అంకురం - అచ్చంగా తెలుగు

అంకురం

Share This

అంకురం

ఆండ్ర లలిత
       
ఆదిత్యకి  12వ తరగతి  పరీక్షలు జరుగుతున్నాయి. అతను చదువులో  కానీ ఏ పనిలోనైనా కానీ,   సిద్ధాంతం  ఎంత  ప్రాముఖ్యమో,  అంతే ఆచరణాత్మక జ్ఞానం కూడా అవసరం అని ఆలోచిస్తాడు. అలా అవలంబించేందుకు  క్రమబద్ధమైన  నియమావళి  అనుసరిస్తాడు.  మంచి మార్కులు వస్తాయి. కష్టే ఫలే  సూత్రం తప్పక పాటిస్తుంటాడు.
            ప్రతిరోజులాగే  ఆ రోజు  4:30 గంటలకి సెల్ పోన్ లో  అలారములు రకరకాల  నాదాలతో  వాయిదా పద్దతిలో ఒక  అరగంట సేపు మారుమ్రోగాయి.  అంతే మరి,  కోడి కూత  పెట్టింది.. ఊరు  వాడ, జంతు  జీవరాసులు, ఆఖరికి సూర్యుడు కూడా  హడావిడిగా  గబగబా  నిద్రలేచారు.  ఆదిత్య కుడా,.!    సూర్యుడి  చుట్టు  గ్రహాలు  తిరిగిననట్లు  ఆదిత్య  చుట్టు వాళ్ళ ఇంట్లో  వాళ్ళు  గిరగిరా తిరుగుతుంటారు.
             ఆదిత్య  నాన్న శ్రీధర్  పడుకున్న గదిలోకి  వచ్చి, " నాన్నా  లే  చదువుకోవాలి  . రేపు  సోమవారము , ఆఖరి  లెక్కలు  పరీక్ష. నేను  ఒక  అరగంటలో తయారైపోతాను. నువ్వూ  తయారైపో. నువ్వు లెక్కలు చాలా బాగా చెప్తావు, ఒకసారి వింటే నాకు గుర్తుండిపోతాయి.. లే, ఇవాళ పాకిస్తాన్  ఇండియా  క్రికెట్ మ్యాచ్  కూడా ఉంది . మనము  పోర్షన్ అంతా పూర్తి చేసి అందరమూ  కలసి మ్యాచ్  టీవిలో  చూద్దాము ,సరేనా ? " అన్నాడు.
"లేస్తున్నాను. ఉండరా బాబు. కంగారు  పడకు  అలాగే  చేద్దాము. పది  నిమిషాలలో  సావిట్లో  ఉంటాను" అన్నాడు  శ్రీధర్
      శ్రీధర్  ,   ఆదిత్య  కలసి   చకచకా  లెక్కలు  చేసేసారు. “ఇక  విశ్రాంతి తీసుకో"  అన్నాడు  శ్రీధర్  న్యూస్ పేపర్  చదువుతూ.  ఆదిత్య దగ్గర లేని  పరికరము  అంటూ  లేదు.  ప్రాధాన్యత  బట్టి  ఏది  ఎప్పుడు  వాడాలో   అప్పుడు వాడుతాడు . ఇంకేముంది  వాట్స్ అప్ లో  టెక్స్టింగ్  మొదలైపోయింది.  టింగ్ టింగ్  శబ్దాలు,  ముసిముసి  నవ్వులు … కొనసాగాయి. టివీలో  క్రికెట్ మ్యాచ్ కూడా మొదలైపోయింది . క్రికెట్  మ్యాచ్!! మజాకా  కాదు. ఊరూ  వాడా  ఎక్కడవాళ్ళు  అక్కడ  స్తంబించిపోయారు.
ఆఖరికి    ఎప్పుడూ  ఉదయాన్నే రాని పనివాళ్ళు కూడా  గబగబా పని  చేసుకుని  వారి వారి  గూటికి  చేరుకున్నారు.  పాకిస్తాన్  బ్యాటింగ్. రెండు  వికెట్స్  పడిపోయాయి  ఐదు  ఒవర్లకి. ముప్పై  రన్నులు  చేసారు.  అంతే ! ఇక  ఎక్కడ  చూసిన  నవ్వులు, కేరింతలు, మరియూ  టపాకాయల  శబ్దాలు. ముప్పై ఓవర్లకి,ఎనిమిది వికెట్స్  పడిపోయాయి, రెండొందలు  పరుగులు చేసారు. ఎక్కడ  విన్నా వహ్వా ,వహ్వా  శబ్దాలు/నవ్వుల  జల్లుల్లే!!!   ఇంక  పది ఓవర్లు  ఎలాగైతేనైనా  ఆడి  రెండొందల ఏభై  పరుగులు చేయగల్గారు. ఇక మధ్యాన్నము ఇండియా బ్యాటింగ్  ఎలా  ఉంటుందో  చూద్దాము...  అనే చర్చలు.
బోజనాలు ముగించుకుని,  క్రికెట్ చూడటము మొదలుపెట్టారు అందరూ. ఐదు  ఓవర్లకి  నాలుగు వికెట్లు  పడిపోయాయి. నలబై  పరుగులు చేసారు. "ఇంక  మనము  చూడద్దు,   కట్టేదాము  అస్సలు  బాగా  ఆడటంలేదు" అన్నాడు ఆదిత్య "మనము అనుక్కున  ప్రణాళికలో  పనులు  జరగవు ఒకొక్కసారి. తాను ఒక్కటి తలుస్తే దైవము ఒకటి నిర్ణయిస్తాడుట. మనము ఏ కార్యమైనా  మధ్యలో  ఒదలకూడదు. ఇప్పుడు క్రికెట్టే తీసుకో, పర్యవసానము  ఫలితము గురించి  ఆలోచించకుండా దృష్టి  బ్యాటింగ్  మీద కేంద్రీకరించి, ఆఖరి బంతి వరకు  ఆడాలి. అలా  చేస్తే, ఏమో!  నెగ్గచ్చు. గెలుపు  ఓటమి  రెండూ స్వీకరించగలగాలి. మనము  చేసే  పనిమీద  దృష్టి  కేంద్రీకరించాలి, ఏమంటావు  ఆదిత్య" అన్నాడు శ్రీధర్.
“సరేలే ఏదో  ఒకటి  చూద్దాము” అన్నాడు ఆదిత్య. అలా ఆఖరి  బంతికి  ఆరు రన్నులు  నెగ్గటానికి ఉంది. ఆ సమయములో   అందరూ మాచ్ లో ఎంతగా నిమగ్నమైపోయారంటే  , శ్వాస  కూడా  వేగముగా  పీల్చుకుంటున్నారు.  ఆఖరి బంతిలో  ఆరు పరుగులు కొట్టేసి ఇండియా నెగ్గింది.  ఒక  పెద్ద పరుగు పోటీలో  పాల్గునినట్లు అనుభూతి చెందారు అందరూ.  సోమవారము ప్రొద్దున్నే లేచి  లెక్కలన్నీ  తిరిగి  పరిశీలించి, పరీక్షకి  తయారైయాడు ఆదిత్య.
శ్రీధర్ " ఇంక  వెళ్దామా. సమయమౌతోంది" అనగానే... "అమ్మా  భయమేస్తోంది " అన్నాడు ఆదిత్య.
 "భయపడకు  వచ్చినది  ముందు  వ్రాయి, రానిది తరువాత ప్రయత్నించు. కంగారు  పడకు" అంది అరుణ.  బామ్మ శ్యామలమ్మ గారు గబగబా వచ్చి "ఈ ప్రసాదము  తిను, అంతా   బావుంటుంది” అంటూ ప్రసాదం ఇచ్చి,“ బాగా  చేస్తావు. ఆ  గణపతికి  దణ్ణము  పెట్టుకో  సరేనా.. " అని దీవించారు.
        "ఆగండర్రా  ఒక్క క్షణం ఇదిగో,  పెరట్లోంచి  బ్రహ్మీ  ఆకులు  తుమ్పుకుని కడిగి తెచ్చాను. తీసుకుని నములు.  మెదడు  చురుకుగా పని చేస్తుంది. " అన్నారు తాతగారు సన్యాసి  రాజు  గారు
"కంగారు పడకురా బాబు . పలికెడిది భాగవతమట  పలికించెడివాడు రామభద్రుండట ……”అని ఆ భగవంతుడికి  ఒక నమస్కారము  చేసాడు   శ్రీధర్.
"నాన్నా రా, ఇంక చాలు  నీ వేదాంతము " అన్నాడు  ఆదిత్య "వేదాంతము కాదురా బాబు, మనము చేసేది  చేసి,  ఫలితము  ఆ భగవంతుడికి వదిలెయ్యాలి.  అప్పుడే  ఒత్తిడి లేకుండా పరీక్ష వ్రాయగలవు" అన్నాడు  శ్రీధర్.
 పరీక్ష  హాలు  దగ్గర " ఆల్  ది బెస్ట్"  చెప్పాడు  శ్రీధర్. "థెంక్యు  నాన్నా" అన్నాడు  ఆదిత్య .
పరీక్ష  ఇలా వ్రాసి  అలా వచ్చాడు. మొహము వికసించిపోయింది.  "నాన్నా  చాలా  బాగా  చేసాను " అన్నాడు ఆదిత్య.
" ఇంక  అయితే  ఒక  రెండు  రోజులు  విశ్రాంతి  తీసుకుని  ప్రవేశ  పరీక్షలకి  చదువుదుగాని, సెలవల్లో ఏం చేస్తావ్ ?" అన్నాడు  శ్రీధర్.
"టీవీ, వాట్స్ అప్, బామ్మ  తాతగారి  భక్తి  పుస్తకాలకు  అట్టలు  వేయటము,  స్నేహితులతో  క్రికెట్  ఆడుకోవటము  అలా  పనులు జాబితా  చాలా  ఉంది " అన్నాడు ఆదిత్య.
*************
"అమ్మా  ఆకలి వేస్తోంది  అన్నము  పెట్టు"  అని బట్టలు మార్చుకుని, భోజనాల  గదిలోకి వచ్చి, "ఏమి  వండావు? " అన్నాడు  ఆదిత్య .
"ముద్ద పప్పు, గుత్తివంకాయ కూర, తోటకూర  పులుసు" అంది అరుణ.
"నాకు  ఇవేమి    ఒద్దు.   కారకారముగా   తినాలని  ఉంది. ఆవకాయి  అన్నము   పెట్టు" అన్నాడు  ఆదిత్య.
ఇంతలో  బామ్మగారు “ పప్పు అన్నములో పులుసు నంచుకుని తినరా, బావుంది. ఆవపెట్టి వండింది, చాలా బావుంది”  అన్నారు.
"ఒద్దు  బామ్మా,  ఇవాళ  నాకు  తినాలని  లేదు" అన్నాడు ఆదిత్య.
బామ్మగారు  ఒక  నిటూర్పుతో “ కాస్త   పెరుగూ  అన్నము  అన్నా  తిను, వేడిచేస్తుంది”  అని అన్నారు.
ప్రతీ  శని  ఆదివారములలో  ఏదో ఒక  పరీక్షలు, దానికోసం తయారౌటము  అలా 12వ  తరగతి పరీక్షా ఫలితాల  సమయము ఆసన్నమైనది. ఇలా రోజులు గిరగిరా  తిరిగిపోతున్నాయి. ఆదిత్య  బయటికెళ్ళి ఆడుకోవటమే  బొత్తిగా   మానేసాడు.  ఎంతసేపు  టీవి.  టివిలో  వచ్చే కార్యక్రమాలలో  నిమగ్నమైపోతాడు. ఇంతలో సావిట్లో టివి ధ్వనితో పిచ్చెక్కి పోతూ, ఇలా అంది అరుణ...
"అలా  రోజంతా  టివి   చూసేబదులు  బయటకి  వెళ్లి  ఆడుకోవచ్చుగా... ఎప్పుడు  చూసిన  సెల్ ఫోన్లోను  లేకపోతే  టివీ ... “
“ఎవ్వరూ  ఆడటము   లేదు. అందరమూ  టెన్షన్ లో   ఉన్నాము. ఎవరూ  ఎవరితో  మాట్లాడటము  లేదు. వెయిట్  ఎండ్   వాచ్  మోడ్ లో  ఉన్నాము. నాతో  ఏమీ   చెప్పద్దు. నన్ను ఒదిలేసై ." అన్నాడు ఆదిత్య.
"బామ్మా  నా   గురించే  దణ్ణము  పెట్టుకో. అసలు  నీ  దేవుడు  ఉన్నాడా.  నాకు  పీడకల  లాగా  ఉంది, ఫలితాలు  వస్తాయి  అంటే. ఏమీ   పాలు   పోవటము  లేదు. ఎలక్ట్రికల్   ఇంజనీర్  అవుతానో   ఎలక్ట్రిసియన్  అవుతానో  తెలీయటములేదు.  కొంచము  నీ  రాముడికి   అభ్యర్థన  పెట్టుకో, "నను  బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి "  పాడుతూ  ఉంటావు  కదా,  పనిలో  పని   ఆ  సీతమ్మ   తల్లిని   కుడా  వేడుకో. నీ  దేవుడు   ఉంటే  ఇదొక్కటీ   చెయ్యమని  చెప్పూ ...." అన్నాడు ఆదిత్య
************
మర్నాడు ఉదయమే  “నాన్నా  ఇవాళ  పరిక్షా    ఫలితాలు  వస్తాయి “ అన్నాడు  ఆదిత్య.
"అమ్మా  భయమేస్తోంది. కెమిస్ట్రీలో  పది   మార్కుల  ప్రశ్నలు  రెండు  సరిగ్గా  వ్రాయలేదుగా, ఏమౌతుందో?  అసలు  కెమిస్ట్రీ  ఎప్పుడూ   మిస్ట్రియే   అనుకో " అన్నాడు  ఆదిత్య.
"ఏది  ఏమైనా  ఎదురుకున్దాము. ఆందోళన  చెందకు"  అంది అరుణ.
“అమ్మా  కంగారుగా  ఉంది. ఏమి  చెయ్యాలో  తోచటములేదు. భయము భయముగా  ఉంది.  ఫుట్బాల్  మ్యాచ్  ఉంది. అందరమూ  కలసి   మ్యాచ్   టీవిలో   చూద్దాము   రండి” అన్నాడు ఆదిత్య.
“పాల  ముంచినా   నీట  ముంచినా   నీదే  భారము”  అని  ఆ  భగవంతుడి   సన్నిధానములో వేడుకుంది  అరుణ .
ఇంతలో  పరీక్షా  ఫలితాలు  వచ్చాయి. 90%  మార్కులతో  ఉతీర్నుడైయాడు.  తాతగారు  అందరికి  పటికబెల్లము   పంచిపెట్టారు.
అందరూ  పట్టలేని  ఆనందములో తేలిపోయారు.
"అమ్మా  కెమిస్ట్రీలో   78%  వచ్చింది. ఇంకెప్పుడూ  ఇలా  టెన్షన్  పెట్టను. ఇష్టమున్నా  లేకపోయినా  ముందునుంచే   చదువుతాను. లెక్కలలో 100%  వచ్చింది. నాకు చాలా  బావుంది. నాన్నా  నేను చెప్పాను  కదా,  చాలా  బాగా   చేసానని. ఇంకా  కెమిస్ట్రీ  గురించి  ఎవ్వరూ మాట్లాడద్దు" అన్నాడు ఆదిత్య.
పిల్లాడు  ఒక  దారిలో  పడుతున్నాడన్న  అనుభూతి   పట్టలేని  సంతోషము  తెచ్చింది   శ్రీధర్కి. ఒక్కసారి  ఆదిత్య  గట్టిగా   శ్వాస   తీసుకున్నాడు. మెల్లిమెల్లిగా  ప్రవేశ పరీక్షా ఫలితాలు  రావటము  మొదలైపోయాయి.
"ఐ ఐ టి  ప్రవేశ పరీక్షా  ఫలితాలలో  మంచి  మార్కులు  మరియు  మంచి  రాంక్  వచ్చాయి.  ఎక్కడో  అక్కడ మంచి  చోట,  మంచి  బ్రాంచ్ లో తప్పకుండా సీట్ వస్తుంది " అని శ్రీధర్ - ఆదిత్య అనుకున్నారు.
“ఇంక   హాయిగా   సంతోషముగా  ఉండు. రేపు  ప్రొద్దున్న  విమానములో  విశాఖపట్నం  నుంచి   తిరుపతి  వెళ్దాము” అని  అన్నాడు శ్రీధర్.
 సకుటుంబ సమేతంగా  తిరుపతి  ఆ  ఏడు కొండల వాడి  దర్శనానికి  ప్రయాణమైయ్యారు . తాతగారూ   బామ్మకి   యిది   మొట్ట మొదటి   సారి   విమాన  ప్రయాణము. చాలా  సంబరపడుతున్నారు.
బామ్మా తాతగారు  విమానము  కిటికిలోంచి    చూస్తునప్పుడు. బామ్మ తాతగారితో  ఇలా అంది  మెల్లిగా "కలయో   నిజమో   వైష్ణవ  మాయో  తెలిసీ  తెలియని   అయోమయములో" అన్నట్లు  ఉంది .
తాతగారు  బామ్మతో "మనము  జట్కాబండి   నుంచి   విమానము  వరకూ   ప్రయాణము చేసాము. మన  జన్మలు  సార్థకమైయాయి. విజ్ఞాన  పరంగా  ఎన్ని  ఆవిష్కరణాలు  అయ్యాయో. అయినా, జీవితంలో ఒత్తిడి ఎంత పెరిగిందో చూసావా... ఇప్పటిదాకా పెద్ద భారం మోస్తున్నట్లు ఉన్న ఆదిత్య, ఇప్పుడు ఎంత హాయిగా నవ్వుతున్నాడో చూడు...” అన్నారు.
“అవునండి, కుటుంబసభ్యులం అంతా అర్ధంచేసుకుని, స్నేహితుల్లా అండగా నిలవబట్టే, ఆదిత్య విజయం సాధించాడు. లేకపోతే ఈ అధిక భారాన్ని తట్టుకోలేక, ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్ధులు మానవత్వం మరిచి, ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా ?
కాలం ఎంత మారినా , నైతిక విలువల వ్యవస్థ  పిల్లలలో  పెంపొందించే పధ్ధతి, ఇంట్లో మొదలౌతుంది. మొదటి గురువు తల్లి. ఇక మిగతా కుటుంభ సభ్యులు పాత్ర కూడా చాలా ఉంది. పుట్టుకతో ఈ సమాజములో  ఎవరూ  చెడ్డ  కాదు. వాతావరణ ప్రభావములు,  ఒత్తిడులు  అలా చేస్తాయి. ఈనాడు ప్రచార, సమాచార సాధనముల ద్వారా మనము మనసును ఆకట్టుకునే విషయాలు చాలా  నేర్చుకుంటున్నాము. మంచిని  తీసుకుని  చెడుని  వదిలేసే శక్తి  పిల్లలలో  పెంపొందించాలి.  సరైన  వాతావరణము, అనుకూల పరిస్థితులు  ఉన్నపుడు, బయట  పోటి, యాంత్రిక ప్రపంచ కాలుష్యపు ఆలోచనలు పిల్లల్ని ఆవహించకుండా  ఉంటే  ఎంత బావుంటుందో  కదా!
ఇల్లంటే పదిలంగా దాచుకునే మనోభావాల ఆలయం. మనోవికాసము ఉద్భవించే దేవాలయము. సంతోషాల హరి విల్లు.  ప్రేమాభిమాన ఆదరణా ఆప్యాయతలతో  తుల తూగుతున్న ఇంట్లో పిల్లల  మనోవికాసము  తప్పకుండా  పెంపొందుతుంది. పెద్దలు ఇంట్లో పిల్లలతో వ్యవహరించేటప్పుడు  గురు స్థానములోంచే  కాదు, ఈ  కాలపరిస్తుతుల  బట్టి  స్నేహితురాలు లేక  స్నేహితుడు, సహోదరీ  లేక  సహోదరుడు పాత్రలలో కూడా అలోచించి, వాళ్ళ  మనసు ఆకట్టుకోవాలి. తల్లీ తండ్రులు  వాళ్ళ   మనసులో  పిల్లలకున్న  స్థానము  మరియు  ప్రాముఖ్యతను వారివద్ద వ్యక్తము చెయ్యాలి. ఫలితాలు ఏమైనా పర్వాలేదని, తామంతా అండగా ఉన్నామన్న నమ్మకం కలిగించాలి.
 ఈ  వ్యవస్థ ఇంట్లో మొదలౌవాలి. అంకురం  మొట్టమొదట  ఇంట్లో  నాటాలి.  ఏదన్నా మార్పు రావాలంటే, మనతోనే   మొదలౌవాలి, అని అంతా తెలుసుకోవాలి. ఇల్లు బావుంటే  ఈ  సంఘము బావుంటుంది. ఈ  సంఘము  బావుంటే  ఈ  దేశము   బావుంటుంది. ఈ  దేశము  బావుంటే ఈ ప్రపంచము  బావుంటుంది కదా!
మన  ఆదిత్య ఆయురారోగ్యైశ్వర్యాలతో  తులతూగుతూ  మనోభీష్టములు  ఫలించీ, ఎక్కడున్నా  సంతోషముగా వర్ధిల్లాలి.  మన ఆదిత్యలో   వినూత్న   ప్రతిభ   చాలా  ఉంది. మంచి  పట్టుదల  కూడా  ఉంది. ఆ  భగవంతుడు   చల్లగా  చూస్తే  ఎన్నో  సాధిస్తాడు.  మన  పిల్లలు  మంచి  వృద్దిలోకి   వస్తే  దానికన్నా  మనకి  ఏమి  కావాలి " అంటూ ఆదిత్యనే చూస్తూ అంది బామ్మ   సంతోషంగా.
************

No comments:

Post a Comment

Pages