శ్రీరమణీమనోహరశతకము - గంగాధరకవి - అచ్చంగా తెలుగు

శ్రీరమణీమనోహరశతకము - గంగాధరకవి

Share This
శ్రీరమణీమనోహరశతకము - గంగాధరకవి
 - దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
శ్రీరమణీమనోహర శతకకర్త గంగాధరకవి తూర్పుగోదావరి మండలనికి చెందిన పిఠాపురప్రాంతానికి చెందినవాడు. నియోగిబ్రాహ్మణుడు. ఆపస్తంభసూత్రుడు. తల్లి రాజమ్మ. తండ్రి పట్టాభిరామాత్యుడు. "ఆపస్తంబుఁడ మంత్రిశేఖరుఁడ గంగానాథునామంబుచే భూపలుం డననొప్పి యీశతకమున్బొపొందగాఁజేసి.." అని ఈశతకంలో తనగూర్చి తానే తెలుపుకొన్న కవి క్రీ.శ. 1860 ప్రాంతమువాడు కావొచ్చని పండితుల అభిప్రాయము. ఈయన రెండుశతకములు రచించినట్లు కనపడుతున్నది. 1. శ్రీరమణీమనోహర శతకము, 2. కీరవాణీశతకము.
కవి ఈశతకాన్ని జీవిత అవసానదశలో వ్రాసిఉండవచ్చును. అదేవిధంగా ఈకవి చివరిదశలో సర్వస్వంకోల్పోయి కష్టాలలో ఉన్నప్పుడు ఈశతకం వ్రాసిఉండవచ్చునని ఈ క్రిందిపద్యం వలన అనిపిస్తుంది.
దార నశించె వెన్కఁ దగ దాయాలువృత్తిహరించిరంత నా
గారమునొక్కవిప్రునదిగాఁ దెగనమ్మితి మున్నెనావయ
స్సారముదగ్గెఁ జేరినది సారవిహీనపుఁజోటు నింక నా
కేరిమహాత్మ నీపయిని నెన్నఁగ శ్రీరమణీమనోహరా
ఈకవి ఇతర రచనల గురించికానీ, మిగిలిన వివరములు గానీ తెలియటం లేదు.
శతక పరిచయం:
శ్రీరమణీమనోహరశతకం భక్తిరస శతకాలకోవలోనికి వస్తుంది. శ్రీకృష్ణుని నుతిస్తు చెప్పిన ఈశతకం చంపకోత్పలమాల శార్ధూల మత్తేభవృత్తాలలో రచింపబడిన భక్తిరసగూళికలు. పద్యమకుటం "శ్రీరమణీమనోహర" అయినప్పటికీ కొన్నింట మకుటం మారినది.
మత్తేభంబులు చంపకంబులు మహామాధుర్యశార్దూలముల్
బొత్తుల్ గూర్చినవృత్తముల్ వరుస మేల్బొందంగఁబద్యంబు లే
నిత్తున్భక్తిని జిత్తజారి చెలికిన్నింపొందఁ బూదండగాఁ
గ్రొత్తల్జిత్తమునందు వెల్లివిరియ న్గోవర్ధన్నోద్ధారకా
ఈశతకంలో 300 పద్యాలు ఉన్నాయి కావున దీనిని శతకం అనేకంటే "త్రిశతి" అనటం సబబుగా ఉంటుంది. 300 వందల పద్యాలను ఎందుకు పొందుపరిచాడో కవే తెలియచేసాడు. చూడండి.
శతకము మూరుపద్యములసంఖ్యను జెప్పిరి సత్కవీంద్రు లో
వితతగుణాఢ్య నామదికి వేడుకబుట్టె శతత్రయంబు బెం
పతులితభక్తిఁజేసి ప్రమదాతిశయంబున నీకు నిత్తు నా
వెత లతివేగఁ ద్రుంచుటకు వేడుక శ్రీరమణీమనోహరా
ఈశతకంలోని పద్యాలు చదవటాని సులభంగా ఉండి, భగవంతునిపై భక్తి, ప్రేమ, ఆప్యాయతలను వెదజల్లుతుంటాయి. ఉదాహరణకి క్రింది పద్యాలు చూడండి.
చక్కనివాఁడ వంచు నెఱజాణ వటాంచు జగంబులోనఁ బెం
పెక్కినవాఁడవంచు గరినేలితి వంచు దయాబ్ధి వంచుఁ బె
న్మక్కువఁ జిక్కె నామదికి మాధవ్ శ్రీధర శ్రీనివాస నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీరమణీమనోహరా
(చక్కనివాడివని, బెరజాణవని, జగాలన్నిటిలో ప్రసిద్ధిచెందినవాడవని, గజరాజును రక్షించినవాడివని, దయాసముద్రుడవనీ తెలిసి నీపై నామనసులో చాలా మక్కువకలిగింది. నీచక్కనైన రూపుచూడాలని మనసయింది ఒకసారి చూపు శ్రీరమనీమనోహరా)
ముక్కున ముత్యము న్నుదుట మొక్కపుఁగస్తురి చుక్కబొట్టును
న్నెక్కువయైనవక్షమున నేర్పడు కౌస్తుభరత్నముం గరం
బక్కజమారఁగంకణము భాసిలఁ బిల్లనగ్రోవితోడ నా
మక్కువదీరఁ గన్పడర మాధవ శ్రీరమణీమనోహరా
(ముక్కున ముత్యపు ముక్కెరతో, నుదుట కస్తూరి బొట్టుతో, విశాలమైన వక్షమున కౌస్తుభ మణితో, చేతికి కంకణములతో, పిల్లనగ్రోవితో నామక్కువ తీరువిధంగా కనపడర శ్రీరమణీమనోహరా)
ఎన్నఁగ నీకు నాశబరి యెక్కడిచుట్తము కుబ్జయు న్గుహుం
డెన్నటిబంధువు ల్దయను నేలితి వారల నన్నుఁగావ నీ
కెన్నఁడు రాదుగా మనసు యేను దురాత్ముడనంచు నీగతి
న్విన్నప మాలకించకను వేడెద శ్రీరమణీమనోహరా
రంగ సమస్తపక్షికులరాజతురంగ రమామనోబ్జ సా
రంగ పురారికార్ముకవిరజితభంగ ఘనాఘనాంగ ని
స్సంగ దయాంతరంగ బలసత్వపరాక్రమపాదగంగ నీ
మంగళమూర్తిఁ జూపు నృపుమండన శ్రీరమణీమనోహరా
ఈశతకంలో 71 వ పద్యం నుండి 80వ పద్యం వరకు దశావతార వర్ణనము,కొన్ని పద్యాలలో కృష్ణలీలలు, కృష్ణ బాల్యక్రీడలతోపాటు, అనేక వేదాంత, తాత్విక సంభందమైన పద్యాలు ఉన్నాయి.
కుచేలునిపై ఈ అధిక్షేప పద్యం చూడండి:
అటుకులు గుప్పెడిచ్చి ధనమార్జనసేయు కుచేలుఁడు న్మహా
ఘటికుఁడు నీమాహామహిమ గానరు నీవును లంచగాఁడవు
న్నెటువలె నేను నీకరుణయీఁగుదు లంచముబెట్టఁజాల న
న్నెటుకరుణింతువో నృపకులేశ్వర శ్రీరమణీమనోహరా
ఏమిర మాయ యీజగము లేమిర నీదువిలాస మేమిరా
పామరమెంతరా తనువుబాసియుఁ బ్రాణముపోవుటెంతరా
యేమియు రాదురా యితరులెవ్వరు నింతఘటింపనేర్తురా
యోమహనీయమూర్తి తగవో నగవో యిదిదెల్పు నాకుఁ బె
న్భాములకోర్వఁజాల కులపావన శ్రీరమణీమనోహరా
ఇటువంటి అద్భుతమైనపద్యాలు ఈశతకంలో ఎన్నో ఎన్నెన్నో. ప్రతిపద్యము ఒక ఆణిముత్యం అని చెప్పవచ్చు. 300 వందల చంపక మత్తేభ, శార్ధూల పద్యాల మాల. ప్రతివొక్కరు చదివి చదివించాల్సిన శతకం. మీరుకూడా చదివి మిగతావారితో చదివించండి
శ్రీరమణీయహృజ్జలజసేవితము న్నిగమార్థపూరము
న్భూరితరంగ మంగళనభోధునికెల్లను నాలవాలమున్
సారమరందవిస్ఫూరితసాసమౌ భవదంఘ్రీయుగ్మమున్
గోరిభజింతు నెమ్మదిని గూరిమి శ్రీరమణీమనోహరా
మంగళ మిందిరాహృదయ మంజులకంజమరందపానసా
రంగ ఘనాఘనోజ్జ్వలవిలాసశుభావహపూర్ణిమాంగ యు
త్తుంగ దయాంతరంగ సురతోషితపాదసరోజగంగ స
న్మంగళహారతుల్గొని సమంచితసత్కృపఁ బ్రోవు వేగ శ్రీ
రంగపురీశ భక్తజనరక్షక శ్రీరమణీమనోహరా

No comments:

Post a Comment

Pages