Sunday, February 22, 2015

thumbnail

శ్రీరఘునాయక శతకము - మదిన సుభద్రయమ్మ

శ్రీరఘునాయక శతకము - మదిన సుభద్రయమ్మ

- దేవరకొండ సుబ్రహ్మణ్యం 


రచయిత్రి పరిచయం:
తెలుగు సాహిత్యంలో పురుషులేకాక అనేకమంది స్త్రీలు అనేక అద్భుతమైన రచనలను చేసి తమ ఉనికిని చాటుకున్న విషయం మనకి తెలిసినదే. అదేవిధంగా శతకసాహిత్యంలో కూడా స్త్రీలు అనేకమంది అనేక శతకాలను రచించి తమ సత్తా చాటుకున్నారు. అటువంటి రచయిత్రులలో మదిన సుభద్రయమ్మ గారు ఒకరు. అనేక కృతులువ్రాసిన ఈ విశాఖపురమండలవాసిని. క్రీ.శ.1787లో జమిందారుల ఇంటిలోజన్మించినది.
"వర గొడేవంశాబ్ధి సర్వశశాంకుండు పూతచరిత్రుండు పుణ్యరతుఁడు| ఘన యశోనిధియునై యొనరు జగ్గారాయు వలన జెల్లమ గర్భతలమునందుఁ| బ్రభవించి మదినె సుభద్రయంచును జనులన" అనితానే తన తల్లితండ్రులను గురించి తనరచనల్లో చెప్పుకొన్నది. ఈమె శ్రీరాజా గొడేనారాయణగజపతిరాయని మేనత్త. ఈమె రచనలలో కొన్ని 1. శ్రీరామ దండకము, 2. కోదండరామ శతకము, 3. శ్రీహరిరమేశ శతకము, 4. శ్రీరంగేశ్వర శతకము, 5. శ్రీసింహాచలాధీశ్వర శతకము, 6. శ్రీరఘునాయక శతకము, 7. శ్రీవేంకటేశ శతకము, 8. శ్రీకేశవ శతకము, 9. శ్రీకృష్ణ శతకము, 10. శ్రీసింహగిరి శతకము, 11. శ్రీరాఘవరామ శతకము మొదలైనవి. వీరి రచనలన్నీ భక్తి, నీతి రసభరితాలు.
శతక పరిచయం:
"శ్రీరఘునాయక దీన పోషకా" అనే మకుటంతో రచించిన ఈ శతకం భక్తిరస ప్రధానమైనది. ఇందు కవియిత్రి చెప్పినట్లుగా
" ఏపగు చంపకోత్పలము లింపుగనూ ఱొనగూర్చి వానిచే
నీపదనీరజాతముల నిండినవేడుకఁ బూజఁ జేసెదన్
బ్రాపుగఁదావకీన కృప భాసిల నంతయుఁ జిత్తగించు మ
న్నాపరపక్షధైర్యహరణా రఘునాయక దీనపోషకా!"
పూర్తి వంద పద్యాల శతకాన్ని చంపక, ఉత్పలమాల వృత్తాలలో రచించినారు. రామాయణకావ్యంలోని అనేక సంఘటనలు తనపద్యాలకు ఇతివృత్తంగా ఎన్నుకోవడమే కాకుండా భాగవత ఘట్టాలను, దశావతార వర్ణనలు కూడా ఈశతకంలో మనకు దొరుకుతాయి. అనేక సామెతలను, జాతీయాలను కూడా సందర్భోచితంగా ప్రయోగించి తనకవిత్వానికి ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. భక్తిరస ప్రధానమైన ఈ క్రింది పద్యాలను చూడండి.
"చెరుకు రసంబు తేనెయును జెన్నగు చెక్కెరపానకంబునున్
నిరతము ద్రావఁగ్రోల హర నీరజగర్భనురా రమేశ నీ
వెరవుగ నీదు నామసుధ వేమారు నానెద వాంఛదీర సు
స్థిరమతి నాకొసంగు హరి శ్రీరఘునాయక దీనపోషకా"
"క్రోలెద నీకథామధువు గ్రోలెద నిపదపద్మతోయముల్
గ్రోలెద నీదునామసుధ కోరిక వాచవి దీరునట్టుగాఁ
గ్రోలెద భవ్య భాగవత కోమల వాక్కుసుమంబు తేనె రా
మా లలితాబ్జనేత్ర పరమా రఘునాయక దీనపోషకా!"
"నీపదధూలిచే శిలను నిర్మలయేపను జెసినావు ము
న్నాపద వాయ ద్రౌపదికి నక్ష్య వస్త్రము లిచ్చినావు నా
కోపికలేదు తాపములనొందఁగఁ దప్పులుసైఁచి కావవే
తాపసవందితా సురనుతా రఘునాయక దీనపోషకా!"
గజేంద్ర మోక్షము, అజామీళుని వృత్తాంతము, అంబరీషోపాఖ్యానము, సముద్రమంధనము మొదలైన అనేక పురాణాల్లోని ఇతివృత్తాలను మనకు ఈశతకంలో అదించారు.
"సుధగొని దైత్యదానవులు సొక్కుచు నేగిరి మాకు దిక్కు త్వ
త్పదములె యంచు దేవతలు ప్రస్తుతి సేయ దయాపయోధివై
ముదమున లోకముల్ బొదల మోహినివైతి మహాద్భుతంబుగా
సదమలభక్తపాల సుయశా రఘునాయక దీనపోషకా!"
"మోహినివైన నిన్నుగని మోహముమీఱ సుధా ఘటంబు మా
కోహరిణాక్షి పంచియిడు మొప్పుగనంచును దైత్యులీయఁగా
స్నేహము మీర వేల్పులకుఁ జెచ్చెరఁద్రావఁగ నిచ్చి యంతలో
శ్రీహరిమూర్తిన్ గైకొనవె శ్రీరఘునాయక దీనపోషకా!"
దశావతార పద్యాలలో కొన్ని చూద్దాం:
" వామను మేనుఁదాల్చి కడు వంచన మూడడుగుల్ మహాబలిన్
భూమినివేఁడి పుచ్చుకొని పొల్పుగ మన్నును మిన్ను ముట్టి సు
త్రామునకిచ్చి దాతను దిరంబుగ భోగుల ప్రోల నిల్పవే
సేమము వేల్పులొంద హరి శ్రీరఘునాయక దీనపోషకా!"
"దశరథరామ రూపమున ధారణిపై జనియించి సత్యవా
గ్వశూఁడగు తండ్రి యాజ్ఞవనవాటికఁజొచ్చి వధూవియోగదు
ర్దశను గృశించి రావణుని సమయించి జానకీ
శశిముఖిఁ దెచ్చినావు సుయశా రఘునాయక దీనపోషకా!"
"కలియుగవేళ మానవులు గర్వితులై కులసంకరంబుగా
మలినతనొంది భూసురుల మాన్యుల దీనుల బాధపర్చఁగా
నలఘునిశాతశస్త్రమున నా ఖలకోట్ల నెల్లఁ గల్కివై
దళితులఁ జేతువీవె వరదా రఘునాయక దీనపోషకా!"
దశావతారములను ఒకేపద్యంలో చూపించిన ఈ పద్యం చూడండి
"సలలిత మీన కూర్మతను సంయుత కోల నృసింహ విగ్రహో
జ్జ్వల వరవామనాగ ధర భార్గవరామ నరేంద్ర రామశ్రీ
హలధరరామనామ వినతాదర బౌద్ధ సురారిభీమ శ్రీ
కలికి రమాభిరామయనఘా రఘునాయక దీనపోషకా!"
చక్కని సరళమైన తెలుగులో, మనసునకు హత్తుకుపోయే పద్యాలతో అలరారే ఈశతకం అందరూ చదవవలసినది. మీరుచదవండి. అందరిచే చదివించండి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information