బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం  త్య క్త్వా కరోతియః

లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా

( భగవద్గీత 5 వ అధ్యాయం, 10 వ శ్లోకం)

తామరాకు నీటిలో పుట్టి, నీటిలో పెరిగి, నీరు ప్రాణాధారంగా జీవిస్తుంది. నీరు తామరాకుకి జీవాన్ని, చైతన్యాన్ని ఇస్తుంది. అయినప్పటికీ తామరాకు నీటినుంచి వేరుగా, నీటిలోని తడి తనకు అంటకుండా ,ఆనీటిలోనే ఉంటుంది. ఇదేవిధంగా మనిషి యొక్క ఆత్మ అతని శరీరంలో ఉన్నప్పటికిని , ఆత్మ ఆ శరీరాన్ని ఒక ఉపకరణంగా వినియోగించుకుంటుంది. ఆత్మ శరీరంలో వున్నప్పటికినీ, నీటిలో వున్న తామరాకులా శారీరక బంధానికి అతీతంగా వుంటుంది. కానీ మానవుడు తన శారీరక వ్యామోహం చేత ఆత్మ జ్ఞానాన్ని గ్రహింపజాలడు. శారీరక వ్యామోహం అతనికి తాను తన శరీరానికి యజమాని అన్న భావం కలుగ చేస్తుంది.ఈ శారీరక వ్యామోహం అనే ముసుగు తెర వల్ల అతనికి ఆత్మ జ్ఞానం అవగతం కాదు. తాను తన శరీరానికి యజమాని అన్న భావన వల్ల , తన శరీరం చేసే ప్రతి పనికీ తానే కర్త అనే భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతి వల్ల మనిషి ప్రభావితుడై , తన శరీరం ఆచరించే ప్రతి కర్మకు తానే కారకుడుగా భ్రమిస్తాడు. ఈ భ్రమ వల్ల అతనికి కర్మాచరణ యందు ఆసక్తి కలుగుతుంది. తామరాకు జీవించటానికి నీరు ఆధారమైనప్పటికి, తామరాకు నీటిలో వున్న తడిని, లేదా నీటి గుణాన్ని ఎలాగ తనకు ఆపాదించుకోదో, అదేవిధంగా మనిషి జ్ఞావంతుడు అయిననాడు, తన శరీరం కేవలం కర్మలను ఆచరించే ఒక పరికరం గా గుర్తిస్తాడు. అప్పుడు అతడు తాను తన శరీరం కన్నా వేరన్న సత్యాన్ని గ్రహిస్తాడు. ఈ సత్యం తెలుసుకొన్ననాడు అతడు శారీరక వ్యామోహం వదులుకొని కర్మ బంధాలనుండి విముక్తుడు అవుతాడు. అప్పుడు అతని శరీరం సహజ సిద్ద మైన కర్మలను ఆచరించినప్పటికినీ, ఆ కర్మ ఫలాలను అతడు ఆశించడు. శారీరక వ్యామోహం విడిచి పెట్టుట చేత అతను అహంకార, ,మమకారాలని త్యజిస్తాడు. కర్మలని ఆచరించుట శారీరక ధర్మం కాబట్టి అతని శరీరం సహజ సిద్దమైన కర్మలని ఆచరిస్తూ వుంటుంది. కానీ ప్రతిఫలేక్ష ఆశించని అతను ఆ కర్మలని నిస్స్వార్ధ పూరితంగా నిర్వహిస్తాడు. ప్రతిఫలాపేక్షలేకుండా కర్మలని ఒక కర్తవ్యంగా ఆచరించిననాడు, మనిషి కోరికలు లేనివాడు అవుతాడు. అటువంటి మనిషి శారీరక మోహాన్ని, కోరికలను విడిచి, అహంకార రహితుడై, కర్మలను ఆచరిస్తున్నప్పటికినీ కర్మ బంధ విముక్తుడు అవుతాడు. అప్పుడు అతను తామరాకు నీటిలోవున్నప్పటికినీ నీటివల్ల ఎలా ప్రభావితం కాదో, అదేవిధంగా అతను కర్మలను ఆచరిస్తున్నప్పటికినీ ఆ కర్మలకు అతీతంగా వుంటాడు.  ఎప్పుడయితే మనిషి అహంకారాన్ని, మమకారాన్ని, కోరికలను త్యజిస్తాడో అప్పుడు అతను స్వార్ధ రాహిత్యం పొందుతాడు. అటువంటి మనిషి కర్మలను ఆచరించినప్పటికీ, ప్రతిఫలాపేక్ష రహితంగా అతను నిర్వహించే ఆ కర్మలయొక్క ఫలం సంఘానికి ఉపయుక్తం అవుతుంది.

శారీరక వ్యామోహం, కర్మ ఫలాపేక్ష ఈరెండు త్యజించిన మనిషి సంఘ ప్రయోజకుడు అవుతాడు. అతని ప్రతీ చర్య సంఘానికి ఉపయోగకరం అవుతుంది. ఇటువంటి వ్యక్తినే ప్రజలు నాయకుడిగా పరిగణిస్తారు. ప్రపంచంలోని మహా నాయకుల చరిత్రల్ని పరిశీలిస్తే మనకి ఈవిషయం అవగతమవుతుంది. మహా నాయకులు అందరూ నిస్స్వార్ధంగా సమాజానికి సేవ చేసిన వారే. నాయకత్వం అన్నది పదవివల్ల రాదు, నాయకత్వం మనిషి స్వచ్ఛందంగా అనుసరించే ఒక లక్షణం. పదవి మీద ఆధారపడ్డ నాయకత్వం పదవి పోయిన పిమ్మట నిర్వీర్యం అవుతుంది. నిజమైన నాయకుడు ఎటువంటి పదవి అధికారం లేకపోయినప్పటికీ కేవలం తన స్వార్ధ రాహిత్యం వల్ల, ప్రతిఫలాపెక్ష లేని సంఘ సేవా తత్పరత చేత ,ప్రజలను ప్రభావితం చేయగలడు. అతనికి ప్రజలను ప్రభావితం చేయగల శక్తి అంతర్గతంగా సంభవిస్తుంది. ఇది కేవలం స్వార్ధరాహిత్యం వల్ల సాధ్యమవుతుంది. అటువంటి నాయకుడికి పదవి, అధికారం తో సంబంధం లేదు. అటువంటి మహా నాయకుల కోవకు చెందినవారు మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద . గాంధీ మన దేశ స్వతంత్రం కోసం పోరాడితే, స్వామి వివేకానంద సర్వమానవ సౌభ్రాతృత్వం,విశ్వశాంతి కోసం పరిశ్రమించారు. దారిద్ర్య నిర్మూలన, ఆపన్నులని ఆదుకోవటం , మతం యొక్క ముఖ్యోద్దేశ్యం అని ప్రపంచానికి స్వామి వివేకానంద చాటి చెప్పారు. మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద వీరిద్దరూ ఎటువంటి పదవి, అధికారం లేనివారే. అయినప్పటికీ వారి నిస్స్వార్ధ చింతన, సంఘ సేవాతత్పరత, వారికి వారి లక్ష్యం పట్ల అచంచలమైన విశ్వాసం , నమ్మకం ఇచ్చాయి. అందువల్ల కేవలం వారి లక్ష్యంతో వారు ప్రజలని ప్రభావితం చేయగలిగారు. లక్ష్య సాధనకు వారి ఆత్మవిశ్వాసం, మనోబలం కావలసిన శక్తిని ఇచ్చాయి. వారు ఎన్నో ఒడిదుడుకులను, ఆటంకాలను , ఓర్పుతో కేవలం వారి ఆత్మ విశ్వాసం, మనోబలం చేత ఎదుర్కోగలిగారు. వారి లక్ష్యసాధనలో  లోకహితం తోపాటు స్వార్ధరాహిత్యం  వుండతంచేత ,వారు ఎటువంటి ప్రలోభాలకు తలవొగ్గలేదు. ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి ప్రస్తుతం ఇటువంటి మహా నాయకుల ఆవశ్యకత ఎంతైనావుంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యం వల్ల యావత్ప్రపంచానికి  సంభవించిన సంక్షోభం ఇంకా తీవ్రతరం అవకుండా వుండాలంటే దూరదృష్టి గల నిస్స్వార్ధపూరిత సేవాతత్పరతతో కూడిన నాయకత్వ లక్షణాలున్న మహాత్ములు తెరమీదికి రావలసిన తరుణం ఆసన్నమయింది. చరిత్రలో క్లిష్ట పరిస్థితుల్లో సరియైన మహానాయకులు ఉద్భవించి మానవాళిని ప్రగతిపధాన నడిపించిన ఉదంతాలు ఎన్నోవున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుందని ఆశిద్దాం.

( "     July-Sept  2013 Triveni సంచికలో ప్రచురింపబడిన ఆంగ్ల వ్యాసానికి రచయిత స్వీయ తెనుగు అనువాదం.")

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top