Thursday, July 30, 2015

thumbnail

మౌనం

మౌనం 

- అక్కిరాజు ప్రసాద్ 


మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మ నిష్ఠైః
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే
చిన్ముద్రతో, ఆనందము మూర్తీభవించుతున్న, తనలో తాను రమించుచు, పరమానందమైన ముఖముతో, తన చుట్టూ చేరిన పరబ్రహ్మ ధ్యానములో ఉన్న ఋషులకు మౌనంగా పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించే దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను
- జగద్గురువులు ఆది శంకరాచార్యులు
సృష్టి సమయములో చతుర్ముఖ బ్రహ్మ శివుని ఉపాసించి సృష్టి కార్యమును చేసే అపారమైన శక్తిని పొందాడు. సనకసనందాది మునులు ఆ పరమశివుని ప్రార్థించి పరబ్రహ్మ తత్త్వమును ఉపదేశించమని వేడుకొనగా శివుడు దక్షిణామూర్తిగా అవతరించి, మౌనంగా వారికి జ్ఞానోపదేశం చేశాడు.
ఆ దక్షిణామూర్తిపై ఆదిశంకరులు రచిచిన స్తోత్రములో మొదటిది పైన చెప్పబడిన శ్లోకం. మౌనంగా ఉంటూ పరబ్రహ్మ తత్త్వాన్ని ఎలా బోధించాడు? ఈ ప్రశ్నకు సమాధానం గురించి కొంత విశ్లేషిద్దాం.
దక్షిణామూర్తి అనగా మూర్తీభవించిన జ్ఞానము అని అర్థము. రమణ మహర్షులను శిష్యులు ఒక ప్రశ్న అడిగారు.
అనుగ్రహము అనేది గురువు ఇచ్చే కానుక కాదా?
దానికి రమణుల సమాధానం:
పరమాత్మ, గురువు, అనుగ్రహము ఇవన్నీ ఒకటే. శాశ్వతమైనవి, ఎప్పుడు  అందుబాటులో ఉండేవి. మనం వెదికితే దొరికేవాడు కాదు గురువు. అదే దక్షిణామూర్తి తత్త్వము కూడా. మౌనంగా ధ్యానములో ఉండగా చుట్టూ చేరారు శిష్యులు. మౌనంతో వారి సందేహాలకు సమాధానం తెలిపాడు దక్షిణామూర్తి. అనగా, వారు తమ 'నేను ' అనే ఉనికిని కోల్పోయారు. అదే జ్ఞానం.
మౌనం అన్నిటికన్నా శక్తివంతమైన సాధనం. సమస్త శాస్త్రముల సారమూ గురువు యొక్క మౌనము ముందు దిగదుడుపే. ఆ మౌనం సాగరం కన్నా లోతైనది, హిమాలయములకన్నా ఎత్తైనది. మౌనంతో అహంకారాన్ని నశింపజేస్తాడు గురువు. అహంకారమంటే? నేను, నాది, నా వలన అనే మాయాపూరితమైన భావనలు. నేను అన్నదానికి చోటు లేనప్పుడు ఆ వ్యక్తి సృష్టిలో అత్యద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లే.
గురువు చేసే అత్యుత్తమమైన ఉపదేశం మౌనంగానే జరుగుతుంది. దీనిని దక్షిణామూర్తి రూపం ద్వారా ఈ ప్రపంచానికి పరమేశ్వరుడు తెలిపాడు. గురువు చేసే ఇతర ఉపదేశ పద్ధతులు - స్పర్శ, మంత్రము, దృష్టి, మానసిక బోధ..ఇవన్నీ కూడా మౌనోపదేశము కన్నా తక్కువ స్థాయిలోవే. దేహము అనే ఆలోచనను దాటిన వాడు గురువు. శిష్యులలో ఆ భావనను మౌనముతో పోగొట్టినవాడు దక్షిణామూర్తి.
రమణులను శిష్యులు ఇంకో ప్రశ్న అడిగారు.
మౌనం అన్నిటికన్నా అతి బిగ్గరగా చేసే ప్రార్థన అని వివేకానందులు చెప్పారు?
రమణుల సమాధానం:
అవును. మౌనంగా ఉండే శిష్యునికి గురువు యొక్క మౌనం అతి ప్రభావవంతమైన సూచనలు. గురువు యొక్క ఆ మౌనం అత్యుత్తమమైన అనుగ్రహం. గురువు యొక్క ఉపదేశ పద్ధతులలో మౌనం అన్నిటికన్న ప్రధానమైనది. గురువు మౌనముగా ఉంటే శిష్యుని మనసు  అతి వేగవంతంగా పరిశుద్ధమవుతుంది.
మిగతా ఉపదేశపద్ధతులన్నిటిలో విషయము-వస్తువు అనే రెండు ఉండి తీరాలి. ముందు విషయము తరువాత వస్తువు అలాంటి ఉపదేశంలో వస్తాయి. మౌనోపదేశంలో ఇవి అతి త్వరగా శిష్యునకు అబ్బుతాయి. గురువు యొక్క మౌనము శిష్యుని సత్య మార్గాన్వేషణలో ముందుంచుతుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. శిష్యుల స్థాయిని బట్టి గురువు తన పద్ధతిని మార్చుతాడు. సనకసనందులు బ్రహ్మజ్ఞాన నిష్ఠా పరాయణులై ఉన్నందున అతి ప్రభావంతమైన మౌనోపదేశాన్ని వారికి అందించాడు దక్షిణామూర్తి. ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠకు ఎంతో సాధన అవసరం. ఈ సాధనకు గురువు అవసరం. ఆ గురువు ఎల్లప్పుడూ ఒక్కరే ఉండరు. మన ఆధ్యాత్మిక యానంలో మనం వేసే ముండడుగులను బట్టి తగిన గురువు మనకు అందుబాటులో ఉంటాడు. అన్నిటినీ దాటి నేను అన్న భావన తొలగే స్థాయికి చేరినప్పుడు స్వయంగా పరమాత్మే మనకు అత్యుత్తమమైన పద్ధతిలో పరబ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. అందుకే ఆధ్యాత్మిక యానం రెండువైపులా పదునైన కత్తిపై చేసే ప్రయాణం అని ఆర్యోక్తి.
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information