హనుమంతుని “CARE” - అచ్చంగా తెలుగు
హనుమంతుని “CARE”
- శ్రీనివాస్ యనమండ్ర
గత గురుపూర్ణిమ సందర్భముగా నాలో మెదిలినికొన్ని ఆలోచనలకి, సుందరకాండలోని కొన్ని శ్లోకాలు, వాటి అంతర్జాల వ్యాఖ్యానాల తోడుగా మీతో పంచుకొనుటకు రాసిన టపా ఇది. మన పురాణ గ్రంధాలనుండీ నేటితరం వారికి ఉపయోగపడు కొన్ని విషయాలపైన నేను దృష్టిసారించి రాసిన మొదటిటపా ఇది.   గుకారము అంధకారము, రుకారం తేజస్సు. అజ్ఞానమనే అంధకారము నుండీ మనలను తనతేజస్సుతో బయటకు తీసుకువచ్చే శక్తి ఒక్క గురువుకికాక వేరెవరికీ లేదు.కార్యసాధనలో గురువుకి వున్న ప్రాముఖ్యం మనకి రామాయణ, మహాభారతాలలో విరివిగా కనిపిస్తుంది. అల్లదిగ్రంధాలలో నాకు ఈ తరానికి ఆదర్శముగా తీసుకొనదగిన గురువు హనుమంతుడనిపించి, ఆయన లీలామృతమయిన సుందరకాండలో నికొన్నిశ్లోకాల ఆధారంగా వారి యొక్క CARE నైజము ఈ నాటితరమునకు ఎట్లు ఉపయోగపడునో ఈ కిందివివరణలో పొందుపరచాను.   సుందరకాండ మొత్తమూ కార్యసాధకునికి సాఫల్యం సాధించడానికి అవసరమైన లక్షణాలసమాహారం. స్థూలముగా ఈ కాండము కార్యసాధకునికి కావలిసిన ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము, వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము – మొదలగు లక్షణములు హనుమంతుని పాత్రచిత్రీకరణము ద్వారా తెలుపుతుంది. కార్యసాధకుడు వంటపట్టించుకోకూడని కొన్నిజాడ్యాలు, అలాగే దైవసంకల్పబలం కూడ ఈ కాండములో వివరించబడినది. ఇంత వివరముగా కార్యసాధనలో తోడ్పడు మార్గము మన ముందుంచిన హనుమంతుడు కాక వేరెవరు మనకి గురుతుల్యులు అవుతారు? అందుకే హనుమంతుని సుందరకాండ ఆధారముగా గురువుదగ్గర నేర్చుకోదగిన నాలుగు లక్షణములు ఆంగ్లవర్ణములు CARE ద్వారా మీ ముందుంచుతున్నాను.   Competence (సమర్ధత)   మొట్టమొదటగా గురువుదగ్గర శిష్యుడు చూచే అంశము అతని కార్యసాధన సమర్ధత. జ్ఞానము భోధించే గురువుకన్నా ఆ జ్ఞానాన్నిఆచరించి చూపించే గురువు సతతం ఆచరణీయుడు.ఈ రకముగా చూచినట్లయితే, సమర్ధతకి గీటురాయిగా ఈ కింది లక్షణాలు సుందరకాండలో హనుమంతుని ఉధ్ధేశ్యించి చెప్పబడ్డాయి.   యస్యత్వేతానిచత్వారివానరేన్ద్రయథాతవ, ధ్రుతిర్ధృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి (సుం. 1-198)   హనుమంతునివలె అకుంఠిత ధైర్యం, సూక్ష్మదృష్టి,  సునిశితబుద్ది, సామర్ధ్యం కలవాడు అన్నిటా విజయం సాధిస్తాడు అన్నది ఈ శ్లోకార్ధము. సమర్ధతకి కావలసిన లక్షణాలు ఈ విధముగా ప్రదర్శించి తన యజమానికి అవసరమయిన కార్యామును సునాయాసముగా, సమర్ధముగా సాధించాడు కనుకనే ఆయన చూపిన మార్గము గురుతుల్యమయ్యి, ఆ లక్షణాలు మనకు ఆచరణీయుములుగా సుందరకాండ మనకి అందించునది.   Articulation (వ్యక్తీకరణ)   సమర్ధతకి తోడు గురువుకి ఉండవలసిన రెండవగుణము భావవ్యక్తీకరణ. ఎంత సమర్ధుడయిన గురువయినప్పటికీ, ఆయన అనుసరించిన మార్గము, ఆయన తనను అనుసరించు భక్తులకు బోధించలేనపుడు, సాధకునికి ఉపయోగపడలేడు. సుందరకాండలో ప్రతీ సంభాషణా వ్యక్తీకరణ, మంత్రమాలికే. అన్నిటిలోకీ ఈ కింది శ్లోకము హనుమంతుని వ్యక్తీకరణానైపుణ్యాన్ని తేటతెల్ల పరుచును.   తతోదృష్టేతివచనంమహార్ధమమృతోపమమ్ నిశమ్యమారుతేఃసర్వేముదితావానరాభవన్ (సుం. 57-40)   సీతాన్వేషణాకార్యము ముగిసిన పిదప రాముని వద్దకు ఏతెంచు హనుమంతుని చూచిన వానరసమూహము తనవద్దనుండి ఏ విధమయిన వార్తవినగోరుతున్నారో ఎరిగినస్వామి కనుక కిందికి దిగకుండానే, ఆ వానరులకు వీనులవిందుగా వుండుటకు కేవలము “చూశాను” అని ఘీంకారము చేస్తాడు హనుమంతుడు. ఒక్కపదములో అర్ధవంతమయిన, మధురామృతమయిన ఆ వార్తలోని ఉత్సాహమునకు వానరులంతా సంతోషముతో ఉప్పొంగిపోయారు. ఈ రకముగా పటాటోపము లేకుండా సూటిగా విషయాన్ని వినేవారికి ఉల్లాసభరితమగునట్లు చెప్పి నేరుగా వారి హృదయాలలో ఆహ్లాదమగు భావాలునాటు గురువులు నిస్సందేహముగా ఆదర్శవంతులు.   Responsiveness (బాధ్యతాయుతము)   హనుమంతుని వర్ణనలోని విశిష్టత ఆయన అకుంఠితదీక్ష, బాద్యతాయుతమయిన ఆయన వ్యక్తిత్వం. అందుకు మచ్చుతునక ఈ కింది శ్లోకాల సమాహారము.   యథారాఘవనిర్ముక్తఃశరఃశ్వసనవిక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామిలంకాంరావణపాలితామ్   న హిద్రక్ష్యామియదితాంలంకాయాంజనకాత్మజామ్ అనేనైవహివేగేనగమిష్యామిసురాలయమ్.   యదివాత్రిదివేసీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వారాక్షసరాజానమానయిష్యామిరావణమ్.   సర్వదాకృతకార్యో హ మేష్యామిసహసీతయా, అనయిష్యామివాలంకాంసముత్పాట్యసరావణమ్.     సీతాన్వేషణకి బయలుదేరుటకు ముందుగా హనుమంతుడు వానరులనుద్ధేశించి పలికిన పలుకులివి. శ్రీరాముని విల్లునుండీ వదలినబాణములా నేను లంకానగరములో సీతఅన్వేషణకు బయలుదేరెదను. అక్కడ సీతకనపడని పక్షములో అదేవేగముతో దేవలోకముకు పయనమయ్యెదను. అక్కడా కనపడనిపక్షములో ఏమాత్రమూ శ్రమపొందక రావణుని బంధించి తీసుకువచ్చెదను .అన్ని విధాల ప్రయత్నించి కార్యము సాధించి మాత్రమే నేను సీతాసహితముగా మీ ముందుంటాను. కాకుంటే రావణునితో సహా లంకనే పెకిలించి ఇక్కడకు తెస్తాను. ఈ విధమయిన సంకల్పము హనుమంతునికి అతని కార్యము మీదున్న బాద్యతాయుతమయిన భావాన్ని మనకి ఎరుకపరుస్తుంది.   కార్యసాధకునికి కావలిసినది ఈ విధముగా లక్ష్యము సాధించువరకూ నిద్రపోకూడని మనోధైర్యము అని మనకిమాటలతోనే కాక చేతలతో కూడా చూపిన మహాపండితుండు హనుమంతుడు.   Execution (నిర్వహణ)   ఇంతకార్యాన్ని తనపైన మోపిననూ ఇసుమంతయిననూ ఉత్సాహాన్ని తననుండీ దూరము చేసుకొనడు హనుమంతుడు. అభివృద్దికి మూలం దిగులు చెందకుండా ఉండటమే. అంటే ఉత్సాహంగా ఉండటమే అంటూ నిర్వహణలో కార్యసాధకునికి మనోల్లాసము అందించు శక్తిగురించి వర్ణిస్తుంది ఈ శ్లోకము ద్వారా సుందరకాండము   అనిర్వేదఃశ్రియోమూలమనిర్వేదఃపరంసుఖమ్ అనిర్వేదోహిసతతంసర్వార్దేషుప్రవర్తకః (సుం. 12-10)   ఉత్సాహము ఎంత విలువయినదో, అదేవిధముగా నిర్ణయముతీసుకున్నాక ద్వైదీభావము (ఆ నిర్ణయము సరిఅయినదా కాదా అని ఆలోచన) పనికిరాదని కూడ ఆయన వ్యక్తిత్వము ద్వారా తేటతెల్లమగుతుంది, ఈ కింది శ్లోకము గమనించినట్లయితే.   అర్ధానర్ధాన్తరేబుద్ధిర్నిశ్చితాపి న శోభతే, ఘాతయన్తిహికార్యాణిదూతాఃపణ్డితమానినః (సుం. 2-40)   ఈ విధముగా కార్యసాధకునికి అవసరమయిన సమర్ధతకు (Competence) మూలమగు లక్షణాలు ప్రదర్శిస్తూ, కార్యసాధకునికి అనువగురీతిలో తగిన భావవ్యక్తీకరణామంత్రాన్ని (Articulation) అందిస్తూ, కార్యసాధకునికి లక్ష్యము పట్ల బాద్యతాభావాన్ని (Responsiveness) పెంపొందిస్తూ, నిర్వహణాసమయములో(Execution) ఉండవలసిన లక్షణాలు తెలుపే హనుమంతుని దివ్యమంగళస్వరూపాన్ని గురురూపముగా భావించి మనసున నిలుపుకొనిన సర్వకార్యములలో విజయము తధ్యమని సుందరకాండ మనకి తెలుపుతోంది.      

No comments:

Post a Comment

Pages