బైరాగి(గోదావరి కధలు ) - అచ్చంగా తెలుగు

బైరాగి(గోదావరి కధలు )

Share This
బైరాగి(గోదావరి కధలు )
బి.వి.ఎస్.రామారావు
రేవు దాటటానికి నావ కోసం టిక్కెట్టు కొనబోతుంటే కట్టుతాడు కొరికేసి దౌడు తీసింది కుక్కపిల్ల. దానిని పట్టుకోవటానికి పరగడుపునే చెడుగుడు ఆటయిపోయింది మన్మధ రావుకి . కుక్కపిల్లని చంకలో బిగించి ,రొప్పుతూ రేవు చేరే సరికి నావనికాస్తా వదిలేశాడు సరంగు . “ఇదిగో సరంగూ....... కాస్త ఆగు !నన్ను కూడా ఎక్కించుకో,అవతల రేవులో బస్సు వెళ్ళిపోతుంది .ఏయ్ నిన్నే... ! టిక్కెట్టు కొన్నాను.చిల్లర లేదంటే ముప్పై పైసలకి ఏకంగా రూపయిచ్చాను రేపు గుమస్తాకి.ఆపవోయ్! బస్సు అందకపోతే ఆఫీస్ టైంలో అందుకోలేను .కొంపలంటుకుంటాయి నాకు .ఇదిగో నిన్నే అదనంగా రూపాయిస్తాను.రెండు పుచ్చుకుందిగానిలే .. పోనీ ఐదూ... సరే! ఆగు . పదిరూపాయలిస్తాను” అని ప్రాధేయపడ్డాడు మన్మదరావు. “ ఆ అబ్బాయిగారేదో పది రూపయలిస్తానంటున్నాడు వెనక్కిమళ్ళించి ఎక్కించుకోకూడదా పోలయ్యా!” అన్నాడు  నావ సరంగుతో  నావలో కూర్చొని తత్వం పాడుతున్న కళ్ళులేని బైరాగి. తెరచాప దింపి తెడ్డేసి  నావని వెనక్కి మళ్ళించాడు సరంగు.హమ్మయ్య అనుకున్నాడు మన్మధం. నావంతా ఆడా,మగా ,పిల్లా మేకలతో కిక్కిరిసి ఉంది . దానికి సాయం ఆ పిర్కాలోని మైనరు బాబు ఒకడు సగం నావని ఆక్రమించేసి,సైకిల్ కి స్టేండు వేసి పట్టుకునుంచున్నాడు . నావమధ్య కూర్చున్నాడు గుడ్డి బైరాగి,చేతుల బనీను , గులాభి రంగు పంచె ,నెరసిన గడ్డం ,గిరణాలజుట్టు ,పంగ నామం ,చెవిలో గన్నేరు పువ్వు ,చేతిలో తుంబురా . ఎప్పుడు నావలో కూర్చొని అరిగి పోయిన గ్రామ్ ఫోన్  ప్లేటులా ఒకే చరణాన్ని పదే పదే  పొద్దస్తమానం పాడుకుంటాడు.భైరాగి లేకుండా రేవులో ఏ నావ కదలదు. భైరాగి చూట్టు కూలి నాలి చేసుకొనే జనం కూర్చొని పాటలను శ్రద్ద గా వింటున్నారు.’ఏ తీరుగా నను దయచూచెదవో .. రామా ‘ భైరాగి చరణం.   మన్మధం నావ పడిచెక్క మీద కూర్చొని ,వోళ్లోని  కుక్కపిల్లని  దువ్వుతూ ,మచ్చిక  చేసుకుంటున్నాడు. తెరచాప విప్పి కొయ్య మీదకి కేక్కిస్తూ.. “ బాబు గారు ! తొట్టెలో కూర్చోండి . మేరకున్న కాడ గదేయ్యడానికి అడ్డోస్తారు” అన్నాడు సరంగు. పర్వాలేదు నుంచుంటా అని నున్చోబోయ్యాడు మన్మదం.”గాలి పోతూ ముదిరిందంటే, పరమానుతాడు పీక్కి చుట్టుకొని తూలి గోదాట్లో పడగలరు.తమరు .మీకు సాయం చంక లో కుక్క పిల్లోకటి . అది యీదేయగలదనుకోండి. మరి మీకీతోచ్చో  లేదో సుసు కొండి . అయినా మద్దెన నాకెందుకు .మీ యిట్టం” అన్నాడు తెరచాప తాళ్ళను కట్టటం లో సాయపడుతున్న ఓ రైతన్న. “బాబుగారూ! మాకు దగ్గర దగ్గర తాళ్ళ చుట్ట ఒకటి ఉండాలి . దాని మీద కూర్చోండి “ అన్నాడు భైరాగి. నావ ముందు భాగాన్ని తాళ్ళ చుట్ట  కట్ట బడింది .రెండు అడుగులు ముందు కేసాడు మన్మధం. “నిమ్మది నాయనా! యీ మడి జాడి ముట్టుకోగలవు.కాస్త అసుంటానడు”అని హెచ్చరించింది. తాళ్ళకట్ట ప్రక్కన కూర్చొని,చిన్న సైజు జాడిని కాపలా కాస్తున్న,ఓ నడివయస్సు మనిషి. తాళ్ళమీద చతికిలబడ్డాడు మన్మదం.స్థలం మార్పు కి విసిగేసిన కుక్కపిల్ల “భౌ” మంది .దాని అరుపుకి అదిరిపడి  “మే” అంది పిల్ల మేక. పరవాలేదు. అది మన జోలికి రాదులే “ ని మేక భాష లో “మే! మే!” అని దైర్యం చెప్పింది తల్లి మేక. ‘ఏ తీరుగ  నను దయచూసెదవో” చరణం ఆపి “బాబు గారూ కుక్క పిల్లను పెంచుతున్నారా? మంచి  జాతి కుక్క  కామోసు తమరిది”ఆడిగాడు భైరాగి. “కాదు లేహేస్! అది ఊర కుక్క.కరణం గారి జాగిలం డాక్టర్ గారి సీమ కుక్కతో క్రాసింగైంది.ఆ మద్దిన . పిల్లల్ని ఊరంతా పంచి పెట్టాడు కరణం.దాని బాపతే అయిఉండాలి యిది” అన్నాడు  మైనరు బాబు. కుక్క పిల్ల భుజాలు తడుము కోవటాన్ని మన్మధం చూడలేదు .మైనరు దీన్ని ఊరకుక్క అన్నందుకు వొళ్ళు మండింది .ఈ పల్లెటూరి భైతు కి కుక్కల గురించి ఏం తెలుసు లే అని ఊరుకున్నాడు.”అయితే బాబు గారూ , కరణం గారికి మీకు చుట్టమా?”భైరాగి ప్రశ్న. ఆ కరణం తన మామ అనాలో ,లేక తను కరణం అల్లుడి తో ననాలో తేల్చుకునే లోగా “మీరు వారి అల్లుడు గారా?” అని  అడిగేసాడు  భైరాగి.’ఊ!’ అని టూకిగా సమాధానం చెప్పాడు మన్మధం,ఈ ముస్టాడి తో కబుర్లేమిటని . “కరణం గారి అల్లుళ్ళ౦ దరి వీ పెద్ద ఉద్యోగాలని చెప్పుకుంటారు .తమరు కూడా ఎదో గొప్ప ఉద్యోగం చూస్తూ ఉండాలి .” “వీడికి యివన్ని  చెప్పటం ఏమిటి “ అని ఊరుకున్నాడు కాని ,అందరూ తన కేసి కూతూహలం గా చూస్తున్నారని గ్రహించి గుమస్తానని చెప్పుకోవటానికి నామోషి పడి “కాకినాడ స్టేట్ బ్యాంకు లో పని “ అన్నాడు కప్పదాటుగా. “మేనేజరుగిరా బాబు !” “ఆ !” అన్నాడు యింతటితో ఊరుకుంటాడన్న భరోసాతో . “మరక్కడ క్రిష్ణమూర్తి గారు కదా మేనేజరు,వారిదీ కొనసీమేలెండి. మా రాజు ,రేవు దాటి నప్పుడల్లా పలకరించి ఓ రూపాయి దానం చేసేవారు”. “ఆయన కింద అసిస్టెంటు  మేనేజర్ని” అని బూకాయించాడు మన్మధం. “వారి అసిస్టెంటు గా భజగోవిందం గారు కదా పని చేస్తూ వుంట?” గొంతు లో వెలక్కాయ పడ్డట్టయింది మన్మధానికి.’ఈ గుడ్డి పీనుక్కి యిన్ని వివరాలు ఎలా తెలుసు చెప్మా?’అని ఆచ్యర్యపోయాడు. “వారు పంట భూముల లావా దేవిల్లో అప్పుడప్పుడు వస్తూ వుండే వారు లెండి .ఏ మాట కామాటే చెప్పుకోవాలి .నా చేతుల్లో ఎప్పుడూ గుప్పెడు చిల్లర పోసేవారు .” వీడు డొంకంతా కదిపెస్తున్నాడు.కొంప తీసి బ్లాకు మెయిల్ చేస్తాడేమోనని భయపడి పర్సులోంచి రెండు రూపాయల కాగితం తీసి యిదిగో యింద” అంటూ రెండడుగులు ముందు కేసి ,భైరాగి చేతిలో పెట్టాడు  మన్మధం.ఆ రెండడుగులు ముందుకు వేస్తుంటే “ అసుంటా,అసుంటా.జాడి ముట్టుకు తగలేయ్య గలరు “అంది బోడెమ్మ  గొంతు చించుకుంటూ. “ఎవరు సూరమ్మ గారా ! అమ్మాయిని చూడ్డానికి పట్నం వెళుతున్నారా తల్లి !” అని పలకరించాడు  భైరాగి . “ఆవకాయ రోజులు కదా ! అమ్మాయిది బొత్తిగా ఆడ దిక్కు లేని సంసారమాయే. కాస్త సాయం చేయటానికి వెళ్తున్నాను” అంటూ కొంగు ముడిలోంచి ఐదు పైసలు తీసి “ అలా అతనికి య్యి “ అని ప్రక్కనున్న షావు కారికి అందించింది . షావుకారు “యింద ,ఆరికియ్యి”అంటూ అడ్డ పొగ కాలుస్తూ ,బండ కొడవలి తో వీపు గోక్కుంటున్న  గడ్డి మోపావిడకి అందించాడు . నోట్లోంచి చుట్ట తీసి,గుప్పున పొగ వదిలి “యిదిగో సూస్కో ఐదు పైసలు “ అంటూ ఆ భైరాగి చేతి లో పెట్టింది  ఆ గడ్డి మోపు . “ఎవరు చిట్టెమ్మా! కమ్మని పొగవాసన  తగల గానే అనుకున్నాను , నా పక్కన కూర్చున్నది చిట్టేమ్మేనని.ఇందరు చుట్టలు కాలుస్తున్నారు గాని ,నీ దగ్గర ఉన్నకమ్మదనం ఎవరికీ రాదంటే నమ్ము చిట్టెమ్మా” అని పొగిడాడు  భైరాగి . చిట్టెమ్మ ఐసైపోయి . బొడ్లో౦చి నాలుగు పొగాకు పాయలు తీసి ,ఓ పాయ ఇవ్వబోయి మూడు పాయ లిచ్చేసింది భైరాగికి. అందుకున్న పొగాకు బాపతు ఘాటు పీలుస్తూ చిత్తేమ్మేప్పుడూ చిట్టేమ్మే అని మెచ్చుకున్నాడు  భైరాగి . అలా అనగానే ప్రక్కనున్న అప్పాయమ్మ కి పౌరుషం వచ్చి,బుట్ట లోంచి అమ్మకానికి తీసుకెళ్తున్న మామిడి పళ్ళను ఓ పుంజుడుతీసి ,ఇంద అని భైరాగి వొళ్ళో వేసింది.

No comments:

Post a Comment

Pages