మంచుకొండల్లో అమరయోధులు - అచ్చంగా తెలుగు

మంచుకొండల్లో అమరయోధులు

Share This

మంచుకొండల్లో అమరయోధులు

- కంచర్ల మాధవి

మంచు కొండలు. ఊహకందని ప్రకృతి రమణీయతకు నెలవులు. అంతు తెలీని లోయలు , ఆకాశాన్ని తాకే గిరిశిఖరాలు. కురిసే మంచు చినుకుల నడుమ విరిసిన వనాల సోయగాలు . ఎక్కడ పుట్టి ప్రవహిస్తున్నాయో తెలియని జలపాతాలు . ఎంత ఎత్తు పేరుకుపోయిందో తెలియని మంచుగడ్డలతో   వెండి కొండలను తలపించే హిమగిరులు - ఇవే కొన్ని దేశాలకు సరిహద్దుల్లో పెట్టని కోటలు. సాహసికులైన పర్వతారోహకులకు మాత్రం హిమగిరుల ఆరోహణ ఒక అద్బుతమైన గమ్యం. వారి జీవితకాలపు లక్ష్యం. ఎవరెస్ట్ తో సహా ఎన్నదగిన మంచుగిరులశిఖరాగ్రాన తమ విజయ పతాకాన్ని నాటాలని రెస్ట్ లేకుండా శ్రమిస్తుంటారు.
అసలే మంచు కొండలు . అందునా నిట్టనిలువునా ఆకాశ హర్మాలను చుంబిస్తున్న శిఖరాలు . వీటిని  అధిరోహించడం అంటే  ప్రతి సెకను  ప్రాణాలతో చెలగాటమే . కాలికింద మంచు పెళ్ళ ఫెళఫెళ మని విరిగి పడొచ్చు.  బలంగా నాటామనుకొన్న మంచు గొడ్డలి  పుటుక్కున జారిపోవచ్చు. క్షణక్షణం మారే వాతావరణం ఏ క్షణమైనా ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. రెప్పపాటు కాలం ఏమరుపాటుగా   ఉంటె చెల్లించాల్సిన మూల్యం  ఒక జీవిత కాలం ! అయినా హిమగిరులంటే తరగని మోజు ట్రెక్కర్లకు. 90 సంవత్సరాలనాటి మలరీ, ఇర్విన్ లకైనా , ఈ నాటి మల్లి మస్తాన్ బాబు కైనా వాటిని సాధించడమే జీవితకాల లక్ష్యం. అందుకే ప్రమాదమని తెలిసినా ... వెనుతిరగని ధీరత్వం. మొక్కవోని మొండి ధైర్యం. పట్టు సడలని సాహసం. ఈ నాటి పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అర్జెంటీనా ఆండీస్ పర్వతాలను అధిరోహిస్తూ ప్రమాదంలో చిక్కుకుని అసువులు బాశాడు. మనదేశంతో సహా అనేక దేశాలలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన అపార అనుభవం మస్తాన్ సొంతం. అటువంటి యువ సాహసికుణ్ణి ప్రమాదం ఎలా బలి తీసుకొందో అంతు చిక్కని విషయం. ప్రపంచం ఎరుగని రహస్యం.
అయితే ... ఈ నాటి అత్యాధునిక శాటిలైట్   సమాచార వ్యవస్థ, సాకేతిక పరిజ్ఞానం సాయంతో మస్తాన్ పార్ధివ దేహాన్ని నేలరోజులలోపే స్వదేశానికి, స్వస్థలానికి చేర్చగాలిగారు . కానీ ... 1924లో ఇలాంటి సంఘటనే జరిగితే ... ? ఆ సాహసికుల పరిస్థితి ఏంటి ?ఈ ప్రశ్నకి జవాబు జార్జ్ మలరీ , ఆండ్రూ ఇర్విన్లకి ఎదురైన అనుభవమే ! కానీ వారి అనుభవం ఎవరు చెప్పగలరు ? హిమాలయాలలో నిక్షిప్తమైన వారి దేహాలు సుమారు 75 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు.  ఈ దురదృష్ట సంఘటన వెనుక ఇప్పటికీ వీడని మిస్టరీలు ... ఎన్నో చర్చలకు తావిస్తున్నాయి.
ఎవరెస్ట్ ప్రపంచ అత్యున్నత శిఖరం. దీన్ని అధిరోహించాలని కలలుకన్న మొట్టమొదటి పర్వతారోహకులు ఈ స్నేహితులు. తమ కలను సాకారం చేసుకొనే ప్రయత్నంలో ఎవరెస్ట్ చేరుకొన్నారు. మజిలీలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మలరీ అంతకుముందు రెండుసార్లు ఎవరెస్ట్ ను జయించాలని ప్రయత్నించి భంగపడ్డాడు. ఈ సారి విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలనే తెగింపుతో ఉన్నాడు.
 అలుపెరుగని సాహసంతో ముందుకు సాగుతున్న మలరీ , ఇర్విన్ లిద్దరూ 1924 జూన్ 6 ఉదయం 8.40 కి  ఎవరెస్ట్ లోని నాలుగవమజిలీ నుండి బయలుదేరారు. పర్వతారోహణ కొంత ఎత్తువరకూ ఆహ్లాదకరంగా , ఉత్సాహంగా సాగుతుంది . పరవశింప జేసే ప్రక్రుతి సోయగాలనడుమ శ్రమ తెలీకుండా గడుస్తుంది. కానీ ఎత్తుకు వెళ్ళే కొద్ది ప్రమాదం దాగుడుమూతలు ఆడుతుంటుంది.  గాలిలో ప్రాణవాయువు ఆక్సిజన్ శాతం పడిపోతుంటుంది. ఈ క్రమం లోనే ఆక్సిజన్ వెంట తీసుకెళ్ళమని తోటి పర్వతారోహకులు ఓడెన్, నార్టన్ మొదలైన వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ ఈ స్నేహితులు ట్రెక్కింగ్ లో ఆక్సిజన్ వెంట తీసుకెళ్లడం అంటే పెద్దగా ఇష్ట పడరు. అయినా తోటివారి బలవంతంతో ఆక్సిజన్ తీసుకొని బయల్దేరారు.
రేపు సాయంత్రానికి ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడి ఐదవమజిలీ చేరుకొంటామని స్నేహితులతో చెప్పి వీడ్కోలు తీసుకొన్నారు. మలరీ తన జేబులో భద్రంగా దాచిన  భార్య ఫోటోను ఒకసారి తీసి చూసుకొన్నాడు. ఎవరెస్ట్ శిఖరాగ్రాన, ఎవరెస్ట్ కంటే ఉన్నతమైన తన ప్రేమకు గుర్తుగా ఆ ఫోటోను అక్కడ ఉంచి వస్తానని మలరీ  ఆమెకు ప్రమాణం చేశాడు మరి!  వాతావరణం అనుకూలించింది. హాయిగా ఐదవమజిలీ చేరి, ఆరోజుకు ఆగిపోయారు. అది 7వ తేదీ  జూన్ 1924. ఐదవమజిలీ నుండి ఔత్సాహికులైన స్నేహితులిద్దరూ 6వ మజిలీకి ప్రయాణం మొదలుపెట్టారు. 26,800 అడుగుల ఎత్తులో ఉన్న ఆ మజిలీ చేరేందుకు తిరుగులేని ఆశావాదం ఆక్సిజన్ గా మారి వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. విజయం మరో మజిలీ దూరమే అని ఊరిస్తూ గాలి నెమ్మదిగా వీస్తోంది. మేఘాలు కూడా వారి ప్రయాణాన్ని ఆటంకపరచలేదు.  గొడ్డలి లాంటి పరికరాన్ని నాటుతూ (ఐస్ యాక్స్) .. అడుగు వెంట అడుగు వేస్తూ,ముందుకు సాగుతున్నారు. ఈ లోగా నాలుగవ మజిలీలో ఉన్న ఓడెన్ ఐదవ మజిలీ చేరుకొన్నాడు. దూరదర్శిని సాయంతో  మలరీ , ఇర్విన్ లను గమనిస్తూ కూర్చున్నాడు.
కాలం ఆ మిత్రులతో పాటే కదిలిపోతోంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరాడు. అయినా మలరీ , ఇర్విన్ లు తమ పయనం ఆపలేదు. తిరుగుమార్గం పట్టలేదు.  ఐదవ మజిలీ వద్ద వేచి ఉన్న ఓడెన్ లో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవేళ వాళ్ళు ఇప్పటికైనా తిరుగు ముఖం పట్టకపోతే ... చీకటి ముసురుకోకముందే మజిలీని చేరడం చాలా కస్టం. దూరాన ఉన్న ఆ సాహస మిత్రులు చిన్న చిన్న అణువుల్లా కనిపిస్తున్నారు ఓడెన్ కు. అంతలోనే ఊహించని సంఘటన జరిగింది.   దూరదర్శి నుండి చూస్తున్న ఓడెన్ కి ,    మలరీ , ఇర్విన్ లకు మధ్య  ఒక మంచు మేఘం అడ్డుగా వచ్చింది. అంతే ... ఇక అవే చివరి చూపులు. ఆతర్వాత ఓడెన్కే  కాదు, మరెవ్వరికీ ఆ స్నేహితులు కనిపించలేదు. అయితే ... దాదాపు శిఖరాన్ని చేరుకోన్నట్టు కనిపించిన మలరీ , ఇర్విన్ ఎవరెస్ట్ శిఖరం చేరుకొన్నారా ? తమ కలలను పండించు కొన్నారా? ఆ తర్వాత ఆచూకీ దొరకని వారి శరీరాల లాగే ... ఈ ప్రశ్నలకూ జవాబు లేదు. ఒకవేళ మలరీ , ఇర్విన్ ఎవరెస్ట్ శిఖరాన్ని తాకి ఉంటె .... హిల్లరీ టెన్సింగ్ నార్కేల బదులు మొదటి సారి ఎవరెస్ట్ ని జయించిన యోధులుగా మలరీ , ఇర్విన్ లు ఉండాలి.
      ఈ సంఘటన జరిగిన సుమారు  75 సంవత్సరాల తర్వాత...  1999 లో,  'మలరీ , ఇర్విన్ రీసెర్చ్ ఎక్స్ పిడిషన్ సంస్థ' పరిశోధనల్లో  ఇర్విన్ మృత దేహం బయల్పడింది . ఆ తర్వాత మలరీ!   ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్ల ఎత్తు ఉంటే ... మలరీ శరీరం 8,155 మీటర్ల ఎత్తులో దొరికింది.  అంటే మలరీ దేహం  శిఖరానికి కేవలం 693 మీటర్ల దూరంలో లభ్యమయ్యిందన్నమాట.   అతని నడుం చుట్టూ గాయాలైన ఆనవాళ్ళున్నాయి . వాళ్ళ కెమెరాలు ఏమయ్యాయో  ఆచూకీ లేవు.  మలరీ జేబులో ఉండాల్సిన అతని జీవిత  భాగస్వామి ఫోటో దొరకలేదు. ఆమె ఫోటోని ఎవరెస్ట్ దగ్గర ఉంచుదామనుకున్న అతని ముచ్చట తీరిందా ? ఒకవేళ వాళ్ళు శిఖరాన్ని చేరి తిరిగివస్తూ ప్రమాదం బారిన పడ్డారా ?? లేక వెళుతూనే మృత్యు గహ్వరంలోకి  జారిపోయారా ?  ఏ ప్రమాదం వారి పాలిట మృత్యు పాశంగా పరిణమించింది ?ఎవరెస్ట్ కు సుమారు  ముప్పావు కిలోమీటర్ దూరంలో అసలేం జరిగింది?  అంతు లేని ప్రశ్నలు - జవాబు చిక్కని ప్రశ్నలు !  హిమగిరులలో మంచు కింద గడ్డకట్టిన ఇలాంటి నిజలెన్నో !

No comments:

Post a Comment

Pages