ పేరుతోనే ఇంకో ప్రొఫైల్ ఉంది. అది నా మాజీప్రేయసిది. ‘మాజీ’ అని ఎందుకు అంటున్నాను అంటే... నాకు ఆక్సిడెంట్ అయిన మరుక్షణం ఆమె నా స్థితి తెలుసుకుని, తెరమరుగయ్యింది. కోలుకున్నాకా ఫేస్ బుక్ చూస్తే, ‘అవిటి వాడితో జీవితం గడపలేను. ప్రస్తుతం బ్రతుకుతావో, చస్తావో, బ్రతికినా కనీసం సరిగ్గా నడవగలుగుతావో లేదో, ఎన్నాళ్ళకు కోలుకుంటావో చెప్పడం కష్టమని, డాక్టర్ లు చెప్పారు. పచ్చడైన నీ ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని కూడా చెప్పారు. నీవంటి బాధ్యతారహితమైన వ్యక్తితో జీవితం గడపలేను. నన్ను క్షమించు.’ అన్న మెసేజ్ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, మరి నేను ఫోన్ చేసింది ఎవరికి... చూస్తే, తనలాంటి ప్రొఫైల్ ఫోటో ఉన్న మీరు !”
“మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉండండి, చూస్తాను,” అంటూ తనవద్ద ఉన్న ట్యాబు నుంచి ఫేస్ బుక్ తెరిచి చూసింది, నిజమే, అటువంటి ప్రొఫైల్ ఫోటో, అదే పేరుతో ఉన్న మరో అమ్మాయి!
“ఆశ్చర్యంగా ఉందండి. ప్రస్తుతం ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది ?” అడిగింది చంద్రిక.
“నాకు ఈ లోకంలో ఎవరూ లేరండి. అందుకే ప్రాణాలు అన్నీ ప్రేయసి పైనే పెట్టుకున్నాను. అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల ఆమె కూడా దూరమయ్యింది. శారీరక ఆరోగ్యం ఓ నెల రోజుల్లో చేకూరుతుంది అని డాక్టర్ లు చెప్పారు. కాని, ఆమె ప్రవర్తన వల్ల మానసికంగా తగిలిన గాయం ఎప్పటికి మానుతుందో తెలీదు. మా కంపెనీ వారు నన్ను ప్రాజెక్ట్ పనిమీద అమెరికా పంపి, ఈ మధ్యనే ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం వల్ల, ఒకరిద్దరు తప్ప ఇక్కడ కూడా ఆప్తులు ఎవరూ లేరు. ఉన్నవారు కూడా ఎవరి బిజీలో వాళ్ళు. ఎందుకో, ఒక్కసారిగా ప్రపంచమంతా శూన్యం అయిపోయినట్లు తోస్తోంది. మీరు నన్ను మనస్పూర్తిగా క్షమిస్తే, మధ్యమధ్య నన్ను పలకరిస్తూ ఉంటారా ప్లీజ్...” అవతల మౌనంగా ఏడుస్తున్న శబ్దం.
నా గుండె ద్రవించిపోయింది. ఆప్తులంతా ఒకేసారి దూరం అయినప్పుడు, నా స్థితి నాకు గుర్తుకు వచ్చింది. అంత సరదాగా మాట్లాడిన వ్యక్తి, ఈ విధంగా ధైర్యం కోల్పోకూడదు. అతనికి సాయం అందించాలి, అని ధృడంగా నిశ్చయించుకున్నాను. “ముందు మీరు ఏ హాస్పిటల్ లో ఉన్నారో చెప్పండి, ఇప్పుడే వస్తాను.”
“నేను పంజాగుట్టలోని యశోదా హాస్పిటల్, రూమ్ నెం. 303 లో ఉన్నానండి, అయినా మీకు శ్రమ...” అంటూ ఉండగానే లైన్ కట్ చేసి, కార్ ను అటువైపు మళ్ళించాను.
విశాలమైన హాస్పిటల్ ఆవరణలో అటు, ఇటు హడావిడిగా తిరుగుతున్నారు నర్స్ లు, డాక్టర్లు, కంపౌడర్లు. ఇంకా విసిటింగ్ అవర్స్ కావడంతో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నేరుగా ఆ రూమ్ కు వెళ్లాను. బెడ్ మీద ముక్కు భాగమంతా బాండేజ్ లతో ఉన్న ఆ యువకుడి మొహం స్పష్టంగా తెలియట్లేదు. నెమ్మదిగా దగ్గరికి వెళ్లి, పక్కనున్న కుర్చీ లాక్కుని, అతని చెయ్యి, నా చేతిలోకి తీసుకున్నాను.
“ మీ పేరు ?” అడిగాను.
“ఏవిటి, పేరు తెలియకుండానే చూసేందుకు వచ్చారా ?” ఆశ్చర్యంగా అడిగింది నర్స్. ఆమెను కాసేపు బైటికి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేసాను.
“నా పేరు ... నా పేరు... శ్రీ... శ్రీరాం అండి.” అతని కళ్ళు కొండంత ఆశ్చర్యంతో విప్పారి, రెప్ప వెయ్యటం కూడా మరిచి నన్నే చూస్తున్నాయి. కొత్తగా పరిచయమైన నేను ఇలా రావటం అతనికి దిగ్భ్రమ కలిగించింది.
“నా పేరు చంద్ర, చంద్రిక. స్పూర్తి ఇన్ఫోటెక్ అనే కంపెనీ అధినేత్రిని. కోట్లకు వారసురాలైన ఒంటరిని. కాని, చుట్టూ ఎంత డబ్బున్నా, బిజీ పనులున్నా, నాలోని మనసు ఇంకా బ్రతికే ఉంది. అదే మీ మాటల్లోని నిజాయితీకి ద్రవించి, మీవద్దకు నన్ను వచ్చేలా చేసింది. మీకు నా కధ చెబుతాను. విన్నాకా, బ్రతుకు మనల్ని సవాలు చేసినప్పుడు, చావో రేవో తెల్చుకునేలా ఏటికి ఎదురీది అయినా పోరాడాలో, లేక మధ్యలో ఈత మాని, నిస్పృహతో మునిగిపోవాలో మీరే నిర్ధారించుకోండి...” అంటూ అతనికి నా కధ వినిపించాను.
అంతా విన్న అతని కళ్ళలో నీళ్ళు. అతని చెయ్యి, నా చేతిని చాలా బలంగా పట్టుకుంది. అలా పట్టుకోడంలో మళ్ళీ అతనిలో చిగురించిన బ్రతకాలన్న ఆశ నాకు స్పష్టమయ్యింది.
“ శ్రీరాం గారు, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్లిపోతాము. మధ్యలో మనం ఒంటరితనాన్ని అనుభూతి చెందకూడదు అనేమో, భగవంతుడే ఇన్ని బంధాలుగా మారి మనల్ని అలరిస్తూ ఉంటాడు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ నర్స్ తో సహా, ఆయన ప్రతిరూపాలే. మీరు మళ్ళీ కళకళ లాడుతూ తిరగాలని కోరుకునేవారే. మీరు కోలుకునేదాకా, మధ్యమధ్య వస్తూనే ఉంటాను. మీ బాగోగులు చూసేందుకు ఒక మనిషిని మాట్లాడాను. అతను, ఈ పాటికి వస్తూనే ఉంటాడు.”
“నాపై ఎందుకింత దయ చూపుతున్నారు ? దీనికి బదులుగా నేను మీకు ఏమివ్వగలను ? నాకు ఆసరాగా దివి నుంచి దిగి వచ్చిన దేవతా మీరు...”
“అలాగే అనుకోండి. అనుకుని, నాకు చిన్న నైవేద్యం కూడా పెట్టాలి. మీరు ఇదివరకు లాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. నన్ను నువ్వు అంటూ  ఏకవచనంతోనే పిలవాలి, ఒక మంచి స్నేహితురాలిగా నన్ను భావించాలి. ఏ సమయంలో మీకు ఏ అవసరం వచ్చినా, ఏ సాయం కావాల్సినా, మాట్లాడాలి అనిపించినా, నాకు ఒక్క మెసేజ్ పెట్టండి. వీలవ్వగానే ఫోన్ చేస్తాను. ప్రతి ఆదివారం మిమ్మల్ని కలిసేందుకు తప్పకుండా వస్తాను.” అన్నాను, అతని చేతిని నొక్కి వదులుతూ.
ఇంతలో అక్కడకు వచ్చాడు తెలుపు ప్యాంటు, షర్టు వేసుకున్న ఒక నడివయసు వ్యక్తి. నుదుట విభూతి రేఖలు. “వీరి పేరు సాయిబాబా. సాయి బంధువు, భక్తులు. అవసరంలో ఉన్నవారికి అపరిమితమైన సేవ చేసేందుకు తన జీవితం అంకితం చేసారు. ఇటువంటి వారు ఇంకా ఉన్నందుకేనేమో ఈ భూమి ఇంకా నిలబడుతోంది. వీరు మిమ్మల్ని సొంత తమ్ముడిలా చూసుకుంటారు. ఇక చింతించకండి, మీకు మేమున్నాము అన్న ధైర్యంతో కోలుకోండి.”  అని చెప్పి, కృతజ్ఞతతో చూస్తున్న అతని కళ్ళకు నవ్వుతూ బదులిచ్చి, నర్స్ కు నా వివరాలు అందించి, జాగ్రత్తలు చెప్పి, తిరుగుముఖం పట్టాను.
ఎందుకో ఆ రాత్రి ఒక మంచి పని చేసానన్న తృప్తితో, చాలా రోజుల తర్వాత నిద్రమాత్ర వేసుకోకుండానే, హాయిగా నిద్రపట్టింది నాకు.
(సశేషం...)
 

No comments:

Post a Comment

Pages