అంతర్యామి – 3 - అచ్చంగా తెలుగు
అంతర్యామి – 3
-పెయ్యేటి రంగారావు

(జరిగిన కధ : రామదాసు గారు నరసాపురం కాలేజి లో లెక్చరరు ,ఆస్తికుడు. ఆయన మిత్రుడు లావా నాస్తికుడు,స్థానిక హేతువాద సంఘం అధ్యక్షుడు. వారిద్దరి మధ్య భగవంతుడు ఉన్నాడా ,లేడా అన్న విషయమై వాదోపవాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. రామదాసుగారి ఇంటికి అంతర్యామి అనే స్వామీజీ తన  శిష్యులతో వచ్చారు. ఇక చదవండి ....)

వెంటనే వారి ముఖ్యశిష్యులైన భగవంతం గారు కొబ్బరి కాయ కొట్టి , వారికి హారతి ఇచ్చాడు.   క్షణం.....రెండు క్షణాలు గడిచాయి!   అంతర్యామి గారి కళ్ళు మూత పడిపోయాయి.   ఆయన బిగుసుకున్న కండరాలు తిరిగి మామూలుగా మారసాగాయి. మనిషి అలసట తో వడలిన తోటకూర కాడలా మారిపొయాడు. ఉన్నట్టుండి మెరుపు వేగముతో లేచి, గాలి లోకి చేయి చాపి ,'స్వామీ!' అని అరిచాడు! ఏదో దొరికినట్ట్లుగా అంది పుచ్చుకున్నాడు . ఆయన కళ్ళవెంట అశృవులు ధారాపాతం గా వర్షించ సాగాయి. రామదాసు తో ఆనందంగా అన్నాడు.   'నీ పంట పండిదయ్యా రామదాసూ! నీకు స్వామి వారి అనుగ్రహం లభించింది! ఇదుగో,ఇది నీకు ప్రసాదించారు!'   రామదాసు గారు భక్తి పారవశ్యం తో ,కళ్ళ వెంట నీళ్ళు జల జల రాలుతుండగా ఆ విగ్రహాన్ని అందుకుని కళ్ళకద్దుకుని,అక్కడున్న అందరికీ ఆ విగ్రహాన్ని చూపించారు.   అందరూ ఆయనని మనసారా అభినందించారు.   అంతలో అక్కడకు లావా వచ్చాడు.   రామదాసు ఆనందంగా లావాని కౌగిలించుకుని 'మహత్తర క్షణాల్లో నువ్వు లేకుండా పోయావురా. ఇదుగో ,స్వామి వారు నాకు అనుగ్రహించిన విగ్రహం!' అంటూ లావా కు కూడా ఆ విగ్రహాన్ని చూపాడు.   లావా ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసి చిరునవ్వుతో తిరిగి రామదాసుకు ఇచ్చేశాడు.   ******      **************     *******   అందరూ వెళ్ళిపొయ్యారు .   అంతర్యామి గారు విశ్రాంతి తీసుకుంటున్నారు.   లావా రామదాసుతో మళ్ళీ వాదనకు దిగాడు.   5       'దాసూ! ఆ సమయాన నేనుండవలసినది. నీ మీద ఆంజనేయస్వామికి అంత వాత్సల్యమే ఉంటే ఆ కంచుముక్కని విసిరి కొట్టటమెందుకు? బంగారు ముద్దనే ప్రసాదించవచ్చుగా?   రామదాసు అన్నాడు ,'నీకు నిదర్శనాన్ని చూపించవలసిన ఆగత్యం ఆ పరమాత్మకి లేదురా లావా , ఆ నిదర్శనాన్ని చూసే అర్హత కూడా నీకు లేదు . పోతే ,నాకు ఆ పరమాత్మ నిదర్శనం గా ఆ విగ్రహాన్ని ఇవ్వలేదు .అనుగ్రహాన్ని మాత్రమే ప్రసాదించారూ. 
 ************** 
 గార్డు ఈల వేసి పచ్చ జండా చూపించాడు.   రైలు నెమ్మదిగా కదలసాగింది.   అంతలో ఒకామె ప్లాట్ ఫారం మీద పరిగెట్టుకుంటూ రైలునందుకోవటానికి ప్రయత్నించసాగింది.ఒక ఫస్త్ క్లాస్ కంపార్ట్ మెంట్ అందుబాటు లోకి వచ్చేసరికి ,ఆలోచించకుండా అతి కష్టం మీద ఊచ పట్టుకుని లోపలికి గెంతింది.ఆయాస పడుతూ సీట్లో కూలబడి సేద తీర్చుకోసాగింది.   తనెక్కిన కంపార్ట్ మెంట్ ఫస్ట్ క్లాస్ అన్న ధ్యాస కూడా లేదామెకి.   తను టికెట్టు కొనలేదే అన్న చింత కూడా ఆమె మొహములో కనిపించట్లేదు .   ఆ భోగీ లో వేరే ఎవ్వరూ లేరన్న విషయాన్ని కూడా ఆమే గమనించలేదు.   నిరాసక్తం గా  అలాగే కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది.   రైలు వేగాన్ని పుంజుకుంది.   ఆమె నెమ్మదిగా తేరుకుంది. కళ్ళు తెరిచి కొద్ది క్షణాలు కిటికీ లోంచి కదులుతున్న దృశ్యాల కేసి చూస్తూ వుండిపోయింది.   ఆమె అందానికి నిర్వచనం లా ఉంది. పాల మీగడను,మలయ సమీరాన్ని ,కొండల మధ్య నించి ఉదయిస్తున్న సూర్యుడిని , ఆమని లోని పచ్చటి ప్రకృతిని కలబోసి ,సృష్టికర్త కల్పించిన మానవ రూపమా అన్నంత మనోహరం గా ఉంది.   నీరెండ ఆమె కపోలాల్ని తాకి పులకిస్తున్నది!   చల్లని గాలి ఆమె శరీరాన్ని ఆత్రముగా అలుముకుంటున్నది !     ఐనా ఆ శరీరం తనది కాదన్నట్టు, 'తను ' అంటే ఆ శరీరం కాని మరేదో పదార్ధమైనట్టు -- ఒక అలౌకికమైన భావనతో వెనక్కి వాలి కళ్ళుమూసుకుంది. తను అందగత్తెనన్న ధ్యాస కూడా ఆమెకు ఉన్నట్లు లేదు.   'టికెట్ ప్లీజ్'!     '........' మేడం! టికెట్ ప్లీజ్"!     వెన్నెల విరిసినట్లుగా ఆమె కళ్ళు తెరిచి రెప్పలల్లార్చింది.   మేఘాలలుముకున్నట్లుగా తిరిగి రెప్పలు మూసుకుంది.   కోలవెన్ను తిలక్ లో కొద్దిగా గుండె ధైర్యం, ఎంతోగా మగతనం ప్రవేశించాయి!  అతడికున్న బలహీనతలు రెండే రెండు. మనీ,మగువ!   అతడు చిన్నప్పుడు అతి పేదరికాన్ని అనుభవించాడు. అదృష్టం బాగుండి టికెట్ కలెక్టర్ గా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.ఇది అతడికి చాలా అనువైన ఉద్యోగం. హైదరాబాదులో తను కట్టుకుంటున్న భవంతికి ఆర్ధికసాయాన్ని ప్రజల నుంచి అందజేసేది ఈ ఉద్యోగం. అందుకని ప్రతి రోజూ ఇంతకు తక్కువ సంపాదించకూడదని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకూ కిందా మీదా పడే రకం అతడు.   తిలక్ భార్యకి,వేళా పాళా లేకుండా డ్యూటీలు చేసే తన భర్త అంటే చిరాకు. నైట్ డ్యూటీ చేసి వచ్చి ,పట్టపగలు తనని శృంగారం అనే రొంపిలోకి దింపుదామని అతడు పడే తాపత్రయం చూస్తే ఆమెకు ఒళ్ళుమంట . వాళ్ళిద్దరి మధ్యా భావసారూప్యం కూడా పూర్తిగా కొరవడింది.అందువల్ల వారి కాపురం మూడు ఉప్పురాళ్ళూ,నాలుగు మిరపకాయల మంటలో వేసినట్టు గా గొడ్రుగానూ,ఘాటు గానూ సాగుతోంది.ఐనా తిలక్ కి బెంగ లేదు.  అతడు డ్యూటీ చేసేటప్పుడు చిల్లర తిరుగుళ్ళకి బాగా అలవాటు పడిన ప్రాణి.అందుకని అతడు నిర్దేశించుకున్న రెండో లక్ష్యం ,ప్రతి రోజూ ఎలగైనా కాస్త చిల్లరగా గడ్డి మెయ్యాలని.   తిలక్ కి రైలు భోగీలో ఆమె కనిపించగానే తను నిర్దేశించుకున్న రెండు లక్ష్యాలలో ఏదో ఒక లక్ష్యం నెరవేరబోతోందన్న నమ్మకం కలిగింది.   ఎగిరే సీతాకోకచిలుకను పట్టి, గోళ్ళతో సుతిమెత్తగా రెక్కలు తుంచుతున్నట్లు,ఆమె భుజం మీద చేయి వేసి,'ఇదుగో ,నిన్నే.....' అన్నాడు.   యజ్ఞగుండం లో హోమద్రవ్యం  పడినట్లు ఒక్కసారిగా ఆమె కళ్ళు భగ్గున వెలిగాయి!   కానీ అంతలోనే ఆమె మొహం లో పూర్వపు నిరాశక్తత! భుజం  మీద నుంచి అతడి చేతిని తోలగించడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదామె!   తిలక్ కి మరి కొంచెం ధైర్యం కలిగింది.   'టికెట్ లేదా?'   '.........' ఆమె కళ్ళు కిటికీ లోంచి ప్రకృతిని చూస్తూ....     'కొనడానికి డబ్బు లేదా?'.... అతడు ఆమె పక్కన కూర్చుంటూ..... 7   '...... ఆమె కళ్ళు శూన్యాన్ని చీలుస్తూ....   'ఫర్వాలేదులే,కంగారు పడకు .'- అతడు మరికొంత చొరవ తీసుకోడానికి ప్రయత్నిస్తూ.....   '.....' ఆమె కళ్ళు శూన్యాన్ని,ఆ శూన్యం వెనుక ఆస్తికులు ఊహించుకునే జ్యోతి స్వరూపాన్ని శోధిస్తూ .....   'ఇంకో అరగంట దాకా  ఏ స్టేషనూ రాదులే.'- అతడు మరికొంచెం దగ్గరకు జరిగి,భుజాల పైనుంచి చేతుల్ని కిందికి జారుస్తూ.....   ఆమె తల తిప్పి అతడికేసి నిర్వికారం గా ఒకే ఒక్క క్షణం చూసింది.   అతడి చేతులు అప్రయత్నంగా కిందకు జారిపోయాయి.   ఆమె తిరిగి కిటికీలోంచి శూన్యాన్ని ఛేదిస్తూ.....జ్యోతి స్వరూపాన్ని శోధిస్తూ......   'ఎక్కడకెళ్ళాలి?'   ఆమె నెమ్మదిగా వినిపించీ  వినిపించనట్లుగా  చెప్పింది.   డబ్బులు లేక పోయినా ఫర్వాలేదులే.నేను మేనేజ్ చేస్తానుగా!'-- జీవితం లో మొదటి సారి కన్యాకుమారి లోని సూర్యాస్తమయాన్నీ,చంద్రోదయాన్ని శారీరకముగా అనుభవించబోతున్న ఆత్రుత!   సన్నజాజులు పరిమళిస్తున్నట్లుగా ఆమెలో చిన్ననవ్వు!   నెమ్మదిగా అడిగాడు, 'నీ పేరేమిటి?'   మలయ సమీరం లో జలతరంగ వాదన అతి దూరాన్నుంచి వినిపించింది!   'ఆడది!'     తిలక్ ఆమె కేసి అయోమయం గా చూసాడు.   'ఏమిటీ?'   సన్నగా హోరుగాలి మొదలయ్యింది !   'ఆడది!'   'అదేం పేరు?'  ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తమకంగా నిమురుతూ అడిగాడు .   హోరుగాలి ప్రభంజనమయింది!   'నాలో నువ్వు చూస్తున్నది ఆడతనాన్నేగా?' (సశేషం...)  

No comments:

Post a Comment

Pages