నాన్న.. - అచ్చంగా తెలుగు

నాన్న..

Share This

నాన్న..

-వెంపరాల.వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి.


" అభి నాన్నా..లేరా..స్కూల్‌ కి టైం అవుతోంది.లేచి త్వరగా రడీ అవు. " గట్టిగా చెప్పాడు రేవంత్‌.
" ఇవాళ బ్రేక్‌ పాస్ట్‌, ఏం చేస్తున్నావు.? " అడిగాడు దుప్పటి ముసుగు లోంచి అభి.
" ఉప్మా చేస్తున్నాను..నాన్నా.." చెప్పాడు రేవంత్‌.
" రోజూ ఉప్మా నే నాన్నా..తినలేకపోతున్నాను.మార్చొచ్చు కదా. " అన్నాడు గోముగా.
" రేపు ఆదివారం కద నాన్నా..రేపు దోశలు పోస్తానులే.ఈ రోజు కి అడ్జస్ట్‌, అవు.మా అభి ఈజ్‌ ఏ గుడ్‌ బాయ్‌ కదా.నాన్న ఎలా చెబితే అలా వింటాడు." అంటూ బుజ్జగించాడు.
అభి లేచి తయారయ్యాక స్కూల్‌ దగ్గర దింపి తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు రేవంత్‌.
***
" ఏరా..అభి ఏం తెచ్చావు లంచ్‌ బాక్స్‌, లో.." అడిగాడు నిక్కీ.
" ఉప్మా చేసార్రా మా డాడీ.అదే తెచ్చాను." చెప్పాడు అభి.
" మీ డాడీ చెయ్యడమేరా..మీ మమ్మీ చెయ్యరా ." అడిగాడు నిక్కీ.
" లేదురా..మా మమ్మీ దేవుడి దగ్గర వుందట.మా డాడీ చెప్పారు." చెప్పాడు అభి.
"  ఓహో..అలాగా..ఒరే,ఈ దేవుడి దగ్గర వున్న వాళ్ళతో మాట్లాడడమెలాగో నీకు తెలుసా.." అడిగాడు నిక్కీ.
" ఎందుకురా..నాకు తెలీదే." అన్నాడు అభి.
" మా నానమ్మ కూడా దేవుడి దగ్గరే వుందట.నాకు మా నానమ్మ తో ఆడుకోవాలని,మాట్లాడాలని వుంటుది రా.ఎప్పుడు ఎవరిని అడిగినా దేవుడి దగ్గర వుందని చెబుతున్నారు." అన్నాడు నిక్కీ.
" సరే లే రా.. రేపు మా డాడీ ని అడిగి నీకు చెబుతాను.అప్పుడు ఎంచక్కా నువ్వు మీ నానమ్మ తో,నేను మా అమ్మ తో మాట్లాడుకోవచ్చు." చెప్పాడు అభి.
సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చి ఇంటి దగ్గర హోం వర్క్‌, చేసుకుంటున్నాడు అభి.ఆఫీసు నుంచి వచ్చి తన లాప్‌ టాప్‌ లో ఏదో చూసుకుంటున్నాడు రేవంత్‌.
" నాన్నా..నువ్వు ఎప్పుడైనా దేవున్ని చూసావా ? " అడిగాడు అభి.
ఊహించని ప్రశ్నకి ఒక్కసారిగా షాక్‌ తిన్నట్టయ్యాడు రేవంత్‌.ఏం సమాధానం చెప్పాలా అని తటపటాయించాడు. ఏం చెప్పినా ఆ చిన్నారి మనసుకి హత్తుకోవాలని,నొచ్చుకోకూడదని అనుకున్నాడు.
సున్నితంగా అభిని దగ్గరకి తీసుకొని చేతితో తలని నిమురుతూ " ఏం అభి అలా అడిగావు." అన్నాడు.
" నాకు అమ్మతో మాట్లాడాలని వుంది నాన్నా.." అన్నాడు కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతుండగా.
ఒక్కసారి రేవంత్‌ కళ్లు చెమ్మగిల్లాయి.
" అలాగే..అభి..తప్పకుండా.ఆ దేవుడ్ని నువ్వు కోరుకుంటే నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు." చెప్పాడు రేవంత్‌.
" ఆ దేవుడు నా కోరిక తీర్చాలంటే ఏం చెయ్యాలి నాన్నా " అమాయకంగా అడిగాడు అభి.
" ఏం లేదు నాన్నా..నువ్వు బాగా చదువుకోవాలి.అప్పుడు ఆ దేవుడు మీ అమ్మతో మాట్లాడిస్తాడు." చెప్పాడు రేవంత్‌.
" అయితే సరే నాన్నా,కష్టపడి బాగా చదువుతాను." చెప్పాడు అభి.
 " వెరీ గుడ్‌ అభి..మా అభి ఈజ్‌ ఏ గుడ్‌ బాయ్‌ " అని నుదిటమీద ముద్దాడాడు రేవంత్‌.
అభి మరికొంత సేపు పోయాక ఎగురుకుంటూ వచ్చి తండ్రిని వాటేసుకున్నాడు.
" నాన్నా ఇప్పుడు అమ్మతో మాట్లాడించు " అడిగాడు.
నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది రేవంత్‌ కి.కానీ నెమ్మదిగా తేరుకొని
" అభీ నువ్వు,నేను మాట్లాడుకున్న విషయం ఆ దేవుడి కి ఎలా తెలుస్తుంది చెప్పు.నీకు మీ అమ్మతో మాట్లాడాలని వుందని ముందు ఆ దేవునుకి తెలియాలి కదా." అన్నాడు.
" మరి ఆ దేవుడికి ఎలా తెలుస్తుంది.నువ్వే చెప్పు.మనమేం చేయాలి " అన్నాడు గోముగా.
ఒక్కసారి ఆలోచించి చెప్పాడు రేవంత్‌." సరే అయితే నువ్వు దేముడి కి ఓ వుత్తరం రాయి.అది చదివి ఆ దేవుడికి నచ్చితే అప్పుడు అమ్మతో మాట్లాడిస్తాడు." చెప్పాడు.
" నిజంగానా..నాన్నా."ఎంతో సంతోషం తో అడిగాడు అభి.
" నిజంగానే అభి..." చెప్పాడు.
" నిజంగా నా వుత్తరం దేవుడు చదువుతాడా..? " మళ్ళీ అడిగాడు అభి.
" ఏమో ప్రయత్నం చెయ్యి.నీ ఉత్తరం ఆ దేవుడు తప్పక చదవొచ్చు." చెప్పాడు రేవంత్‌.
" మరి ఆ ఉత్తరాన్ని ఎక్కడకి పోస్ట్‌, చెయ్యాలి " అడిగాడు.
" ముందు నువ్వు ఉత్తరం రాసి ఆ దేవుడిపటం దగ్గర పెట్టు.అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం." చెప్పాడు.
వెంటనే అభి ఎంతో ఉత్సాహంతో తన మనసులోని భావాల్ని,కోరికల్ని వివరిస్తూ ఎంతో ఆరాటంతో ఉత్తరం రాసి ఆ దేవుడి పటం దగ్గర పెట్టి నమస్కరించాడు.
అయినా మనసులో ఒకటే బెంగ,కలవరం.ఆ దేవుడు ఎప్పుడు వస్తాడు,తన ఉత్తరం చదువుతాడో,లేదో,చదివితే ఏం చేస్తాడు.మనసు నిండా ఇవే ఆలోచనలు తిరుగుతుండటం తో చాలా సేపటి వరకు నిద్రపట్టలేదు అభి కి.అలా ఆలోచిస్తూ,ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాడు.
***
“ దేవుడా..నా కెందుకు ఇలా చేసావు.మా అమ్మ ని నీ దగ్గరకి ఎందుకు తీసుకు వెళ్ళిపోయావు.మా స్కూల్లో చిన్నికి,నానికి,జాన్‌ కి,నిక్కీకి,రేష్మా కి అందరికీ అమ్మలు వున్నారు.వాళ్లందరూ లంచ్‌ టైం లో వచ్చి వాళ్లకి గోరు ముద్దలు తినిపిస్తూ వుంటారు.నేనెప్పుడూ ఉప్మా తింటూ ఏడుస్తుంటాను.వాళ్ళందరూ వాళ్ళమ్మ మీద కూచొని చిట్టి ముద్దులు తీసుకుంటారు.నేనలా దూరం నుంచి వాళ్లనలా చూసి సిగ్గుతో తల దించుకుంటాను.వాళ్ళ స్కూల్‌ బేగులు వాళ్లమ్మలే మోసుకెళతారు.నా బేగ్‌ నేనే నడుంనొప్పి వచ్చినా మోసుకుంటాను.ఇలా నాకు ఎన్నో చెప్పుకోలేని భాధలు వున్నాయి గాడ్‌.
నాకు మా అమ్మ గొంతు వినాలని,ఒక్కసారి మాట్లాడాలని,తనివితీరా ఆడుకోవాలని వుంది.ఒక్కసారి నాతో మాట్లాడించవా!.నువ్వు ఏం చెప్పినా చేస్తాను.. ప్లీజ్‌ గాడ్‌..
అమ్మ పిలుపు కోసం ఎదురుచూస్తూ..అభి. ”
ఆ ఉత్తరం చదువుతున్న రేవంత్‌ కి దుఖం ఆగలేదు.ఒంటరిగా వెక్కి,వెక్కి ఏడ్చాడు.
***
జాహ్నవి పోయిన రోజు గుర్తొచ్చింది.
ఆసుపత్రి లో అభి పుట్టిన తర్వాత తడిమిచూసుకుంటూ , తన పక్కనున్న రేవంత్‌ ని చూసి చెప్పింది జాహ్నవి.
" రేవంత్‌..నన్ను ఆ దేవుడు పిలుస్తున్నాడు.మన ప్రేమ కి చిహ్నం గా ఆ దేవుడే మనకీ బిడ్డని ఇచ్చాడు.నువ్వు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకొని హాయి గా వుండు.మన ఋణాన్ని ఆ దేవుడు ఈ రోజు వరకే రాసాడు." కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా చెప్పింది జాహ్నవి.
" లేదు..జానూ..వీడు మన ప్రేమకి ప్రతిరూపం.మన సాంగత్యానికి సజీవ శిల్పం.నేను ఈ బిడ్డలోనే నిన్ను చూసుకుంటాను.మరో అమ్మాయికి నా జీవితం లో స్థానం లేదు.నా కంటికి రెప్పలా వీడ్ని పెంచుతాను..." అప్పటికే జాహ్నవి తనువు ఆఖరి శ్వాస వదిలేసింది.
ఆ సంఘటన ఓ సారి కళ్ళముందు కదిలింది.
***
మర్నాడు ఉదయాన్నే వేగంగా లేచి దేవుడిపటం దగ్గర వెతికాడు అభి.ఆశ్చర్యంగా తను రాసిన ఉత్తరం అక్కడ లేదు.దాని స్థానం లో మరో ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు.దాన్ని తీసి ఎంతో ఆతృంగా చదివాడు.
“ అభీ..నువ్వు రాసిన వుత్తరం చదివాను.నువ్వు బాగా చదువుకోవాలి.భవిష్యత్‌ లో పెద్ద,పెద్ద విజయాలు సాధించాలి.ఇక్కడ మీ అమ్మ కూడా కోరుకొనేదదే.నువ్వెప్పుడూ సంతోషంగా వుండాలని. మీ నాన్న ని ఎప్పుడూ భాధపెట్టకూడదు. చెప్పినట్టు విని మంచిపేరు తెచ్చుకోవాలి.
నేను చేసే ప్రతి పనికి ఎంతో అర్ధం వుంటుంది.మీ అమ్మ ని నాదగ్గర వుంచుకొని,మీ అమ్మని,నాన్నని కలిపి ఒకేరూపం లో నీకు నాన్నలా ఇచ్చాను.కాబట్టి నువ్వు మీ నాన్నతో ఆనందాన్ని పంచుకో..
అయినా సరే,నువ్వు చాలా మంచి అబ్బాయి వి కాబట్టి, నీతో మీ అమ్మని ఒకసారి మాట్లాడమని చెబుతాను.అదీ ఒకసారి మాత్రమే నీ కోసం..”
ఆ ఉత్తరం చూసి ఆనందాన్ని పట్టలేకపోయాడు అభి.
రాత్రి ఎనిమిదవుతోంది.ఆ దేవుడు వాళ్ళమ్మతో ఎప్పుడు మాట్లాడిస్తాడా అని ఎదురుచూస్తున్నాడు అభి.ఎలా మాట్లాడిస్తాడు.ఎక్కడి కెళ్ళాలి..చిన్న బుర్ర నిండా అవే ఆలోచనలు.
ఇంతలో ఫోన్‌ రింగవడం మొదలెట్టింది.రేవంత్‌ పట్టించుకోనట్టు కూర్చున్నాడు.అభి వెళ్ళి ఫోన్‌ తీసాడు.
అటునుంచి సన్నని గొంతు తో "అ భీ.." అని వినిపించింది.
ఒక్కసారిగా షాక్‌ తిన్నట్టయిపోయాడు.అవతలి గొంతు నించి ఆపుకోలేకపోతున్న దుఖం.
" అమ్మా,అమ్మా.." అంటూ అభి పిలుపుల్లాంటి కేకలు..చూస్తున్నాడు రేవంత్‌.
" ఎలావున్నావమ్మా..నన్నిలా వదిలేసావేమమ్మా.."అంటూ ఎన్నో ప్రశ్నలు గుప్పిస్తున్నాడు అభి.
అన్నిటికీ ఓపికగా తనివితీరా జవాబులు చెప్పిం ది ఆ అమ్మ..
ఆ అన్నిటి సారాంశం ఒకేలా అర్ధమయ్యింది అభికి. మీ నాన్న చాలా మంచివాడు.జాగ్రత్తగా చూసుకో..అని.అమ్మ చెప్పిందని.
ఒక్కసారిగా తండ్రిని వాటేసుకొని ఏడుస్తూ నిద్రలోకి జారుకొన్నాడు అభి.
***
నిక్కీ తల్లి చేసిన సహాయానికి మనసులోకృతజ్నతలు చెప్పుకున్నాడు రేవంత్‌..
                                                                                  

No comments:

Post a Comment

Pages