ఇలా ఎందరున్నారు ?- 11    

- అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. ఇక చదవండి... )
సంకేతను కలవగానే ఆటను చేసే మొట్టమొదటి పని ఆమె దగ్గరఉన్న సెల్ ఫోన్ ని చేతిలోకి తీసుకొని ఏవేవో చెక్ చేస్తూ గేమ్స్ లోకి వెళ్ళి ఆడుతూ, మధ్యమధ్యలో హుషారుగా మాట్లాడుతూ అందంగా నవ్వుతూ అప్పటికప్పుడే ఒక గమ్మత్తయిన వాతావరణాన్ని సృష్టిస్తారు.
అతనెప్పుడు కలిసినా సంకేత మంత్రముగ్ధలా నిలబడి అతని హెయిర్ స్టైల్ ని, లేటెస్ట్ డ్రెస్ లో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్న అతని బాడీ ఫిట్ నెస్ ని చూస్తుంటుంది. ఎంత చూసినా తనివి తీరక విలువైన వస్తువును లాకర్లో దాచుకునట్లు అతన్ని తన కళ్లలో దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. బలమైన అతని భుజాలపై కన్పిస్తున్న టాటూలనైతే రోజుకి ఒక్కసారైనా నిమరందే ఊరుకోడు...
అనంత్ బైక్ కి  స్టాండ్ వేసి దాన్ని అనుకుని రోడ్డు పక్కగా నిలబడ్డాడు. అతన్ని అనుకుని నిబడింది సంకేత...
...నీలిమ అప్పటికే ఐరన్ షాపు దగ్గరకి వెళ్ళి, శివరామకృష్ణ , శ్రీహర్ష డ్రెస్ లు తీసుకొని, కాంచనమాల చీరకి ఫాల్ ఒకటి కొనుక్కుని పండ్ల దుకాణం దగ్గరకి వచ్చి ఆగింది.
వరమ్మకి పుచ్చకాయ అంటే బాగా ఇష్టమని ముందుగా ఒకటి కొని కవర్లో పెట్టుకుంది. నీలిమ తను ఎప్పుడు మార్కెట్ కి వచ్చినా వరమ్మ కోసం ఏదో ఒకటి కొంటుంది. అది వరమ్మకి తెలుసు. అందుకే నీలిమ ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళినా నీలిమ వచ్చేంత వరకు ఎదురుచూస్తుంది. ఆశ వుంటేనే కదా ఎదురుచూపులు వుండేది. వరమ్మ అలా చూడడం నీలిమకు చాలా ఇష్టం. ఆ చూపుల్లో ఎంతో ఆత్మీయత కన్పిస్తుంది. ఇంట్లో వాళ్లకోసం యాపిల్, ద్రాక్ష కొన్నది. షాపు అతనికి డబ్బులిస్తుంటే నీలిమ పక్కగా స్కూటీ వచ్చి ఆగింది. నీలిమ భుజంపై చేయి పడగానే...
ఉలిక్కిపడి తిరిగి చూసి “శివానీ మేడమ్! మీరా? అంది నీలిమ ఆశ్చర్యపోతూ.
శివాని నవ్వి “నేనేగాని, మీ సంకేత ఎక్కడ?” అంది.
“కాలేజీకి వెళ్లింది” అంది నీలిమ.
 “వెళ్లింది కాలేజీకే! కానీ వుండేది ఎక్కడో తెలుసా? అనంత్ పక్కన! అదిగో ఆ అమ్మాయి ఎవరో చూడు సంకేతనేనా?” అంది రోడ్డుకి అవతలవైపు వున్న సంకేకిటికీ
తను చూపిస్తూ....
...వెంటనే తల తిప్పి భుజం మీదుగా వెనక్కి చూసి అప్రతిభురాలైంది. “అనంత్ అంటే అతనేనా!!!” అని నీలిమ షాకవ్వటం చూసి తృప్తిపడింది శివాని... ఎందుకంటే సంకేత విషయంలో కొందరయినా అలా షాకవ్వాలి. ఆ తర్వాత ‘సంకేత’ కూడానా అని ఆశ్చర్యపోవాలి... లేకుంటే ‘శివాని ఒక్కతే అలాంటిది’ అని కొందరు అనుకుంటే ఎలా? నిజానికి తనకన్నా సంకేతనే ఎక్కువగా తిరుగుతోంది. కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్లు – తిండీ ,నిద్రా ఆనంతే అయినట్లు – ఇంకా చెప్పాలంటే మనసు ఎక్కడో! తను ఇంకెక్కడో అన్నట్లు కాకుండా భగవంతుని అనుసంధాన గంధాన్ని ఆహ్వానిస్తున్న భక్తురాలిలా అనంత్ తో ఒక బంధనాన్ని, ఒక మాధ్యమాన్ని సృష్టించుకుంది.
కానీ ఇప్పుడున్న అమ్మాయిల్లో చాలామంది ఇలా వుండటం లేదు. అబ్బాయిల్లో ఏముందని అంతగా ప్రేమించాలి? అని అనుకుంటుంటారు. అదేం అంటే ఏదో మనం వాళ్ళకి కావలి కాబట్టి రెస్టారెంట్ కి తీసికెళ్లి తినిపిస్తారు. త్వరగా ఇష్టపడాలి కాబట్టి బహుమతులు ఇస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మనకి ఆ తిండిమీద, బహుమతులమీద మక్కువ తగ్గిపోతుంది. ఆ అబ్బాయిల మీదకూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంతమాత్రానికే అంత కష్టపడి ప్రేమించాలా? మనసుకి కోతపెట్టుకోవాలా? అంత అవసరమా! అంటారు.
కానీ సంకేత అలా అనుకోవటం లేదు... ప్రేమపేరుతో మనసును పూర్తిగా అనంత్ మీద లగ్నం చేసింది. గమ్యం బాగా తెలిసినదానిలా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం ఎందాకో? అని శివాని మనసులో అనుకుంటూ నీలిమవైపు చూసింది. ఇంకా షాక్ లోంచి తేరుకోలేదు నీలిమ. శివాని వెంటనే నీలిమ భుజం తట్టి “నిన్ను నా స్కూటీ మీద డ్రాప్ చెయ్యనా? నీ వాలకం చూస్తుంటే తిన్నగా ఇల్లు చేరేలా లేవు... మరీ అంతగా షాక్ అయితే ఎలా? అంది.
నీలిమ తేరుకుని “షాక్ కాక మరేంటి మేడమ్! సంకేత గత రెండు సంవత్సరాలుగా నాకు తెలుసు. ఎంత బాగా చదివేది. కడిగిన ముత్యంలా అన్పించేది. మనుష్యుల్లోకి అప్పుడప్పుడు దయ్యాలేమైనా ప్రవేశిస్తుంటాయా? విపరీత బుద్ధులతో ఆడిస్తుంటాయా?” అంది.
వెంటనే అనంత్ చేతిలో వున్న సెల్ ఫోన్ వైపు చూస్తూ “ఇప్పుడు అనంత్ సార్ చేతిలో వుండే ఆ సెల్ ఫోన్ సంకేత. మేడమ్ దగ్గర చాలా రోజుల నుండి రహస్యంగా వుంటోంది... అది నాకెలా తెలుసంటే ఒకరోజు నాకు నిద్రపట్టక అటు ఇటు కదులుతుంటే సంకేత మేడమ్ దుప్పట్లోంచి  ‘ఊ.. ఊ..’ అనటం విన్పిచింది. అందుకే కలవరిస్తుందని కంగారుపడి దుప్పటి లాగి చూశాను... కళ్ళు మూసుకొని, చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని వుంది. అంతే! ఇక అర్ధం చేసుకొని అప్పటినుండి దుప్పటి లాగటం లాంటి పొరపాటు చేయటం లేదు. అంటే ఆ మేడమ్ రోజు మాట్లాడేది ఈ సార్ తోనేనా? కానీ సంకేత మేడమ్ పగలు నిద్రపోదు. రాత్రి నిద్రపోదు. అలా ఎలా వుండగలుగుతుందో అర్ధం కాదు...” అంది విచారంగా ముఖం పెట్టి...
“అదేమైనా బ్రహ్మపదార్ధమా అర్ధం కాకపోవటానికి...? కాలేజీ గేటులోకి అడుగుపెట్టీ పెట్టగానే అది కొందర్ని గాలిలా చుట్టుకుంటోంది. సహస్ర బాహువుల్లా విస్తరించి విస్తరించి అక్షయపాత్రలా వూరించి. వూరించి దడాలున వదిలేస్తుంది. దాన్నే కొందరు ప్రేమ అంటున్నారు. కొందరు ఆకర్షణ అంటున్నారు. ఇంకా కొందరు యూజ్ అండ్ త్రో అంటున్నారు.... అవునూ! అసలు ప్రేమ అనేది వుందా నీలిమా?”  అంది శివాని.
“నాకేం తెలుసు మేడమ్! నన్ను అడుగుతారు?” అంది నీలిమ బిత్తరపోతూ....
“తెలుసేమో! చేబుతావని అడిగాన్లే! తెలియకపోతే నో ప్రాబ్లం! కానీ అది తెలుసుకోవాలని నేను ఇప్పటికే ముగ్గురబ్బాయిలతో క్లోజ్ గా తిరిగాను” అంటూ ఆగింది.
కళ్ళు తిరిగాయి నీలిమకు...”ముగ్గురు అబ్బాయిలా!” అంది ఆశ్చర్యపోతూ.
శివాని అదేం గమనించకుండా తన ముఖాన్ని స్కూటీ అద్దంలో చూసుకుంటూ “అయినా దాని అర్ధం తెలియలేదు. ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే వున్నాను” అంది.
          నీలిమ నెమ్మదిగా “ప్రేమను తెలుసుకోవాలంటే అబ్బాయిలతోనే తిరగాలా మేడమ్! అమ్మాయిలతో తిరిగి, అమ్మాయిల్ని ప్రేమించి, అమ్మాయిలతోనే ప్రేమించబడొచ్చుగా “ అంది.
          “అలా ఎవరైనా చేశారానే చరిత్రలో...? నేనొక్కదాన్నే చేసి కొత్త చరిత్రను సృష్టించమంటావా? నేనెలా కన్పిస్తున్నానే నీకు? నా వైపు చూసి చెప్పు!! అంటూ భుజాలపై పడ్తున్న జుట్టును వెనక్కి నెట్టుకుని స్ట్రెయిట్ గా నిలబడింది శివాని...
          జవాబు లేని దానిలా ఒకక్షణం బిగుసుకుపోయింది నీలిమ. ఆ తర్వాత ఆలోచనగా అనంత్ నే చూస్తూ “సంకేత మేడమ్ సెల్ ఫోన్ అనంత్ సార్ చేతిలో ఎందుకు వుంది? అ  సార్ కి సెల్ ఫోన్ లేదా మేడం?” అంది.
          “అనంత్ సార్ కి ఫోన్ లేకపోవడం ఏమిటి పిచ్చిదానా? వాళ్లు చాలా డబ్బున్నవాళ్ళు! అదృష్టం బాగుండి సంకేతకి తగిలాడు. ఒకప్పుడు అతని కోసం నేను కూడా ప్రయత్నం చేశాను. నాకు వర్కవుట్ కాలేదు. బ్యాడ్ లక్! అయినా అదంతా ఇప్పుడెందుకులే....! ఆ సెల్ ఫోన్లో అతనేదో చాలా శ్రద్ధగా చూస్తున్నాడు చూడు. కన్పిస్తుందా?...”
          “అవును చూస్తున్నాడు. కన్పిస్తోంది... ఏం చేస్తున్నాడు మేడమ్?”
          “ఆ సెల్ ఫోన్ కి అతనిచ్చిన మెసేజ్ లు, మిస్డ్ కాల్స్ కాక వేరే వాళ్ల ద్వారా ఏమైనా వచ్చాయా! ఒకవేళ వచ్చివుంటే వాటికి సంకేత ఏమైనా సమాధానాలు ఇచ్చిందా?లేదా? అని చూస్తున్నాడు... ఇలా తనిఖీ చెయ్యడం ఇప్పటి అబ్బాయిలకి మామూలైపోయింది” అంది.
          నీలిమ హతాసురాలై “అంటే! ఆ సార్ సంకేత మేడమ్ ని అనుమానిస్తున్నాడా? పాపం! ఆ మేడమ్ ఈ మధ్యన చదువుకోవటం కూడా మానేసి రాత్రంతా ఆ సార్ తోనే మాట్లాడుతోంది. అందుకు నేనే సాక్షి! అలా సెల్ ఫోన్ చెక్ చేయడం కోసం రోడ్డు మీద నిలబెట్టడం దారుణం!” అంది నీలిమ ఉద్వేగంగా.
          “ఏయ్! పిచ్చీ! ఏంటా ఎమోషన్? అసలు ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా వున్నారో తెలుసా నీకు? చాలా మంది అబ్బాయిల కన్నా అనంత్ ఎంతో మేలు!.... ఇంతెందుకు బి.టెక్ ఫస్టియర్లో వున్నప్పుడు పల్లవికి ఓ అబ్బాయి ‘ప్రపోజ్’ చేశాడు. ఒక నాలుగు నెలలు గడవగానే ‘నో’ చెప్పాడు. ఎందుకో తెలుసా? అతను ప్రపోజ్ చేసినప్పుడు పల్లవి బరువు 54 కిలోలు... ఇప్పుడు 70 కిలోలు. అందుకే వద్దన్నానని ముఖం మీదనే చెప్పాడు.... ఎవరికైనా ‘లైట్ తీసుకో’ అని చెప్పే పల్లవి పైకి చెప్పుకోలేనంతగా షాక్ లోకి వెళ్లింది. ఆ షాక్ తో మంచం పట్టి నాలుగు రోజులు లేవనేలేదు. నేనే వెళ్ళి నాలుగుతన్ని ఆతర్వాత జండూబామ్ పూశాను. అయినా లేవకుండా అలాగే పడుకుంది. “నువ్విలాగే భావోద్వేగాలకు లోనై బెడ్ మీద నుండి లేవకపోతే ఇంకా బరువెక్కి నీ శరీరాకృతి దెబ్బతింటుందని భయపెట్టాను. లేచి కూర్చుంది. అప్పటినుండి ఎవరు ఎవర్ని ప్రేమిస్తున్నారని తెలిసినా క్లాస్ తీసుకోటానికి రెడీగా వుంటుంది. పాతరోగి డాక్టరన్నట్లు...
          అసలు మా అందరికన్నా ముందు గ్రంథం నడిపింది పల్లవినే...
కానీ అదిప్పుడెవరూ గుర్తుపెట్టుకుని వుండరులే అనుకుంటుంది. నాకు మాత్రము బి.టెక్ ఫస్టియర్ వున్నప్పుడు కాని అంతకుముందు అంటే నైంత్, టెన్త్, ఇంటర్ లో కాని బాయ్ ఫ్రెండ్స్ లేరు. అసలు అలాంటి స్నేహాలు ఎలా ఉంటాయో, ఎలా మొదలవుతాయో కూడా తెలియదు.. బి.టెక్ సెకండియర్లోకి వచ్చాక డబ్బుతో బాగా అవసరమైంది. మా నాన్న ఇవ్వనన్నాడు. ఆయన ఎప్పుడూ అంతే! డబ్బులు వున్నా కూడా ఇవ్వనన్నాడు. ఆయన ఎప్పుడూ అంతే! డబ్బులు ఉన్నాకూడా ఇవ్వనంటాడు. ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలంటే తాతలు దిగిరావాలి. మా అమ్మ మాకు ఎప్పుడు ఏ తిండి చేసిపెట్టాలన్నా మా నాన్నకి తెలియకుండా వాళ్ళమ్మ గారింట్లోంచి తెచ్చిపెడుతుంది. అదిసరే! నాకు మా కాలేజీలో ఇచ్చే జె.కె.సి. కోచింగ్ తీసుకోవాలని బలంగా వుండి దాని ఫీజు కోసం ఎంత ప్రయత్నించినా ఇచ్చే వాళ్ళు కన్పించలేదు.
          అప్పుడు దానికోసం మా కాలేజి అబ్బాయిని కాకుండా వేరే కాలేజి అబ్బాయిని అడిగాను. అతను ఒక డాక్టర్ కొడుకు. అప్పుడప్పుడు నేను జిరాక్స్ కోసం వెళ్ళినప్పుడు కలిసేవాడు. ఎంతో స్నేహపూర్వకంగా, ఎంతో పరిచయమున్న వాడిలా నవ్వేవాడు... నేను అడగ్గానే ఇచ్చాడు. దానికి ఫలితంగా నన్నేమడిగాడో తెలుసా?” అంది శివాని.
          “ఏమడిగాడు?” ఉత్కంఠతో అడిగింది నీలిమ.
          “తనతో చాటింగ్ చెయ్యమని అడిగాడు. నాకు చాటింగ్ చెయ్యటం రాదన్నాను. ఒకరోజు నేర్పించాడు. నేను నేర్చుకుని అతనితో ప్రతిరోజు చాటింగ్ చేసేదాన్ని... అతను అదే సంవత్సరం ఫైనల్ ఇయర్ కావటంవల్ల చదువు పూర్తయి ఎం.ఎస్. కోసం లండన్ వెళ్ళాడు. ఆ తర్వాత నాతో చాటింగ్ చెయ్యలేదు. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. కొద్దిరోజులు బాధపడ్డాను. మళ్ళీ మామూలైపోయాను.
          నీలిమకి అది నచ్చక “అసలు ఆ జె.కె.సి. కోచింగ్ తీసుకోకపోతే ఏమైంది? దానికోసం అతన్నెందుకు డబ్బులు అడగాలి? అతనితో చాటింగ్ ఎందుకు చెయ్యాలి? మళ్ళీ బాదెందుకుపడాలి? డబ్బుల్లేనప్పుడు అలాంటి కోచింగ్ లు తీసుకోకుండా వుండాల్సింది” అంది.
          “అది తీసుకుంటే మంచిది నీలిమా! అన్ని కంపెనీస్ దానితో సంబంధం పెట్టుకుని వుంటాయి కాబట్టి ఉద్యోగాలు సులభంగా వస్తాయి. ఆ కోచింగ్ ని కూడా మా కాలేజీలోనే ట్రైనింగ్ & ప్లేస్ మెంట్ ఆఫీస్ లో ఇస్తారు. అది తీసుకుంటే ఏదైనా కంపెనీస్ వాళ్ళు వచ్చినప్పుడు మన ఇ-మెయిల్ కి మెయిల్ చేస్తారు. ఫోన్ నెంబర్ కి మెసేజ్ ఇస్తారు. ఒకవేళ ఇ-మెయిల్, ఫోన్ నెంబరు మారిపోతే మా కాలేజీలో వున్న ట్రైనింగ్ & ప్లేస్ మెంట్ ఆఫీస్ లో వున్న ఆఫీసర్ సహాయంతో మా డిటైల్స్ అప్ డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. డబ్బులేకపోతే ఈ కోచింగ్ తీసుకోలేము. మంచి ఉద్యోగాలు రావాలంటే ఇదయినా తీసుకోవాలి లేదంటే పబ్లిక్ రిలేషన్ లయినా పెంచుకోవాలి” అంది.
          “పబ్లిక్ రిలేషనంటే బయట రోడ్డుమీద తిరిగే జనాలతోనా?”
          “కాదు. మా కాలేజీలో కాని, ఇతర కాలేజీలో కాని చదివి వెళ్ళిపోయిన విద్యార్థులతో కాని, ప్రస్తుతం చదువుతున్న మా సీనియర్లతో కాని పరిచయాలు పెంచుకోవటం... అది అంత సులభం కాదు. ఇంత చదివి ఉద్యోగం రాకుంటే ఎలా? ఉద్యోగం వుంటనే జీవితం అని ఫిక్సయి పోయిన నేను జె.కె.సి. కోచింగ్ ఫీజ్ కోసం తొలిసారిగా ఒక డాక్టర్ గారి అబ్బాయితో చాటింగ్ చేశాను...” అంది.
          నీలిమలో ఆసక్తితోపాటు ఆశ్చర్యంకూడా ఒకశాతం ఎక్కువైనట్లు శివానినే చూస్తూ వింటోంది.
          “జీవితమంటే ఒక నెలో, రెండు నెలలో కాదు కదా! డాక్టర్ గారి అబ్బాయిని మరచిపోవడం కోసమో, లేక ఇంకేదో నేను కారణం చెప్పలేను.... కాని మా క్లాస్ లోనే ఒకబ్బాయిని నేను ఇష్టపడ్డాను” అంది శివాని.
          “ఇంతెందుకు! నేను బాగా ఇష్టపడిన ఆ అబ్బాయి ఏం చేశాడో చెప్పనా! పదిసార్లు ఫోన్లో మాట్లాడి, నాలుగుసార్లు బైక్ మీద తిప్పి, షాపింగ్ మాల్ లో ఒక చీప్ సెంట్ స్ప్రేయర్ కొని కానుకగా ఇచ్చి ఇక నావల్ల కాదన్నట్టు ముఖంపెట్టాడు. ఇంకా ఏమన్నాడో తెలుసా అప్పటికే వాడిని నేను బాగా వాడుకున్నానట... నా సరదాలకోసం స్నేహితుల దగ్గర అప్పులు చేయించానట నా వల్ల చాలా నష్టపోయాడని ఆ విషయం... స్నేహితుల ముందే చెప్పాడు.. వాడి నేమనాలి చెప్పు?” అంది శివాని.
          నేనేం చెప్పలేనన్నట్లు చూసి శివాని మేడమ్ ఇలాంటి సమస్యలని కూడా తట్టుకుంటుందా అన్నట్లు విస్తుపోయింది.
          “నాకే అన్పించింది నీలిమా! వాడి విషయంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని.. ఇప్పుడున్న ఈ ధరల్ని బట్టి కొంతమంది అబ్బాయిలు రూముల్లో వండుకుని తింటూ రోజుకో పూట పస్తులుంటున్నారు వాళ్ళతో పాటు వాడు కూడా ఉంటున్నాడు. అదినాకు తర్వాత తెలిసింది. అందుకే నేను అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం మానేశాను. ఎప్పుడైనా సొంత బైక్ లేనివాడితో, బ్యాంక్ బ్యాలెన్స్ లేనివాడితో స్నేహం చేస్తే ఇలాంటి పేద ఏడుపులే వినిపిస్తాయి... వాళ్ళనేదో తెగవాడుకున్నట్లు ఫీలవుతారు... వాళ్ల దగ్గర ఏముందని వాడుకోవటానికి....?
          అందుకే అన్నీ ఉన్నోడి చెంతకు ఏ అమ్మాయి వెళ్ళినా ఓ అర్ధం వుంటుంది. అలా కాకుండా స్నేహితుడి బైక్ ను అడుక్కునో, వాడి పాకెట్ మనీని ఉపయోగించుకునో, కాలక్షేపం చేసే వాడి లైన్లోకి పొతే మాత్రం తప్పకుండా భవిష్యత్తు లేకుండా అవుతాం! నాకిప్పుడు బాగా అనుభవానికి వచ్చింది... అందుకే నేను ఎవరికీ చెప్పినా మనం స్నేహం చేసేటప్పుడు ముందు వెనకా ఆలోచించకుండా ఇంట్లో, ఒంట్లో వూపిరిలేనివాడితో తిరగొద్దని. తిరిగేవాళ్ళు తిరుగుతుంటారు. తిరగని వాళ్ళు తిరగరు...” అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ
          ఈ తిరుగుడు గోలేందో అర్ధం కాక నీలిమ బుర్ర తిరిగిపోతుంది. వెల్లబెట్టిన నోరు అలాగే వుంది. ఆ షాపు ముందు పుచ్చకాయలు కోసిపెట్టి వుండడంతో వాటిపై ఈగలు బాగా ముసురుతున్నాయి. వెంటనే నీలిమ శివాని గడ్డాన్ని తాకి నోరు మూయించింది.
          చదువుకన్నా లోకజ్ఞానం బాగావున్న నీలిమకు ఎందుకో శివాని మాటలు నచ్చటంలేదు. వీళ్లు చదవటంతో పోటీపడకుండా తిరగటంలో పోటీపడ్తున్నారు. అదే ఇప్పుడున్న పద్దతిగా, మంచి అర్హతగా భావిస్తున్నారు. వీళ్ళనెవరు అదుపు చెయ్యాలి? ప్రస్తుతం శివాని మేడమ్ అలాగే వుంది. సంకేత మేడమ్  చేస్తున్నది కూడా అదే! పల్లవి మేడమ్  పైకి ఒబేసిటీ ప్రాబ్లంతో చచ్చిపోతున్నా అని అంటూనే తన శక్తికి తగిన పరిచయాలను పెంచుకుంటూనే వుంది. వీళ్ల నెవరు బాగుచెయ్యాలి? ఒక్క హిందూ మేడమ్ మాత్రమే వీటికి దూరంగా వునట్లు అన్పిస్తుంది అని నీలిమ తన మనసుతో తను అనుకుంటుంటే...
          శివాని నీలిమ భుజం తట్టి నువ్వింకా అనంత్ గురించే ఆలోచిస్తున్నావా? నువ్వున్నావే రోడ్డు మీద నిలబెట్టి సెల్ ఫోన్ చెక్ చేయడం దారుణం అని... దాన్ని మేము ఒక లవర్ మా మీద చూపించే కేర్ గా భావిస్తాము... అదీగాక ఈ మధ్యన కొన్ని సెల్ నెట్ వర్క్ లు నిత్యం పదుల సంఖ్యలో వినియోగదార్లకు ఎస్.ఎం.ఎస్.లను పంపిస్తూ అకౌంట్ లో వున్న బ్యాలెన్స్ కాజేస్తున్నాయి. కాలర్ ట్యూన్ లు, రేడియో ఫ్యాక్స్, మ్యూజిక్, క్రికెట్ స్కోర్ అప్ డేట్స్ ప్యాకేజీలు, డైలీ జోక్స్, ఇంటర్నేషనల్ న్యూస్, రైల్వే, ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్, ఆస్ట్రాలజీ లాంటి మెసేజ్ లు పంపుతూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇష్టమైన కాలర్ ట్యూన్ కోసం ఫలానా నంబర్ ప్రెస్ చేయమని ఆప్షన్లు చెబుతూ సెకన్ల చొప్పున బ్యాలన్స్ కట్ చేస్తున్నాయి. అందుకే అనంత్ సంకేత సెల్ ఫోన్ చెక్ చేస్తున్నాడు.
          సంకేతకి సెల్ ఫోన్ యూజ్ చెయ్యటం కొత్త కాబట్టి సెల్ ఫోన్ లో వస్తున్న కాలర్ ట్యూన్లు, మెసేజ్ లపై అవగాహన వచ్చేలా వివరణ ఇస్తున్నాడు. అదీకాక ప్రస్తుత పరిస్థితిలో ఒక రాంగ్ కాల్ కి మిస్డ్ కాల్ కి మధ్యలో మిస్సైన జీవితాన్ని వెతుక్కుంటూ సమాధానాల్లేని ప్రశ్నల్లాగా కొందరమ్మాయిలు నలిగిపోతున్నారు. అలాంటి ఇబ్బంది సంకేతకి రాకుడదని జాగ్రత్తలు చెబుతున్నాడు.. సపోజ్ ఇప్పుడు మనం కూడా! ‘మన మనిషి’ లా భావిస్తున్నవాళ్లని ఎంతలేదన్నా జాగ్రత్తగా చూసుకోమా!” అంది శివాని...
          ముఖం అదోలా పెట్టి “మనం అంటూ నన్ను కలుపుతారేం మేడమ్?” అంది నీలిమ.
          శివాని నవ్వి “నీ దగ్గర అంత సీన్ లేదులే! అనవసరంగా ఉలిక్కిపడకు. ఇంటికెళ్ళు! వెళ్ళేప్పుడు దారి మరచిపోతావేమో! జాగ్రత్త!” అంది శివాని.
          నీలిమ శివానివైపు ఒకరకంగా చూసి పళ్ళు, ఇస్త్రీ చేసిన దుస్తులు వున్న రెండు బ్యాగులు చేత్తో పట్టుకొని “నేను దారి మరచిపోయి తిరిగే మనిషిని కాదులే మేడమ్! వేసే ప్రతి అడుగు ఒళ్లు దగ్గర పెట్టుకునే వేస్తాను. ఎందుకంటే నాకు మీలాగా కాలేజి చదువులు లేవు” అంటూ అటువైపే వస్తున్న ఖాళీ ఆటోని ఆపి శివానికి వీడ్కోలు చెప్పి ఎక్కింది.
          శివాని స్కూటీ ఎక్కి కొత్తగా పరిచయం అయిన తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్లింది. సంకేత, అనంత్ అక్కడే కొద్దిసేపు నిలబడి, ఆ తర్వాత కొత్తగా పెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్లారు.
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top