మనసున మనసై- 3 - అచ్చంగా తెలుగు

మనసున మనసై- 3

Share This

@@@@-మనసున మనసై ..- @@@@

(పెద్ద కధ ) – 3 వ భాగం

రాజవరం ఉష


(జరిగిన కధ : సుజన్,సంజన ప్రక్క ప్రక్క ఇళ్ళలో ఉంటారు. వాళ్లకు రక్తసంబంధం లేకపోయినా, వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే, ప్రక్కప్రక్కన ఇళ్ళు కట్టుకుని, ‘బావా- బావమరిది’ అంటూ వరస కలుపుకుని, ఆత్మీయంగా పిలుచుకుంటారు. సుజన్, సంజనల చదువు పూర్తి కాగానే వాళ్ళ పెళ్లి చేసి, ఆ బంధాన్ని మరింత బలోపేతం చెయ్యాలని, వాళ్ళ ఆలోచన. తను ప్రేమించే రంజిత్ గురించి సుజన్ కు చెప్తుంది సంజన. ఆమె చెబుతుండగా విన్న సంజన తల్లి అన్నపూర్ణ , అవాక్కై మెట్లమీద జారి పడిపోతుంది .... ఇక చదవండి...)

అన్నపూర్ణ ఆయాసంతో రొప్పుతూ" ఏమిటే  ఏమి మాట్లాడుతున్నావే నిన్ను సుజాన్ కిచ్చి పెళ్లి చేయాలను కుంటుంటే  ఏమైందే నీకు? మీ నాన్నకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? వీళ్ళ నాన్నకి ఇచ్చిన  మాట పోదూ? అన్నయ్య వదినెలకి నేనెలా చెప్పాలే ?" వగరుస్తూనే అంది అన్న పూర్ణ.
రంజిత్  నీళ్ళ గ్లాసు తెచ్చి నోటికందించాడు.
“ బిపి పెరిగినట్లుంది ఆంటీ ! మాత్ర వేసుకున్నారా లేదా ఇవ్వాళ ?” అని అడిగాడు.
నీళ్ళు త్రాగి స్థిమితపడింది అన్నపూర్ణ . "నువ్వు కూడా ఏంటి బాబు? ఈ పిచ్చిదేదో వాగితే  ఊరుకుంటున్నావు ? అవతల మీ అమ్మ నాన్నలు మీ పెళ్లి కోసం  కలగంటున్నారు.   రెండు నెలల తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయని  నిన్ననే మాతో అన్నారు. మేము కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము, ఆ శుభ ఘడియల కోసం.  దీని కళ్ళెం లేని మాటలకు  సమాధానం నువ్వైనా చెప్పవు” అంది అన్నపూర్ణ  సంజన వైపు కోపం గా చూస్తూ.
సంజన తల దించుకుంది. సుజన్ “ఆంటీ! ఇప్పుడు సంజునేమీ అనకండి. ఇది కేవలం తన నిర్ణయమే కాదు మా ఇద్దరిదీ. మేము ఇద్దరం  ప్రేమలో పడ్డాం కానీ మీరనుకుంటున్నట్లు  పరస్పరం కాదు. వి ఆర్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే!” అన్నాడు.
 ఈసారి  అన్నపూర్ణ  సుజన్ వైపు వింతగా  చూసింది.  “అవునాంటీ! నేనెప్పుడూ, అంటే చిన్నప్పట్నుండీ  సంజనని ఆ దృష్టితో చూడలేదు. మీరలా అనుకుంటున్నారని కూడా తెలియదు  నాకు. నిజం చెప్తున్నాను,”  అన్నాడు.
మౌనంగా ముగ్గురూ సంజన ఇల్లు చేరారు. తర్వాత సుజన్ తన యింటికి వెళ్ళాడు. రోజులు భారంగా గడుస్తున్నట్లు సుజన్ కి , యుగాల్లా గడుస్తున్నట్లు సంజనకి అనిపించసాగాయి. పరీక్షలు రానే వచ్చాయి.
సంజన రంజిత్ శ్రద్ధాసక్తులు గమనించి మరింత బాగా  చదవసాగింది. పరీక్షలన్నీ బాగా వ్రాశారిద్దరూ. అటు సుజన్ కూడా పరీక్షలు బాగా వ్రాసాడు. ఈసారి రంజిత్ కి ట్రీట్ ఇవ్వాలని సంకల్పించింది సంజన. ఇదివరకు  రాసిన పరీక్షల కంటే ఇప్పుడు  వ్రాసిన ఎగ్జామ్స్ చాల ఆసక్తిగా వ్రాసినట్లు లాస్ట్  ఎగ్జామ్ రోజు  రంజిత్ ని కలిసినప్పుడు చెప్పింది సంజు. వెంటనే తల్లికి మెసేజ్ చేసినట్లున్నాడు. ‘అమ్మ కూడా మెచ్చుకుంది నిన్ను’ అన్నాడు రంజిత్.
‘పదండి ఎక్కడికెల్దాం? అన్నాడు .
‘స్వాగత్ కేల్దామా?’ అంది తను.. ఇద్దరు పది నిముషాల్లో హోటల్లో ఉన్నారు. మొట్ట మొదటి సారి తామిద్దరే తమ లోకంలో .. స్వేచ్చగా మాట్లాడుకున్నారు. ఒకరి భావాలూ మరొకరు పంచుకొనే వేదికగా ఈ స్వాగత్ స్వాగతం పలుకుతుండగా .. ఎన్నో మౌనక్షణాలు తామిద్దరి మధ్య నాట్యమాడుతుండగా ,” సంజన!” అంటూ నిశ్శబ్దాన్ని చీల్చుకుని మృదువైన పిలుపు వినబడింది సంజనకు.
తలెత్తి చూసింది. “మా అమ్మ ఏదో తన ధోరణి లో మీకు ఏవేవో చెప్పింది కానీ అవి మీ అభిప్రాయాలకు ఎంత అడ్డు పడ్డాయో  కదా!” అన్నాడు రంజిత్.  లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సంజు.
"కానీ సంజన! ఒక్కటి మాత్రం చెప్పగలను. తల్లి ప్రేమకు మించినది ఈ లోకంలో మరొక్కటి లేదు. ఆమె ఒంటరి జీవితానికి ఉన్న ఒకే ఒక్క ఆశాసౌధంగా నన్ను భావించింది. అందుకే నేను అమ్మ కోసం పెళ్లి  చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తాను ఈ మాత్రం ఆరోగ్యం ఉండగానే యింటి కోడలును చూసి మురిసిపోవాలనుకుంది. అందుకే అమ్మను మరింతగా బాధపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో నాకు నీ అభిప్రాయం కావాలి.  నీ జీవితాశాయాలకు ఈ మన వివాహం అడ్డు కాదు కదా! నీ మనసులో మరెవరు లేరు  కదా? నీకు మనస్పూర్తి గా ఈ పెళ్లి యిష్టమేనా?” అంటూ ఎటో చూస్తూ పలికుతున్న రంజిత్ మాటలు మధ్య లోనే ఆపేసింది సంజన .
“లేదు రంజిత్, ముమ్మాటికీ నాకీ పెళ్లి యిష్టమే! నాకెలాంటి అభ్యంతరము లేదు,” అని రంజిత్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది సంజన. అప్పుడు రంజిత్ తన వైపు చూసిన కృతజ్ఞతా పూర్వకమైన దృక్కులు సంజనకు ఎంతో హాయినిచ్చాయి. ఇరువురు టిఫిన్, కాఫీలు ముగించి బయటకునడిచారు. బైక్ ఎక్కిన సంజన గమనించని విషయం ఒక్కటి అక్కడ జరిగింది....
త్యాగరాజు ఏదో పని మీద అటుగా వెళ్తూ, బైక్ పై నున్న వీరిద్దరిని చూసాడు. యింటికి  వేగంగా చేరిన త్యాగరాజు,  గుమ్మంలో నిలబడ్డ సంజనను చూడగానే “ఆగు” అని పొలికేక పెట్టాడు.
 " డాడీ! " అవాక్కైంది సంజన, సంశయం భయం  కలగలిసిన స్వరంతో.
ఆ అరుపుకి చేస్తున్న వంట పని ఆపి, అన్నపూర్ణవంటింట్లోంచి బయటకొచ్చింది.
“ఏమిటండీ?” అంది.
"నువ్వాగు, సంజనా ఎవడే వాడు ? ఈడొచ్చిన పిల్లవి, పైగా పరువు గల కుటుంబంలో పుట్టినదానివి.  నువ్వు చేస్తున్న పనేంటో తెలుస్తోందా? నీ కోసం , నీ చదువు కోసం అమ్మ రోజు ఎంత కష్ట పడుతుందో వంటింట్లో ఒక్కర్తే! ఎప్పుడైనా ఆలోచించావా? ఆడపిల్ల చదువుకోవాలనే ఆమె ఆరాటం తెలుసా నీకు?”
 ఈ మాటతో అన్నపూర్ణ గుటక వేసింది ఒక్కసారి.  “ఆడపిల్లని తీరుగా పెంచాలి , గారాబం చేయ కూడదని మీ అమ్మ ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదే ! అత్త వారింట్లో ఎలాగూ అమ్మ గారింట్లో ఉన్నంత సుఖం ఉండదు కదా, అని నేను అమ్మను సమాధానపరుస్తూ వచ్చాను.  నీ స్వేచ్చకు ఎలాంటి ఆటంకం కల్గించలేదు ఎందుకు? చదువుకుని ప్రయోజకురాలై  అమ్మ నాన్న కు మంచి పేరు తెస్తావని..."
“డాడీ !” అంది సంజన  భయపడుతూ ..
 నాన్నకు  బి. పి  వస్తే ఎలా ఉంటుందో మొదటిసారి చూస్తోంది తను.
"ఏమండీ ఏమైందండీ?” అడిగింది అన్నపూర్ణ విస్తుపోతూ, పైకి  ఏమీ తెలీనట్లు ..
మరి అయన కోపం ఇంతలా ఎన్నడూ జీవితంలో చూసి ఉండలేదు ....
“ఆ ఏముందీ! నేను దీన్ని వెనకేసుకొచ్చిన పాపానికి, నీ కూతురు ఇవ్వాళ ఎవరితోనో బైక్ పై కూచుని కబుర్లాడుతూ కనిపించింది. అరె! బావ గారు, అక్కయ్యకి మాట ఇచ్చాము. వాళ్ళడిగితే అదే మహద్భాగ్యము అని సంబంధాలు వెతికేపని కూడా లేదు , అదృష్టం కలిసొచ్చి మంచి కుటుంబానికే కోడలవుతుంది అనుకున్నాను. కానీ ఇలా నీ కూతురు  పది మంది ముందు తల దించుకునే పని చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఛా!” ఊగిపోతూ  అన్నాడు త్యాగరాజు.
ఈ పెద్ద గర్జనలకు , పక్కింట్లో నుండి సుజన్, వాళ్ళమ్మ నాన్నలు పరుగెత్తుకొచ్చారు. త్యాగరాజు మళ్లీ అందుకున్నాడు " అసలు దీన్ని రేపట్నుండి కాలేజీకి పంపను. నో ఎగ్జామ్స్ నత్తింగ్! ఇంక యింట్లో కూచోమను. ఆడ పిల్లలకు చదువులు అంటే.. దానికంటే ముందుగా ప్రపంచంలో స్వేచ్చగా  విహరించాలన్నదే ముఖ్యం అయిపొయింది వీళ్ళకు. అందుకే పూర్వ పద్ధతే నయం. ఏదో న్యూస్ పేపర్ చదివేంత చదివించి పెళ్లి  చేసి పంపించే వాళ్ళు. వీళ్ళకొచ్చిన  స్వేచ్చని పాడు చేస్తున్నారు.
“రండి బావ గారు! ఈ వేళ మీ కోడలు .. అదే, నాకూతురు ఏం చేసిందో తెలుసా? వేరే ఎవడితోనో హోటల్ నుండి బయటికొచ్చింది కబుర్లాడుతూ, అంటూ చైర్ లో చతికిలబడ్డాడు.
“ఆ! ఏమ్మా? “ అని వెంటనే గిరి, రమ సంజనను చుట్టు ముట్టి  “ఇదేంటమ్మ? నీకు, సుజన్ కి ఈ పరీక్షలయ్యాక  నిశ్చితార్ధం జరపాలని  అనుకుంటుండగా ఇప్పుడు నువ్విలా చేస్తే  అర్ధం ఏంటమ్మా?” అని అడిగారు.
 సంజనకు  ఈ మాటలతో ఏడుపొస్తుంది. సుజన్ వంక చూసింది సంజు. ఇంక తనేమి మాట్లాడాలో తెలియక, చెప్పదలచుకున్నది ఎలా చెప్పాలో అనే భయంతో కూడిన సందేహంతో, అందుకే తను సుజన్ తో ‘అమ్మ నాన్నలకు ముందే చెప్దా’మంది.  సుజన్ తేలిగ్గా తీసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు చెప్పోచ్చులే, అని  అన్నాడు. ఇప్పుడు తను ముందు దొరికిపోయింది నాన్నకు. ఇప్పుడు సుజన్ ఏమి చెప్తాడు? ఇవి ఆమె లోని ఆలోచనా సుడి గుండాలు...
సుజన్ వంక చూస్తూ కన్నీరు మున్నీరు అవుతోంది సంజన. ఇక సుజన్ వచ్చాడు ముందుకు...
“అంకుల్ !  బి కూల్ ! మన రెండు కుటుంబాలు  స్నేహితుల్లా కాకుండా, నా చిన్నప్పటి నుండీ బంధువుల్లాగా కలిసి పోయాం, కదూ?" అన్నాడు.
తల పట్టుకుని కూర్చున్న త్యాగరాజు మెల్లగా తల తిప్పి ఆ చేతిని అంతరంలో నిలిపి, అలా స్థాణువులా ఉండిపోయి ప్రశ్నార్ధకంగా సుజన్ వైపు చూసాడు.
“ఏం చెప్పబోతున్నాడా?” అని  అందరూ సుజన్ నే కన్నార్పకుండా చూస్తున్నారు. వెక్కిళ్ళ మధ్య సంజన కూడా సుజన్ నే అయోమయంగా చూస్తూ ఉంది.
"అంకుల్ ! నేను చెప్పేది వినండి  మీరు , మా నాన్న బావ- బావ అని ముచ్చట్లాడుకుంటుంటే నాకు ఎంతో ముచ్చటేసేది. మా మావయ్యకు  కూడా లేని చనువు  మీకుంది. అలాగే, మాకు కూడా మీరెంతో దగ్గరయ్యారు. పైగా మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారు, గౌరవిస్తారు.  ఆ చనువుతోనే నేను చెప్పేది  వినండి .. సంజనను  నేనెప్పుడూ మీరనుకుంటున్న దృష్టితో చూడలేదు. చిన్నప్పటి నుండి, తను కూడా నన్ను ఒక ఆప్త మిత్రుని లాగే చూసింది. కానీ ఎన్నడు మీరనుకున్నట్లు ఆ దృష్టితో చూడలేదు. చిన్నప్పటి నుండి మేము  కలిసి పెరిగినందుకు  కావొచ్చు. పెద్ద వాళ్లమయ్యాక మా  అభిప్రాయాలు మాకున్నాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి పై రుద్దటం భావ్యం కాదు. నేను ఈ విషయం మీకు చెప్దామనుకున్నా సమయం కుదరలేదు. సంజనది ఇందులో తప్పుంటే, అందులో సగం  నాకు  కూడా ఉంది.  ఎలా అంటారా?.... నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమంటే  ఆకర్షణతో కాదు, ఆ అమ్మాయికి తల్లి ప్రేమ కరువు. వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకుంటే, ఆ సవతి తల్లి  వలన ఆ అమ్మాయికి నిత్యం వేధింపులే! ఆమె అందువలన చదువు లో పూర్తిగా ఏకాగ్రత చూపలేక, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండేది. ఇవన్నీ మా యిద్దరి మధ్య ఓ సందర్భంలో స్నేహం అయ్యాకే  తెలిసాయి. అప్పుడు చెప్పింది  నేను విషయం అడగ్గా!  ఆ తరువాత  నా మాటలతో తను ఎలా మారిందంటే , చదువులో బెస్ట్ గా అనిపించుకుని ముఖం కళకళ లాడుతూ , నాకు ఎంతో సంతోషాన్ని కాన్ఫిడెన్సు ని పెంచింది. తన ఈ పరిస్తితి మేరుగవ్వటానికి కారణం  నేను, అని తన ప్రగాఢ విశ్వాసం.
ఆ విశ్వాసమే ప్రేమగా మారి, తనను “వివాహం చేసుకుంటావా?”  అని  తనచేత  అడిగించింది. అలా  తనకు మాట యిచ్చాను. ఒక ఆడపిల్ల కష్టాలలో ఉంటే, మా  అమ్మనాన్నలే కాదు, అంకుల్ అయిన మీరు కూడా సాయం అందించకుండా ఉండలేరు. అలాంటి హృదయాలు మీవి. నేను అలాంటి కుటుంబ నేపధ్యం నుండే కదా వచ్చాను అంకుల్ ! అందుకే తనను వివాహం చేసుకున్న తరువాత తనకు అత్తా మామలే అమ్మ నాన్నలై చూసుకుంటారని కూడా భరోసా ఇచ్చాను,”  అన్నాడు సుజన్.
ఆశ్చర్యపోవటం ఇప్పుడు అక్కడున్న అందరి వంతు అయ్యింది, ఒక్క సంజన తప్ప..
“ఏమిట్రా? మేము ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఇక్కడ?” అని గిరి బాబు అడిగాడు సాలోచనగా. “డాడీ! ఇప్పుడేమయ్యింది? సంజనకు మంచి అబ్బాయే పరిచయం అయ్యాడు. అతన్ని చేసుకుంటే సంజన సుఖ పడుతుంది. తాను అతన్ని ఎంతగానో  ప్రేమిస్తుంది. అలాగే ఇక్కడ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది రజని .. నన్ను మనసారా ప్రేమిస్తుంది. ఒక సామెత ఉంది అంకుల్, తాను ప్రేమించే వారికన్నా తనను ప్రేమించే వారి దగ్గరే జీవితం హాయిగా గడిచి పోతుంది , అని ..
ఇది మనం వింటున్నదే  కదా ! అలా మా యిద్దరికీ సరైన జంటలు కుదిరాయి. సంజన ఈ విషయం మీకు చెప్పాలని ఎప్పుడో అన్నది. కానీ నేనే  సమయం వచ్చినప్పుడు చెప్తాం లే అన్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇక మీరెవ్వరూ అనవసర భయాలు పెట్టుకోకండి. సంజన విషయంలో మొట్టమొదటి శ్రేయోభిలాషిని నేనే అంకుల్,” అంటున్న సుజన్ నే చూస్తున్నారు అందరు!
అంతా విని  రమ " ఊ ! అంతా అయ్యాక ఇక మేము పెద్దలం ఉండి చేసేదేమిట్రా! నిర్ణయాలన్నీ మీవే అయినప్పుడు ?” అంది .
గిరి బాబు  త్యాగరాజు  భుజం పై చెయ్యి వేసి ఇలా అన్నాడు” చూడు రాజు! పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి,” అన్నారు. అంచేత మన తెలివి తేటల తోనే పుట్టిన మన పిల్లలు మన భావాలతోనే ఉంటూ , ఈ కాలం పిల్లలకు విభిన్నంగా ఆకర్షణలకులోను కాకుండా ఆలోచన చేసారు.  తమ జీవితాలకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళ స్వతంత్రంలో దుడుకుతనం లేదు, ఆవేశం లేదు -ఆలోచన ఉంది.  మనకిప్పుడే మయింది ? మనం ఇప్పుడు , ఎప్పుడు ఇలాగే కలిసుంటాం. మన బంధుత్వాలలో, స్నేహాల్లో ఎలాంటి మార్పు లేదు, ఉండదు. మనవి రెండు కుటుంబాలు కాదు, ఇప్పటి నుంచీ ఒకే కుటుంబం. వీళ్ళ నిర్ణయాలను పెద్ద మనసుతో బలపరుద్దాం”, అన్నాడు.
సంజన తండ్రి ముఖంలోకి ఇప్పుడు చూడ గలిగింది ధైర్యంగా! త్యాగరాజు ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. “నన్ను క్షమించు డాడీ” అంటూ తండ్రి  ఒళ్లో వాలింది.  “ఏమండీ!” అంది అన్నపూర్ణ!
“అందరూ ఇంత చెప్పాక నేనేమంటాను? ఆడపిల్ల తండ్రిగా రంజిత్ వాళ్ళింటి కెళ్లాలి అంటారు మీరు .. అంతేగా, “అన్నాడు  సంజన తల నిమురుతూ. అతని వాలకానికి గిరి, రమ, అన్నపూర్ణ లు నవ్వారు. సుజన్, సంజన లు ఒకరి వైపోకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఆరాధన సుజన్ కి తెలియకనే తెలిసింది. సుజన్ చూపుల్లోని భరోసా సంజన మనసు భారాన్ని తగ్గించింది. వాతా వరణం చల్ల బడింది..
 పరీక్షలు అయిన వెంటనే సుజన్- రజని జంటకు, సంజన- రంజిత్  జంటకు  ఒకే పెళ్లి పందిట్లో  వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన పెద్దలందరి ఆశీస్సులతో, రెండు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. రంజిత్ వినయ విధేయతలు  త్యాగరాజును కట్టి పడేశాయి. రంజిత్ తల్లి కళ్ళార ఈ వివాహాన్ని చూసి తరించింది.  సంజనా రంజిత్  -  రజినీ  సుజన్  జంటలను “ శీఘ్రమేవ  సుపుత్ర ప్రాప్తిరస్తు!”  అని దీవిస్తున్న అన్నపూర్ణ ,త్యాగరాజు ల కళ్ళలోని ఆనంద బాష్పాలు చూస్తున్న రమా, గిరి ల కళ్ళు కూడా  మెరిసాయి..
(అయిపొయింది...)


No comments:

Post a Comment

Pages