వెన్నెల్లో లాంచీ ప్రయాణం

- వంశీ


“టైమెంత?” “ఏడవ్వస్తుందండి” “వచ్చే రేవేంటి?” “కొరుటూరు” “మరైతే ఆ మధ్యనున్న తిప్ప మీద ఈ రాత్రికి లంగరేసేద్దామా?” అదడగడానికే వచ్చాను... “సరే... బాసరలోనూ భద్రాచాలంలోనూ చూసిన గోదారికి ఇక్కడి గోదారికీ ఇంత డిఫరెన్స్ ఉందేమిటి”. అంటా వచ్చిన గొట్టిముక్కల పద్మారావు గారిని వాళ్ళ ముద్దు కృష్ణా లాంచీ చూపు కర్ర దగ్గరకి దించి, పన్న (చుక్కాని ముందు భాగం) దగ్గర కూర్చోపెడుతుంటే ఆ వెన్నెల్లో గోదావరిని చూసిన పద్మారావు “గోదావరి ఇంత గొప్పగా ఉంటదా?” అడిగాడు. “రోజూ జూసే మాకేం తెలుస్తుందండి కొట్టగా వచ్చిన మీరే జెప్పాలి” అన్నాడు నా పక్కనే నిలబడ్డ మురళీ కృష్ణ లాంచీ ఓనరు మూర్తి. తక్కిన తోముంగ పక్షులన్నీ ముందే వెళ్ళిపోడంతో ఎక్కడో ఇరుక్కున్న ఆ పక్షి తన పక్షుల్ని వెతుక్కుంటూ అరుచుకుంటూ వెళ్తుంది. ఆకాశంలో చంద్రుడు చాలా లైట్లు పడ్డ వెండి బిందెలా వెలిగిపోతున్నాడు. గాలి వీయడానికి ఇష్టం వుండీ లేనట్టు పల్చ పల్చగా వీస్తుంది. వెన్నెల్లో గోదారి అందం గోదావరి పెట్టుకున్న పాపిట బొట్టులాంటి పొడుగాటి ఇసక తిప్ప మధ్యలో లాంచీ ఆపాడు మూర్తి. వరదొచ్చినప్పుడు మట్టి లాగేసుకోడం వల్ల పెద్ద జంతువు అస్తిపంజరంలా బయట పడిపోయాయా చింత చెట్టు వేళ్ళు. కొమ్మల్లో మీద నిద్ర రాని పూరీడు పిట్ట విచిత్రంగా విరుస్తూ కూస్తుంది. దూరంగా రేవులో ఒడ్డుకి లాగి తిరగేసిన నావని రిపేరు చేస్తుంటే పదేళ్ళ కుర్రోడు లాంతరు చూపిస్తున్నాడు. నిండు చంద్రుడు మీంచి పల్చని మబ్బు పాయ పల్చటి వాయిలు చీర అంచులా పాకుతా వెళ్ళిపోతుంది. నిద్రరాని కొందోడు ఒడ్డుమీంచి నడుస్తా పోతున్నాడు. ఆకాశంలో నక్షత్రాల మధ్య వెళ్తున్న జానా బెత్తెడు సైజు విమానం దీపాలు మిలుక మిలుకమంటున్నాయి. గాలి ముమ్మరం పెరిగేసరికి జూకోడు పక్షి విచిత్రంగా అరుస్తూ వెళ్తుంది. కూనవరం సంతనించోస్తున్న లాంచీ నిండా జనం. ఎవరికి తోచిందాడు మాటాడ్తుంటే ఎవడికనిపించిందాడు పాద్తున్నాడు. ఆ లాంచీ వెళ్ళాక అంతసీపూ ఏ చప్పుడూ చెయ్యకుండా వున్న గోదాట్లో భళక్కు భళక్కుమన్న నీళ్ళ చప్పుడుతో పాటు రెండు పాయల కింద విడిపోయింది గోదారి. ఈ చప్పుడుకి నీళ్ళలోంచి ఒక్కసారి పైకి లేచి మళ్ళీ లోపలికెళ్ళి పోయినియ్యి నాలుగు బొచ్చు చేపలు. ఆకాశంలో కనిపించని రెండు పక్షులు కీర్ కీర్ చప్పుళ్ళు చేసుకుంటా వెళ్లిపోయినియ్యి. దూరంగా వున్నా శివగిరి వూళ్ళో ఒక లాంతరు వెలిగి మాయమైపోయింది. ఆ వెన్నెల్లో ఈదుతూ ఇదే గోదాట్లో ముప్పయ్యేళ్ళ క్రితం పాత, వెన్నెల్లో గోదారి అందం గుర్తొచ్చింది. వెనక్కి చూస్తే వెన్నెల్లో వెలిగిపోతున్నాయి పాపికొండలు. కుడి పక్కనున్న కొండ మొదలు గ్రామంలోనూ ఎడం పక్కనున్న కొరుటూరు లోనూ మసగ్గా వెలుగుతూ కనిపిస్తున్నాయి దీపాలు. వంట చెయ్యడానికి నల్ల శ్రీను పొయ్యి వెలిగిస్తుంటే సాయం చేస్తున్నాడు కృష్ణ. చంద్రుడ్ని చూస్తా వెన్నెల స్నానాలు చేసిన మా కోసం ఇసుకలో పరుపులేసి దుప్పట్లు పరుస్తున్నాడు మల్లాది సాంబులు. మీ కోసం కోయదొర దగ్గర మాంచి చిగురు సంపాయించేనంటూ రెండు లీటరు బాటిల్స్ తో వచ్చిన మూర్తిగారు ఒరే పట్టాభీ మూడు గ్లాసులు కదిగాట్టుకురా” అంటూ అరిచాడు. గోదారి నీళ్ళలాంటి రుచిగల ఆ చిగురు పుచ్చుకుంటున్న మా ఆనందం ఇంతా అంతా గాదు మరెంత? .... పాపికొండల్లో ఓ కొండంత. ఇంత గొప్ప ఆనందం ఇంతకూ ముందెప్పుడూ అనుభావిన్చాలేదన్నాడు పద్మారావు. చక్రి అయితే కొత్త పాత కట్టేసి కొత్తగా పాడేశాడు. కారణం తెలీదు, వేటపడవ ఒకటి వెనక్కొచ్చేస్తుంది. “రారా కౌగిలి చేర” అని పాత పాడతా ఇసక తిప్ప మీదాడుతోంది ఎల్. విజయలక్ష్మి. ఆ పాత మనిషికి పోటీగా వచ్చిన హంసానందిని మిర్చిలో పాటందుకుంది. గోదావరి మధ్యన రకరకాల వెలుగులు. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళిద్దరి కలలూ యెంత సేపు పండాయో. ఓ ముప్పావు గంట తర్వాత వంట పనిగానిచ్చిన నల్ల శ్రీనూ, డ్రైవరు కృష్ణా, సరంగు పట్టాభితో పాటు ఇంకా తాతలూ, బుల్లబ్బాయి లాంటోళ్ళంతా మా చుట్టూ మూగిపోయి మరి ఊసులాడ్డం మొదలెట్టారు.... ఆత్మ బంధువు అలలమీంచి చల్లని ఇగణంలా లేసు తెరలు గాలికేగురుతున్నట్టు తెరలు, తెరలుగా వీస్తుంది గోదారి గాలి. ఓ పదారేళ్ళ పడుచుపిల్ల లాంచీ పది చెక్క మీద ఓరగా కూర్చొని తన పారాణి పాదాల్ని గోదారి నీళ్ళలో ఆడిస్తూ పాపికొండల అందాలను కళ్ళప్పగించి చూస్తుంది. ఎప్పుడో తెల్లారగట్ల. ఎదరాల్లో కూర్చున్న తల్లి ఒళ్లో సంటోడు బూరా ఊదుతున్నాడు. తాళ్ళ చుట్ట మీద కూర్చున్న ముసలోడు మాగన్నుగా నిదరోతున్నాడు. రాజమండ్రి రేవులో మొదలైన ప్రయాణం మధ్యలో ఆగుతా తర్వాత సాగుతా... అందరినీ పలకరించుకుంటా.. రేవులన్నీ చుడతా దేవీపట్నం దగ్గరకొచ్చింది. ఆ రేవులో లాంచీలోకి అత్తారుబత్తంగా చేరుస్తున్నాడు టిక్కెట్లు కొట్టే మల్లాడి పట్టాభి, పొలాలకి ఎరువులు తీసుకెళ్ళే వొళ్ళు... కొండోళ్ళకి పప్పులు, ఉప్పులు మోసుకెల్లి వ్యాపారాలు జేసుకునేవోళ్ళు... చంటోళ్ళకు సుస్తీ చేస్తే ఆసుపత్రులకు తీసుకెళ్ళే వాళ్ళతో నిండిపోయింది లాంచీ. అటూ ఇటూ పరుచుకుపోయున్న పాపికొండల గూడేల్లో వుండే గిరిజనులు బయటకు రావాలన్నా, ప్రాణావసరాలు తీర్చుకోవాలన్నోళ్ళకి ఈ లాంచీలు తప్ప మరే ఆధారం లేదు. అందుకే ఆలలకి ఆత్మబంధువు లాంచీ. స్వర్ణయుగం దవిళేశ్వరం, పోలవరాల్లో మొత్తం కలిపి అయిదారొందల లాంచీల దాకా వున్నాయి. ఇయ్యన్నీ రాజమండ్రి లేకపోతే పోలవరం నించి బయల్దేరి పాపికొండ అవతల్లున్న కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెం దాకా ఎగువ నుంచి దిగువకి, దిగువ నించి ఎగువకీ కలతిరుగుతున్నాయి. ఒక్కోసారి దుమ్ముగూడెం కూడా దాటిపోయి ఏటూరు నాగారం, కాళేశ్వరాలవతలున్న ఆదిలాబాద్ – మహారాష్ట్ర బోర్డరు దాకా వెళ్ళొచ్చేస్తుంటాయి. ఎక్కువ పాసెంజర్ రద్దీ మాత్రం రాజమండ్రి నుంచి తూర్పు గోదావరికి చివరి గ్రామమైన కచ్చులూరు మధ్యే వుంటది. ప్రతీ లాంచీలోనూ నలభై, యాభై మంది జనాలు అటూ ఇటూ తిరుగుతుంటారు. రాజమండ్రి నుంచి పాపికొండలుకి వెళ్ళొచ్చేందుకు ఒక లాంచీకి రమారమి పది గంటలు పడద్ది. మధ్యాన్నం రెండింటికి కనక రాజమండ్రిలో లాంచీ బయలుదేరితే కచ్చులూరేళ్ళే సరికి పోద్దుగుంకిపోద్ది. ఇక రాత్రికి లాంచీ పనోళ్ళంతా రేవులో ఓరగా గెడేసి నిలిపేసి గోదారి చేప, రొయ్యలతో గుమాయించే కూరలోన్డుకుని తినేసి ఆ ఇసక తిప్పల మీద నడుం వాల్చేసి ఆకాసంలో చుక్కల్లెక్కెట్టుకుంటూ నిద్రల్లోకెళ్ళిపోతారు. తెల్లారేక ప్రయాణం మొదలైతే రాజమండ్రి చేరుకునేతలికి సూర్యుడు నడినెత్తి మీదకి జేరతాడు. ఇలా కల తిరిగే లాంచీ ఒక్కో ట్రిప్పుకి ఓనరుకి అన్ని ఖర్చులు పోనూ పదిహేనొందల నించి రెండు వేల రూపాయల దాకా మిగులుద్ది. లాంచీ స్టాఫ్ కి చేతినిండా పని, ఓనరుకి జేబునిండా సొమ్ము. అందరికీ పనే రాజమండ్రి పేపరు మిల్లుకి పచ్చి వెదుళ్ళతో కట్టిన తెప్పకట్టలు ఎగువనించి దిగువకోస్తున్నాయి. యందు మిరపకాయల లాంచీ లెక్క పెట్టలేనన్ని దిగుతున్నాయి. ఎగువలో బాగా మేసిన మేకల మందొకటి ఒక పడవలోకెక్కేసి ఈ వేపొస్తుంది. గోదారి మీద లాంచీలు జోరుగా కల తిరుగుతున్నాయి. ప్రతీ లాంచీ మీదాసరంగూ, గెడేసేవోడు, ఇంజిను డ్రైవరు, వంటపుట్టు, టిక్కెట్లు కొట్టేవోడు, ఈల్లందరికీ ఒక్కో అసిస్టెంటు. అంటే ఒక లాంచీ కదలాలంటే ఏడెనమండుగురు జనం. ఇలా మొత్తం రెండు మూడు వేళ కుటుంబాలకి లాంచీల మీదే బతుకుదెరువు. ఇంకా లాంచీలకు మరమ్మత్తులు చేసేవోళ్ళు కొత్త లాంచీల్ని తయారు చేసేవోళ్ళు ఇలా చాలా మంది పనోళ్ళున్నారు. ఈళ్ళంతా ధవిళేశ్వరంలో వాడపేట, జాలారి పేటలో కాపురముండే జనాభా. ఈ కుటుంబాల్లో కుర్రోళ్ళకి చదువు అట్టే వంటబట్టకపోయినా లాంచీ మీద ఎలా బతకాలో మాత్రం బాగా అబ్బుతుంది. లాంచీ మీద సరంగుగా పన్జేసే ప్రతివోడు, తన బిడ్డని కూడా సరంగుగానే తీర్చి దిద్దుతాడు. ఇంట్లో ఇద్దరుముగ్గురు మగ పిల్లలుంటే ఆళ్ళకిఇంజిను డ్రైవర్, మేకానిక్కూ పనులే నేర్పెస్తారు. పడీ పద్నాలుగేళ్ళ వయసొచ్చే తలికి ఆ పిల్లలు కూడా లాంచీలేక్కి గోదారమ్మ ఒళ్లో ప్రయాణానికి తయారయిపోతారు. యెంత ప్రేమండీ బాబో లాంచీ తయారవ్వాలంటే లక్షల రూపాయలుగావాలి. ఆటిని పెట్టుబడి పెట్టి, ఓ రూపు తీసుకొచ్చే ఓనర్లు ఇటు పశ్చిమ గోదావరి, అటు తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఉన్నారు. ఆళ్ళంతా ఆళ్ళ లాంచీల్తో పాటే గోదావరిమీద ప్రయాణాలు చేస్తుంటారు. లాంచీ ఎక్కే ప్రతీ పాసింజర్నీ చాలా ఇష్టంగా ప్రేమగా ఎప్పడ్నుంచోఎరుగున్నట్టుచేయ్యట్టుకు తీసుకెళ్ళి లాంచీలో కూర్చోబెడ్తారు. అమాయకులైన కొండోళ్ళంటే మాయిష్టం ఈల్లకి. ఆ కొండోళ్ళు కూడా గుండెల్లో పెట్టుకునేవోళ్ళే. ఒక్కోసారి టిక్కెట్టుకు సరిపడా డబ్బులు లేకుండా ఎక్కినోళ్ళని అర్ధణాబిళ్ళ కూడా అడక్కుండా ఆ కొందోల్లు ఎక్కడ దిగాలో అక్కడ దిమ్పెస్తారు మళ్ళీ వచ్చినప్పుడాళ్ళు ఆ సొమ్మును తెచ్చి, బాకీ తీర్చేస్తారనీళ్ళకి తెల్సు. బలమైన బంధం మరి ఒక్కోసారి చాలా పని బడి ఆ కొండోళ్ళు గోదారి రేవులో అన్నం కూడా తినకుండా లాంచీకోసం పడిగాపులు గాస్తుంటారు. అంత ఆకలితో లాంచీ ఎక్కినాల్లు లాంచీలోని వంటోడి దగ్గరకెళ్ళి “ఆకలేస్తంది... ఏదైనా ఉంటే పెట్టు...” అనడిగితే ఆ వంటోడు గబగబా పొయ్యెలిగించి, కాస్త గెంజన్నం కాసి వేడి వేడిగా కొండోడి గొంతులో పోసేటప్పిటికి ఆడి ప్రాణం లేచొస్తది. అప్పుడా కొండోడు నీళ్ళు నిండిన కళ్ళతో ఈ లాంచీలో వంటోడ్ని చూస్తాడు. అందుకేనేమో ఆళ్ళు లాంచీలోళ్ళడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తారు. కొండ చెట్లకు కాసే కాయలు, పళ్ళతో పాటు ఇప్పసారా, తాటి చిగురు, దుప్పి మాంసం ఒకటేంటి ఆళ్ళడగడమే తప్పు కొండలమీద్దోరికే ఎన్నో విలువైన వస్తువులు తెచ్చేసి లాంచీలోళ్ళ కాళ్ళ దగ్గర కుప్పలు కింద పోసేస్తారు. లాంచీ పనోళ్ళాళ్ళ ప్రాణాలకి తెగించి గిరిజనులని కాపాడిన సంగతులెన్నో. ఓసారి గోదారి తీరాన కొలువై ఉన్న గండి పోసమ్మ తల్లి తీర్ధం జరుగుతుంటే అమ్మోరిని దర్శనంజేసుకోడానికోచ్చినో కుటుంబం మొక్కు చేల్లించుకుని, అక్కడ కోళ్ళు మేకలూ కోసి, వంటలు చేయించి సంతర్పణ జేస్తున్నారు. ఆళ్ళల్లో ఓ తల్లి సంటిపిల్లోడ్ని ఒడ్డునోదిలేసి, కుండామండా కడుక్కుంటుంటే, ఆ చంటోడు పాక్కుంటూ గోదాట్లోకెళ్ళిపోయాడు. గండిపోసమ్మ తీర్దానికి వచ్చేవోల్లని గోదాట్లో ఆ రేవు నుంచి ఈ రేవుకి చేరవేస్తున్న గూటాల మూర్తి, పిల్లోడు మునిగిపోతున్న సంగతి జూసి వెంటనే సరంగు సిమాద్రిని గోదాట్లోకి దూకేయమని అరిచేడు. అంతే ! సిమ్మాద్రి అమాంతంగా గోదాట్లోకి జంప్ జేసి ఆ చంటోణ్ని ఒడిసి పట్టేసుకుని పండుగోప్పలా ఈదుకుంటా ఒడ్డుకు చేరిపోయి ఆ బిడ్డని తల్లి ఒళ్లోకిజేర్చేడు. దీంతో ఆ తల్లి కన్నీరు గోదారి నీరైపోయింది. “ఆ గండిపోసమ్మే నీ రూపంలో వచ్చి నా పేగు బంధాన్ని నిలబెట్టింది...” అంటా కాళ్ళ మీద బడిపోయింది. ఇలాగెన్నో ప్రేణాలు నిలబెట్టారీలాంచీ జనాభా. దేవీపట్నం అవతలేపున్న సింగన్న పల్లిలో గోదార్తల్లి అనే కొండ మనిషికి సుస్తీ చేసింది. ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని క్షణాలు లెక్కపెడ్తుంటే ఉమా పరమేశ్వరి లాంచీ సింగన్నపల్లి రేవులోకొస్తే, ఆ మనిషి కష్టం మీద లాంచీ ఎక్కింది. చాలా నీరసంగా ఉన్న ఆ మనిషిని పలకరించాడు లాంచీ సరంగు తాతబ్బాయి. తన పరిస్థితి చెప్పింది. వంటోడు రాజు, టిక్కెట్లు గొట్టే రామిరెడ్డి కలిసి ఎంతో కష్టపడి ఆళ్ళకిదెల్సిన డాక్టరు నాగాసామి గారి దగ్గరకి తీసుకెళ్ళారు. అయితే ఆ మనిషికోచ్చింది చాలా పెద్ద జబ్బని, వేలకువేలు ఖర్చవుతాయని చెప్పాడా డాక్టరు. చూస్తే చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆ మనిషినలా వదిలేడానికి మనసోప్పలేదా లాంచీ పనోళ్ళకి. ఓనరూ, కృష్ణమూర్తి స్నేహితుడైన డాక్టరు మాటతో గవర్నమెంటు ఆసుపత్రిలో చేర్చారు. ఆ మనిషికి మంచి వైద్యం చేయించేరు. ఓ మూడ్నేల్లపాటు కంటికి రెప్పలా చూసుకున్నారు. లాంచీలోళ్ళ ఇల్లనుంచే రోజూ ఆమెకి అన్నాలూ అదీ పట్టుకెళ్ళేవోళ్ళు. చివరికి ఆ మనిషి ఆరోగ్యం సక్క బడ్డాక తీసుకొచ్చి సింగన్నపల్లిలో వదిలిపెట్టేరు. ఇక గోదారికి వరదొచ్చిందంటే లాంచీ వర్కర్లు జేసే సేవలు అన్నీ ఇన్నీ గావు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ జేసినప్పటి నుంచే గోదారి తీరమంతా ఏ చప్పుడూ లేకుండా ఉంటది. లాంచీలన్నీ రెవిన్యూ అధికారుల చేతుల్లోకేల్లిపోతయ్యి. ఇంకాళ్ళ చెప్పు చేతల్లోనే లాంచీ పనోళ్ళంతా. చాలా కష్టపడ్తారు. గోదారి ఒడ్డునుంచే ఆళ్ళే కొండోళ్ళ గూడేలకి అన్నలూ, మందులు పట్టుకేల్తారు. వరదలో ఇరుక్కుపోయినోళ్ళని ఏదో ఒడ్డుకి చేరుస్తారు. సుడులు తిరిగే గోదారి ఒడిలో లాంచీ పనోళ్ళు ప్రాణాలకి తెగించి చాలా కష్టపడ్తారు. ఇలా ఆ లాంచీ పనోళ్ళు జెప్పినవి విని చప్పట్లు కొట్టెం మేమంతా. నల్లటి విషాదం “ఇప్పుడు మేం చెప్పినియ్యి పాతికముప్పయ్యేల్ల క్రితం నాటి సంగతులండీ”... అదిరిపోయి నీళ్ళలోపడ్డాడు చెక్రీ, పద్మారావయితే గోడక్కోట్టిన మేకులాగుండిపోయేడు. “ఔనండి... కాలం మారిపోయిందండీ... ఈయన గారు ఆళ్ళ పసలపూడి కథల్లో రాసినట్టు తీర్థం నాడు దేవుడి రధాన్ని మహేంద్రా ట్రాక్టర్ లాగుతున్న రోజులండి ఇయ్యి” అన్నాడు మూర్తి. “నిజంగా ఆ కాలమే సెపరేటండి... ఆ రోజులే వేరండి, అయ్యి మళ్ళీ వస్తయ్యంటారా, వస్తే యెంత బాగుంటదండీ” “చాల్లేరా చాదస్తం... ఇదిగో యావండీ... మళ్ళీ రమ్మన్నా రావండీ ఆ రోజులు” అన్నాడు కృష్ణ. “మళ్ళీ జన్మం గానీ వుంటే మా దవిళేశ్వరంలోనే పుట్టి, మా జనార్ధన స్వామి గుడివున్న కొండ మీద కళ తిరిగి మా గోదారితల్లి ఒళ్లో ఈదాలనుందండీ” “బాగా జెప్పేవురా పట్టాభీ... ఆ రోజులే అసలు రోజులు, ఆ కాలమే అసలు కాలం... అసలు సిసలైన బంగారపు బంగారపు కాలం” అంటా కళ్ళ నీళ్ళేట్టుకున్నాడు బుల్లబ్బాయి. తాతాలైతే కళ్ళ నీళ్ళేట్టుకోడంగాదు కోరుటూర్నుంచి పోలవరం బయల్దేరుతున్నా బస్సుని జూసి ఏడుస్తుంటే మేమూ అదోలాగయిపోయేం, మా మనసులు కూడా కరిగి జారిపోయినియ్యి. మమ్మల్ని చూళ్ళేని పున్నమి చెంద్రుడు మబ్బుల్లోకెళ్ళి పోతుంటే మా ముఖాల్నిండా విషాదం... నల్లటి విషాదం.
-------------()--------------

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top