తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు -2 - అచ్చంగా తెలుగు

తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు -2

Share This

తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు -2 

- పోడూరి శ్రీనివాస్


వ్యాసం మొదటి భాగం ఈ లింక్ లో చదవండి... http://acchamgatelugu.com/%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%82 
భానుప్రియ.. కొందరిప్రముఖుల అభిప్రాయాలు, భానుప్రియ గురించి, ఈ విధంగా ఉన్నాయి.
శివాజీగణేశన్: యువతారల్లో – నాటిమేటి తారలైన సావిత్రి, పద్మినిలతో పోల్చదగిన, నటనాకౌశలం కలిగిన ఏకైక నటి – భానుప్రియ.
చిరంజీవి: అందరు తారలతోనూ నా అభినయానికి భానుప్రియతో నా అభినయానికి తేడా ఉంది. భానుప్రియ ఎంతసేపూ నాట్యంలో తన పాదాల కదలికకు, సాంకేతికనైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది.
ఖుష్బూ: ‘ఆరారోఅయిరారో’ లో భానుప్రియ చేసినపాత్రకి మాత్రం నేను న్యాయం చేకూర్చలేను.
s.p.బాలసుబ్రమణ్యం: కమల్ హాసన్, చిరంజీవి, ప్రభుదేవా, l.విజయ, లక్ష్మీ, వైజంతీమాల – లతో పోల్చదగిన అందమైన నృత్యకళాకారిణి.
ప్రభు: 1980వ దశాబ్ధంలోని గోపా కథానాయికలలో ఒకరు – భానుప్రియ
కార్తీక్: ప్రత్యేక నటనానైపుణ్యంగల కథానాయిక
డాన్స్ మేష్టారుకళా: 1990లోని గొప్ప హీరోయిన్.
ఫోటోగ్రాఫర్ – డైరెక్టర్ pcశ్రీరామ్: దక్షిణ భారతదేశంలోని సినీతారాల్లో అత్యంత అందమైన ఫోటోజెనిక్ ఫేస్ గల హీరోయిన్ – భానుప్రియ. తనకళ్ళతో భావాలు పలికించడంలో సాటిలేని హీరోయిన్ భానుప్రియ.
9.ఆలీ:
            రాజమండ్రి పేరు చెబితే గుర్తొచ్చే నటుల్లో ఆలీ ముందుంటారు. 11.10.1968 వ తేదీన మహమ్మద్ భాషా, జైతూన్ బీబీ లకు రాజమండ్రిలో ఆలీ జన్మించాడు. ఆలీకి బాల్యం నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకని చిన్నతనంలోనే సినిమా ప్రయత్నాలకై మద్రాసు వెళ్లి వేషాలకై ప్రయత్నించసాగాడు. ఆలీ తల్లిదండ్రులు చాలా పేదవారు. తండ్రి టైలర్ వృత్తి చేసేవాడు. సోదరుడు ఖయ్యమ్.
మద్రాసు చేరుకున్న ఆలీ ప్రముఖ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడ్డాడు. ‘సీతాకోకచిలుక ‘ ఆలీ మొదటి సినిమా. కార్తీక్ – ముచ్చర్ల అరుణ నటించిన, ఈ చిత్రంలో బాలనటుడిగా నటించాడు ఆలీ. భారతీరాజా ఈ చిత్ర దర్శకుడు. అలా కొన్ని చిత్రాల్లో బాలనటుడిగానే రాణించాడు ఆలీ. తరువాత, తన రూటు మార్చాడు- హాస్యపాత్రల వైపు దృష్టి మళ్ళించాడు. హాస్యనటుడిగా వెలుగొందుతున్న ఆలీ- svకృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘యమలీల’ సినిమాతో హీరో అయ్యాడు. హీరో అయినప్పటికీ తన ఒరిజినల్ రూటైన హాస్యపాత్రలను వదిలి పెట్టలేదు. హాస్యపాత్రలను ధరిస్తూనే అడపాతడపా హీరో వేషాలు వేస్తుండేవాడు. అలా- ‘అమ్మాయి కావురం’ , ‘అక్కుమ్ బక్కుమ్’ , ‘ఆవారాగాడు’ చిత్రాల్లో హీరోవేషాలు వేశాడు. ముఖ్యపాత్రలు సుమారు 50చిత్రాల్లో నటించాడు.
ఆలీ నటించినవి – తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు సుమారు 800 వరకూ వుంటాయి. అలీ నటించిన చిత్రాల్లో కొన్ని ముఖ్యమైనవి :సీతాకోకచిలుక, యమలీల, హలోబ్రదర్, అమ్మా నాన్న ఓ తమిళఅమ్మాయి, ఖలేజా, వాసు, శివమణి,ఆది,ఆనంద్,అతడే ఒక సైన్యం,వినోదం,ఇష్టం,నీ స్నేహం,చెన్నకేశవరెడ్డి, ఖుషి, నేనున్నాను,శివశంకర్,ఒక లైలా కోసం, s/oసత్యమూర్తి మొదలైనవి.
పూరిజగన్నాథ్ సినిమాల్లోనూ, పవన్ కళ్యాన్ నటించిన సినిమాల్లోనూ అలీ  తప్పనిసరిగా ఉంటాడు.
జుబేదా సుల్తానా బేగమ్ ను వివాహం చేసుకున్న ఆలీకి ముగ్గురు సంతానం- ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మహమ్మద్ అబ్దుల్ సుభాన్, మహమ్మద్ ఫతీమా రమీజన్,జువేరియామీతు – వారి పేర్లు.
ఆలీ సోదరుడు ఖయ్యామ్ కూడా సినీనటుడే.
ఇక అవార్డుల విషయానికికొస్తే 2003లో అమ్మా నాన్న ఓ తమిళఅమ్మాయి సినిమాకు ఉత్తమ హాస్యనటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, 2005లో కన్నడ సినిమాకు ఉత్తమ హాస్యనటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, 2012లో best commedian గా దక్షిణ భారత ఇంటర్నేషనల్ మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ చేయబడ్డాడు. అదే విధంగా 2014లో కూడా ఉత్తమ హాస్యనటునిగా దక్షిణ భారత ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ కు నామినేట్ చేయబడ్డాడు.
ఆలీ మాతృభాష మళయాళమనీ, పూర్వీకులు కేరళ నుంచి వచ్చి, ఆంధ్రలో స్థిరపడ్డారనీ చెబుతారు.
ఆలీ తన తండ్రి పేరు మీద ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పరచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఆలీ వెండి తెరమీదేగాక బుల్లితెర మీద కూడా ATM, ఆలీతో జాలీగా వంటి టెలివిజన్ షోలు చేస్తున్నాడు.
  1. రవితేజ అనబడే భూపతిరాజు రవిశంకర్ రాజు:
          రవితేజ, శ్రీ భూపతిరాజు రాజగోపాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 26.01.1968వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని ‘జగ్గంపేట’ లో జన్మించాడు. తండ్రి రాజగోపాలరాజు ఫార్మసిష్టుగా పనిచేశారు.తండ్రి వృత్తిరీత్యా రవితేజ విధ్యాబ్యాసం జైపూర్, ఢిల్లీ , బోంబే.భోపాల్ లలో జరిగింది. అనంతరం విజయవాడలోని NSM పబ్లిక్ స్కూల్ లో చదివారు. సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, విజయవాడలో BA చదివారు.
రవితేజకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం, అందులోనూ అమితాబ్ బచ్చన్ అంటే మరీను. ఎన్నోసార్లు బొంబాయి వెళ్ళిపోయి, స్టుడియోల చుట్టూ తిరిగి, అమితాబ్ బచ్చన్ కలుసుకుని, తను గూడా అమితాబ్ అంత సూపర్ స్టార్ అయిపోవాలని ఆశపడుతుండేవాడు.
          చదువయిపోయాక సినీప్రయత్నాలు మొదలుపెట్టాడు. సహాయనటుడిగా ‘కర్తవ్యం’ సినిమాలోనూ, చిన్న చిన్నపాత్రలు ‘చైతన్య’, ఆజ్ కా గుండారాజ్ (హిందీ), ‘అల్లరిప్రియుడు’, ‘నిన్నే పెళ్ళాడుతా’, సినిమాల్లోనూ ధరించాడు. అసిస్టెంట్ డైరెక్టరు గా చాలా సినిమాలకు పనిచేశాడు. అందులో కొన్ని – ప్రతిబంద్(హిందీ). ఆజ్ కా గుండారాజ్(హిందీ), క్రిమినల్(హిందీ), నిన్నే పెళ్ళాడుతా.
          రవితేజ నటించిన కొన్ని సినిమాలు: సిందూరం, ఇడియట్,ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఖడ్గం, వెంకీ, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నా ఆటోగ్రాఫ్, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ, కిక్, డాన్ శీను, మిరపకాయ, బలుపు, పవర్, సీతారామరాజు, మనసిచ్చి చూడు , పాడుతాతీయగా, ప్రేమకువేళాయేరా, నీకోసం,సముద్రం,అన్నయ్య,బడ్జెట్ పద్మనాభం, అమ్మాయి కోసం,ఇట్లు శ్రావణి-సుబ్రహ్మణ్యం,దొంగోడు,వీడే, ఈ అబ్బాయి చాలా మంచోడు,వీర,భగీరథ,షాక్,ఖతర్నాక్,బలాదూర్,నీనింతే,శంభో-శివశంభో,ఆంజనేయులు,ఒకరాజు-ఒకరాణి, దేవుడు చేసిన మనుషులు, నిప్పు, దరువు.... మొదలైనవి. ప్రస్తుతం కిక్-2, బెంగాల్ టైగర్ నిర్మాణంలో ఉన్నాయి.
అవార్డుల విషయానికి వస్తే –
          సింధూరం – సినిమాకు ఉత్తమ ద్వీతీయ జాతీయస్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం
          నీకోసం – సినిమాకు ఉత్తమ ద్వీతీయ చిత్రంగా వెండినంది, రవితేజకు ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరి నంది పురస్కారం.
          ఖడ్గం – సినిమాకు జాతీయసమైక్యతకుగాను సరోజినిదేవి అవార్డ్, రవితేజకు స్పెషల్ జ్యూరి నంది అవార్డ్ లభించాయి.
          రవితేజకు ‘మాస్ మహారాజ్’ , ఆంధ్రా అమితాబ్’ అని బిరుదులున్నాయి. రవితేజకు భార్య శ్రీమతి కల్యాణితేజ, ఇద్దరు సంతానం – ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. రవితేజకు ఇద్దరు సోదరులు- రఘురాజు, భరత్ రాజు.
  1. కృష్ణభగవాన్ అనబడే పాపారావు చౌదరి:
          తూర్పుగోదావరి జిల్లాలో, పెదపూడి మండలంలో, కైకవోలు అనే కుగ్రామంలో మీనవల్లి వీర్రాజు- లక్ష్మీకాంతం దంపతులకు పాపారావు చౌదరి 02.07.1965 న జన్మించాడు. ప్రాథమిక విద్యాబ్యాసం పెదపూడిలోనూ, పడవ తరగతి కాకినాడలోనూ జరిగింది. ఇంటర్మీడియట్ కాకినాడలోని ఆండాళమ్మ కాలేజ్ లో చదివాడు. తరువాత సినిమా వ్యామోహంతో హైదరాబాదు వచ్చేశాడు. B.com హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని అంబేడ్కర్ డిగ్రీ కాలేజ్ లో చదివాడు.
          సుమారు వంద సినిమాలకు పైగా హాస్యనటుడిగా నటించాడు. అందులో కొన్ని ముఖ్యమైనవి: మహర్షి, ఏప్రిల్ 1 విడుదల, డిటెక్టివ్ నారద, చెట్టు క్రింద ప్లీడరు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, దొంగ రాముడు & పార్టీ, లక్ష్మీ నరసింహ, శంఖారావం, నా ఆటోగ్రాఫ్, వెంకీ, సాంబ, ఎవడిగోల వాడిదే, పందెం, అల్లరిబుల్లోడు, జాన్ అప్పారావు 40 +, దుబాయ్ శీను,మిష్టర్ గిరీశం,  దొంగసచ్చినోళ్లు, కాంచనమాల-కేబుల్ టివి, యమగోల మళ్ళీ మొదలైంది. బొమ్మనా బ్రదర్స్-చందన సిస్టర్స్,ఆంధ్రా అందగాడు,  భజంత్రీలు, టాటాబిర్ల మధ్యలో లైలా...మొదలైనవి.
          పైన తెలిపిన చిత్రాల్లో - జాన్ అప్పారావు 40 +, మిష్టర్ గిరీశం,  దొంగసచ్చినోళ్లు,బొమ్మనా బ్రదర్స్-చందన సిస్టర్స్, ఆంధ్రా అందగాడు,  సినిమాల్లో హీరోగా నటించాడు.
          సినిమాల్లోకి వచ్చాక పాపారావు తనపేరు కృష్ణభగవాన్ గా మార్చుకున్నాడు. మహర్షి- కృష్ణభగవాన్ మొదటి చిత్రం.
          స్కూల్లో చదువుతున్నపుడే ‘పెండింగ్ ఫైల్’మొదలైన నాటకాల్లో నటించాడు. కృష్ణభగవాన్ కి భార్య లక్ష్మీ, ఒక కుమార్తె ఉన్నారు.
  1. ఆదుర్తి సుబ్బారావు (దర్శకుడు):
          శ్రీ ఆదుర్తి సత్తెన్న పంతులు – శ్రీమతి రాజ్యలక్ష్మమ్మగార్లకు 16.12.1912వ తేదీన రాజమండ్రిలో ఆదుర్తి సుబ్బారావు జన్మించారు.
          ఈయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక విజయవంతమైన చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
          కథను అర్ధం చేసుకుని, చక్కని స్క్రీన్ ప్లే తో – ప్రేక్షకుల మనసులకు హత్తుకునేటట్లు, అవి కలకాలం వారి గుండెల్లో నిలచిపోయేటట్లు సినిమాను చిత్రీకరించడంలోనూ, పాత్రధారుల నుండి నటనను రాబట్టడంలోనూ, శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు సిద్ధహస్తులు. అందుకే అయన చిత్రాలు అనేకం – విజయవంతమైనాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా, జాతీయస్థాయిలో, 10 సార్లు ఆయన అవార్డులు అందుకున్నారంటే – ఆయన ప్రతిభ ఎంత గొప్పదో మనం ఊహించుకోవచ్చు.
          ప్రసిద్ధి పొందిన సెయింట్ జేవియర్ కాలేజ్, ముంబాయిలో ఫొటోగ్రఫీలో మూడు సంవత్సరాల కోర్సులో చేరి, వ్యక్తిగత కారణాలవల్ల రెండు సంవత్సరాలు మాత్రమే చదవగలిగారు.
          సూపర్ స్టార్ గా పేరొందిన.. ఒక ప్రత్యేక ఒరవడిలో నటనా కౌశలం చూపే నటుడు కృష్ణను తెలుగు చలనచిత్రసీమకు పరిచయం చేసింది శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారే. ఆయన ‘తేనెమనసులు’ చిత్రం ద్వారా నూతన నటీనటులకు పరీక్షలు నిర్వహించి, ఎంపికచేసి – కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంద్యారాణి మొదలైన నటీనటులను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు.
          మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి ‘సుడిగుండాలు’, మరోప్రపంచం, అనే సందేశాత్మక చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. అందులో ‘సుడిగుండాలు’ సినిమా అనేక ప్రతిష్టాత్మక బహుమతులను, అవార్డులను గెలుచుకుంది.
          శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహించిన అనేక సినిమాలు తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లోనూ – ప్రదర్శించబడ్డాయి.
          తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారి పేరు మీద – ఆదుర్తి సుబ్బారావు ఆవార్డును నెలకొల్పారు.
          శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారి శ్రీమతి – శ్రీమతి కామేశ్వరిబాల.
ఆదుర్తి సుబ్బారావుగారుదర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు: మాంగల్యబలం, తోడికోడళ్ళు, మహాకవి క్షేత్రయ్య, మంచిమనసులు, వెలుగునీడలు, ఆదర్శకుటుంబం, మనుషులు-మమతలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, నమ్మిన బంటు, చదువుకున్న అమ్మాయిలు, తేనెమనసులు, మూగమనసులు, సుడిగుండాలు, ఇద్దరు మిత్రులు, సుమంగళి, తోడూనీడ, కన్నెమనసులు, విచిత్ర బంధం, మరోప్రపంచం, మాయదారిమల్లిగాడు, బంగారుకలలు, సునేరా సంసార్(హిందీ), మిలన్(హిందీ), రాఖ్ వాలా(హిందీ), మస్తానా(హిందీ), జ్వార్ భాటా(హిందీ), డోలీ(హిందీ), దర్పన్(హిందీ), ఇన్సాఫ్(హిందీ), మనే ఆలియ(కన్నడ), కుముదం(తమిళం)...మొదలైనవి.
శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు సాధించిన అవార్డుల విషయానికి వస్తే –
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – తెలుగు – డాక్టర్ చక్రవర్తి – 1964
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – తెలుగు –మనుషులు-మమతలు -1965
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – తెలుగు –సుడిగుండాలు - 1967
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – తెలుగు –ఆదర్శకుటుంబం - 1969
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – కన్నడ–మనేఆలియా - 1964
జాతీయస్థాయి ఉత్తమ చిత్రం – తెలుగు –మూగమనసులు - 1963
3వ ఉత్తమ కథాచిత్రంగా తమిళంలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ – కుముదం – 1961
తెలుగులో ఉత్తమ కథాచిత్రంగా రాష్ట్రపతి వెండి పతకం – నమ్మిన బంటు – 1959
తెలుగులో ఉత్తమ కథాచిత్రంగా - సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ – మాంగల్యబలం - 1958
తెలుగులో ఉత్తమ ద్వీతీయ కథాచిత్రంగా - సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్– తోడికోడళ్ళు -1957
నందిఅవార్డులు:
ఉత్తమ కథాచిత్రం – డాక్టర్ చక్రవర్తి – 1964
ఉత్తమ కథాచిత్రం– సుడిగుండాలు – 1967
ఉత్తమ కథాచిత్రం– మహాకవి క్షేత్రయ్య – 1976
ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్ – సౌత్ – తెలుగు – సుడిగుండాలు – 1967
 ఇన్ని అవార్డులు పొందిన దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు 01.10.1975 చెన్నై లో కన్ను మూశారు.
  1. p.ఆదినారాయణరావు (నిర్మాత-మ్యూజిక్ డైరెక్టర్-నాటకరచయిత-గీతరచయిత)
పెనుపాత్రుని ఆదినారాయణరావు 1915వ సంవత్సరంలో కాకినాడ (తూర్పుగోదావరి) లో జన్మించారు. వారి తల్లిదండ్రులు శ్రీ కృష్ణయ్య గౌడ్, అనసూయ. ఆదినారాయణరావు తన మెట్రిక్యులేషన్ పరీక్ష కాకినాడలో పాసయ్యాడు.
తన బాల్యం నుంచీ నటనమీద దృష్టి నిలిపి, 6 సంవత్సరాల వయసులోనే రాజరాజేశ్వరి నాట్యమండలి పతాకంపై నారదుడు, సావిత్రి మొదలైన పౌరాణిక పాత్రలు స్టేజ్ పై ధరించేవాడు. అనంతరం సాలూరులోని శ్రీ పాత్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద కర్ణాటక శాస్తీయ సంగీతం అభ్యసించాడు, ఆదినారాయణరావు.
12 సంవత్సరాల వయసు వచ్చేసరికి పలురకాల సంగీత వాయిద్యాలను వాయించడమే కాదు రాగబద్ధంగా పాటలకు వరసలు కట్టడం, నాటకరచనలో కూడా తన ప్రతిభను చూపేవారు ఆదినారాయణరావు.
కాకినాడలో గల ‘యాంగ్ మెన్స్ హేపీక్లబ్’లో ఆదినారాయణరావు,svరంగారావు, రేలంగి వెంకట్రామయ్య, గండికోట జగన్నాథం, అంజలీదేవి మొదలైన వారితో కలిసి నాటకాలాడుతుండేవారు.
వారందరూ కలిసి ప్రదర్శించిన నాటకాలలో బ్లాక్ మార్కెట్, వసంతసేన, వీధి గాయకులు మొదలైనవి ప్రముఖమైనవి. ఆదినారాయణరావు స్వయంగా రచించిన స్ట్రీట్ సింగర్స్ అనే నాటకంలో అంజలీదేవి ధరించిన పాత్రకు విశేషఆదరణ లభించడమేగాక అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరైన సర్ ఆర్థర్ హాప్ నుంచి 1943వ సంవత్సరంలో అంజలీదేవికి బంగారుపతకం, సన్మానపత్రము లభించాయి.
1948లో అంజలీదేవిని శ్రీ ఆదినారాయణరావు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.
1946లో శ్రీ ఆదినారాయణరావు, శ్రీ sv రంగారావు ఒకే సినిమా ‘వరూధిని’ ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, మేకప్ మెన్ శ్రీ k. గోపాలరావుగార్లతో కలిసి శ్రీ ఆదినారాయణరావు ‘అశ్విని పిక్చర్స్’ అనే నిర్మాణసంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించడమే గాకుండా వాటికి పాటల సాహిత్యం, సంగీత దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నారు – శ్రీ ఆదినారాయణరావు. వాటిల్లో ముఖ్యమైనవి: మాయలమారి, మాయాక్కారి(తమిళం), అన్నదాత. ప్రసిద్ధ దర్శకులు సత్యం, టి.వి.రాజు, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వీరికి సహాయకులుగా పనిచేశారు.
తరువాత ‘అశ్విని పిక్చర్స్’ను వదిలిపెట్టి, తనభార్య అంజలీదేవి పేరున 1951లో ‘అంజలీ పిక్చర్స్’ స్థాపించారు. అంజలి పిక్చర్స్ బ్యానరుపై అఖందవిజయం సాధించిన పరదేశి, అనార్కలి, పూంగత్తాయి(తమిళం), సువర్ణసుందరి, భక్తరుకారాం, పూలోంకిసీజ్(హిందీ), సువర్ణసుందరి(హిందీ) మొదలైనవి. వీటిల్లో సువర్ణసుందరికి కథారచన శ్రీ ఆదినారాయణరావు గారే చేశారు.
నిర్మాతగా శ్రీ ఆదినారాయణరావు నిర్మించిన చిత్రాలు: మాయలమారి, మాయాక్కారి(తమిళం), పరదేశి,అనార్కలి, పూంగత్తాయి(తమిళం), సువర్ణసుందరి, స్వర్ణమంజరి, భక్తరుకారాం, పూలోంకిసీజ్(హిందీ), భక్తతుకారం, సతీసక్కుబాయి, అమ్మకోసం, మహాకవి క్షేత్రయ్య....మొదలైనవి.
సంగీత దర్శకునిగా శ్రీ ఆదినారాయణరావు వ్యవహరించిన సినిమాలు: గొల్లభామ, పల్లెటూరిపిల్ల, మాయలమారి, మాయక్కారి(తమిళం), ఆడుత్తవీరపెణ్(తమిళం), ఋణానుబంధం, మంగయిర్ ఉల్లమ్  మంగడ సెల్వమ్ (తమిళం), అగ్నిపరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, పెద్దకొడుకు, అల్లూరి సీతారామరాజు, కన్నవారిల్లు, చండీప్రియ... మొదలైనవి.
కథారచయితగా ‘సువర్ణసుందరి’ సినిమాకు వ్యవహరించారు. ఉత్తమ సంగీతదర్శకునిగా ‘సువర్ణసుందరి’ సినిమాకు అవార్డు అందుకున్నారు. ఎన్నో మధురమైన పాటలకు సంగీతదర్శకత్వం వహించిన శ్రీ ఆదినారాయణరావు 20.01.1991వ తేదీన చెన్నై లో కన్నుమూశారు.
శ్రీ ఆదినారాయణరావు 20వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య శ్రీమతి అంజలీదేవి ఆదినారాయణరావు అవార్డును , ఆయన స్మృత్యార్ధం నెలకొల్పారు. మధురగాయని గానకోకిల శ్రీమతి p. సుశీల ఆ అవార్డుకు మొదటిసారిగా ఎంపికయ్యారు.
  1. తోటకూర వెంకటరాజు –TV.రాజు (ప్రసిద్ధ సంగీతదర్శకుడు):
          శ్రీ TV.రాజుగారు 25.10.1921వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. వీరికి బాల్యం నుంచీ సంగీతమంటే ప్రాణం.
1950లో సంగీతదర్శకులు శ్రీ ఆదినారాయణరావుగారికి అసిస్టెంట్ గా ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో సినీరంగప్రవేశం చేశారు.
1952లో విడుదలైన ‘టింగురంగ’ చిత్రం శ్రీ TV.రాజు స్వతంత్రంగా సంగీతదర్శకత్వం వహించిన తొలిచిత్రం.
తోటకూరసోమరాజు ఈయన సంతానం. ఈ సోమరాజే ప్రసిద్ధ సంగీతదర్శకులు ‘రాజ్-కోటి’ ద్వయంలోని ‘రాజ్’. శ్రీరాజ్ కూడా ఎన్నో ప్రసిద్ధ చిత్రాలకు మధురమైన సంగీతం అందించారు.
‘పల్లెటూరిపిల్ల’ చిత్రీకరణ సమయంలో శ్రీ ఎన్.టి.రామారావు గారితో జరిగిన పరిచయం శ్రీ TV.రాజుగార్ని అనేక మంచి చిత్రాలకు సంగీతదర్శకత్వం చేసే అవకాశం కలిగించింది. శ్రీ TV.రాజుగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ అమిత మాధుర్యభరితంగా ఉంటాయి. శ్రీ ఎన్.టి.రామారావు నటించిన ఎన్నో సినిమాలకు శ్రీ TV.రాజుగారే సంగీతదర్శకత్వం వహించారు.
శ్రీ TV.రాజుగారు సంగీతదర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు: టింగురంగ, పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, నిరుపేదలు, జయసింహ, చింతామణి, పాండురంగమహత్యం, రాజనందిని, బాలనాగమ్మ, టాక్సీ రాముడు, సవతికొడుకు, శ్రీ కృష్ణమాయ, శ్రీ కృష్ణవతారం, శ్రీ కృష్ణపాండవీయం, శ్రీ కృష్ణాంజనేయయుద్ధం, శ్రీ సింహాచలక్షేత్రమహిమ, పిడుగురాముడు, భామావిజయం, కాంభోజరాజుకథ, ఉమ్మడికుటుంబం, బాగ్దాద్ గజదొంగ, పిన్ని, కలిసొచ్చిన అదృష్టం, విచిత్రకుటుంబం, నిండుహృదయాలు, నిండుదంపతులు, నిండుమనసులు, వరకట్నం, భలేతమ్ముడు, కథానాయకుడు, సప్తస్వరాలు, మారినమనిషి, తల్లా-పెళ్ళామా?, చిన్ననాటి స్నేహితులు, మంగమ్మశపథం, చిక్కడు-దొరకదు, కదలడు-వదలదు, రేచుక్క-పగటిచుక్క, కోడలు దిద్దినకాపురం, కర్పూరహారతి, దేవకన్య, నేనే మొనగాడ్ని, తిక్కశంకరయ్య, ధనమా-దైవమా...మొదలైనవి.
ధనమా-దైవమా? అన్నది శ్రీ TV.రాజుగారు సంగీతదర్శకత్వం వహించిన చివరి సినిమా. ఇంతటి మాధుర్యాన్ని తెలుగుప్రేక్షకులకు పంచిన శ్రీ TV.రాజు తన 52వ ఏట స్వర్గస్తులైనారు.
  1. రఘు కుంచె (గాయకుడు, సంగీతదర్శకుడు, నటుడు, ఏంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్):
          రఘు కుంచె 13.06.1975న రాజమండ్రి సమీపంలోని, కోరుకొండ మండలంలోని ‘గాదరాడ’ అనే గ్రామంలో జన్మించారు.
          గాయకునిగా 2000వ సంవత్సరంలో ‘బాచి’ సినిమాతోనూ, సంగీత దర్శకునిగా ‘బంపర్ ఆఫర్’అనే సినిమాతో సినీరంగప్రవేశం చేసారు. గాయకునిగా, సంగీతదర్శకునిగా పరిశ్రమకు రాకముందు ఏంకర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏంకర్ గా ఇప్పరికీ జీ టివి, జెమినీ టివిలలో ఎన్నో కార్యక్రమాలు లైవ్ షోలు చేస్తూనే ఉన్నారు రఘు కుంచె.
          రఘు కుంచె ఇప్పటివరకు సుమారు 500పాటలు పాడి ఉంటారు.
          సంగీతదర్శకునిగా – బంపర్ ఆఫర్, ఆహ నా పెళ్ళంట, దగ్గరగా దూరంగా, దేవుడు చేసిన మనుషులు, లేదేస్ & జెంటిల్మెన్, దొంగాట...మొదలైన సినిమాలకు సంగీతదర్శకత్వం వహించారు.
          డబ్బింగ్ ఆర్టిస్ట్ గా-అరవిందస్వామి, వినీత్, అబ్బాస్,దీపక్ – ఇంకా అనేకమందికి గాత్రదానం చేశారు.
అవార్డుల విషయానికొస్తే ఇప్పటివరకు 5నంది అవార్డులు, రేడియో మిర్చి అవార్డు, BIG FM అవార్డు – శ్రీరఘు కుంచె గెలుచుకున్నారు.
*****
ఇవండీ! తూర్పుగోదావరి జిల్లానుంచి సినీచిత్రరంగం ఏలిన – ఏలుతున్న ప్రముఖుల విశేషాలు. మనకు తెలియకుండానే – మనమధ్యే – మనఊళ్ళో – మన ప్రాంతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉద్బవించిన, వెలుగొందిన, అనేకులకు అఖండకీర్తి తీసుకొచ్చిన గోదావరి ప్రాంతం, రాజమండ్రి ప్రాంతం – ఎంత గొప్పదో కదా! ఎంత మహిమాన్వితమో కదా!
ఇంకా sv రంగారావుగారు కూడా ఆ ప్రాంతమే అంటారు గానీ, వారు పుట్టిన ప్రదేశం నూజివీడని తెలుస్తోంది. కానీ, కొన్నాళ్లపాటు వారు కూడా – కాకినాడలోని యంగ్ మెన్స్ హేపీ క్లబ్’ లో నాటకాలు ఆడారు. శ్రీ ఆది నారాయణరావుగారితో కలిసి ‘వరూధిని’ సినిమాతో చలనచిత్ర రంగప్రవేశం చేశారు.
అలాగే ‘వహీదారెహ్మాన్’ కూడా చెంగల్పట్టులో జన్మించినప్పటికీ కొన్నాళ్లపాటు రాజమండ్రిలో ఉందని తెలుస్తోంది. ‘రోజులుమారాయి’ , ‘జయసింహ’ చిత్రాల ద్వారా తెలుగు సినీప్రేక్షకులకు ఆమె సుపరిచితమే.
          ‘జిత్ మోహన్ మిత్ర’- కె.విశ్వనాథ్: జంద్యాల సినిమాలు చూసేవాళ్ళకు శ్రీ జిత్ మోహన్ మిత్ర ముఖం – ఎంతో పరిచయమైనదిగా కనిపిస్తుంది. ప్రాణం ఖరీదు, శంకరాభరణం, శుభలేఖ, సాగరసంగమం, శ్రీవారికి ప్రేమలేఖ, సిరివెన్నెల, శ్రుతిలయలు, హై హై నాయకా, ప్రేమ ఎంత మధురం... ఇలా ఎన్నో సినిమాల్లో శ్రీ జిత్ మోహన్ మిత్ర నటించారు. 73సంవత్సరాల ఈ నవయువకుడు ఇప్పటికీ రాజమండ్రిలో ప్లీడరుగా పనిచేస్తూ తనింకా అలసి పోలేదని, తనగాత్రంలో ఇంకా పటిమ తగ్గలేదని నిరూపిస్తూ ఉంటాడు... అవునుమరి గాయకుడిగా సుమారు 6000ప్రోగ్రాంలు ఇచ్చి గత 60ఏళ్లుగా కచేరీలు చేస్తూనే ఉన్నాడు శ్రీ జిత్ మోహన్ మిత్ర. ఆ విజయాన్ని గుర్తించే కాబోలు – ఇటీవలే గానగంధర్వుడు శ్రీ sp బాల సుబ్రహ్మణ్యం, శ్రీ జిత్ మోహన్ మిత్రను అభినందిస్తూ సన్మానం చేశారట.
          ఈ ప్రముఖ కళాకారులందరినీ, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని పవిత్ర గోదావరి పుష్కరాల సమయంలో – ఆ గోదావరి అలలతో బాటు మన మానసిక సెలయేరులో హృదయాన్ని ఓలలాడిద్దాం!!

No comments:

Post a Comment

Pages