ప్రేమతో నీ ఋషి – 8 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 8

Share This

ప్రేమతో నీ ఋషి – 8 

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కలిసి భావాలు పంచుకుంటుండగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక వారిలో అంతర్లీనంగా బలపడుతుంది. ఇక చదవండి...)
“హాయ్ మృణాళ్. గుడ్ మార్నింగ్. 5 నిముషాల్లో నా డెస్క్ వద్ద నన్ను కలవగలవా ? “ ఇంటర్కాం లో మృణాళ్ కు ఫోన్ చేసింది స్నిగ్ధ.
ఆ రోజు సోమవారం, స్నిగ్ధ ఆఫీస్ కు త్వరగా వచ్చింది. ఆమె పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసి, ఆ వారం చెయ్యాల్సిన పనులను సిద్ధం చేస్తోంది.
“నలదమయంతి పెయింటింగ్ అందలేదని నాకు హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది. మనం రెండు వారాల క్రితమే పంపామని నేను వారికి మెయిల్ పంపాను. నేను ఈ పెయింటింగ్ ను దాదాపు నెల క్రితమే క్లియర్ చేసాను. ఆలస్యానికి వేరేదైనా కారణం ఉందా ?” తన డెస్క్ వద్దకు వచ్చిన మృణాళ్ ను అడిగింది స్నిగ్ధ.
“నేను వేరే పనుల్లో చిక్కుకుని ఉండడంవల్ల ఇది కాస్త ఆలస్యమయ్యింది. ఒకటి రెండు రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాను.” హామీ ఇచ్చాడు మృణాళ్. సూటిగా అతనిచ్చిన జవాబు స్నిగ్ధ అతన్ని ప్రశ్నించడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదని సూచిస్తోంది.
“ నీ పని ఒత్తిడిని నేను అర్ధం చేసుకోగలను. కానీ, ఈ ప్రాజెక్ట్ నవంబర్ కు ప్రారంభం కానుంది. మనం మార్చ్ లో ఉన్నాము. ఇంకా 8 నెలలే ఉంది, ఇంకా మనం 200 పెయింటింగ్స్ ను ఎంపిక చేస్తేనే మన 500 టార్గెట్ ను చేరుకోగలుగుతాము. రానున్న రోజుల్లో మనకు మరింత ఒత్తిడి పెరగనుంది. నీకు నా సాయం కావాలంటే చెప్పు.” మర్యాదగానే మృణాళ్ కు చెప్పినా ధృడంగా పలికింది ఆమె స్వరం.
“నేను క్లియర్ చేసినా, హైదరాబాద్ పంపకుండా ఆఫీస్ లో పడున్న పెయింటింగ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో నేను తెలుసుకోవచ్చా ?” మరిన్ని వివరాలు తెలుసుకోవాలని, అడిగింది స్నిగ్ధ.
“దాదాపు 10 ఉంటాయి. నేను ఈ వారాంతం లోపు అవన్నీ క్లియర్ చేస్తాను,” హామీ ఇచ్చాడు మృణాళ్.
“ఓకే. నేను మధ్యాహ్నం స్టోర్ హౌస్ కు వచ్చి, స్టాక్ పరిస్థితి ఏమిటో సమీక్షిస్తాను. దీనికి ఏర్పాట్లు చెయ్యగలవా ?” తనకున్న పరిమితుల్ని అధిగమించి బాధ్యత తీసుకోవడం అనే స్నిగ్ధ లక్షణమే ఆమె మహేంద్ర  మెప్పును పొందేలా చేసింది.
మృణాళ్ అసౌకర్యాన్ని దాచేందుకు ప్రయత్నిస్తూ, “ఓ, తప్పకుండా, నేను రేపటికల్లా ఏర్పాట్లు చేస్తాను. ఓకే నా ?” అంటూ వెంటనే స్పందించాడు.
“ఓకే. పర్వాలేదు. కాని, మీకు ఇబ్బంది కలిగినప్పుడు సాయపడేందుకే నేనిక్కడ ఉన్నానని, మీరు గుర్తుంచుకోండి. అందుకే, మనిద్దరం కలిసి, పని ఎంతుందో చూసి, పెండింగ్ ఉన్నవన్నీ రేపటికి క్లియర్ చేద్దాం.” అంది స్నిగ్ధ వాతావరణాన్ని తేలిక పరుస్తూ, మృణాళ్ కు దిగ్భ్రమ నుంచి తేరుకునే అవకాశమిస్తూ.
ఆమె క్యాలెండరు చూసి, అప్సర ఆ రోజు మధ్యాహ్నం తనను కలిసేందుకు రానుందని గుర్తించింది. అప్పటినుంచి, రోజువారీ పనుల్లో పడిపోయి, లంచ్ టైం వరకు ఇట్టే గడిచిపోయింది. ఆమె లంచ్ ముగించుకుని రాగానే, తనకోసం లాంజ్ లో ఎదురుచూస్తూన్న అప్సర ఆమెకు కనిపించింది.
“హలో అప్సరా, ఎలా ఉన్నావు ? లంచ్ అయ్యిందా ? “ అడిగింది స్నిగ్ధ. అప్సర ఎప్పట్లాగే చక్కగా అలంకరించుకుని కనిపించింది ఆమెకు.
అప్సర స్నిగ్ధ కంటే 8 ఏళ్ళు పెద్దది, కాని చెబితే తప్ప, ఎవరూ ఆ వయసు తేడాని గమనించలేరు. అప్సర అలా మైంటైన్ చేస్తుంది. ఆమె వయసు ముడుతలు లేకుండా చాలా నాజూగ్గా కనిపిస్తుంది, దాన్నే ఆమె దర్పంగా ప్రదర్శిస్తుంది.
మామూలుగా తన ఒంపుసొంపుల్ని, శరీరాకృతిని ప్రదర్శించగల వెస్త్రెన్ దుస్తుల్ని ఆమె ధరిస్తుంది. ఏ పురుషుడికైనా, వారి దృష్టిని ఇట్టే ఆకర్షించగల అయిస్కాంతం లాగా ఆమె కనిపిస్తుంది. ఆకర్షణను తట్టుకునే వారి నిగ్రహ శక్తికి ఆమె ఒక పరీక్షలా కనిపిస్తుంది. ఆమె నడుస్తున్నప్పుడు, ఆమె వెనుక భాగాన్ని ఒంపులు తిప్పుతూ స్పష్టపరిచే హై –హీల్స్ షూస్ ధరిస్తుంది. ఆమె అలా కదిలి వెళ్ళినప్పుడల్లా, చూపరులకు మతిపోగోట్టేలా ఆమె తననుతాను ప్రదర్శించుకునే విధానం, వారిని మూర్చపోయేలా చేస్తుంది.
“లంచ్ అయింది స్నిగ్ధా. నీది ?” సమ్మోహనంగా నవ్వినా నవ్వు ఆమె వదనానికి మరింత అందం తెచ్చింది.
స్నిగ్ధ తన శరీరం గురించి, కావలసినంత శ్రద్ధ మాత్రమే వహిస్తుంది, ఆమె అందం ఆమె సింప్లిసిటీ లోనే ఉంది. స్నిగ్ధలా కాకుండా అప్సర, చూపరుల కళ్ళకు ఏదోఒకటి అందిస్తూనే ఉంటుంది.
అప్సర కనిపించే విధానం గురించి స్నిగ్ధకు అభ్యంతరాలున్నా, ఎప్పుడూ వెల్లడించే ధైర్యం చెయ్యలేదు. స్నిగ్ధ, అప్సర భిన్న ధృవాల వంటివారు, అయినా  స్నిగ్ధకు ఇటువంటి విషయాల గురించి పట్టించుకునేందుకు తగిన కారణం లేదు.
అప్సరతో ఆమె సంప్రదింపులు అన్నీ చాలావరకు పనికి సంబంధించినవే. వ్యాపారరీత్యా ఆమె సూక్ష్మబుద్ధిని స్నిగ్ధ ప్రశంసించినా, ఆమె ప్రాజెక్ట్ కు ఎంపిక చేసే కళాఖండాల పట్ల స్నిగ్ధకు అభ్యంతరాలు ఉండేవి.
చాలావరకు, అప్సర వివాదాస్పదమైన కళాఖండాలను ఎంపిక చేసేది. అటువంటివి చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయని ఆమె అభిప్రాయం.
అటువంటి వాటి అన్వేషణలో, మ్యుజియం యొక్క కళాత్మకమైన అంశాల నుంచి, సహజంగానే ఆమె దృష్టి మళ్లేది. ఈ విషయంలో స్నిగ్ధ తరచుగా అప్సరతో ఈ విషయంపై వాదించేది – సంచలనాత్మకమైన వాటిని ఎన్నుకోవడం కంటే, మ్యుజియం కు ఆ కళాఖండం ఎంతటి ప్రతిష్టను కలిగిస్తుంది అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అనేది.
ఈ రోజు కూడా, తను ఎంపిక చేసిన ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ ను స్నిగ్ధ  ముందుకు కదిపేందుకు నిరాకరించడంతో, ఆ విషయం గురించి చర్చించేందుకే అప్సర స్నిగ్ధను కలిసింది. అవి వివిధ భంగిమల్లో చిత్రించిన హిందూ దేవతల నగ్న చిత్రాలు. ప్రతి పెయింటింగ్ లోనూ, ఆ దైవం చేతిలోని ఆయుధం తప్ప, వారిని పూర్తిగా నగ్నంగా చిత్రీకరించారు.
కేట్ విన్స్లెట్ ఆ పోస్ లో వంటిపై  కేవలం ఒక డైమండ్ లాకెట్ తో సుందరంగా కనిపించినా, దేవతల చిత్రాల విషయంలో అది కాస్త భావగర్భితమైన విలువల్ని కలిగి ఉంటుందని స్నిగ్ధ భావించింది. అందుకే ఆమె సిఫార్సు చెయ్యబోయే పెయింటింగ్స్ జాబితాలో వాటిని చేర్చేందుకు నిరాకరించింది. కాని అప్సర దీని గురించి చర్చించేందుకు పట్టుబట్టి, ఇదే విషయాన్ని మాట్లాడేందుకు స్నిగ్ధ ఆఫీస్ కు వచ్చింది.
స్నిగ్ధ ఆమెను కాన్ఫరెన్స్ రూమ్ కు తీసుకువెళ్ళి, అప్సర చర్చను మొదలపెట్టాలని ఎదురు చూడసాగింది.
“అయితే స్నిగ్ధ,చివరికి మనం ఈ పెయింటింగ్స్ ను మ్యుజియం కలెక్షన్ లలో పెడుతున్నట్టేనా ?” అప్సర నేరుగా విషయానికి వచ్చింది.
“అప్సరా అది ప్రైవేట్ మ్యుజియం అయితే నేను వాటిని తీసుకునేదాన్ని. కాని ప్రజలముందు ప్రదర్శనకు ఉంచినప్పుడు, అదీ దక్షిణ భారతంలో అంటే, ఈ పెయింటింగ్స్ కేవలం జుగుప్సాకరమైన విలువని, చెడ్డ ప్రచారాన్ని మాత్రమే కల్పిస్తాయని, నేను భావిస్తున్నాను. అటువంటి ప్రచారాన్ని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మన మ్యుజియం తట్టుకోలేదు.” స్నిగ్ధ మరొక్కసారి తన భావాల్ని స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వెల్లడించింది.
ఇప్పుడామె అప్సరకు ఏ మాత్రం బెదరకుండా ఇటువంటి సంభాషణలను కొట్టిపారేస్తోంది. ఆమె తనను తాను ఈ సంస్థలో ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగినిగా భావించడంవల్ల, తన పనిలో జోక్యం కల్పించుకున్న ఎవరితోనైనా మాట్లాడే ధైర్యాన్ని కలిగిఉంది.
అప్సర వెనక్కు తగ్గింది. ఆమె అహం దెబ్బతిన్నట్టు కనిపించింది. ఆమె సూటిగా స్నిగ్ధ కళ్ళలోకి చూస్తూ, “స్నిగ్ధ ఒక్కొక్క పెయింటింగ్ వెల ఎంతో నీకు తెలుసా ? ఒక్కొక్కదానికి సుమారు 5 కోట్లు. ఎందుకో నీకు తెలుసా – అన్ని వేలం వస్తువుల్లో వీటికి అత్యధికమైన డిమాండ్ ఉంది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి, త్వరగా వీటిని అమ్మాలని చూస్తున్న ఒక ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్ ను నేను అతికష్టం మీద ఒప్పించాను.” అంది.
స్నిగ్ధ ఇంకా దీనితో ఏకీభవించినట్లు కనిపించలేదు. ఆమె మహేంద్రకు ఫోన్ చేసి, దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని అంది. వాళ్ళు వెంటనే ఇండియాకు కాల్ చేసి, మహేంద్ర సెక్రటరీని అతనితో మాట్లాడించమని అభ్యర్ధించారు. మహేంద్ర లైన్ లోకి రాగానే, అప్సర ముందుగా చొరవ తీసుకుని, ఆ నగ్న దేవతా చిత్రాలు మ్యుజియం కు తేగల సంచలనాత్మకమైన విలువను గురించి చెప్పింది. మొదట్లో అటువంటి ప్రచారం మ్యుజియం కు మరింతమంది సందర్శకులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తుందని, ఆమె అంది.
స్నిగ్ధ తన అభిప్రాయాన్నే తెలుపుతూ, మ్యుజియం అటువంటి చవకబారు పనులను ప్రోత్సహించకూడదు అంది. ఆమె మ్యుజియం ప్రారంభోత్సవాన్ని రాజకీయంగా సునిశితమైన అంశాన్ని చేస్తూ, పూర్తిగా ఆపివెయ్యగల ఉద్యమకారుల గురించి కూడా మహేంద్రకు సూచన చేసింది. అంతేకాక, మ్యుజియంకు వారు అనుకున్న విధానాల దృష్ట్యా ఇవి జాతీయ కళాఖండాలు కూడా కావని, ఆమె చెప్పింది.
అన్నీ విన్నాకా, మహేంద్ర ఇలా బదులిచ్చాడు, “ అప్సర, స్నిగ్ధ చెప్పేది చాలా సమంజసంగా ఉందని నాకు అనిపిస్తోంది. ప్రారంభ దశలో ఊహించని చెడు ప్రచారం ఎదుర్కునే కంటే, నేను అంతగా పేరుప్రఖ్యాతులు రాకపోయినా నిలకడగా ఉండడాన్నే ఇష్టపడతాను. నీ కష్టాన్ని నేను అభినందిస్తున్నా, నేను మరికొంతకాలం  వేచి ఉండి, దీన్ని గురించి ఒక నిర్ణయానికి వద్దాము.”
అప్సర మళ్ళీ వాదించబోయింది, కాని మహేంద్ర స్వరంలో పలికిన అయిష్టతను దృష్టిలో పెట్టుకుని, మరొక్కసారి ఆలోచిస్తూ, విరమించుకుంది.
“అప్సరా, ఈ దశలో మన ప్రాధాన్యతల గురించి మనం స్పష్టంగా ఉందాము. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం, మీడియా పబ్లిసిటీ ను పెంచడం కాదు, టూరిస్ట్ లను, సందర్శకులను పెంచడం. మరిన్ని పెయింటింగ్స్ కోసం నీ అన్వేషణ కొనసాగించు, కాని అలా వెతికేటప్పుడు, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని సరిగ్గా ప్రతిబింబించే వాటినే ఎంచుకో.” అంటూ తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాడు మహేంద్ర .
“ఉదాహరణకి, నువ్వు ప్రద్యుమ్న పెయింటింగ్స్ ను ఎన్నింటిని వెతికి పట్టినా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే దేవతల్ని అతను చూపే విధానం కళ్ళకు ఇంపుగా ఉండి, గొప్ప చారిత్రాత్మకమైన విలవల్ని కలిగి ఉంటుంది. ఇదే విషయం నేను నీకు అనేకమార్లు చెప్పాను, నాకు ప్రద్యుమ్న చివరగా వేసిన ‘మేనకా విశ్వామిత్రా పెయింటింగ్ ‘ ను ఎలాగైనా తీసుకురావాలని ఉంది. అది నువ్వు తేగలిగితే, అంతకంటే గొప్ప ప్రచారం ఉండదు. ఆ దిశలో నీ ప్రయత్నాలను కొనసాగించు.” అని చెప్తూ, మహేంద్ర ఫోన్ పెట్టేసాడు. గదిలో అప్సర, స్నిగ్ధ కాసేపు మౌనంగా ఉండిపోయారు. అప్సర కాస్త నిరాశకు గురైనా, దాన్ని మొహంలో కనిపించనివ్వలేదు.
*********
మర్నాడు ఉదయం స్నిగ్ధ రాగానే మృణాల్ ఆమెను పలకరించి, పెయింటింగ్స్ ఉన్న క్రింది అంతస్తులోని హాల్ కు వెళదామా అని అడిగాడు. ఆమె సైన్- ఇన్ రివాజులను పూర్తిచేసి, అతనితో వెళ్ళింది. రెండవ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ద్వారా వెళ్ళేబదులు, ఆమె మెట్లు దిగసాగింది. మృణాళ్ ఆమెను అనుసరించసాగాడు. ఆమె మెట్లు దిగుతుండగా, మృణాళ్ ఆమెను తేరిపారా చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది.
మగవారు చాలాసార్లు వారి మనసులోని ఆలోచనలను, భావనలను చెప్పరు. ప్రదర్శిస్తారు. ఒక ఆర్ట్ స్టూడెంట్ గా, చూపుల్ని, అంగవిన్యాసాల్ని చదవగలగడం ఆమెకు సహజంగానే అబ్బింది. మగవారు తమలోని భావాల్ని దాచగాలిగామని భావించినా, తన వద్ద ఉన్న ఒక వ్యక్తి తనను కామంతో చూస్తున్నాడో, లేక గౌరవభావంతో చూస్తున్నాడో ఆమె తేలిగ్గా చెప్పగలదు.
ఆమె క్రింది ఫ్లోర్ ను చేరుకోగానే, పరిస్థితిని సమీక్షించేదుకు చూస్తే, అక్కడ నేలమీద 12 పెయింటింగ్ లు, వాటికి హాని కలిగే విధంగా దాదాపు ఒక నెలపైనుంచే పడున్నాయని, గుర్తించింది. “మృణాళ్ , ఈ పెయింటింగ్స్ ను హేండిల్ చెయ్యడంలో మనం మరింత జాగ్రత్త వహించాలని నాకు అనిపిస్తోంది. మరొక్క విషయం నాకు చెప్పు – మొత్తం ప్రక్రియ పూర్తయినా, ఈ పెయింటింగ్స్ ను ఎక్స్పోర్ట్ చేసేందుకు కంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతోందో చెప్పు ?” స్నిగ్ధ ఇప్పుడు కారణాలు తెలుసుకోవాలని అనుకుంటోంది.
కాని, మృణాళ్ తనకు చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పినట్లు ఆమెకు అనిపించింది. పైగా అతని కళ్ళు ఆమెను ఆకలిగా తడుముతున్నాయి. మృణాల్ కళ్ళలో కనిపించిన కామం, ఒక్కక్షణం పాటు ఆఫీస్ లో మొట్టమొదటిసారిగా ఆమె చూపుల్ని వెనక్కి తీసుకునేలా చేసింది. కాని, వెంటనే ఆమె తేరుకుని, ఆ భావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
“బాధపడకు స్నిగ్ధ, నేను ఈ గందరగోళాన్ని త్వరలోనే క్లియర్ చేస్తాను. ఒక వారం సమయం ఇవ్వు, నేను అన్నీ పంపేస్తాను,” అన్నాడు. విషయం మహేంద్ర దాకా వెళ్తే, మరింత క్లిష్టం అవుతుందని అతనికి తెలుసు. మహేంద్రకు తనపట్ల కంటే, స్నిగ్ధ పట్ల ఎక్కువ గౌరవం ఉందని కూడా అతనికి తెలుసు. అందుకే, అప్పుడే, అక్కడే త్వరగా ఆ సమస్య పరిష్కారం అవ్వాలని అతను భావించాడు.
“సరే అయితే. త్వరగా పూర్తిచెయ్యి. రాబోయే కొన్ని వారాల్లో మన పని ఒత్తిడి పెరగనుంది. మన ఆఫీస్ లో ఉన్న కాస్తంత స్థలంలో మనం పెయింటింగ్స్ ను పేరుస్తూ పోలేము. ఇవాళ మరో పెయింటింగ్ ఉ అప్పగించనున్నారు. దీనివల్ల, మనకు పెయింటింగ్స్ ను సరిగ్గా ఉంచేందుకు తగినంత స్థలం లేదని తెలుస్తోంది. ఈ హాల్ ప్రక్కన ఉన్న గదిలో కాస్త చోటు ఉందేమో చూడకూడదూ ?” స్నిగ్ధ మృణాళ్ ను అడిగింది.
మృణాళ్ చాలా అసహనంగా కనిపిస్తూ, “స్నిగ్ధా, నువ్వు చింతించకు, దీని గురించి నేను చూసుకుంటాను. పెయింటింగ్స్ ను గురించి తగినంత శ్రద్ధ వహించడం నా బాధ్యత. అందుకే, ఈ పనిని నాకు వదిలెయ్యి. ప్రక్కన ఉన్న గది, మహేంద్ర ప్రైవేట్ రూమ్. అది ఆయనకు ఎందుకు కావాలో నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వు కూడా అడిగేంత సాహసం చేస్తావని నేను భావించట్లేదు, కదూ ? లేక అడుగుతావా ?” అతను ఉద్దేశపూర్వకంగా సంభాషణను ముగించాలని అనుకున్నాడు.
స్నిగ్ధ అతని అంగవిన్యాసాన్ని అర్ధం చేసుకుని, సంభాషణను ఇక పొడిగించలేదు. “ సరే, నువ్వెలా చెప్తే అలా, కాని ఈ శుక్రవారానికి స్టాక్ తీసుకుని, రాబోయే కొన్ని వారాలకు ప్లాన్ చేద్దాము,” అంటూ తన డెస్క్ కు తిరిగి వెళ్ళిపోయింది.
మృణాళ్ ఆమెను త్వరగా అనుసరించాడు, ఆమెకూ అతనితో చర్చను తేలికపరచాలని ఉంది. క్రింది ఉద్యోగులు కాకుండా, తనకు ఉన్న ఒకేఒక్క సీనియర్ ఉద్యోగి అతను. అతనితో వ్యవహారం చెడితే, ఆమె ఉద్యగం వదలాల్సి రావచ్చు. అటువంటి మూర్ఖపు కారణాల కోసం ఆమె తన ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధంగా లేదు.
“మృణాళ్, ఒక సంగతి చెప్పు, నీకు ఇష్టమైన రంగు ఏది ?” వాతావరణాన్ని తేలిక పరుస్తూ అడిగింది స్నిగ్ధ.
ఈ ప్రశ్నల ద్వారా ఆమె మృణాళ్ ను గురించి మరింతగా తెలుసుకోవాలని అనుకుంటోంది.
మృణాళ్ ఆమె స్వరంలోని మార్పును గమనించి నవ్వి, “నాకు నీలిరంగులో ఉండేవి అన్నీ ఇష్టమే...” అంటూ ఒక్క క్షణం ఆగి...” ఫిలిమ్స్ కూడా” అన్నాడు.
స్నిగ్ధకు ఆ జవాబు ఎంతమాత్రం నచ్చలేదు, అతనితో ఇవాళ ఇక మాట్లాడకూడదని ఆమె అనుకుంది. కాని, “బాగుంది, ఇది మగవారు అందరికీ ఇష్టమైన రంగు. ఎందుకంటే, ఇది అధికారాన్ని, మేధస్సును, స్థిరత్వాన్ని సూచిస్తుంది. గుడ్ లక్ ” అని బదులిచ్చింది. ఆమె తన చోటుకు వెనక్కు వెళ్లి, పనిని కొనసాగించింది. కాని, ఇంకా అతను పిచ్చివాడిలా తనవంక చూస్తున్నాడని, ఆమె సబ్ కాన్షస్ మైండ్ కు అనిపించసాగింది. ఆమె ఆ భావనను త్వరగా అధిగమించింది, ఎక్కడ పనిచేసినా మొదట తను ఎదుర్కోవాల్సిన సాధారణమైన సమస్య అదే.
అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కూడా, తనకంటే 17 ఏళ్ళు చిన్నదైన, పింక్ కలర్ శాటిన్ డ్రెస్ వేసుకున్న G -8 డెలిగేట్ దొంగచూపులు చూస్తూ, దొరికిపోయాడని ఒకరోజు దినపత్రికలో ఆమె చదివింది. ఇటలీ లో ఆ సదస్సు గ్రూప్ ఫోటో తీసేముందే, సరిగ్గా ఇది జరిగింది.
“ఋషి కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. “ అనుకుంది ఆమె ఒక్కక్షణం. ఋషిని గురించిన ఆలోచన ఆమె భావోద్వేగాల స్థాయిని వెంటనే చల్లార్చింది. సాయంత్రం అతనితో మాట్లాడితే, తనకు కాస్త హాయిగా ఉంటుంది, అని ఆమెకు తెలుసు. ఆమె ఆఫీస్ లో చేరాకా, మొదటిసారి, మృణాళ్ ప్రవర్తన ఆమెను సందిగ్ధంలో పడేసింది.
ఆమె మొబైల్ తీసి, ఋషికి కాల్ చేసింది. అతను వెంటనే తీసాడు, “ఋషి, మనం ఇవాళ డిన్నర్ కు కలుద్దామా ?” అని అడగ్గానే ఋషి హుషారుగా ఎగిరి గంతేసి, ఆమె అడిగినదానికి ఒప్పేసుకున్నాడు.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages