మనసుంటే మార్గం ఉంది - బి.వి.సత్య నగేష్ - అచ్చంగా తెలుగు

మనసుంటే మార్గం ఉంది - బి.వి.సత్య నగేష్

Share This

ఈ దేశం నాకేమిచ్చిందీని ప్రశ్నించే ముందు ఈ దేశానికి నేనేమిచ్చాను అని ప్రశ్నించుకోమన్నాడు, ఆనాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ... ఈ సమాజాన్ని, వ్యవస్థను తిట్టుకుంటూ కూర్చునేకంటే, మనం ఏం చేయగలం, మన ఆశలేంటీ అని ప్రశ్నించుకుని ప్రయత్నిస్తే, జీవితం చాలా అర్ధవంతంగా చేసుకోవచ్చునని నిరూపించాడు.  ఈనాటి ఓక్ సామాన్యపౌరుడు- పాల్ రాజ్ జోసెఫ్.

ది వీక్ అంగ్లవార పత్రికలో వినూ అబ్రహం అందించిన వివరాలతో ఈ వ్యాసాన్ని వ్రాయటం జరిగింది. పాల్ జాన్ జోసెఫ్ ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి, ఊహించని ఒక సంఘటన ద్వారా జీవిత ఖైదీ గా శిక్షింపబడ్డాడు. అతని జీవితంలోని అనేక మలుపులు చివరగా అతను ఎలా స్థిరపడడు అనే వివరాలలోకి వెళ్దాం !

ఇరవై సంవత్సరాల యువకుడైన జోసెఫ్ బియస్సి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడై పై చదువులకోసం ప్రయత్నం చేస్తున్న రోజులవి. తమిళనాడులో అదల్కలపురం అనే ప్రాంతంలో చిన్న రైతు కుటుంబంలో జన్మించిన జోసెఫ్ జీవితంలో ఒక్ చెడు సంఘటన 1981 వ సంవత్సరంలో జరిగింది. ఘర్షణకు దిగిన ఒక త్రాగుబోతు నుంచి తన తండ్రిని రక్షించబోయి ఇరుకులో పడ్డాడు. తన తండ్రిని చంపే స్థితి వరకూ తీసుకెళ్ళిన ఆ త్రాగుబోతుతో  ఘర్షణకు దిగాడు. హఠాత్పరిణామం వల్ల ఆ త్రాగుబోతు మరణించాడు. జోసెఫ్ ని, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. తండ్రీకొడుకులను పాలయం కొట్టై అనే సెంట్రల్ జైలు లో నిర్భందించారు. కోర్టు ఆదేశాల మేరకు.. జీవిత ఖైదీగా సెంట్రల్ జైలులో క్రొత్త  జీవితాన్ని ప్రారంభించారు. జోసెఫ్ విద్యార్హతల గురించి తెలుసుకున్న విజయ్ నారాయణన్ అనే జైలు ఆఫీసర్ జోసెఫ్ తో మాట్లాడి , చదువును కొనసాగించాల్సిందిగా సలహా ఇచ్చాడు.  ఎమ్మెస్సీ మాథ్స్ చదవాలని నిర్ణయించుకున్నాడు. జైలు ఆఫీసర్ సిఫారసు తో ఇన్స్ పెక్టర్  జనరల్ ఆఫ్ ప్రిజన్స్ జోసెఫ్ ను ప్రత్యేక కేసుగా పరిగణించారు. కానీ ఆ రోజుల్లో ఎమ్మెస్సీ కరస్పాండెన్స్ ద్వారా చదవాలంటే.. బిఎస్సీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండాలి. జోసెఫ్ కేసును యూనివర్శిటీ కూడా స్పెషల్ కేసుగా పరిగణించి ప్రత్యేక అనుమతి నిచ్చారు. జోసెఫ్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. హత్య కేసులో నిందితునిగా ఉన్న జోసెఫ్ ఎంత చదువుకున్నా ఉద్యోగం దొరకదేమోనన్న అనుమానంతో అడ్వోకేట్ గా స్థిరపడాలని న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు. కానీ చదవటానికి అనుమతి దొరకలేదు. జైలు ఆఫీసర్ విజయ్ నారాయణ్ స్నేహితుడైన దేవదాస్ జోసెఫ్ కు చదువుకు సహాయం చేయాలను కున్నాడు. జోసెఫ్ ను తిరుచ్చి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. తిరుచ్చి లా కాలేజీలో జోసెఫ్ చేరాడు. పోలీస్ ఎస్కార్ట్ లేకూండా కాలేజీకి హాజరెయ్యేవాడు. భరతీ దాసన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో ప్రధమ ర్యాంక్ సంపాదించుకున్నాడు. అన్నీ సదుపాయాలు ఉండీ చదువుకున్న  విద్యార్ధుల కంటే మేలన్నట్లు ర్యాంక్ సాధించుకున్నాడు. జోసెఫ్ మరియు అతని తండ్రి ప్రవర్తన సరళి పై సదభిప్రాయం ఉండటం వల్ల సుప్రీం కోర్టు వారి విడుదల పై ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం ఇష్టపడితే వారిని విడుదల చేయవచ్చని తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం వారిని విడుదల చేయలేదు.  యావజ్జీవ కారాగార శిక్ష (14 సంవత్సరాలు) అనుభవించి తీరాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అప్పటికే 8 సంవత్సరాల గడువును జోసెఫ్ గడిపాడు.

ఆ తరువాత మూడు నెలల లోపే జోసెఫ్ తండ్రి గుండె పోటుతో  1990 లో మరణించాడు. తండ్రి మరణం వల్ల కలిగిన బాధ.. ఒక ప్రక్క కుటుంబ బాధ్యతలు, మరోప్రక్క ఉన్నప్పటీకీ  జోసెఫ్ తన చదువును చెదరని లక్ష్యంగా పెట్టుకుని  6 సంవత్సరాల తర్వాత రానున్న భవిష్యత్ పై దృష్టిని సారించాడు. మధురై  కామరాజ్ యూనివర్శిటీలో పి.హెచ్.డీ రిజిష్టర్ చేసుకున్నాడు. ప్రొఫెసర్ ఆర్ముగం గైడెన్స్ తో రీసెర్చ్ మొదలు పెట్టి పి.హెచ్.డి సాధించుకున్నాడు. జైలులో పద్నాలుగు సంవత్సరాల గడువు తీరిన  తర్వాత 1994 లో జోసెఫ్ జైలు నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చాడు. తన తమ్ముడు ఒక రైతు గా స్థిరపడి కుటుంబ బాధ్యతలు చక్కదిద్దాడు. ఇక జోసెఫ్ తన జీవితంలో స్థిర పడటం తన వంతు అయ్యింది. వివాహం చేసుకుని తిరునవ్వేలి వెళ్ళి అడ్వకేట్ గా తన వృత్తిని మొదలు పెట్టడు. అతి త్వరలోనే ఆ పట్టణంఅంలో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు.  కానీ చదువు పై వున్న మమకారం , చదువు వల్ల కలిగిన జ్ఞాన సంపద

వల్ల జోసెఫ్ చదువును బోధించే వృత్తిని చేపట్టి అదే పట్టాణంలో ఎం.ఎస్ యూనివర్శిటీలో గణిత శాస్త్ర డిపార్ట్ మెంట్ లో చేరాడు. "ఈ వృత్తికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు" అంటాడు జోసెఫ్.

దేవుడి పై అపారమైన భక్తి గల జోసెఫ్ అంతటితో చదువును ఆపలేదు. అంతర్జాతీయ జర్నల్స్ కు ఎన్నో రీసెర్చ్ పేపర్స్ ను పంపిన ఘనతను సాధించుకున్నాడు. యూనివర్శిటీ ప్రొఫెసర్ అయ్యాడు. ఖైదీల కొరకు ప్రవేశపెట్టిన ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కు  యూనివర్సిటీ నిర్వహణాధికారిగా బాధ్యతలను చేపట్టమని    యూనివర్శిటీ అడిగినప్పుడు వెంటనే ఆ పోస్టును వాటేసుకున్నాడు." ఖైదీలు వారి బాధలు వారి లక్ష్యాల గురించి అర్ధం చేసుకోవడానికే తాను జైలు జీవితాన్ని అనుభవించానేమో ".. అంటాడు.

జోసెఫ్ తన తండ్రి ఆశయాలు.. దేవునిపై వున్న అపార భక్తి వలన ప్రతి విషయాన్ని సానుకూల దృక్పదంతో (పాజిటివ్ థింకింగ్) ఆలోచించడం అలవాటు చేసుకున్నానంటాడు . కష్టకాలం లో కూడా తన కష్టాలను, లక్ష్యాన్ని, నమ్మకాల్ని గాలికి వదిలేయకుండా అనుకూల దృక్పధంతో తన విజయాలను తనకు కావాల్సినట్టుగా తీర్చిదిద్దుకున్నాడు జోసెఫ్. అన్నీ ఉన్న చాలామంది జీవితాలతో పోలిస్తే.. జోసెఫ్ జీవితం చాలా కఠినమైనదే..! జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఎన్నో మహా రచనలు చేసిన నాయకుల గురించి విన్నాం. వారు స్వాతంత్య్ర ఉద్యమం లాంటి సంధర్భాలలో జైలు పాలైయారు. అటువంటి వారికి ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు, వుండటం వలన వారు ఉన్నతమైన పనులు చేసి విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు పొందారు. నేరాలు, దోపిడీలు చేసిన దొంగల లక్ష్యాలు వేరు కనుక వారికి ఉన్నత లక్ష్యాలు ఉండవు. వారు సాధించిన విజయాలు వుండవు. వారు నేరచరితలు గానే మిగిలి పోతారు. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కొంతమంది ఖైదీలను విడుదల చేస్తున్నప్పుడు జోసెఫ్ కు ఆ అవకాశం రాలేదు. అయినా అతనికి నిరాశ, నిస్పృహ రాలేదు.

చివరగా మనం ఆలోచించాల్సిన విషయం మనసులో దాగిన లక్ష్య సాధన.

ఖైదీగా వుంటూ న్యాయశాస్త్రంలో యూనివర్శిటీ  ప్రధమ ర్యాంకరుగా నిలిచిన జోసెఫ్ మనసులో విద్యపై వున్న మమకారం లక్ష్యం ఏ స్థాయిలో వున్నయో మనం అర్ధం చేసుకోవాలి. అంతే కాకుండా ఖైదీ జీవితం నుంచి బయటపడిన జోసెఫ్ ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించినప్పటికీ అడ్వకేట్ వృత్తిని వదలి యూనివర్శిటీ ప్రొఫెసర్ గా స్థిర పడటం అత్ని మనసులోని ప్రగడ వాంఛ కు చిహ్నం అని చెప్పవచ్చు. ఈ సమాజాన్ని వ్యవస్థను ప్రబుత్వాన్ని తిట్టుకుంటూ ఉండే ప్రజలెందరో కనిపిస్తుంటారు. అటువంటి వారికి జోసెఫ్ జీవితం ఒక కనువిప్పుగా వుంటుందని ఆశిద్దాం.నిజమే మనసులోలక్ష్యంపై కసి వుంటే సాధించటం సాధ్యమే..! అందుకే 'మనసుంటే మార్గం ఉంటుంది ' అన్నారు. విజ్ఞులు.. నిజమే కదా!

No comments:

Post a Comment

Pages