చిత్రకళకు ‘ఉదయ’ వర్ణాలు - భావరాజు పద్మిని. - అచ్చంగా తెలుగు

చిత్రకళకు ‘ఉదయ’ వర్ణాలు - భావరాజు పద్మిని.

Share This

bఆయన కుంచె నుంచి జాలువారిన ప్రతీ చిత్రం ఓ సజీవ శిల్పం. ప్రతీ భావం హృద్యం, చూసే మనసుకు సులభ గ్రాహ్యం. ఆయన బొమ్మలు చూసే వారు వాటిలోని జీవకళ, భావుకత, ఆర్ద్రతకు మంత్ర ముగ్ధులై శిలా ప్రతిమల్లా నిల్చుండిపోతారు. కళ్ళను, మనసును కట్టి పడేసే అనితర సాధ్యమైన ప్రతిభ ఆయన సొంతం. చిన్న బియ్యపు గింజ నుంచి యెంత పెద్ద కాన్వాస్ అయినా, ఆయన చేతుల్లో వర్ణ రంజితమై మురిపిస్తుంది. కృషి, పట్టుదల, అంకిత భావంతో భారతీయ చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన అద్భుతమైన చిత్రకారులు... ఉదయ్ కుమార్ మార్లపుడి.

ఉదయ్ గారికి స్పూర్తి, ప్రేరణ, మార్గదర్శి, తండ్రి ఇజ్రాయెల్ గారు. వీరు చిత్రలేఖనోపాధ్యాయులు. బాల్యం నుంచే తండ్రి వేసే పోర్ట్రైట్ లను శ్రద్ధగా గమనిస్తూ, ఆరాధనగా చూసేవారు ఉదయ్. అలా చూస్తూ కేవలం 3,4 సంవత్సరాల వయసులోనే ఉదయ్ గీసిన ‘గుఱ్ఱపు బండి’ బొమ్మ తండ్రిగారి స్కూల్ లోని ఎక్సిబిషన్ లో ప్రదర్శింపబడి పలువురి పెద్దల మన్ననలు అందుకుంది. ఉదయ్ తోబుట్టువులు కూడా బొమ్మలు వేస్తూ ఉండేవారు. అయితే, ఉదయ్ చిత్రకళను ఒక వ్యాపకంగా మాత్రమే చూడలేదు. ఒక తపస్సులా సాధన చేసేవారు. కనిపించే ప్రకృతిని, మనుషుల్ని, సంఘటనల్ని నిశితంగా పరిశీలించేవారు. ప్రతీ రోజూ బొమ్మలు గియ్యకపోతే ఉదయ్ కు నిద్ర పట్టేది కాదు. అది గమనించిన తండ్రి ఉదయ్ ను అనేక విధాలుగా ప్రోత్సహించేవారు.

bhumi  కొన్ని కుటుంబ ఆచారాల వల్ల వారు సినిమాలు చూడకూడదన్న నియమం ఉండేది. అయినా, ఉదయ్ ను  చిన్నతనంలో అమరశిల్పి    జక్కన్న, తాజ్మహల్ అనే సినిమాలకు తీసుకువెళ్ళారు తండ్రి. ఆ చిత్రం ప్రేరణతో వేసిన బొమ్మ ‘ కళాప్రియ’. ఇది ఆరేళ్ళ వయసులోనే  వేసారు ఉదయ్. చేతిలోని గులాబీని వాసన చూస్తూ, తాజ్ మహల్ ఎదుట విషాదంగా కూర్చుని, తియ్యటి గత స్మృతులను  నెమరువేసుకుంటున్న షాజహాన్ బొమ్మను చిత్రీకరించి, అందుకు గానూ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం గెల్చుకున్నారు.

 విద్యార్ధి దశలోనే ‘అకాల ఆర్ట్స్ అకాడెమి’ , భీమవరం నుండి ఏడు సంవత్సరాలు (1969-76)ప్రధమ బహుమతి గెల్చుకున్నారు.  అంతేకాక లయన్స్ క్లబ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అల్ ఇండియా కాంగ్రెస్ వంటి పలు సంస్థలు నిర్వహించిన చిత్రకళా పోటీల్లో ప్రధమ  బహుమతులు అందుకున్నారు. 12 ఏళ్ళ వయసులో ఉదయ్ ‘వన్ మాన్ షో’ చూసేందుకు వచ్చిన అప్పటి విద్యాశాఖా మంత్రి మండలి  వెంకట కృష్ణారావు గారి స్పాట్ పెయింటింగ్ వేసి, ఆయనకు ఇవ్వగా ఆయన బాల ఉదయ్ ని కౌగిలించుకోవడం ఉదయ్ కు కొత్త ప్రేరణ అందించింది.

1983 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బాచిలెర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టాను అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీdurga

ఇంటర్ కాలేజీ పోటీల్లో , ఉదయ్ గారు వేసిన ఆలోచన రేకెత్తించే చిత్రాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆ సమయంలో ఉదయ్ వేసిన ఊర్వశీ పురూరవ, విదురపత్ని, నా తరమా భవసాగారమీదను, వంటి చిత్రాలు ఉదయ్ సృజనకు, భావజాలానికీ తార్కాణంగా నిలుస్తాయి.

“కళాకారుడికి సమాజం పట్ల ప్రాధమిక బాధ్యత ఉండాలి. ఏ కళైనా సమాజాన్ని ఆలోచింపచేసి, ఒక చైతన్యాన్ని, మార్పును తీసుకురాగలిగినప్పుడే సార్ధకమౌతుంది ! పుట్టిన ప్రతీ వ్యక్తీ సమాజానికి కొంత సేవ చెయ్యాలి. కళ మనసుల్ని రంజింప చెయ్యడమే కాదు, అవసరమైన చోట మనసుల్ని తట్టి లేపి మేల్కొల్పాలి !” అంటారు ఉదయ్.

k జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. 1982 లో పాలస్తీనా విమోచన ఉద్యమంపై ఉదయ్ గీసిన రెండు  పెద్ద పోస్టర్లు సంచలనం సృష్టించాయి. సమాజంలోని మూఢ నమ్మకాలు, రుగ్మతలపై , మతసామరస్యం, స్త్రీ సమస్యలు, వాతావరణ  కాలుష్యంపై ఎన్నో బొమ్మలు గీసారు. సారా వ్యతిరేక ఉద్యమం పై ఆయన గీసిన బొమ్మలు వ్యసనాలకు బలైన జీవితాలను ప్రతిబింబించి,  మనసుల్ని కదిలిస్తాయి. ఈ చిత్రాలను పలు సినిమాల్లో కట్ ఔట్లు గా వేసారు. ఎయిడ్స్ పై జరిగే అవగాహనా సదస్సుల్లో ప్రతీ సంవత్సరం  పాల్గొని, తన చిత్రాల ద్వారా స్పూర్తిని అందిస్తారు ఉదయ్.

 1997 లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘శాంతి శాంతి శాంతిః’ అనే శీర్షికతో బుద్ధుని ఆశయాలపై ఉదయ్ ప్రదర్శించిన చిత్రం  పలువురు దేశ విదేశీ పర్యాటకుల మన్ననలు పొందింది.

1998 లో పాలకొల్లులో జరిగిన ‘జాతీయ సమైక్యతా శిబిరంలో ‘కాలుష్య నివారణ’ పై ఉదయ్ వేసిన 50 చిత్రాలు ప్రదర్శించినప్పుడు, లోక్ సత్తా నాయకులు mజయప్రకాశ్ నారాయణ్ ఆ చిత్రాలు చూసి ముగ్ధులై, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉదయ్ చిత్రాల ద్వారా కనబరచిన సందేశం సమాజంలో కొత్త మార్పుకు దోహదం చేస్తుందంటూ అభినందించారు.

1999  మార్చ్ లో కువైట్ లోని కమర్షియల్ బిజినెస్ కాలేజీ ఫర్ విమెన్ ఆధ్వర్యంలో జరిగిన పెద్ద ఎక్సిబిషన్ లో ,విదేశీయులకు సూక్ష్మంగా చిత్రకళను ఎలా అధ్యయనం చెయ్యాలో నేర్పి అక్కడి రాజవంశీయుల  ప్రశంసలు అందుకున్నారు ఉదయ్.

ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూనే క్షణాల్లో చిత్రాలు గియ్యడం ఉదయ్ ప్రత్యేకత. 2003 డిసెంబర్ 10 వ తేదీన న్యూఢిల్లీ లో నీటి భద్రతపై జరిగిన సదస్సులో అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి అభినందనలు అందుకున్నారు ఉదయ్. ఈ సదస్సులో ఉదయం అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను తెలుసుకున్న ఉదయ్, ఎముకలు కోరికే చలిలో, రాత్రంతా వాటర్ కలర్స్ ఉపయోగించి కలాం గారి జీవిత విశేషాలను, కళా హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా అందమైన పెయింటింగ్ గీసి, ఉదయాన్నే ఆయనకు బహుకరించారు. అప్పుడు ఆయన కళ్ళలో మెరిసిన ఆనందం ఎప్పటికీ మరువలేనని అంటారు ఉదయ్.

wరెండు దశాబ్దాలుగా అమెరికా,ఆస్ట్రేలియా, లండన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని చర్చిల్లో ఆయన చిత్రాలకు స్థానం లభించడం విశేషం. ఎందరో కవుల, రచయతల పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసారు ఉదయ్. ఇక ఆయన వెయ్యికి పైగా గీసిన జాతీయ నాయకుల, పలువురు ప్రముఖుల, స్వాతంత్ర్య సమరయోధుల, దేశ భక్తుల, బొమ్మలు ఆయన సత్తా ఏమిటో చూపుతాయి.

విదేశాల్లో ప్రకృతి వైపరీత్యంలో చనిపోయిన తమ ఆప్తురాలి బొమ్మను గియ్యమని ఉదయ్ ను సంప్రదించారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే, వారి వద్ద ఆమె ఫోటో తల వరకే ఉంది. వారిచ్చిన బొమ్మ ఆధారంగా వెలుతురు ,భంగిమ దిశలను ఏర్పాటు చేసుకుని, తన కుమార్తెను మోడల్ గా కూర్చోపెట్టి, ఆమె శరీర ఆకృతిని ఊహించి, లైఫ్ సైజు బొమ్మ వేసి ఇచ్చారు ఉదయ్. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, తమ బంధువే ఉదయ్ ను ఆవహించి బొమ్మ వేయించుకున్నదేమో అన్నంత సజీవంగా, సహజంగా బొమ్మ ఉందని ఆనందంగా మెచ్చుకోవడాన్ని ఎప్పటికీ మరువలేనంటారు ఉదయ్.

కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు, ఉదయ్ చేయితిరిగిన శిల్పి కూడా ! ఉభయ గోదావరి జిల్లాల అన్నదాత, అపర భగీరధుడైన కాటన్ దొర విగ్రహాన్ని ఎంతో అందంగా మలిచారు ఉదయ్. ఆదికవి నన్నయ్య , మహాత్మాగాంధీ వంటి పలువురు ప్రముఖుల శిల్పాలను సజీవంగా మలిచారు ఉదయ్.

1picభావుక హృదయం, స్పందించే మనసు ఉంటే, వారి చేతుల్లో కళ ఎన్ని రూపలనైనా పొందుతుంది. ఉదయ్ కేవలం చిత్రకారులూ, శిల్పి మాత్రమే కాదు. మంచి కవి కూడా ! ఇందుకు ఆయన రాసిన ‘చిత్ర ప్రియ’ , ‘అనంత వేదన’ కవితలు, నానీలే సాక్ష్యం ! సంగీత స్వరాలకు అనుగుణంగా చక్కటి గీతాలు కూడా రాయగలరు ఉదయ్. విశ్వవాణి రేడియో కార్యక్రమంలో ‘జీవజలాలు’ పేరుతో ప్రసారమయ్యే క్రైస్తవ భక్తి గీతాల్లో, ‘నీ శిలువ కొమ్మపై ఓ కోయిల’ అంటూ ఆయన రాసిన గేయం ఎందరినో మురిపించింది.

వైవిధ్యం, సమకాలీనత, సమాజానికి ఏదైనా అందించాలన్న తపన ఉదయ్ గారిని ఒక ప్రత్యేక స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఉదయ్ ఆలోచనల్లోని పరిణితి ఆధ్యాత్మిక మూలాల నుంచి మలచబడిందని ఆయన  చెప్తుంటారు. ‘సేవ్ ‘ అనే సామాజిక సంస్థను నెలకొల్పి పేద విద్యార్ధులకు ఉచితంగా చిత్ర కళను నేర్పుతున్నారు. పాలకొల్లులో ‘ హరివిల్లు ఆర్ట్స్ అకాడమి’ స్థాపించి, పలు చిత్రకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్ లో కూడా పలువురు విదేశీయులకు చిత్రకళలోని మెళకువలు నేర్పుతారు ఉదయ్. పచ్చటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆర్ట్ గాలరిని భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఘనత ఉదయ్ కే దక్కింది.

coton తల్లి పుష్పమ్మ గారు 84 ఏళ్ళ వయసులో, ఇప్పటికీ కూడా, తను వదిలేసిన రంగుల్ని సర్దడం, మరలా నీరు ,  పెయింటింగ్ కు అవసరమైన రంగులు అమర్చి పెట్టడం చేసి ప్రోత్సహిస్తూ ఉంటారని చెప్తారు ఉదయ్.  తను చిత్రకళకు  అంకితమై అంచెలంచలుగా ఎదగడం వెనుక తన భార్య ఝాన్సి లక్ష్మి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉందని అంటారు  ఉదయ్. కుమారుడు ఉజ్వల్ తేజ్, కుమార్తె శ్రావ్య మేఘన సహకారం ఆయన విజయానికి ఆలంబనం.

 సృజన, ప్రతిభ, అంకితభావంతో ఒక పని తపస్సులా చేసుకుపోతుంటే ప్రశంసలు, అవార్డులు వాటికవే వెతుక్కుంటూ  వస్తాయి. పలు స్థానిక సంస్థలు, జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక సత్కారాలు, పురస్కారాలు  అందుకున్నారు ఉదయ్. యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్ నుండి ‘సంస్కృతి పురస్కారం ‘ అందుకున్నారు . 1992 లో  ఓ.ఎన్.జి.సి సంస్థకు ‘మార్గదర్శి’ అనే ఆడియో తయారు చెయ్యడానికి గానూ ఉదయ్ అందించిన సహకారానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నుండి సన్మానం అందుకున్నారు.

చిత్రాల ద్వారా ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్నానన్న తృప్తి తనను ముందుకు నడిపిస్తుందని అంటారు ఉదయ్. కళాకారుడు ఒకే మూసలో, ఒకే రకమైన చిత్రాలు గియ్యకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యానికై నూతన రీతులు ప్రయత్నించాలన్నది ఉదయ్ నమ్మకం. నేటికీ తానొక విద్యార్ధినే అనే వినయంగా చెప్తుంటారు ఉదయ్. పండితపామర రంజకంగా బొమ్మలు వెయ్యడానికి ఇప్పటికీ నిత్యం సాధన చేస్తుంటారు. చిత్రాలు గీసే సమయంలో తాను ఎంతో ఆనందంగా విధి నిర్వహణ చేస్తూ ఉంటానని చెప్తారు ఉదయ్. ప్రస్తుతం ఒక ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నారు ఉదయ్. కళను ఒక తపస్సుగా భావించి, సమాజానికీ, ముందు తరాలకు స్పూర్తిదాయకంగా నిలిచే ఉదయ్ జీవన విధానం ఎందరికో ఆదర్శనీయం !

No comments:

Post a Comment

Pages