Sunday, August 23, 2015

thumbnail

నందో రాజా భవిష్యతి

నందో రాజా భవిష్యతి

చెరుకు రామమోహనరావు 


నందో రాజా భవిష్యతి అన్న నానుడిని మనము విరివిగా వాడుతూనే వుంటాము.ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడూరకుంటామా ! జరిగినప్పుడు చూద్దాములే అన్న భావనకు అనుగుణముగా వాడుతూవుంటారు.అసలు దీనికి ఒక కథ వుంది. అందులో ఒక దాసి తన రాణికి ధైర్యము నూరిపోసే సందర్భములో ఈ మాట చెబుతుంది.నిజానికి మనిషిలో నిరాశ నిస్ప్రుహ ఆవరించినపుదు ప్రోత్సాహము అత్యవసరము. మనము క్రీడలలో ఈ విషయమును గమనించుతూనేవుంటాము. అసలు సీతమ్మను వెదుక వానరసైన్యమును అఖడ భూమండలములోని అన్ని దిక్కులకు తన వానర సైన్యమును పంపి వెదకించుతానముట ఒక ఆశను కలిగించే ప్రోత్సాహమే కదా! మనము చేయగలిగినది లేనపుడు చేసిపెట్తమని భగవంతుని ఆశించుచూనే వున్నాము కదా! మన అబ్దుల్ కలాము గారు కూడా కలలుగను.కన్న కలను సాధించు అన్నారు.కొన్ని కష్టపడి సాధించేవైతే కొన్ని కాకతాళీయంగా జరిగి పోయేటివి వుంటాయి. అందుకే ఆశ ఉన్నా అవకాశము వచ్చేవరకు ఊరక ఉండవలసినదే. భర్తృహరి సుభాషితముల తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేతలోని ఈ పద్యము చూడండి.  
రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండ బద్ధమై 
భీతిలి చిక్కి యాశ చెడి పీదయు దస్సిన పాము వాత సం
పాతముజెందె దానిదిని పాము తొలంగె బిలంబు త్రోవనే
ఏతరి హానివృద్ధులకు నెక్కుడ్ దైవవము కారణంబగున్ 
బుట్టలో బంధింపబడిన పాము బయటికి పోయే దారి లేకపోయినా బ్రతుకుతూ వుండింది కేవలము ఆశతోనే.ఆ ఆశే అసంకల్పితంగానే ఎలుక బుట్టకు రంధ్రము చేసి లోనిలి పోవుట తో పాము దానిదిని బయటకు కూడా రాగలిగింది.కాబట్టి కొన్నిటిని విధికి వదిలి పెట్టుటకూడా   ఒకానొక రాజుగారికి నిక్షేపంగా ఇద్దరు భార్యలుండటం, చిన్నభార్యామణి మోజులో పెద్దావిడ పట్టపురాణీగారిని సదరు రాజావారు నిర్లక్ష్యంచేస్తూ ఉండటం జరుగుతున్నాయట. పాపం పెద్దరాణీవారికి సొమ్ముకు కటకటగా ఉండేదట. ఒక రోజున ఒక వ్యాపారి, బహుశః యీవిడ పరిస్థితి సరగా తెలియని వాడేమో, వచ్చి చాలా వెలగల చీరలు విక్రయించబోయాడట. ఆవిడకు కొనుక్కోవాలని ఉన్నా కొనడానికి గతిలేని పరిస్థితి. ఆలాగని పరాయి వాడికి చెప్పుకోలేదు గదా. ఏంచెయ్యాలా అని గడబిడ పడుతుంటే ఆమెగారి ఆంతరంగిక దాసి అందట యీ మాట, "పుచ్చుకోండమ్మా, రొక్కానికి మరలా రమ్మనండి. నందో రాజా భవిష్యతి, చూద్దాం అని" అంటే రేపుమాపు మీ కొడుకు నందుడు రాజు అవుతాడులెండి మీ కష్టాలు తీరుతాయి అని. రేపేదైనా జరుగ వచ్చుకదా అని ఆశావహ దృక్పధంతో చెప్పటానికి యిది వాడతారు.
పైన  శ్రీ కృష్ణ మోహన్ గారు తెలిపిన విషయము యొక్క పూర్తి పాఠము ఈ క్రింద పదిమందికీ పంచుచున్నాను.
ఉత్తుంగ భుజ నాశోవా దేశ కాల గతోపివా 
వేశ్యా వణిజ నాశోవా నందోరాజా భవిష్యతి
ఒకానిక కాలములో ఉత్తుంగభుజుడు అనే రాజు ఉండేవాడు. అతను ఒక వేశ్యను కామించి ఆమె మాటను మంత్రముగా భావించి రాజప్రసాదమునకు దూరముగా తమ వనాంతర గృహము (farm house) లో ఆమె దాసితో బాటూ వుంచినాడు. అప్పటికే ఆమె గర్భవతి. ఆమె రాజ్యానికి వారసుని ప్రసవించినది . అయినా రాజు చూచుటకు కూడా రాలేదు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమాను డౌతూవస్తున్నాడు.
ఒకనాడు ఒక బంగారు నగల వర్తకుడు ఒక అత్యంత విలువ గల వజ్రాల హారాన్ని అమ్మకానికి రాజు వద్దకు తెచ్చినాడు. అతనికి పిల్లలు లేరు.రాజు అప్పటికే తన సర్వము వేశ్యకు దారపోయుటవల్ల వర్తకునితో వద్దు అని అన్నాడు. వెశ్య ఆయన పై అలిగింది. రాజు ఇంతకాలము తన సర్వస్వము వెశ్య పై వెచ్చించినా ఒక హారము కొననందుకు అట్లు వేశ్య ప్రవర్తించుట నచ్చ లేదు
ఆవ్యాపారి మొదటినుండి రాణి గారు తెలిసిన వాడయినందువల్ల ఆవిడ వునికి కనుగొని ఆవిడ వద్దకు వెళ్ళినాడు. విషయము తెలుసుకొని బాధ పడిన వాడై ఆనగాను ఆమెకు అప్పుగా , ధర కూడా తగ్గించి ఇవ్వదలచుకొన్నాడు.పిల్లవాడు పెద్దయ్యే వరకు ఆగుతానన్నాడు. అప్పుడు రాణి యొక్క దాసి ఆమెను ప్రక్కకు పిలిచి, అమ్మా హారము ఎంతో బాగుంది. రేపు మీ కుమారుడు రాజయిన తరువాత కోడలికైనా ఉపయోగ పడుతుంది.కావున తప్పక కొనమని ప్రోత్సహించుతూ పై శ్లోకము చెప్పింది:
ఉత్తుంగ భుజ నాశోవా దేశ కాల గతోపివా 
వేశ్యా వణిజ నాశోవా నందోరాజా భవిష్యతి
అమ్మా! భవిష్యత్తు ఎవరికీ తెలుసు. మహారాజయిన ఉత్తుంగభుజుడే మరణించ వచ్చు, దేశ కాల పరిస్థితులే మారి పోవచ్చు వేశ్య (పిల్లలులేని) వర్తకుడు కాలాంతరములో చనిపోవచ్చు, రాజకుమారుడైన నందుడే రాజు కావచ్చు . అందువల్ల  హారాన్ని తప్పక కొనుమని ప్రోత్సహించింది.
రాణి అట్లే చేసింది. రాజు పై కక్ష తీర్చుకొనుటకు వేశ్య ఒక పామును తెప్పించి రాజును మాయ మాటల చేత తన మందిరానికి రప్పించి రాజు చూడకుండా పాము నాతనిపై వుసిగొలిపినది . పాము కాటుకు రాజు మరణించగా, ఆత్రముతో రాజువైపుకు నడచిన వేశ్య , పామును గమనించనందువల్ల, తానూ పాము కాటుకు గురియైనది. అక్కడ వర్తకుడు వయోభారముచే గతించినాడు.
దాసి చెప్పినట్లు నందుడు రాజయినాడు. హారము దక్కింది.
 ఈ కథను ఆశావాదమును బల పరచుటకు పూర్వము పెద్దలు చెప్పే వారు. మా అమ్మమ్మ గారి వద్దనుండి నేను విన్నది మీతో పంచుకొనుచున్నాను.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information