సర్వేశ్వరశతకము - అల్లమరాజు రంగశాయికవి - అచ్చంగా తెలుగు

సర్వేశ్వరశతకము - అల్లమరాజు రంగశాయికవి

Share This

సర్వేశ్వరశతకము - అల్లమరాజు రంగశాయికవి

- పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం
అల్లమరాజు రంగశాయి కవి (క్రీ.శ.1861-1936) పిఠాపురము సమీపములోని చేబ్రోలు గ్రామనివాసి. వీరు ఆపస్తంబసూత్ర, ఆరామద్రావిడ బ్రాహ్మణులు. హరితసగోత్రులు. వీరివంశమునందు చాలామంది కవులు కలరు. వీరితండ్రిగారైన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి బహుగ్రంధకర్త. సుబ్రహ్మణ్యమకి అనేక గ్రంధాదులేకాక అనేక శతకముల కర్త కూడా. రంగశాయికవి తల్లి పేరు చిన్నమ.
భువిలో నల్లమరాజవంశకలశాంభోరాశిపూర్ణేందుఁ డా
ర్యవరశ్లాఘితసచ్చరిత్రుఁ డగు సుబ్రహ్మణ్యసంజ్ఞాక స
త్కవికిన్ జిన్నమకున్ సుతుండ నమరంగన్ రంగశాయ్యాఖ్యనౌ
కవి నేనీశతకంబు నీకొసంగితిన్ గైకొమ్ము సర్వేశ్వరా
అని ఈ కవి తనగురించి శతకాంతపద్యంలో చెప్పుకొన్నారు. రంగశాయి కవి బహు శతక కర్త. వీరు రచించిన శతకములు 1. రఘురామశతకము, 2. పరమాత్మశతకము, 3. సర్వేశ్వరశతకము, 4. గోవిందశతకము, 5. లక్ష్మీశతకము, 6. మాధవశతకము, 7. కుక్కుటలింగశతకము, 8. గోపాలస్వామిశతకము, 9. మల్లికార్జునశతకము అనునవి. ఈకవి ఈశతకములేకాక శ్రీమదాంధ్ర చంపూభారతము, రామాయణచంపువు తెలుగున, మరికొన్ని సంస్కృతకృతులనుకూడా రచించినారు. ఈకవి కవిత్వము మృదుమధురపదగుంఫనము కలిగి లాక్షణికమైన పద్ధతులలో సాగిపోతూ పూర్వకవితలను గుర్తుచేస్తాయి. ధారాశుద్ధి శబ్షపటుత్వము, శ్రవణపేయసమాససంకలనము, నిరాఘాటమైన యురవడి ప్రతిపద్యంలో మనకు కనిపిస్తుంది.
ఈకవి సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయములో కొంతకాలము పనిచేసినాడు. అంతకుపూర్వము గోడే గజపతిరాయప్రభువు వద్ద ముప్పదియేళ్ళు ఆస్తానకవిగా నుండినాడు. తరువాత ఏ ఉద్యోగములేక యున్నదానితో తృప్తిపడి సుమారు డెబ్బదియైదేండ్లు జీవుంచి క్రీ.శ. 1936 లో కీర్తిశేషుడయినాడు.
శతకపరిచయం
సర్వేశ్వరశతకము "సర్వేశ్వరా" అనే మకుటంతో  శివకేశవ అబేధాన్ని నిరూపిస్తు చెప్పిన భక్తిరసశతకము. శార్ధుల మత్తేభవృత్తాలలో చెప్పిన ఈశతకంలో 103 పద్యాలున్నాయి.
ధరణీమండలి శాలివాహనశకాబ్దంబుల్ సముద్రాగ్నికుం
జరశీతాశులచే గణింపఁబడఁగన్ జంచత్పరీధావివసంవ
త్సరమందుం దగుమాఖశుద్ధప్రతిపద్ఘసంబునన్ బూర్తియై
పరగెన్ నీశతకంబు సర్వభువనవ్యాప్తౌజ సర్వేశ్వరా
అని కవి చెప్పిన ప్రకారం ఈశతకము శాలివాహనశకం 1837 లో వ్రాయబడినది. ఈశతకము ధ్యానము, స్తోత్రము, ఉపదేశము, ప్రార్థన, గోష్ఠ్యుద్ఘుష్యప్రార్థన, మంగళము, కవివిషయము అని 7 భాగాలుగా విభజించబదినది.
శివఖేశవ అబేధాన్ని నిరూపించే ఈ మత్తేభ పద్యాన్ని చూడండి.
శివుఁ డంచున్ మది నెంచి కొందఱుజనుల్ సేవించువారైరి వి
ష్ణువటంచున్ నిను నమ్మి కొందఱునరుల్ స్తోత్రంబు గావింతురా
ర్యవరుల్ గొంగఱు నిన్ను నెంతురు పరబ్రహ్మంబ వంచున్ సమ
స్త విశేషంబులు వీవె యౌదు వనుచున్ శ్లాఘింతు సర్వేశ్వరా.
సర్వేశ్వరుని సర్వలోకవ్యాపకత్వాన్ని నిరూపించే ఈ పద్యం చూడండి
నీ కొక్కండును వైరి లేఁడు సఖుఁడు న్వేరొండు లేకుండెఁగా
లోకంబం దొకచోట నుండుటయు నాలోచింప నీ వొక్కచో
లేకుంతన్ వినలేదు సర్వమును నీలీలం దగెన్ గాన ని
న్నేకాలంబునఁ గొల్తు ననుఁ గృపతో నీక్షింపు సర్వేశ్వరా
నిగమంబుల్ మఱి యాగమప్రకరముల్ నిన్ బేర్కొనంజాలఏ
మడిగెన్ గావున నేరు జాలరు భవన్మాహాత్మ్యమున్ దెల్పఁగన్
జగముల్ నీవె సృజింపఁ బెంపఁగను నాశంబూంప శక్తుండ వె
ట్లుగ నిన్నుం దెలియంగ నేర్తు నను మూఢుంబ్రోవు సర్వేశ్వరా
తను చెప్పవలసిన విషయాన్ని అతి సులభమైన భాషలో సూటిగా చెప్పగలిగిన ప్రతిభావంతుడు ఈకవి. ఈ క్రిందిపద్యాలను ఒకసారి అవలోకంచండి:
మ. తొలి బాల్యంబున బాలురం గదిసియెంతో సంతసంబొంది యా
టల నాడున్ మఱి యౌవనం బుదయమౌటన్ స్ర్తీరతుండై ప్రవ
ర్తిల్లు నానాటికి వార్ధకం బొనరఁగా దేహమునందున్ వళీ
ఫలితంబుల్ గని కుందు నిన్ దెలియఁ డెవ్వండైన సర్వేశ్వరా!
మ. ధన మొక్కింతయుఁగల్గెనేనిఁగడుమోదంబొందుచున్ భక్ష్యముల్
మునుగానైనవి మెక్కి కాయముఁ గరంబుం బెంచి మత్తిల్లి దు
ర్జనసంసర్గ మొనర్చి యాపిదప దుష్కార్యంబులన్ జేయఁబూ
నును మార్త్యుండు మదిం దలంపడు శరణ్యున్ నిన్ను సర్వేశ్వరా
సందర్భోచిత ఉపనానములు వాడటం ఈ కవికి వెన్నతో పెట్టిన విద్య.  కొన్ని ఉదాహరణలు " తలఁపన్ దారువులందు నగ్నివలె నంతర్యామివై సర్వదేహులయందున్ నివసించుచుంటివి" (సర్వే-7), పరుసం బంటినతోడనె యిను మొగిన్ బంగార మౌరీతి నీ కరుణాదృష్టి యొక్కింతయైనఁ గదియంగా నెట్టి మూడాత్ముఁడున్" (సర్వే -47)
కొన్నిపద్యాలు మనుకు పూర్వకవుల రచనలకు దగ్గరగా కనుపిస్తాయి. ఉదాహరణకు పైన చెప్పిన "శివుడంచున్" అనే పద్యాన్ని చదివినప్పుడు మనకు అన్నమయ్య కీర్తన "ఎంతమాత్రమునను ఎవ్వరు తలచిన" గుర్తుకురాక మానదు. అదే విధంగా
తనకున్ విత్తము గల్గి యున్నప్పుడె మిత్రశ్రేష్ఠులున్ బంధులున్
దన సామీప్యముఁ జేరుచుందు రది శూన్యంబైనచోనొక్కడై
నను దన్నుం గదియంగ రాఁడు జలవంతం బైనవేళం గొలం
కున బక్ష్యాదులు జేరినట్లుగను గన్గొనయ్యె సర్వేశ్వరా
అన్న పద్యం చదివినప్పుడు సుమతీశతకంలోని "ఎప్పుడు సంపదగల్గిన అప్పుడు బంధువులొత్తు రది ఎట్లన్నన్" తప్పక మనసులో మెదులుతుంది.
చక్కని సరళమైన భాష, నీతి సారము, భక్తిరసప్రధానమైన పద్యాలు అన్నికలిసిన ఈ శతకం చదవటం మొదలు పెడితే ఆశాంత చదివించగలదు. మీరు చదవండి. అందరిచే చదివించండి.

No comments:

Post a Comment

Pages