అజరామరం - గుంటూరు శేషంద్ర శర్మ సాహిత్యం - అచ్చంగా తెలుగు

అజరామరం - గుంటూరు శేషంద్ర శర్మ సాహిత్యం

Share This

అజరామరం - గుంటూరు శేషంద్ర శర్మ సాహిత్యం 

- కొల్లూరు విజయా శర్మ 


నేనెంత ఒక పిడికెడు మట్టే కావొచ్చు. కానీ, కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అని ఎంతో గర్వంగా చెప్పుకున్న కవి గుంటూరు శేషేంద్రశర్మ గారు.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ కన్నుల్లోనీరు తుడిచీ కమ్మని కలలిచ్చిందీ రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ దీనురాలి గూటిలోనాదీపంలావెలిగింది. శూన్యమైనవేణువులోఒక స్వరం పలికి నిలిపింది ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది.
ఈ పాట తెలియని తెలుగువారు ఉండరేమో !ముత్యాల ముగ్గు లో బాపు గారు ఈ కవిత ని పాట గా పెట్టారు. సందర్భానికి తగ్గట్టుగా ఈ పాట చక్కగా అమరి, ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయింది.
శేషేంద్ర కవిత్వం రసమయ ప్రవాహమే కాదు.. అగ్ని స్పర్శగల లావా ప్రవాహం కూడా. ఆయనది సముద్ర భాష. అట్టడుగు వర్గాల ఘోష. తెలుగు సాహిత్యంలో శేషేంద్ర సృష్టించిన ప్రభంజనానికి నిదర్శనమే ఆధునిక మహాభారతం, కవిసేన మేనిఫెస్టో, కాలరేఖ లాంటి సంచలన గ్రంథాలు.
విత్తనం లో ఉన్న నేను ఒక రాగం విన్నాను: బయటికి వచ్చి ఆకాశాన్నీసూర్యుడ్నీచూద్దామనీ, చూచి ఆశ్చర్యామృతం తాగుదామనీ అంకురించింది. నేను చెట్టునయ్యాను కొమ్మల్లో చెట్టు కలనయ్యాను. అంటే! రాగ రస గంధాలు మిళితం చేసుకున్న పువ్వునయ్యాను.
-  ఆధునిక మహాభారతం
వసంతాన్ని తెచ్చి ఇచ్చి కోకిల్ని ఊరుకోమంటే ఊరుకుంటుందా? అంటూ మన మనసుల్లో వసంత మాసాన్ని తీసుకువచ్చే ఈ కవిత చూడండి...
చైత్రమాసపు గాలి వీచిందో లేదో చెట్లన్నీ పూయడానికే నిర్ణయించుకున్నాయి పూలు పెదవులు విప్పాయి పుప్పొడి రహస్యాలను వినిపించడానికి . ఇప్పుడు ప్రతి చెట్టూ ఒక దేవాలయం. పక్షులన్నీ ఎగిరే దేవతలు కొమ్మ కొమ్మలో పాటల పోటీలు గడ్డిపోచలో కూడా గంధర్వలోకాలు సితారు సోకితే చాలు శబ్దాలు అప్సరసలు . ఈ పువ్వుల్ని ఎవరు లేపారో అవి నా వెంట పడుతున్నాయి. ఏవో తీపి జ్ఞాపకాలకు నన్ను క్రూరంగా అప్పగిస్తున్నాయి. ఈ కోకిలల్ని ఆ మామిడి కొమ్మ మీద ఎవరు పెట్టారో అవి లోకానికి నిద్రపట్టనీయడం లేదు. వసంతాన్ని తెచ్చి ఇచ్చి కోకిల్ని ఊరుకోమంటే ఊరుకుంటుందా? భావుకతకు పరాకాష్ట ప్రకృతిలో కవి మమేకమైపోయి, తాదాత్మ్యం చెందడం... ముచ్చటైన ఈ రెండు కవితల్ని చూడండి...
నేను ఒక పాటని అడవిలో సరిగమలు అల్లుతూ ముత్యాల గుంపులా పరుగులెత్తే వాగుని నీలిమలో మధురిమ చల్లుతూ రెక్కల మీద తేలిపోయే పక్షిని తోటలో వసంతం గుండెలో గ్రీష్మం ఎటుపోవాలో తెలీని బాటసారిని నా వాక్యం ఒక పిల్లనగ్రోవి లోపల గాలి తప్ప అర్ధం ఉండదు గొంతు మాత్రం ఎందుకు అంత తీయగా ఉంటుందో ?
ఈ ఆకాశం లో నక్షత్రాలు చినుకులై రాలితే భూగోళానికి కాంతినిచ్చేది సూర్యచంద్రులకు బదులు ఒక ఇంద్రధనుస్సు అయితే ఓహ్
ఉత్తరాలు... జీవిత గ్రంధంలో జ్ఞాపకాల పూలు. వాడిపోని పూలగుత్తి లాంటి ఆ మధురజ్ఞాపకాల్ని నెమరు వెయ్యాలని, ఉత్తరాలు విప్పితే ఏమయ్యింది ? ఇదిగో, ఈ అద్భుతమైన కవితలో చదవండి... ఉత్తరాలు విప్పాను పేజీల్లోంచి వెన్నెల రాలింది . వాక్యాలు శారికలై చకోరికలై ఎగిరిపోయాయి నేనూ ధవళమూ మిగిలేము పేజీల మీద ఇవాళ నా హృదయం ఒక కొత్త భావచ్చ్చాయకు అతిధి అయింది తారల గ్రామాలలోకి చంద్రుడు వెన్నెల మందలను తోలుకొచ్చాడు.
ఈ కవిత వాల్మీకి రామాయణాన్ని ఉద్దేశించి రాసినది.. ఆ కావ్యం ఒక పూవు. అది సూర్యోదయం లా ఉంది అంటే జ్ఞాన మయం. పాపాలనే,అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతుంది. ఆ కావ్యాన్ని ఆలపించినది ఎవరు?తన గొంతు కోకిలలకు జన్మ స్థలం అయిన వాడు(కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం).. వాల్మీకి రామాయణమే తోలి రామాయణం దానిని అనుసరించి ఎన్నో రామాయణాలు పుట్టాయి.అందుకనే తన గొంతు ఎన్నో కోకిలలకు జన్మ స్థానం అయిన వాడు అన్నారు కవి. ధ్వని ప్రాదానమైన కవిత లలోఇంత అందం ఉంటుందో కదా,  ఆస్వాదించే హృదయం ఉండాలే గానీ  !
ఒక పువ్వు వికసించిందని పిలుపు వస్తే వెళ్లి దర్శనం చేసుకున్నాను. సూర్యోదయం లా ఉంది. చేతులు జోడించాను నాకు తెలియకుండానే ఎవడో తన గొంతు కోకిలలకు జన్మస్థానం అయిన వాడు గొంతెత్తి పాడుతున్నాడు. ఏదైనా కోల్పోయిన తరువాతే దాని విలువ తెలుస్తుంది. ఈ భావాన్ని ప్రతిబింబించే ఈ చక్కటి కవిత చూడండి...
వసంతం అంటే అందరికీ తెలియదు: కోకిలల్ని కోల్పోయిన కొమ్మలకే తెలుసు; పాటల్ని కోల్పోయిన పక్షులకే తెలుసు వసంతం వసంతం కాదు పూలు నిట్టూర్పులు విడుస్తున్న ఋతువు
ప్రేమ అంటే ఏమిటి ? అనుభూతికి నిర్వచనం ఉంటుందా ? అందుకే, తమ ప్రేమను ప్రేమించినవారికి తెలిపేటప్పుడు గొంతు మూగబోతుంది కదా ! ఈ కవిత చూడండి...
ప్రేమని గురించి ఉత్ప్రేక్షలు పేనుతుంటే గుండెని కోకిల తన్నుకుపోయింది. గజల్ గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వం లో తడిసిపోయింది.
కాళిదాసు వంటి మహాకవుల ప్రబంధాలలో ఋతువర్ణన లేని రచన లేదు.వారి పంధాలో శేషేంద్ర గారు "ఋతుఘోష"అనే  రెండు కావ్యాల సంకలనాన్ని రచించారు. ఇందులో ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమ గాథ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఇందులోని కొన్ని పద్యాలు చూద్దాము.
ఇది మధుమాసమా! అవుర యెంత మనోహర మెందుజూచినన్‌ సదమల కాంతులం గులుకు జాజులు మల్లెలు తీగసంపెగల్‌ కొదమగులాబులుం జిగురు గొమ్మల రెమ్మల శాద్వలమ్ములన్‌ ముదమున ముంచె నీసుమ సముద్రము విశ్వదిశాంతరాళమున్‌. ఈ ఆకాశము నీ మహాజలధులు న్నీధారుణీ మండలం బీ యందాల తరుప్రపంచనిచయం బీ విశ్వవైశాల్య మెం తో యంతస్సుషమా సముల్బణముతో నుఱ్ఱూత లూగించె నా హా! యూహావిహగమ్ము తానెగిరిపో నాశించె నుత్కంఠతో.
కవిత్వం నిండా మనిషి కనపడాలన్న ధ్యేయంతో కలాన్ని చేపట్టి అదే ఆశయంతో కవిత్వాన్ని పండించిన నిత్య కృషీవలుడు శేషేంద్ర. బతుకును కవిత్వంలా అనువదించి అక్షరాల ఆకాశంలో అనునిత్యం విహరించిన పదహారణాల పైలా పచ్చాసు కవి ఆయన. అందుకే ఆయన కవిత్వం వెన్నెల్లో తడిసిన చంద్రకాంతం పువ్వులా మన మనసుల్లో నిలిచిపోయింది.

No comments:

Post a Comment

Pages